Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 9

షేబదేశపు రాణి సొలొమోనును దర్శించటం

షేబ దేశపు రాణి సొలొమోను కీర్తిని గురించి విన్నది. కఠినమైన, చిక్కు ప్రశ్నలు వేసి సొలొమోనును పరీక్షించాలని ఆమె యెరూషలేముకు వచ్చింది. షేబ రాణి తన వెంట అనేకమంది మనుష్యులను తీసుకొని వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, బంగారం, విలువైన రత్నాలు మోసుకొని వచ్చిన ఒంటెలు ఆమెతో వున్నాయి. ఆమె సొలమోను వద్దకు వచ్చి అతనితో మాట్లాడింది. ఆమె వద్ద సొలొమోనును అడగటానికి ఎన్నో ప్రశ్నలున్నాయి. ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను సమాధాన మిచ్చాడు. వివరించి చెప్పటానికిగాని, సమాధాన మివ్వటానికిగాని సొలొమోనుకు కష్టమైనదేదీ కన్పించలేదు. సొలొమోను జ్ఞానాన్ని, అతడు నిర్మించిన భవంతులను షేబ దేశపు రాణి స్వయంగా చూసింది. సొలొమోను బల్లమీద రాజ భోజన పదార్థాలను, అతని ముఖ్య అధికారులనేకమందిని ఆమె చూసింది. అతని సేవకులు పనిచేసే తీరును, వారు ధరించే దుస్తులను ఆమె చూసింది. సొలొమోనుకు ద్రాక్షరసము వడ్డించే వారిని, వారి దుస్తులను ఆమె చూసింది. ఆలయంలో సొలొమోను అర్పించిన దహన బలులను కూడ ఆమె చూసింది. షేబ దేశపు రాణి వాటన్నింటినీ చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది!

అప్పుడామె రాజైన సొలొమోనుతో యిలా అన్నది: “నీ ఘనమైన కార్యాలను గురించి, నీ అద్భుతమైన తెలివితేటల గురించి నేను నా దేశంలో విన్న విషయాలన్నీ నిజమని తెలుసుకున్నాను. నేనిక్కడికి వచ్చి, నా కన్నులతో స్వయంగా చూచేవరకు నేనా విషయాలను నమ్మలేదు. ఆహా! నీకున్న మహాజ్ఞానంలో కనీసం సగం కూడ నాకు చెప్పబడలేదు! నేను విన్న విషయాలను మించి వున్నావు నీవు! నీవు, నీ భార్యలు, అధికారులు చాలా అదృష్టవంతులు! నీకు సేవ చేస్తూనే నీ జ్ఞాన వాక్కులను వారు వినగలరు! నీ దేవుడైన ప్రభువుకు వందనాలు! నీ పట్ల ఆయన సంతోషంగా వున్నాడు. అందువల్ల ఆయన తరపున రాజ్యమేలటానికి సింహాసనంపై నిన్ను కూర్చోపెట్టాడు. నీ దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం ఇశ్రాయేలుకు శాశ్వతంగా వుంటుంది. అందువల్లనే ఏది న్యాయమైనదో, ఏది మంచిదో అది చేయటానికి యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు.”

తరువాత షేబ దేశపు రాణి సొలొమోను రాజుకు నాలుగున్నర టన్నుల (రెండు వందల నలబై మణుగులు) బంగారం, లెక్కకు మించి సుగంధ ద్రవ్యాలు, విలువైన రత్నాలు ఇచ్చింది. షేబ దేశపు రాణి ఇచ్చినట్లు రాజైన సొలొమోనుకు ఎవ్వరూ అటువంటి మేలి రకపు సుగంధ ద్రవ్యాలను ఇచ్చివుండలేదు.

10 హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు[a] నుండి బంగారం తీసుకొని వచ్చారు. వారింకా చందనపు కర్రను, విలవైన రత్నాలను తెచ్చారు. 11 ఆలయంలో మెట్ల నిర్మాణానికి, రాజభవన నిర్మాణంలోను రాజైన సొలొమోను చందనపు కర్రను ఉపయోగించాడు. సంగీత విధ్వాంసుల కొరకు తంబురలు, సితరాలు చేయటానికి కూడ సొలొమోను ఈ కర్రను వినియోగించాడు. యూదాలో చందనపు కర్రతో చేయబడిన చిత్రవిచిత్ర కళాఖండాలను ఎవ్వరూ ముందెన్నడూ చూసి వుండలేదు.

