M’Cheyne Bible Reading Plan
యాజకులకు సేవను కేటాయించడం
24 అహరోను వంశంవారు ఎవరనగా: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 2 కాని నాదాబు, అబీహులిద్దరూ తమ తండ్రి కంటె ముందుగానే చనిపోయారు. పైగా నాదాబు, అబీహులకు కుమారులు కలుగలేదు. కావున ఎలియాజరు మరియు ఈతామారులిద్దరూ యాజకులుగా సేవచేశారు. 3 ఎలియాజరు, ఈతామారు వంశం వారిని దావీదు రెండు గుంపులుగా విభజించాడు. వారి వారి కార్యాలను సక్రమంగా నిర్వహించటానికి వీలుగా దావీదు వారిని రెండు గుంపులుగా ఏర్పాటు చేశాడు. సాదోకు, అహీమెలెకుల సహాయంతో దావీదు ఈ పనిచేశాడు. సాదోకు ఎలియాజరు సంతతివాడు. అహీమెలెకు ఈతామారు సంతతివాడు. 4 ఈతామారు వంశంలో కంటె ఎలియాజరు సంతతివారిలో ఎక్కువమంది నాయకులున్నారు. ఎలియాజరు సంతతి వారిలో పదహారు మంది నాయకులుండగా, ఈతామారు సంతతివారిలో ఎనిమిది మంది నాయకులు మాత్రమే వున్నారు. 5 ప్రతి వంశంలో నుండి మనుష్యులు ఎన్నుకోబడ్డారు. వారు చీట్లు వేసి ఎంపిక నిర్వహించారు. పవిత్ర స్థలాన్ని అధీనంలో వుంచుకొనేందుకు కొంత మందిని ఎన్నుకొన్నారు. మరికొంత మంది యాజకులుగా సేవచేయటానికి ఎంపిక చేయబడ్డారు. వీరంతా ఎలియాజరు, ఈతామారు వంశాలలోని వారు.
6 షెమయా కార్యదర్శి. ఇతడు నెతనేలు కుమారుడు. షెమయా లేవి సంతతివాడు. షెమయా ఆయా సంతతుల వారి పేర్లన్నీ రాశాడు. రాజైన దావీదు ముందు, వారి పెద్దల ముందు అతడు పేర్లు వ్రాశాడు. యాజకుడైన సాదోకు, అహీమెలెకు, యాజకుల కుటుంబాలలో పెద్దలు, ఇతర లేవీయుల పేర్లు వున్నాయి. అబ్యాతారు కుమారుడు అహీమెలెకు. చీట్లు వేసిన ప్రతిసారీ వారొక మనుష్యుని ఎంపిక చేశారు. ఆ మనుష్యుని పేరు షెమయా వ్రాసేవాడు. కావున ఎలియాజరు, ఈతామారు వంశాలలోని మనుష్యుల మధ్య పని విభజన జరిగింది.
7 మొదట ఎంపిక చేయబడినది యెహోయారీబు వంశంవారు.
రెండవ చీటీలో యెదాయా వంశం వారు ఎంపిక చేయబడ్డారు.
8 మూడవ వంశం హారీము వారు.
నాల్గవ వంశం శెయొరీము వారు.
9 ఐదవ వంశం మల్కీయాకు చెందినది.
ఆరవది మీయామిను వంశానికి చెందినది.
10 ఏడవ చీటీ హక్కోజు వంశానికి పడింది.
ఎనిమిదవ చీటీలో అబీయా వంశం ఎంపిక చేయబడింది.
11 తొమ్మిదవ చీటీలో యేషూవ వంశం ఎంపిక అయ్యింది.
పదవ వంశం షెకన్యాది.
12 పదకొండవ చీటీ ఎల్యాషీబు వంశానికి పడింది.
పన్నెండవది యాకీము వంశానికి వచ్చింది.
13 పదమూడవ చీటీలో హుప్పా వంశం ఎంపిక చేయబడింది.
పదునాల్గవ చీటీ యెషెబాబు వంశానికి వచ్చింది.
14 పదిహేనవ చీటి బిల్గా వంశానికి పడింది
పదహారవ చీటి ఇమ్మేరు వంశం వారికి వచ్చింది.
15 పదిహేడవ చీటి హెజీరు వంశానికి పడింది.
పద్దెనిమిదవది హప్పిస్సేను వంశానికి వచ్చింది.
