Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 3-4

సొలొమోను ఆలయాన్ని నిర్మించటం

యెరూషలేములో మోరీయా పర్వతం మీద సొలొమోను ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. ఈ మోరీయా పర్వతం మీదే సొలొమోను తండ్రియైన దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దావీదు సిద్ధపర్చిన స్థలంలోనే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్థలం ఒర్నానుకు చెందిన నూర్పిడి కళ్లంవద్ద వుంది. ఒర్నాను యెబూసీయుడు. తన పాలన ఇశ్రాయేలులో నాల్గవ సంవత్సరం రెండవ నెల జరుగుతూ వుండగా సొలొమోను ఆలయ నిర్మాణం చేపట్టాడు.

ఆలయ నిర్మాణ విషయంలో సొలొమోనుకు కొలతలు యివ్వబడ్డాయి: దాని పునాది తొంబై అడుగుల (అరవై మూరలు) పొడవు: ముప్పై అడుగుల (ఇరవై మూరలు) వెడల్పు. ఆలయ కొలతలు తీసుకొన్నుప్పుడు. సొలొమోను పాత మూర కొలతనే అనుసరించాడు. ఆలయ మండపం పొడవు ముప్పై అడుగులు; ఎత్తు ముప్పై అడుగులు. అతడు మండపము యొక్క లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు. పెద్దగది గోడల మీద తమాల వృక్షముల (ఖర్జూరపు చెట్లు) చెక్కలు అమర్చాడు. ఆ తమాల వృక్షపు చెక్కలమీద మేలిమి బంగారపు రేకులు తాపించాడు. ఈ బంగారపు రేకుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు చెక్కించి గొలుసుల నగిషీ పని చేయించాడు. ఆలయంలో అందం ఇనుమడించే విధంగా విలువైన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి తెచ్చిన బంగారాన్ని ఈ పనికి వినియోగించాడు. (అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ఆ ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు). ఆలయపు లోపలి భాగాన్నంతా బంగారు రేకులతో కప్పించాడు. పై కప్పు దూలాలకు దర్వాజాలకు, గోడలకు, తలుపులకు సొలొమోను బంగారు పూత వేయించాడు. గోడల మీద దేవదూతల (కెరూబులు) చిత్రాలు చెక్కించాడు.

తరువాత సొలొమోను అతి పవిత్ర స్థలం[a] ఏర్పాటు చేశాడు. అతి పవిత్ర స్థలం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు ముప్పై అడుగులు. ఆలయం వెడల్పంత వెడల్పు దీనికి కూడ వుంది. అతి పవిత్ర స్థలం గోడల నిండా మేలిమి బంగారు రేకులు వేయించాడు. ఈ బంగారపు బరువు ఇరవై మూడు టన్నులు (ఆరువందల తలాంతులు). బంగారపు మేకుల తూకము ఏబై తులాలు. (ఇంచుమించు ఒకటింపావు పౌనులు). పై గదులకు బంగారు పూత వేయించాడు. 10 రెండు కెరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించటానికి చేయించాడు. పనివారు ఆ కెరూబుల బొమ్మలకు బంగారు తొడుగు వేశారు. 11 ఆ కెరూబుల ప్రతిదాని రెక్క పొడవు ఏడున్నర అడుగులు ఉంది. ఆ రెండు కెరూబుల నాలుగు రెక్కల పొడవు ముప్పై అడుగులు. మొదటి కెరూబు ఒక రెక్క ఒక పక్క గోడకు ఆనుకొని వుంటుంది. రెండవ రెక్క రెండవ కెరూబు రెక్కకు తగులుతూ వుంటుంది. 12 రెండవ కెరూబు ఒక రెక్క గది గోడకు రెండవ వైపున ఆనుతుంది. 13 రెండు కెరూబుల రెక్కలు మొత్తం ముప్పై అడగుల దూరం వ్యాపించి వుంటాయి. దేవదూతల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలోకి చూస్తున్నట్లు నిలబడి వుంటాయి.

14 నీలం, ఊదా, ఎరుపు బట్టలతోను, ఖరీదైన పట్టుతోను సొలొమోను తెరలు[b] చేయించాడు. ఈ తెరల మీద కూడ కెరూబుల చిత్రాలు చిత్రించాడు.