12 రాజైన సొలొమోను కూడ షేబ దేశపు రాణికి ఆమెకు కావలసిన వాటిని, అడిగిన ప్రతి దానిని ఇచ్చాడు. తనకు ఇవ్వటానికి ఆమె తెచ్చిన దానికంటె ఎక్కువగానే సొలొమోను ఇచ్చాడు. తరువాత షేబ దేశపు రాణి, ఆమె పరివారం తమ దేశానికి వెళ్లిపోయారు.

సొలొమోను మహా సంపద

13 ఒక్క సంవత్సరంలో సొలొమోను సేకరించిన బంగారం ఇరవై ఐదు టన్నులు (ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు మణుగులు) తూగింది. 14 సంచార వర్తకులు, వ్యాపారులు సొలొమోనుకు చాలా బంగారం తెచ్చారు. అరబీ రాజులందురూ, దేశంలో ప్రాంతీయ పాలకులూ సొలొమోనుకు వెండి బంగారాలు తెచ్చియిచ్చారు.

15 బంగారు రేకులు తాపిన రెండు వందల పెద్దడాళ్లను సొలొమోను చేయించాడు. ప్రతి డాలుకూ సుమారు ఏడున్నర పౌనుల (ఆరు వందల తులాల) సాగగొట్టిన బంగారం పట్టింది. 16 బంగారు రేకులు వేయించి మూడు వందల చిన్న డాళ్లను కూడ సొలొమోను చేయించాడు. సుమారు మూడు ముప్పాతిక పౌనుల (మూడ వందల తులాల) బంగారం ఒక్కొక్క డాలుకు పట్టింది. లెబానోను అరణ్యంలో కట్టిన భవనంలో రాజైన సొలొమోను ఈ డాళ్లను వుంచాడు.

17 ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని సొలొమోను రాజు చేయించాడు. మేలిమి బంగారపు రేకులు దానికి తాపించాడు. 18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. బంగారంతో చేయించిన కాలిపీట దాని ముందు వుంది. సింహాసనానికిరుపక్కల చేతులు ఆనించటానికి తగిన ఆసరా ఏర్పాటు వుంది. చేతి ఆసరాలకు రెండు పక్కలా రెండు సింహపు విగ్రహాలున్నాయి. 19 ప్రతి మెట్టుకూ అటు ఇటు రెండేసి సింహాల విగ్రహాలు చొప్పున ఆరు మెట్లకు పన్నెండు సింహాపు విగ్రహాలు అమర్చబడ్డాయి. ఏ యితర సామ్రాజ్యంలోనూ ఈ రకమైన సింహాసనం చేయించబడలేదు.

20 సొలొమోను రాజు తాగే గిన్నెలన్నీ బంగారంతో చేసినవే. “లెబానోను అరణ్య” భవనంలో వాడే వస్తుసామగ్రి అంతా శుద్ధ బంగారంతో చేయబడింది. సొలొమోను కాలంలో వెండి విలువైన లోహంగా చూడబడలేదు.

21 తర్షీషు[b] వరకు ప్రయాణం చేసిన ఓడలు సొలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు సొలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంవత్సరాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసుకొని సొలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి.

22 భూలోకంలో వున్న రాజులందరికంటె సొలొమోను భాగ్యంలోను, తెలివితేటలలోను గొప్ప వాడయ్యాడు. 23 ప్రపంచ దేశాల రాజులంతా సొలొమోను వివేకవంతమైన న్యాయ నిర్ణయాలను వినటానికి అతనిని దర్శించేవారు. సొలొమోనుకు ఆ తెలివితేటలను దేవుడే ప్రసాదించాడు. 24 ప్రతి సంవత్సరం సొలొమోనును దర్శించటానికి వచ్చే రాజులందరూ కానుకలు తెచ్చేవారు. వారు వెండి బంగారు వస్తువులు, బట్టలు, కవచాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలను తెచ్చేవారు.