16 పందొమ్మిదవ చీటీలో పెతహయా వంశం వారు ఎన్నుకోబడ్డారు.
ఇరవయ్యో చీటి యెహెజ్కేలు వంశానికి వచ్చింది.
17 ఇరవై ఒకటవ చీటి, యాకీను వంశానికి వచ్చింది.
ఇరవై రెండవది గామూలు వర్గానికి వచ్చింది.
18 ఇరవై మూడవ చీటి దెలాయ్యా వంశానికి పడింది.
ఇరవై నాల్గవది మయజ్యా వంశానికి వచ్చింది.
19 ఈ వంశాల వారంతా ఆలయంలో సేవ చేయటానికి ఎంపిక చేయబడ్డారు. ఆలయపు సేవలో అహరోను ఆదేశ సూత్రాలను వారు పాటించారు. ఆ నియమాలను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అహరోనుకు ఇచ్చాడు.
ఇతర లేవీయులు
20 మిగిలిన లేవి సంతతివారి పేర్లు ఇలా వున్నాయి:
అమ్రాము సంతానం నుండి షూబాయేలు.
షూబాయేలు సంతానం నుండి యెహెద్యాహు.
21 రెహబ్యా వంశం నుండి పెద్దవాడైన ఇష్షీయా.
22 ఇస్హారీ వంశం నుండి షెలోమోతు.
షెలోమోతు వంశం నుండి యహతు.
23 హెబ్రోను పెద్ద కుమారుడు యెరీయా.
హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా.
మూడవ వాడు యహజీయేలు.
నాల్గవ కుమారుడు యెక్మెయాము.
24 ఉజ్జీయేలు కుమారుడు మీకా.
మీకా కుమారుడు షామీరు.
25 మీకా సోదరుడు ఇష్షీ, ఇష్షీ కుమారుడు జెకర్యా.
26 మెరారీ[a] సంతతి వారు మహలి, మూషి మరియు అతని కుమారుడైన యహజీయాహు.
27 మెరారి కుమారుడు యహజీయాహునకు షోహాము, జక్కూరు అను కుమారులు గలరు.
28 మహలి కుమారుడు ఎలియాజరు. కాని ఎలియాజరుకు కుమారులు లేరు.
29 కీషు కుమారుడు యెరహ్మెయేలు.
30 మూషి కుమారులు మహలి, ఏదెరు మరియు యెరీమోతు.
వారంతా లేవీయుల కుటుంబాలలో పెద్దలు. వారి పేర్లు వారి కుటుంబాల ప్రకారం వ్రాయబడ్డాయి. 31 వారంతా ప్రత్యేక కార్యాలు నిర్వహించటానికి ఎంపిక చేయబడ్డారు. యాజకులైన వారి బంధువుల వలెనే వారుకూడ చీట్లు వేశారు. వారు రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకుల, లేవీయుల పెద్దల ముందు చీట్లు వేశారు. వారి వారి పనులను కేటాయించేటప్పుడు వారి పెద్ద కుటుంబాలకు, చిన్న కుటుంబాలకు ఒకే రీతి చీట్లు వేయబడ్డాయి.
గాయక బృందాలు
25 దావీదు, సైన్యాధికారులు కలిసి ఆసాపు కుమారులను ప్రత్యేక సేవల కొరకు కేటాయించారు. ఆసాపు కుమారులు హేమాను, యెదూతూను అనేవారు. ప్రవచనాలు చెప్పటం, తంబుర, సితారులను, తాళాలను వాయిస్తూ దేవుని వాక్యం ప్రకటించటం వారి విశేష సేవా కార్యక్రమం. ఈ విధమైన అసాధారణ సేవలో వున్న వారి పేర్లు ఏవనగా:
2 ఆసాపు కుటుంబం నుండి జక్కూరు, యోసేపు, నెతన్యా మరియు అషర్యేలా. రాజైన దావీదు ప్రవచించటానికి ఆసాపును ఎంపికచేశాడు. ఆసాపు తన కుమారులకు నాయకత్వం వహించాడు.
3 యెదూతూను కుటుంబం నుండి గెదల్యా, జెరీ, యెషయా, షిమీ, హషబ్యా, మత్తిత్యా అనువారు ఆరుగురు. యెదూతూను తన కుమారులకు నాయకత్వం వహించాడు. యెదూతూను ప్రవచించటానికి సితార వాయించే వాడు. యెహోవాకి వందనాలు చెల్లిస్తూ స్తుతి పాటలు పాడేవాడు.