15 ఆలయం ముందు రెండు స్తంభాలను ఏర్పాటు చేయించాడు. ఒక్కొక్క స్తంభం ఏబై రెండున్నర అడుగుల (ముప్పైయైదు మూరలు) ఎత్తు వుంటుంది. ఒక్కొక్క స్తంభం యొక్క శిఖరంమీది పీట యెత్తు ఏడున్నర అడుగులు. 16 కంఠాహారం లాంటి గొలుసులను సొలొమోను చేయించాడు. ఆ గొలుసులను స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలించాడు. 17 ఇలా అలంకరించిన స్తంభాలను సొలొమోను ఆలయం ముందు నిలిపాడు. ఒక స్తంభం కుడి ప్రక్క, రెండవ స్తంభం ఎడమ ప్రక్కన నిలిపారు. సొలొమోను కుడి ప్రక్క స్తంభానికి “యాకీను”[c] అని పేరు పెట్టాడు. ఎడమ ప్రక్క స్తంభానికి “బోయజు”[d] అని పేరు పెట్టాడు.

ఆలయ సామగ్రి

ఒక బలిపీఠాన్ని చేయటానికి సొలొమోను కంచును వినియోగించాడు. ఆ కంచు పీఠం ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల ఎత్తు గలిగి వుంది. కరిగిన కంచును వినియోగించి సొలొమోను ఒక పెద్ద కోనేరును[e] (సముద్రం) చేయించాడు. ఆ కోనేరు (సముద్రం) గుండ్రని ఆకారంలో వుంది. దాని వ్యాసం పద్దెనిమిది అడుగులు. దాని ఎత్తు ఏడున్నర అడుగులు. దాని చుట్టు కొలత నలుబదియైదు అడుగులు. కోనేరు (సముద్రం) క్రింది అంచు చుట్టూ పద్దెనిమిది అడుగుల మేరకు కంచుగిత్తల బొమ్మలున్నాయి. ఆ గిత్తలు రెండు వరుసల్లో కోనేరు (సముద్రం) ను పోతపోసినప్పుడే పోతలో వచ్చాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) పన్నెండు పెద్ద గిత్తల విగ్రహాలపై నిలపబడింది. మూడు గిత్తలు ఉత్తరానికి, మూడు దక్షిణానికి, మూడు తూర్పుకు, మూడు గిత్తలు పడమటి వైపుకు తిరిగి వున్నాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) ఈ గిత్తల మీద నిలపబడింది. ఆ గిత్తలన్నీ వాటి వెనుక భాగాల క్రింద మధ్యలో ఒకదానికొకటి ఆనుకొని వుండి నిలబడి వున్నాయి. కంచు కోనేరు (సముద్రపు) మందం మూడు అంగుళాలు. కోనేరు సముద్రపు అంచు గిన్నె అంచులాగా వుంది. అంచు తామర పుష్పంలా అగపడుతుంది. దానిలో పదిహేడు వేల ఐదువందల గేలనుల (ముప్పై పుట్లు) నీరు పడుతుంది.

సొలొమోను పది వెడల్పైన తొట్టెలను నిర్మించాడు. వాటిలో ఐదింటిని కోనేరు (సముద్రం) సముద్రంకు కుడి పక్కన, ఐదింటిని ఎడమ ప్రక్కన వుంచాడు. ఈ తొట్లను దహన బలులుగా అర్పించే జంతువులను కడగటానికి వినియోగిస్తారు. కాని పెద్ద కోనేరు (సముద్రం) ను మాత్రం యాజకులు తాము బలులు యిచ్చేముందు పవిత్ర స్నానాలు చేయటానికి వినియోగించేవారు.

సొలొమోను పది బంగారపు దీపస్తంభాలు చేయించాడు. ఈ దీపస్తంభాలు చేయటానికి, మునుపటి దీపస్తంభాల నమూనాలనే సొలొమోను అనుకరించాడు. ఈ దీపస్తంభాలను అతడు ఆలయంలో వుంచాడు. కుడిప్రక్క ఐదు, ఎడమప్రక్క ఐదు దీపస్తంభాలను వుంచాడు. సొలొమోను పది బల్లలు చేయించి ఆలయంలో వుంచాడు. ఆలయంలో ఐదు బల్లలు కుడిప్రక్కన, ఐదు బల్లలు ఎడమప్రక్కన వుంచాడు. సొలొమోను వంద తొట్లు చేయించటానికి బంగారం వినియోగించాడు. ఆలయం వెలుపల సొలొమోను యాజకుల పురాన్ని, పెద్ద ఆవరణను నిర్మించి వాటికి వెలుపలి ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఆ ద్వారాల తలుపులకు కంచు రేకులు తాపడం చేయించాడు. 10 పిమ్మట పెద్ద కంచు కోనేరు (సముద్రం) ను ఆలయంకి కుడి పక్కగా ఆగ్నేయ (తూర్పు-దక్షిణాల మూల) భాగాన వుంచాడు.