25 సొలొమోనుకు గుర్రాలను, రథాలను వుంచటానికి నాలుగువేల శాలలున్నాయి. అతనికి పన్నెండు వేలమంది రథసారధులున్నారు. రథాలకు ప్రత్యేక నగరాలను ఏర్పాటుచేసి, మరికొన్ని తనతో యెరూషలేములో వుంచుకున్నాడు. 26 యూఫ్రటీసు నది మొదలు ఫిలిష్తీయుల దేశం, మరియు ఈజిప్టు సరిహద్దు వరకు వున్న రాజులందరికీ సొలొమోను రాజైయున్నాడు. 27 సొలొమోను రాజు వద్ద నిలవవున్న వెండి యెరూషలేములో కొండ గుట్టల్లా పడివుంది. అతని వద్ద పల్లపు ప్రాంతంలో[c] వున్న మేడిచెట్లంత విస్తారంగా దేవదారు చెట్ల కలపవుంది. 28 ఈజిప్టు నుండి, తదితర దేశాలనుండి ప్రజలు సొలొమోనుకు గుర్రాలను తెచ్చి యిచ్చేవారు.

సొలొమోను మరణం

29 మొదటినుండి చివరివరకు సొలొమోను చేసిన పనులన్నీ ప్రవక్తయైన నాతాను ప్రవచనాలలోను, షిలో హువాడైన అహీయా ప్రవచనాలలోను మరియు దీర్ఘదర్శి అయిన ఇద్దో దర్శనాలలోను పొందుపర్చబడినాయి. అహీయా షిలోనీయుడు. ఇద్దో దీర్ఘదర్శి (ప్రవక్త). ఇద్దో యరొబామును గురించి రాశాడు. యరొబాము నెబాతు కుమారుడు. 30 సొలొమోను నలబై యేండ్లపాటు యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటినీ పాలించాడు. 31 పిమ్మట సొలొమోను చనిపోయాడు.[d] తన తండ్రి దావీదు నగరంలో ప్రజలతనిని సమాధి చేశారు. సొలొమోను స్థానంలో అతని కుమారుడైన రెహబాము నూతన రాజయ్యాడు.

యూదా

యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయినటువంటి యూదా, తండ్రియైన దేవుని ద్వారా పిలువబడి, ప్రేమింపబడి, యేసు క్రీస్తులో భద్రం చేయబడినవారికి వ్రాయునదేమనగా:

దేవుని అనుగ్రహం, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా లభించునుగాక!

దుర్బోధకులు

ప్రియ మిత్రులారా! మనమందరము కలిసి పంచుకొంటున్న రక్షణను గురించి మీకు వ్రాయాలనిపించింది. కాని మరొక విషయాన్ని గురించి వ్రాయటం చాలా ముఖ్యమనిపిస్తోంది. అదేమిటంటే దేవుడు తన పవిత్రులకు అప్పగించిన సువార్తలో ఏ మార్పు రాకుండా మీరు పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు దుర్బోధకులు మీలో రహస్యంగా చేరి ఉన్నారు. వీళ్ళు శిక్షింపదగినవాళ్ళని చాలా కాలం క్రిందటే లేఖనాల్లో వ్రాయబడింది. వీళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించువారు. వీళ్ళు దైవానుగ్రహాన్ని ఉపయోగించుకొంటూ అవినీతిగా జీవిస్తారు. వీళ్ళు మన ఏకైక ప్రభువు, పాలకుడు అయిన యేసు క్రీస్తును నిరాకరిస్తూ ఉంటారు.

మీకీ విషయాలన్నీ తెలుసు. అయినా కొన్ని విషయాలు జ్ఞాపకం చెయ్యాలని అనుకొంటున్నాను. ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉండిన తన ప్రజలకు, ప్రభువు స్వేచ్ఛ కలిగించాడు. కాని ఆ తర్వాత వాళ్ళలో విశ్వాసం లేని వాళ్ళను నాశనం చేసాడు. తమ తమ స్థానాలను, అధికారాలను వదిలిన దేవదూతలను దేవుడు చిరకాలపు సంకెళ్ళతో అంధకారంలో బంధించి ఉంచాడు. చివరి రోజుదాకా అదేవిధంగా బంధించి ఉంచుతాడు. సొదొమ, గొమొఱ్ఱా పట్టణాల ప్రజలు, వాటి పరిసర పట్టణాల్లోని ప్రజలు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక సహవాసాలకు లోనైపొయ్యారు. అందువల్ల వాళ్ళు శాశ్వతమైన మంటల్లో శిక్షననుభవించారు. తద్వారా ఈ సంఘటన కూడా ఇతరులకు నిదర్శనంగా నిలిచిపోయింది.