4 దేవుని సేవలో నిమగ్నమైన హేమాను కుమారులైన బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షూబాయేలు మరియు యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తీయెజెరు, యెష్బెకాషా, మల్లోతి, హోతీరు మరియు మహజీయోతు. 5 వీరంతా హేమాను కుమారులు. హేమాను దీర్ఘదర్శి (ప్రవక్త) హేమానును బలపరుస్తానని దేవుడు మాటయిచ్చాడు. అందువల్ల హేమాను బహు సంతానవంతుడయ్యాడు. దేవుడు హేమానుకు పధ్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను కలుగజేశాడు.
6 హేమాను తన కుమారులందరినీ ఆలయంలో భక్తి పాట సంకీర్తనలో పాల్గొనేలా చేసాడు. అతని కుమారులంతా తాళాలు, సితారాలు, వీణలు వాయించేవారు. అది వారు ఆలయంలో సేవచేసే పద్ధతి. రాజైన దావీదు వారిని ఎంపిక చేశాడు. 7 వారితో పాటు వారి బంధువులైన లేవి వంశీయులు కూడ పాటలు పాడటంలో శిక్షణ పొందారు. అలా దేవునికి స్తుతి పాటలు పాడటం నేర్చుకున్న వారిలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది వున్నారు. 8 ప్రతి ఒక్కడూ ఏ పని చేయాలో నిర్ణయించటానికి వారు చీట్లు వేసారు. ప్రతి ఒక్కడూ సమానంగా చూడబడ్డాడు. చీట్లు వేయటంలో చిన్న, పెద్ద, గురువు, శిష్యుడు అనే తేడా లేకుండా అంతా సమానంగా చూడబడ్డారు.
9 మొదటిగా ఆసాపు (యోసేపు) కుమారులు, బంధువుల నుండి పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు.
రెండవ చీటి ద్వారా గెదల్యా కుమారులు, బంధువుల నుండి మొత్తం పన్నెండు మంది ఎంపికైనారు.
10 మూడవ చీటి జక్కూరు పేరున పడగా అతని కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎన్నుకోబడ్డారు.
11 నాల్గవసారి యిజ్రీ కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు.
12 ఐదవ చీటీ ద్వారా నెతన్యా కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎంపికైనారు.
13 ఆరవ చీటీ ద్వారా బక్కీయాహు కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు.
14 ఏడవ చీటీ యెషర్యేలా పేరున వచ్చింది. అతని కుమారులు, బంధువులు, పన్నెండుమంది ఎంపికైనారు.
15 ఎనిమిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ యెషయా కుమారులు, బంధువులు.
16 తొమ్మిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ మత్తన్యా కుమారులు, బంధువులు.
17 పదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షిమీ కుమారులు, బంధువులు.
18 పదకొండవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ అజరేలు కుమారులు, బంధువులు.
19 పన్నెండవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ హష్బయ్యా కుమారులు, బంధువులు.
20 పదమూడవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షూబాయేలు కుమారులు, బంధువులు.
21 పధ్నాల్గవ చీటి మత్తిత్యాకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.
22 పదిహేనవ చీటి యెరేమోతుకు వెళ్లింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.
23 పదహారవ చీటీ ద్వారా పన్నెండుగురు ఎంపిక చేయబడ్డారు. వారు హనన్యా కుమారులు, బంధువులు.
24 పదిహేడవ చీటీ ద్వారా పన్నెండుగురు ఎంపిక చేయబడ్డారు. వారు యొష్బెకాషా కుమారులు, బంధువులు.
25 పద్దెనిమిదవ చీటీ ద్వారా ఎంపికైనవారు పన్నెండు మంది. వారు హనానీ కుమారులు, బంధువులు.
26 పందొమ్మిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మంది మల్లోతి కుమారులు, బంధువులు.
27 ఇరవయ్యో చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ ఎలీయ్యాతా కుమారులు, బంధువులు.
28 ఇరవై ఒకటో చీటి హోతీరుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.
29 ఇరవై రెండవ చీటి గిద్దల్తీకి వచ్చింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.