11 హూరాము కుండలను, పారలను, గిన్నెలను తయారు చేశాడు. పిమ్మట హూరాము రాజైన సొలొమోను తలపెట్టిన ఆలయంలో తన పనంతా పూర్తి చేశాడు. 12 హూరాము మరి రెండు స్తంభాలు, వాటిపైన వెడల్పు పళ్ళెములను చేశాడు. ఆ స్తంభాలపైనున్న వెడల్పైన పళ్లెములను అలంకారంగా కప్పటానికి రెండు వలల్లాంటి అల్లికలను కూడ చేశాడు. 13 ఆ రెండు అల్లికల మీద వేలాడదీయటానికి నాలుగు వందల దానిమ్మకాయల ప్రతిమలు కూడా చేశాడు. అలంకరణగా రెండు వరుసల దానిమ్మకాయల బొమ్మలు చుట్టబడ్డాయి. స్తంభాల మీదనున్న పెద్ద పళ్ళెములను వలలు కప్పివున్నాయి. 14 హూరాము తొట్లను, వాటి కింది కుదురులను కూడా చేశాడు. 15 హూరాము కంచు కోనేరును (సముద్రం), దాని కింది పన్నెండు గిత్తలను చేశాడు. 16 హూరాము పాత్రలను, పారలను, శూలాలను, మరియు రాజైన సొలొమోను నిర్మిస్తున్న ఆలయానికి కావలసిన తదితర వస్తువులను చేశాడు. ఈ వస్తుసామగ్రంతా మెరుగు దిద్దిన కంచుతో చేయబడింది. 17 రాజైన సొలొమోను ముందుగా ఈ వస్తువులను మట్టి మూసలలో పోతపోయించాడు. ఈ మూసలు యోర్దానులోయలో సుక్కోతు, జెరేదాతను పట్టణాల మధ్య తయారు చేయబడ్డాయి. 18 సొలొమోను చేయించిన ఈ రకమైన వస్తుసామగ్రి ఎంత వుందనగా వాటికి పట్టిన కంచును తూచి లెక్క గట్టటానికి ఎవ్వరూ ప్రయత్నించియుండలేదు.

19 సొలొమోను ఆలయానికి కావలసిన సామాన్లు కూడా చేయించాడు. సొలొమోను బంగారు బలిపీఠం చేయించాడు. దైవ సన్నిధిలో నైవేద్యం వుంచాటానికి తగిన బల్లలు చేయించాడు. 20 సొలొమోను దీపస్తంభాలు, దీపాలు మేలిమి బంగారంతో చేయించాడు. అతి పవిత్ర స్థలం ముందు ఈ దీపాలు నిర్ణయించిన ఒక క్రమపద్ధతిలో వెలుగుతాయి. 21 ప్రమిదలు నిలిపే పుష్పాలవంటి కుదుర్లు, ప్రమిదలు, పట్టుకారులు, అన్నీ మేలిమి బంగారంతో సొలొమోను చేయించాడు. 22 వత్తులు ఎగదోయు పని ముట్లను, తొట్లను, గిన్నెలను, సాంబ్రాణి పొగవేయు ధూప కలశాలు చేయటానికి కూడా సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు. ఆలయ ద్వారాలకు, అతి పవిత్ర స్థలం తలుపులకు, ఆలయం తలుపులకు సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు.

1 యోహాను 3

మనం దేవుని బిడ్డలం

మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని తండ్రి మనపై ఎంత ప్రేమను కురిపించాడో చూడండి. అవును, మనం దేవుని సంతానమే. ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని కూడా తెలుసుకోవటం లేదు. ప్రియ మిత్రులారా! మనం ప్రస్తుతానికి దేవుని సంతానం. ఇకముందు ఏ విధంగా ఉంటామో దేవుడు మనకింకా తెలియబరచలేదు. కాని యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనెలా ఉంటాడో చూస్తాము. కనుక మనం కూడా ఆయనలాగే ఉంటామని మనకు తెలుసు. ఇలాంటి ఆశాభావాన్ని ఉంచుకొన్న ప్రతి ఒక్కడూ ఆయనలా పవిత్రమౌతాడు.

పాపాలు చేసిన ప్రతి ఒక్కడూ నీతిని ఉల్లంఘించిన వాడౌతాడు. నిజానికి, పాపమంటేనే ఆజ్ఞను ఉల్లంఘించటం. కాని, యేసు పాప పరిహారం చెయ్యటానికి వచ్చాడని మీకు తెలుసు. ఆయనలో పాపమనేది లేదు. ఆయనలో జీవించేవాడెవ్వడూ పాపం చెయ్యడు. ఆయన్ని చూడనివాడు, ఆయనెవరో తెలియనివాడు మాత్రమే పాపం చేస్తూ ఉంటాడు.