వాళ్ళలాగే కలలుగనే ఈ దుర్బోధకులు తమ శరీరాల్ని మలినం చేసికొంటూ, అధికారాన్ని ఎదిరిస్తూ, దేవదూతల్ని దూషిస్తూ ఉంటారు. కాని ప్రధాన దేవదూత అయిన మిఖాయేలు కూడా తాను మోషే దేహం విషయంలో వాదించినప్పుడు సాతాన్ని నిందించలేదు. వాణ్ణి దూషించ లేదు. అతడంత ధైర్యం చెయ్యలేకపొయ్యాడు. సాతానుతో, “ప్రభువు నిన్ను గద్దిస్తాడు” అని మాత్రం అన్నాడు.

10 ఈ దుర్బోధకులు తమకర్థం కాని విషయాన్ని గురించి దూషిస్తూ మాట్లాడుతారు. తెలివిలేక లౌకికంగా అర్థం చేసికొంటారు. పశువుల్లా వీటి ద్వారా నశించిపోతారు. 11 వీళ్ళు కయీను మార్గాన్ని అనుసరించారు. లాభం కోసం బిలాము చేసిన తప్పునే చేసారు. కోరహు వలె తిరుగుబాటు చేసి అతనిలాగే నశించిపొయ్యారు. వీళ్ళకు శ్రమ కలుగుగాక!

12 వీళ్ళు మీరు చేసే సమాజ విందుల్లో ఏ మాత్రం సిగ్గు లేకుండా పాల్గొంటారు. తమ కడుపులు బాగా నింపుకొంటారు. గాలికి ఎగిరే నీళ్ళులేని మేఘాల్లాంటి, ఫలమివ్వని ఎండిన వృక్షంలాంటివాళ్ళు. వ్రేళ్ళు పెకిలింపబడి రెండు సార్లు చనిపోయిన వృక్షంలాంటివాళ్ళు. 13 అవమానమనే నురుగు కక్కే సముద్రపు కెరటాల్లాంటివాళ్ళు. ఆకాశంలో గతితప్పి తిరిగే నక్షత్రాల్లాంటివాళ్ళు. వారి కోసం దేవుడు గాఢాంధకారాన్ని శాశ్వతంగా దాచి ఉంచాడు.

14 ఆదాము తర్వాత ఏడవ వాడైన హనోకు వీళ్ళను గురించి ఈ విధంగా ప్రవచించాడు: “అదిగో! ప్రభువు వేలకొలది పరిశుద్ధులతో కలిసి వస్తున్నాడు. 15 వచ్చి అందరిపై తీర్పు చెపుతాడు. దుర్మార్గపు పనులు చేసే అవిశ్వాసుల్ని, తమకు వ్యతిరేకంగా చెడు మాట్లాడే పాపుల్ని శిక్షిస్తాడు.”

16 ఈ దుర్బోధకులు సణుగుతూ తప్పులెంచుతూ ఉంటారు. తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ, ప్రగల్భాలు చెప్పుకొంటూ తమ లాభం కోసం ఇతర్లను పొగుడుతూ ఉంటారు.

హెచ్చరికలు, ఉపదేశాలు.

17 కాని ప్రియ మిత్రులారా! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. 18 “చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించేవాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ వస్తారు” అని అపొస్తలులు చెప్పారు. 19 వాళ్ళు ప్రస్తావించిన ఈ దుర్బోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్బోధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఉండదు.

20 కాని ప్రియ మిత్రులారా! మీలో ఉన్న విశ్వాసం అతి పవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి. పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి. 21 దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచుకొని ఉండండి.

22 సంశయాలున్నవాళ్ళ పట్ల కనికరం చూపండి. 23 మంటల్లో పడబోయేవాళ్ళను బయటకు లాగి కాపాడండి. దుర్నీతిలో మలినమైన దుస్తుల్ని వేసుకొన్నవాళ్ళ పట్ల మీకు అసహ్యము, భయము కలిగినా, వాళ్ళ పట్ల కనికరం చూపండి.

24 క్రిందపడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడగలడు. మీలో ఏ లోపం లేకుండా చేసి తేజోవంతమైన తన సమక్షంలో నిలుపుకొని ఆనందాన్ని కలిగించగలడు. అలాంటి ఆయనకు, 25 మన రక్షకుడైనటువంటి ఏకైక దేవునికి, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా గొప్పతనము, తేజస్సు, శక్తి, అధికారము భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లభించుగాక! ఆమేన్.