30 ఇరవై మూడవ చీటి మహజీయోతుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుమంది ఎంపికైనారు.
31 ఇరవై నాల్గవ చీటీ రోమమ్తీయెజెరుకు వచ్చింది. అతని కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎంపికైనారు.
దేవుని మంద
5 మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయట మేమనగా, మీలాగే నేను కూడ ఒక పెద్దను. క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసినవాణ్ణి. దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్థుణ్ణి. 2 సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే! డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభీష్టంతో ఆ కార్యాన్ని చేయండి. 3 దేవుడు మీకప్పగించిన వాళ్ళపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి. 4 ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నిటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది.
5 అదే విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి యితర్ల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో:
“దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు,
కాని, వినయంతో ఉన్నవాళ్ళకు కృపననుగ్రహిస్తాడు.”(A)
అని వ్రాయబడి ఉంది. 6 అందువల్ల దేవుని బలమైన చేతి క్రింద వినయంతో ఉండండి. సరియైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. 7 ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదలివేయండి.
8 మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సాతాను సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని మ్రింగివేయాలని మీ చుట్టు తిరుగుతూ ఉన్నాడు. 9 ఈ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు యిలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు. గనుక దృఢవిశ్వాసంతో ఉండి సాతానుకి ఎదురు తిరగండి.
10 దయామయుడైన దేవుడు, మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలనుభవించాక, ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని యిచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. 11 ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండుగాక! ఆమేన్.
చివరి వందనాలు
12 నా సోదరునిగా భావించే విశ్వాసనీయుడైన సిల్వాను సహయంతో మీకీ లేఖను పంపుచున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి ఈ లేఖను వ్రాస్తున్నాను. ఆ అనుగ్రహాన్ని వదులుకోకండి.
13 మీతో సహా ఎన్నుకోబడి బబులోనులో ఉన్న సంఘం, నా కుమారునితో సమానమైన మార్కు, మీకు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 14 ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకొని శుభాకాంక్షలు తెలుపుకోండి.
క్రీస్తులో నున్న మీ అందరికి శాంతి కలుగుగాక!
ఇశ్రాయేలు నాయకుల పాప దోషం
3 అప్పుడు నేనిలా అన్నాను: “యాకోబు పెద్దలారా, ఇశ్రాయేలు దేశాధిపతులారా, ఇప్పుడు వినండి.
న్యాయమంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి!
2 కాని మీరు మంచిని ద్వేషించి, చెడును ప్రేమిస్తారు!
మీరు వారి ప్రజల చర్మాన్ని ఒలుస్తారు.
మీరు వారి ఎముకలపై గల మాంసాన్ని లాగివేస్తారు!
3 మీరు నా ప్రజలను నాశనం చేస్తున్నారు!
మీరు వారి చర్మాన్ని ఒలుచుకుంటున్నారు; వారి ఎముకలను విరుగ గొడుతున్నారు.
మాంసంలా వారి ఎముకలను కుండలో పెట్టటానికి మీరు నరుకుతారు!
4 అప్పుడు మీరు దేవుడైన యెహోవాను ప్రార్థిస్తారు.
కాని ఆయన మీ ప్రార్థన వినడు;
దేవుడైన యెహోవా మిమ్మల్ని చూచి ముఖం తిప్పుకుంటాడు.
ఎందుకంటే మీరు చెడుపనులు చేశారు!”
బూటకపు ప్రవక్తలు
5 అబద్ధ ప్రవక్తలు యెహోవా ప్రజలకు తప్పుడు జీవిత విధానాన్ని బోధిస్తారు. యెహోవా ఆ ప్రవక్తల విషయంలో ఈ విధంగా చెపుతున్నాడు:
“ప్రజలు గనుక ఈ ప్రవక్తలకు తినటానికి ఆహారం ఇస్తే వారు శాంతి అని అరుస్తారు!
ఒకవేళ ప్రజలు వారికి ఆహారం ఇవ్వకపోతే,
అప్పుడు ప్రవక్తలు ‘యుద్ధానికి సిద్ధంకండి’ అని అరుస్తారు.
6 “అందువల్ల మీకు చీకటి కమ్మినట్లు ఉంటుంది.
మీకు దర్శనాలు కలుగవు.
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మీరు చెప్పలేరు గనుక.
మీకు అంధకారం వ్యాపించినట్లు ఉంటుంది.