బిడ్డలారా! మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. యేసు నీతిమంతుడు. ఆయనలా నీతిని పాలించే ప్రతివ్యక్తి నీతిమంతుడు. ఆదినుండి సాతాను పాపాలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల పాపం చేసే ప్రతివ్యక్తి సాతానుకు చెందుతాడు. సాతాను చేస్తున్న పనుల్ని నాశనం చెయ్యటానికే దేవుని కుమారుడు వచ్చాడు.

దైవేచ్ఛవల్ల జన్మించిన వానిలో దేవుని బీజం ఉంటుంది. కనుక పాపం చెయ్యడు. అతడు దేవునివల్ల జన్మించాడు కనుక పాపం చెయ్యలేడు. 10 అదే విధంగా తన సోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంతానం కాదు. నీతిని పాటించనివాడు దేవుని సంతానం కాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సాతాను సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం.

పరస్పరం ప్రేమతో ఉండండి

11 “పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు. 12 సాతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు.

13 ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14 మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణంనుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15 సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్యజీవం లభించదని మీకు తెలుసు.

16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము. 17 ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది? 18 బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం.

19-20 మన హృదయాలు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడు, అన్నీ తెలిసినవాడు కనుక, మనం నోటి మాటలతో కాక క్రియారూపంగా సత్యంతో ప్రేమను చూపుదాం. అలా చేస్తే మనం సత్యానికి చెందిన వాళ్ళమని తెలుసుకొంటాం. పైగా ఆయన సమక్షంలో దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడని, మన హృదయాలకు నచ్చ చెప్పగలుగుతాం.

21 ప్రియ మిత్రులారా! మన హృదయాలు మన మీద నిందారోపణ చేయలేనిచో మనకు ఆయన సమక్షంలో ధైర్యం ఉంటుంది. 22 దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకు ఆనందం కలిగే విధంగా నడుచుకొంటే మనం అడిగింది మనకు లభిస్తుంది. 23 ఆయన ఆజ్ఞ యిది: దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచండి. ఆయనాజ్ఞాపించిన విధంగా పరస్పరం ప్రేమతో ఉండండి. 24 దేవుని ఆజ్ఞల్ని పాటించినవాళ్ళు ఆయనలో జీవిస్తారు. ఆయన వాళ్ళలో జీవిస్తాడు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మద్వారా ఆయన మనలో జీవిస్తున్నాడని తెలుసుకోగలుగుతాం.

నహూము 2

నీనెవె నాశనం చేయబడుతుంది

నీనెవె, నీతో యుద్ధం చేయటానికి వినాశకారుడు వస్తున్నాడు.
    కావున నీ నగరపు బలమైన ప్రదేశాలను కాపాడుకో,
    మార్గంపై నిఘా పెట్టు.
యుద్ధానికి సిద్ధం కమ్ము.
    పోరాటానికి సన్నాహాలు చెయ్యి!
ఎందుకంటే ఇశ్రాయేలు ప్రభావంవలె
    యాకోబుకు తన ప్రభావాన్ని యెహోవా తిరిగి ఇస్తున్నాడు.
అష్షూరీయులు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేశారు.
    వారి ద్రాక్షాచెట్లను నాశనం చేశారు.

ఆ సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి.
    వారి దుస్తులు మిరుమిట్లు గొలిపేటంత ఎర్రగా ఉన్నాయి.
వారి రథాలు యుద్ధానికి బారులు తీర్చబడి, అగ్ని శిఖల్లా మెరుస్తున్నాయి.
    వారి గుర్రాలు స్వారీకి సిద్ధంగా ఉన్నాయి!
రథాలు వీధులలో దూసుకు పోతున్నాయి.
    బహిరంగ ప్రదేశాలలో అవి ముందుకు, వెనుకకు పోతున్నాయి.
అవి మండే దివిటీల్లా, ఒక చోటనుండి మరొక చోటికి
    ప్రసరించే మెరుపుల్లా కనిపించాయి!

అష్షూరు రాజు తన మంచి సైనికులందరినీ పిలుస్తాడు.
    కాని వారు తొట్రిల్లి దారిలో పడిపోతారు.
గోడను రక్షించటానికి వారు దాని వద్దకు పరుగెడతారు.
    రక్షక కవచాన్ని వారు కిందికి దించుతారు.
కాని నదివైపు ద్వారాలు తెరచి ఉన్నాయి.
    శత్రువు లోనికి వచ్చి, రాజ గృహాన్ని నాశనం చేస్తాడు.
శత్రువు రాణిని ఎత్తుకు పోతాడు.
    ఆమె దాసీలు పావురాల్లా విచారంగా మూల్గుతారు.
    వారు విచారాన్ని వ్యక్తపరుస్తూ తమ రొమ్ములు బాదుకుంటారు.