జెఫన్యా 1

ఇది జెఫన్యాకు యెహోవా ఇచ్చిన సందేశం. ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజుగా ఉన్న కాలంలో జెఫన్యా ఈ సందేశం అందుకొన్నాడు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.

ప్రజలకు యెహోవా తీర్పు దినం

“భూమి మీదనున్న సమస్తాన్ని నేను నాశనం చేస్తాను! మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ నేను నాశనం చేస్తాను. ఆకాశంలో పక్షుల్ని, సముద్రంలో చేపల్ని నేను నాశనం చేస్తాను. దుర్మార్గులను, వారిచేత పాపం చేయించే వాటన్నింటినీ[a] నేను నాశనం చేస్తాను. భూమి మీద నుండి మనుష్యులందరినీ నేను తొలగించి వేస్తాను” అని యెహోవా చెపుతున్నాడు.

ఈ సంగతులను యెహోవా చెప్పాడు: “యూదాను మరియు యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను శిక్షిస్తాను. ఆ స్థలంనుండి నేను వీటిని తీసివేస్తాను. బయలు దేవత పూజ చివరి గుర్తులను నేను తొలగించి వేస్తాను. నేను పూజారులను తొలగించి వేస్తాను. నక్షత్రాలను పూజించుటకు వారి యింటి కప్పుల మీదికి వెళ్ళే వారందరినీ నేను తొలగించి వేస్తాను. ఆ బూటకవు యాజకులను ప్రజలు మరచి పోతారు. కొంతమంది నన్ను పూజిస్తున్నామని అంటారు. ఆ ప్రజలు నన్ను ఆరాధిస్తామని వాగ్దానం చేసారు. కాని ఇప్పుడు వారు బూటకపు దేవత మిల్కోమును పూజిస్తున్నారు. కనుక ఆ ప్రజలను ఆ స్థలంనుండి నేను తొలగించి వేస్తాను. కొందరు మనుష్యులు యెహోవానుండి తిరిగిపోయారు. వారు నన్ను వెంబడించుట విడిచిపెట్టారు. ఆ ప్రజలు సహాయంకోసం యెహోవాను అడగటం మానివేసారు. కనుక నేను ఆ ప్రజలను ఆ స్థలంనుండి తొలగించివేస్తాను.”

నా ప్రభువైన యెహోవాముందు నిశ్శబ్దంగా ఉండు! ఎందుచేతనంటే, ప్రజలకు యెహోవా తీర్పు చెప్పే దినం త్వరలో వస్తుంది గనుక! యెహోవా తన బలిని సిద్ధం చేశాడు. తాను ఆహ్వానించిన అతిథులతో సిద్ధంగా ఉండమని చెప్పాడు.

“బలి అర్పించే యెహోవా దినాన రాజకుమారులను, ఇతర నాయకులను నేను శిక్షిస్తాను. విదేశీ వస్త్రాలు ధరించిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. ఆ సమయంలో గుమ్మం దాటిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. అబద్ధాలతో, హింసతో యజమాని ఇంటిని నింపిన వారిని నేను శిక్షిస్తాను” అని యెహోవా చెప్పాడు.

10 యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “ఆ సమయంలో యెరుషలేములోని చేప ద్వారం దగ్గర ప్రజలు సహాయంకోసం కేకలు వేస్తారు. పట్టణంలోని ఇతర చోట్ల ప్రజలు ఏడుస్తుంటారు. పట్టణం చుట్టూరా కొండల్లో నాశనం చేయబడుతున్నవాటి పెద్ద శబ్దాలను ప్రజలు వింటారు. 11 పట్టణం దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలారా, మీరు ఏడుస్తారు. ఎందుకు? ఎందుకంటే వ్యాపారస్తులు, ధనిక వర్తకులు అందరూ నాశనం చేయబడతారు గనుక.

12 “ఆ సమయంలో నేను దీపం పట్టుకొని యెరూషలేము అంతటా వెదకుతాను. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తృప్తిపడుతోన్న మనుష్యులందరినీ నేను కనుగొంటాను. ఆ ప్రజలు, ‘యెహోవా ఏమీ చేయడు. ఆయన సహాయం చేయడు, ఆయన బాధించడు’ అని అంటారు. అలాంటి వారిని నేను కనుగొని, వారిని శిక్షిస్తాను! 13 అప్పుడు మిగిలిన వారు, వారి ఐశ్వర్యాలను తీసికొని వారి ఇండ్లను నాశనం చేస్తారు. ఆ సమయంలో ఇండ్లు కట్టుకొన్నవారు వాటిలో నివసించరు. మరియు ద్రాక్షాతోటలు నాటుకొన్నవారు ఆ ద్రాక్షాపండ్ల రసం తాగరు. ఇతరులకు అవి లభిస్తాయి.”