ఈ ప్రవక్తలకు సూర్యుడు అస్తమిస్తాడు.
వారికి పట్టపగలే అంధకారం ఆవరిస్తుంది.
7 దీర్ఘదర్శులు (ప్రవక్తలు) సిగ్గుపడతారు.
భవిష్యత్తును చూసేవారు కలవరపాటు చెందుతారు.
అవును, వారంతా వారి నోళ్లు మూసుకుంటారు.
ఎందుకంటే దేవునివద్దనుండి సమాధానం రాదు!”
మీకా దేవుని యదార్థ ప్రవక్త
8 కానీ యెహోవా ఆత్మ నన్ను శక్తితోను,
మంచితనంతోను, బలంతోను నింపివేశాడు.
కావున నేను యాకోబుకు అతని పాపాలనుగూర్చి చెప్పగలను.
అవును. ఇశ్రాయేలుకు అతను చేసిన పాపాలను గురించి నేను చెపుతాను!
ఇశ్రాయేలు నాయకులు నింద పాలవటం
9 యాకోబు ప్రజల నాయకులారా, ఇశ్రాయేలు అధిపతులారా, నేను చెప్పేది వినండి!
మీరు న్యాయాన్ని ద్వేషిస్తారు.
మీరు తిన్నగా ఉన్నదానిని వంకర చేస్తారు!
10 మీరు ప్రజలను హత్యచేసి సీయోనును నిర్మించారు!
మీరు యెరూషలేమును పాపంతో నిర్మించారు!
11 యెరూషలేములో న్యాయాధిపతులు రహస్యంగా లంచాలు తీసుకుంటారు.
వారలా చేసి న్యాయస్థానంలో తమ తీర్పు ఇస్తారు.
ప్రజలకు బోధించేముందు
యెరూషలేము యాజకులకు వేతనం చెల్లించాలి.
ప్రవక్తలు భవిష్యత్తులోకి చూసేముందు
ప్రజలు వారికి డబ్బు చెల్లించాలి.
అప్పుడా నాయకులు, “మనకు ఏరకమైన కీడూ రాదు!
యెహోవా మనపట్ల ఉన్నాడు!” అని అంటారు.
12 మీ మూలంగానే సీయోను నాశనమవుతుంది.
అది దున్నిన పొలంలా తయారవుతుంది.
యెరూషలేము రాళ్ల గుట్టలా మారుతుంది.
ఆలయపు పర్వతం పొదలతో నిండిన వట్టి కొండలా తయారవుతుంది.
పరిసయ్యులవలె ఉండవద్దు
12 అంతలో వేలమంది ప్రజలు సమావేశమవటం వలన ఒకళ్ళనొకళ్ళు త్రోసు కోవటం మొదలు పెట్టారు. యేసు మొదట తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడండి. 2 బయట పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు. 3 చీకట్లో మాట్లాడుకున్న మాటలు అందరికీ వినిపిస్తాయి. గది తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు ఇంటి కప్పుల మీదినుండి ప్రకటింపబడతాయి.
దేవునికి మాత్రమే భయపడుము
(మత్తయి 10:28-31)
4 “మిత్రులారా! నేను చెబుతున్నది వినండి: ఈ శరీరాన్ని చంపేవాళ్ళను చూసి భయపడకండి. దాన్ని చంపాక వాళ్ళేమీ చెయ్యలేరు. 5 ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారమున్న వానికి భయపడండి! ఔను, ఆయనకు భయపడుమని చెబుతున్నాను.
6 “రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్ముడు పోతాయి కదా! అయినా, ఒక్క పిచ్చుకనైనా దేవుడు మరచిపోలేదు. 7 మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. పిచ్చుకలకన్నా మీ విలువ ఎక్కువే! కనుక భయపడకండి.
నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవొద్దు
(మత్తయి 10:32-33; 12:32; 10:19-20)
8 “బహిరంగంగా నన్ను అంగీకరించిన వాణ్ణి మనుష్యకుమారుడు దేవదూతల సమక్షంలో అంగీకరిస్తాడని నేను చెబుతున్నాను. 9 కాని ప్రజల సమక్షంలో నన్ను కాదన్న వాణ్ణి మనుష్యకుమారుడు దేవుని సమక్షంలో కాదంటాడు.