నీరు బయటకు కారిపోతే ఉండే ఒక మడుగులా
    నీనెవె నగరం ఉంది. ప్రజలు,
“ఆగండి! పారిపోవటం మానండి!” అని అరుస్తారు.
    కాని ఎవ్వడూ ఆగడు. వారు చెప్పేదాన్ని ఎవ్వరూ. లక్ష్యపెట్టరు!

నీనెవెను నాశనం చేస్తున్న సైనికులారా, వెండిని తీసుకోండి!
    బంగారాన్ని దోచుకోండి!
తీసుకోటానికి అనేక వస్తువులున్నాయి.
    ఎన్నో ధనాగారాలున్నాయి!
10 ఇప్పుడు నీనెవె ఖాళీ అయ్యింది.
    ప్రతీదీ దోచుకోబడింది.
    నగరం నాశనం చేయబడింది!
ప్రజలు వారి ధైర్యాన్ని కోల్పోయారు.
    వారి హృదయాలు భయంతో వికలమవుతున్నాయి.
వారి మోకాళ్ళు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి.
    వారి శరీరాలు వణుకుతున్నాయి
    వారి ముఖాలు భయంతో వెలవెల పోతున్నాయి.

11 సింహపు గుహ (నీనెవె) ఇప్పుడు ఎక్కడుంది?
    ఆడ, మగ సింహాలు అక్కడ నివసించాయి.
    వాటి పిల్లలు భయపడలేదు.
12 ఆ సింహం (నీనెవె రాజు) తన పిల్లలను సంతృప్తి పర్చటానికి
    అనేక మంది మనుష్యులను చంపింది.
అతడు తన గుహను (నీనెవె) మానవకళేబరాలతో నింపివేశాడు.
    అతడు తాను చంపిన స్త్రీలతో తన గుహను నింపాడు.

13 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు:
    “నీనెవే, నేను నీకు వ్యతిరేకిని!
నీ రథాలను నేను తగులబెడతాను.
    యుద్ధంలో నీ ‘యువ సింహాలను’ నేను చంపుతాను.
    భూమి మీద మరెన్నడూ నీవు ఎవరినీ వెంటాడవు.
నీ దూతలు చెప్పేవాటిని
    ప్రజలు మరెన్నడూ వినరు.”

లూకా 18

పట్టు వదలని వితంతువు యొక్క ఉపమానం

18 నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం చెందరాదని, బోధించటానికి యేసు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను. అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది. చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు. కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”

ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా! ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.

పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు

తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: 10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు. 11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి. 12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’

13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు. 14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”

యేసు చిన్నపిల్లల్ని దీవించటం

(మత్తయి 19:13-15; మార్కు 10:13-16)

15 యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు. 16 కాని, యేసు ఆ చిన్న పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం వాళ్ళలాంటి వారిదే. 17 యిది నిజం. దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లల్లా అంగీరించనివాడు ఆందులోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.

ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం

(మత్తయి 19:16-30; మార్కు 10:17-31)

18 ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.

19 “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు. 20 నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు.

21 “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.

22 ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. 23 ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.

24 యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.

ఎవరు రక్షింపబడగలరు

26 ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.

27 “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.

28 పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.

29 యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు. 30 ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.

యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం

(మత్తయి 20:17-19; మార్కు 10:32-34)

31 యేసు పన్నెండుమందిని ప్రక్కకు పిలుచుకు వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమారుణ్ణి గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నిజం కాబోతున్నాయి. 32 ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింపబడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమానిస్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు, 33 కొరడా దెబ్బలు కొడతారు. చివరకు చంపివేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు. 34 శిష్యులకు ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది బోధపడలేదు.

గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం

(మత్తయి 20:29-34; మార్కు 10:46-52)

35 యేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు. 36 అతడు ప్రజల గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని అడిగాడు.

37 వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.

38 ఆ గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు.

39 ముందున్న వాళ్ళు అతణ్ణి గద్దిస్తూ నోరు మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని అన్నాడు.

40 యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి 41 “ఏమి కావాలి?” అని అడిగాడు.

“ప్రభూ! నాకు దృష్టి కావాలి!” అని గ్రుడ్డివాడు సమాధానం చెప్పాడు.

42 యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు.

43 వెంటనే అతడు చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International