14 యెహోవా తీర్పు తీర్చే ప్రత్యేక దినం త్వరగా వచ్చేస్తుంది! ఆ రోజు దగ్గర్లో ఉంది; మరియు వేగంగా వచ్చేస్తుంది. యెహోవా ప్రత్యేక తీర్పు దినాన ప్రజలు విచారకరమైన శబ్దాలు వింటారు. బలమైన సైనికులు కూడ ఏడుస్తారు! 15 ఆ సమయంలో దేవుడు తన కోపం చూపిస్తాడు. అది భయంకరమైన కష్టకాలంగా ఉంటుంది. అది విధ్వంస సమయంగా ఉంటుంది. అది చీకటి, మబ్బు, తుఫాను రోజుగా, చీకటి సమయంగా ఉంటుంది. 16 అది భద్రతా గోపురాలలో, సంరక్షిత పట్టణాలలో ప్రజలు బూరలూ, బాకాలూ వినే యుద్ధ సమయంలా ఉంటుంది.

17 యెహోవా ఇలా చెప్పాడు: “నేను ప్రజలకు జీవితం చాలా దుర్భరం చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా నడిచే గుడ్డివారిలా ప్రజలు అటు ఇటు నడుస్తారు. ఎందుకంటే, ఆ ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేసారు గనుక. అనేకమంది ప్రజలు చంపబడతారు. వారి రక్తం నేలమీద చిందుతుంది. వారి మృతదేహాలు నేలమీద పెంట కుప్పలా ఉంటాయి. 18 వారి బంగారం, వెండి వారికి యెహోవా ఉగ్రత దినంలో సహాయం చేయవు! ఆ సమయంలో యెహోవా చాలా చికాకుపడి కోపంగా ఉంటాడు. యెహోవా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. భూమిమీద ప్రతి ఒక్కరినీ యెహోవా సర్వనాశనం చేస్తాడు!”

లూకా 23

పిలాతు సమక్షంలో యేసు

(మత్తయి 27:1-2, 11-14; మార్కు 15:1-5; యోహాను 18:28-38)

23 మహాసభ సభ్యులందరూ లేచి యేసును పిలాతు ముందుకు పిలుచుకు వచ్చి, “ఇతడు మన దేశాన్ని తప్పుదారి పట్టించటం మేము గమనించాము. చక్రవర్తికి పన్నులు కట్టరాదని, తాను క్రీస్తునని, రాజునని చెప్పుకుంటున్నాడు” అని ఫిర్యాదు చేసారు.

ఇది విని పిలాతు యేసుతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.

“ఔను, మీరన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.

ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.

కాని వాళ్ళు, “ఇతడు తన బోధనలతో యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలనందరిని పురికొలుపుచున్నాడు. ఇది యితడు గలిలయలో ప్రారంభించి యిక్కడి దాకా వచ్చాడు” అని మళ్ళీ మళ్ళీ అన్నారు.

హేరోదు సమక్షంలో యేసు

ఇది విని పిలాతు వాళ్ళను, “అతడు గలిలయ దేశస్థుడా?” అని అడిగాడు. యేసు, హేరోదు పాలిస్తున్న ప్రాంతానికి చెందినవాడని తెలుసుకొన్న వెంటనే, పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరకు పంపాడు. అప్పుడు హేరోదు యెరూషలేములో ఉన్నాడు.

హేరోదుకు చాలాకాలం నుండి యేసును చూడాలని ఉంది. కనుక ఆయన్ని చూడగానే హేరోదుకు చాలా ఆనందం కలిగింది. యేసును గురించి విన్నవాటిని బట్టి ఆయన ఏదైనా మహాత్యం చేస్తాడేమోనని ఆశించాడు. అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. 10 ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుపై తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు. 11 హేరోదు, అతని భటులు యేసును తిరస్కరించి, హేళన చేస్తూ నవ్వారు. ఆయనకు రాజ దుస్తులు తొడిగించి తిరిగి పిలాతు దగ్గరకు పంపారు. 12 ఆ రోజు హేరోదు, పిలాతు ఇద్దరూ మిత్రులయ్యారు. ఆనాటివరకు వాళ్ళు శత్రువులుగా ఉన్నారు.