10 “మనుష్యకుమారుణ్ణి దూషించిన వాణ్ణి దేవుడు క్షమించవచ్చునేమో కాని పవిత్రాత్మను దూషించినవాణ్ణి దేవుడు క్షమించడు.
11 “సమాజమందిరాల ముందు, లేక పాలకుల ముందు, లేక అధికారుల ముందు మిమ్మల్ని నిలబెడితే ఏ విధంగా మాట్లాడాలో, నిర్దోషులని ఏ విధంగా ఋజువు చేసుకోవాలో చింతించకండి. 12 మీరు ఏమి మాట్లాడాలో అప్పుడు పవిత్రాత్మ మీకు చెబుతాడు.”
పిసినారి ఉపమానం
13 ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.
14 యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు. 15 ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు.
16 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది. 17 అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు.
18 “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో 19 ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు.
20 “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు.
21 “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”
మొదట దేవుని రాజ్యం
(మత్తయి 6:25-34, 19-21)
22 ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందువల్ల నేను చెప్పేదేమిటంటే జీవించటానికి ఏమి తినాలి? మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి? అని చింతించకండి. 23 మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది. 24 పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు. పంటకోయవు. వాటిదగ్గర ఎలాంటి ధాన్యపు కొట్లు లేవు. దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరాపక్షుల కన్నా విలువైన వాళ్ళు. 25 చింతించి తన జీవితాన్ని ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? 26 మీరింత చిన్న విషయం సాధించ లేనప్పుడు మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు?
27 “పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సొలొమోను రాజుకూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు. 28 మీలో కొంతకూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు కదా! మరి మిమ్మల్నెంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి.
29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి. 30 ప్రపంచం లోవున్న ప్రతి ఒక్కడూ వాటికోసం ప్రాకులాడుతాడు. మీ తండ్రికి మీకేవి అవసరమో తెలుసు. 31 ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు.
ధనమును నమ్ముకొనవద్దు
32 “మీరు అమాయకమైన చిన్న మందలాంటి వాళ్ళు. కాని భయపడకండి. మీ తండ్రి తన రాజ్యాన్ని మీకు ఆనందంగా ఇస్తాడు. 33 మీ ఆస్థి అమ్మి పేదవాళ్ళకు దానం చెయ్యండి. పాతబడని డబ్బుల సంచి సిద్దం చేసుకోండి. మీ ధనాన్ని పరలోకంలో దాచండి. అక్కడ అది తరగదు. దొంగలు దాన్ని ముట్టలేరు. ఆ సంపదకు చెదలు పట్టవు. 34 మీ ధనమున్న చోటే మీ మనస్సు కూడా ఉంటుంది.
సిద్దంగా ఉండండి
(మత్తయి 24:42-44)
35 “మీ నడికట్టుతో నడుముకు చుట్టి, దీపాలు వెలిగించి సిద్దంగా ఉండండి. 36 పెళ్ళి విందుకు వెళ్ళి యింటికి వస్తున్న యజమాని కోసం కాచుకొని ఉండే సేవకుల్లా ఉండండి. అలా చేస్తే యజమాని వచ్చి తలుపు తట్టిన వెంటనే అతనికోసం మీరు తలుపు తీయకలుగుతారు. 37 యజమాని వచ్చినప్పుడు మెలుకువతో ఉన్న సేవకులు ధన్యులు. ఇది నిజం. యజమాని వచ్చి తానే నడుము బిగించుకొని స్వయంగా సేవ చేస్తాడు. సేవకుల్ని కూర్చోబెట్టి వాళ్ళకు వడ్డించటానికి సిద్ధమౌతాడు. 38 అతడు ఏ అర్థరాత్రికో లేక తెల్లవారుఝామునో వచ్చినప్పుడు అతని కోసం సిద్దంగావున్న సేవకులు ధన్యులు. వాళ్ళకు శుభం కలుగుతుంది.
39 “కాని యిది అర్థంచేసుకోండి. దొంగ ఏ ఘడియలో వస్తాడో యింటి యజమానికి తెలిస్తే అతడు తన యింట్లోకి దొంగల్ని రానివ్వడు. 40 మీరు కూడా సిద్ధంగా వుండండి. ఎందుకంటే మనుష్య కుమారుడు మీరు అనుకోని సమయంలో వస్తాడు.”
నమ్మదగిన సేవకుడు ఎవరు
(మత్తయి 24:45-51)
41 పేతురు, “ప్రభూ! మీరీ ఉపమానం మాకోసం చెబుతున్నారా లేక అందరి కోసమా?” అని అడిగాడు.
42 ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల వాణ్ణి, తెలివి గలవాణ్ణి తన యితర సేవకులకు సరియైన ఆహారం ఇవ్వటానికి వాళ్ళపై అధికారిగా నియమిస్తాడు. 43 ఆ యజమాని వచ్చినప్పుడు, అతడు చెప్పిన విధంగా నడుచుకొన్న సేవకుడు ధన్యుడు. 44 ఇది నిజం. ఆ యజమాని అతణ్ణి తన ఆస్థికంతటికి అధికారిగా నియమిస్తాడు.
45 “కాని ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను, ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని తన క్రింద పనిచేసేవాళ్ళను ఆడా మగా అనే భేదం లేకుండా కొట్టి, తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి. 46 యజమాని ఆ సేవకుడు ఎదురుచూడని రోజున అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకుణ్ణి నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు.
47 “తన యజమాని మనస్సు తెలిసి కూడా, అతని యిష్టానుసారం పని చెయ్యని సేవకుడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. 48 కాని తెలియక శిక్షార్హమైన పనులు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుడు తాను ఎక్కువగా యిచ్చిన వాళ్ళనుండి ఎక్కువ కోరుతాడు. ఎక్కువ అప్పగించినవాళ్ళ నుండి యిచ్చిన దానికన్నా ఎక్కువ ఆశిస్తాడు.
యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును
(మత్తయి 10:34-36)
49 “నేను ఈ భూమ్మీద అగ్ని వేయడానికి వచ్చాను. ఆ అగ్ని యిదివరకే రగిలి ఉండాలని ఆశించాను. 50 కాని నేను పొందవలసిన బాప్తిస్మము ఉంది. అది జరిగే వరకు నాకీ వేదన తప్పదు. 51 శాంతిని కలుగ జేయుటకు నేనీ భూమ్మీదికి వచ్చాననుకొంటున్నారా? కాదు. దీన్ని విభజించటానికి వచ్చాను. 52 ఇప్పటి నుండి ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే, వాళ్ళు విడిపోయి, ముగ్గురు ఒకవైపుంటే ఇద్దరొకవైపు: యిద్దరొక వైపుంటే ముగ్గురొక వైపు చేరి పోట్లాడుతారు.
53 తండ్రి కుమారునితో,
కుమారుడు తండ్రితో,
తల్లి కూతురుతో,
కూతురు తల్లితో,
అత్త కోడలితో,
కోడలు అత్తతో పోట్లాడుతారు.”
కాలాన్ని అర్థం చేసుకోండి
(మత్తయి 16:2-3)
54 యేసు అక్కడున్న ప్రజలతో, “మీరు పడమరన మేఘాలు కమ్ముకోవటం చూసిన వెంటనే, ‘వర్షం కురుస్తుంది’ అని అంటారు. 55 దక్షిణం నుండి గాలివీయగానే, ‘వేడి ఎక్కువౌతుంది’ అని అంటారు. మీరన్నట్లే జరుగుతుంది. 56 కాని మీరు వంచకులు. భూమివైపు, ఆకాశం వైపు చూసి ఏమి జరుగబోతుందో చెప్పగలరు. కాని ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరుగబోతుందో ఎందుకు చెప్పలేరు?
నీ సమస్యలను తీర్చుకొనుము
(మత్తయి 5:25-26)
57 “ఏది న్యాయమో స్వయంగా మీరే నిర్ణయించండి. 58 మీ ప్రతి వాదితో కలిసి న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళటానికి ముందు దారి మీద ఉన్నప్పుడే అతనితో రాజీ పడటానికి గట్టిగా ప్రయత్నించండి. అలా చెయ్యకపోతే అతడు మిమ్మల్ని న్యాయధిపతి ముందుకు లాగవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటులకు అప్పగించవచ్చు. ఆ భటులు మిమ్మల్ని కారాగారంలో వేయవచ్చు. 59 నేను చెప్పేది వినండి. మీ దగ్గర ఉన్న చివరి పైసా చెల్లించే దాకా మీరు బయటపడరు.”
© 1997 Bible League International