మరణదండన విధించటం

(మత్తయి 27:15-26; మార్కు 15:6-15; యోహాను 18:39–19:16)

13 పిలాతు ప్రధానయాజకుల్ని, పాలకుల్ని, ప్రజల్ని, సమావేశపరిచాడు. 14 వాళ్ళతో, “తిరుగుబాటు చెయ్యటానికి ప్రజల్ని పురికొలుపుతున్నాడని అతణ్ణి మీరిక్కడికి పిలుచుకు వచ్చారు. మీ సమక్షంలోనే అతణ్ణి విచారించాము. మీ నేరారోపణలకు నాకు ఏమాత్రం కారణం కనపడటంలేదు. 15 హేరోదుకు కూడా ఏ తప్పూ కనిపించలేదు. కనుకనే అతణ్ణి తిరిగి మా దగ్గరకు పంపాడు. మరణ దండన పొందవలసిన నేరం అతడు చెయ్యలేదని మీరు గమనించారు. 16 అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను” అని అన్నాడు. 17 [a]

18 వాళ్ళంతా ఒకే గొంతుతో, “అతణ్ణి చంపండి, బరబ్బను విడుదల చెయ్యండి” అని కేకలు వేశారు. 19 బరబ్బ తాను పట్టణంలో చేసిన ఒక తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్నాడు.

20 యేసును విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో పిలాతు మళ్ళీ విజ్ఞప్తి చేశాడు. 21 కాని వాళ్ళు బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వెయ్యండి!” అని కేకలు వేశారు.

22 మూడవసారి, పిలాతు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఎందుకు? అతడేమి నేరం చేశాడు? అతనికి మరణ దండన విధించటానికి నాకు ఏ కారణం కన్పించలేదు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను.” అని అన్నాడు.

23 కాని, అతణ్ణి సిలువకు వెయ్యమని కేకలు వేయటం వాళ్ళు మానలేదు. చివరకు వాళ్ళు గెలిచారు. 24 పిలాతు వాళ్ళడిగినట్లు చెయ్యటానికి ఒప్పుకున్నాడు. 25 తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్న వాళ్ళడిగిన బరబ్బను విడుదల చేసి యేసును వాళ్ళ కప్పగించాడు.

యేసుని సిలువకు వేయటం

(మత్తయి 27:32-44; మార్కు 15:21-32; యోహాను 19:17-19)

26 వాళ్ళు యేసును తీసుకొని వెళ్తూ, గ్రామం నుండి పట్టణంలోకి వస్తున్న సీమోను అనే వాణ్ణి పట్టుకొని అతనిపై సిలువను పెట్టి యేసు వెనుక నడిపించారు. సీమోను కురేనే గ్రామస్థుడు.

27 చాలామంది ప్రజలు యేసు వెనుక నడుస్తూ ఉన్నారు. వాళ్ళలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ యేసు వెనుక నడిచారు. 28 యేసు వాళ్ళవైపు తిరిగి, “యెరూషలేము బిడ్డలారా! నా కోసం దుఃఖించకండి. మీ కోసం, మీ సంతానం కోసం దుఃఖించండి. 29 ‘గొడ్రాళ్ళుగా ఉన్న స్త్రీలు ధన్యులని, పిల్లలు కనని కడుపులు, పాలివ్వని స్తనములు ధన్యములైనవి’ అనే రోజులు వస్తాయి. 30 అప్పుడు వాళ్లు పర్వతాలతో తమ మీద పడమని అంటారు. కొండలతో కూలి తమను కప్పి వేయమని అడుగుతారు.(A) 31 చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు ఈ విధంగా చేస్తే అది ఎండిపొయ్యాక ఏం చేస్తారు?” అని అన్నాడు.

32 మరణ దండన విధించటానికి, ఇద్దరు నేరస్థుల్ని కూడా యేసు వెంట తీసుకొని వెళ్తూ ఉన్నారు. 33 కల్వరి[b] అనబడే స్థలాన్ని చేరుకొన్నాక ఆ నేరస్థులు యిద్దర్నీ ఒకణ్ణి యేసుకు కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు ఉంచి ముగ్గుర్నీ సిలువకు వేసారు.

34 యేసు, “తండ్రి, వాళ్ళను క్షమించు, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు”[c] అని అన్నాడు.

వాళ్ళు చీట్లు వేసి ఆయన దుస్తుల్ని పంచుకొన్నారు. 35 ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేసారు. వాళ్ళు, “ఇతర్లను రక్షించాడే! తాను దేవుడెన్నుకొన్న వాడైనట్లైతే, తాను ‘క్రీస్తు’ అయినట్లైతే తనను తాను రక్షించుకోనీ!” అని అన్నారు.

36 భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన చేసారు. వాళ్ళు ఆయనకు పులిసిన ద్రాక్షారసం యిస్తూ 37 “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అని ఎగతాళి చేసారు. 38 “ఇతడు యూదుల రాజు” అని వ్రాసి సిలువకు తగిలించారు.

39 ఆయనతో సహా సిలువకు వేయబడిన ఒక నేరస్థుడు, “నీవు క్రీస్తువు కదా! నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు!” అని అవమానపరిచాడు.

40 కాని మరొక నేరస్థుడు మొదటి వాణ్ణి గద్దిస్తూ, “నీవు దేవునికి భయపడవా! నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా! మనల్ని శిక్షించటం న్యాయమే. 41 మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము. కాని ఆయన ఏ అపరాధమూ చెయ్యలేదు” అని అన్నాడు. 42 ఆ తదుపరి ఆయనతో, “యేసూ! నీవు నీ రాజ్యం చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో” అని అన్నాడు.

43 యేసు, “ఇది నిజం, ఈ రోజు నువ్వు నాతో సహా పరదైసులో[d] ఉంటావు” అని సమాధానం చెప్పాడు.

యేసు మరణం

(మత్తయి 27:45-56; మార్కు 15:33-41; యోహాను 19:28-30)

44-45 అప్పుడు మధ్యాహ్నం పండ్రెండు గంటల సమయం. సూర్యుడు ప్రకాశించటం మానేయటం వల్ల అప్పటినుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటితో నిండిపోయింది. మందిరంలో ఉన్న తెర రెండు భాగాలుగా చినిగి పోయింది. 46 యేసు బిగ్గరగా, “తండ్రి! నా ఆత్మను నీ చేతుల్లో పెడ్తున్నాను” అని అన్నాడు. వెంటనే తన ప్రాణం వదిలాడు.

47 శతాధిపతి జరిగిందిచూసి దేవుణ్ణి స్తుతిస్తూ, “ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడు!” అని అన్నాడు.

48 ఈ దృశ్యం చూడాలని గుమికూడిన ప్రజలు జరిగినదాన్ని చూసి తమ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయారు. 49 కాని ఆయనకు తెలిసిన వాళ్ళు, గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన స్త్రీలు, యివన్నీ చూస్తూ కొంతదూరంలో నిలుచొని ఉన్నారు.

యేసును సమాధి చేయటం

(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; యోహాను 19:38-42)

50 అరిమతయియ యూదుల గ్రామం. ఆ గ్రామానికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతడు మహాసభ సభ్యుడు. 51 నీతిమంతుడు, మంచివాడు. యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మహాసభ సభ్యులు యేసుకు మరణ శిక్ష విధించటానికి నిర్ణయించినప్పుడు అతడు ఒప్పుకోలేదు. 52 యోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తీసుకెళ్ళటానికి అనుమతి పొందాడు. 53 అతడు ఆ దేహాన్ని సిలువ నుండి క్రిందికి దింపి ఒక విలువైన బట్టలో చుట్టాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి యిదివరకు ఎవర్నీ పెట్టని ఒక సమాధిలో ఉంచాడు. ఆ సమాధి పెద్దరాయి మలచి సిద్ధం చేయబడి ఉంది. 54 అది విశ్రాంతిరోజు కొరకు సిద్ధమౌతున్న రోజు. అది ప్రారంభం అవ్వబోతుంది.

55 యేసు వెంట గలిలయనుండి వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్లి సమాధిని, అతడు ఆ సమాధిలో యేసు దేహాన్ని ఉంచిన దృశ్యాన్ని చూసారు. 56 ఆ తర్వాత వాళ్ళు యింటికి వెళ్ళి, అత్తరు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసారు.

కాని విశ్రాంతి రోజు ప్రారంభం అయినందువల్ల వాళ్ళు మోషే శాస్త్రం ప్రకారం ఏ పనీ చేయలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International