M’Cheyne Bible Reading Plan
మిద్యానీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుట
6 యెహోవా చెడ్డవి అని చెప్పిన సంగతులనే ఇశ్రాయేలు ప్రజలు మరల చేసారు. అందుచేత యెహోవా మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను ఏడు సంవత్సరాల వరకు ఓడింపనిచ్చాడు.
2 మిద్యాను ప్రజలు చాలా శక్తిగలవారు మరియు ఇశ్రాయేలు ప్రజల పట్ల చాలా క్రూరులు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ కొండలలో దాగుకొనే స్థలాలు అనేకం చేసుకున్నారు. వారి భోజనాన్ని గుహలలోను, కనుక్కొనేందుకు కష్టతరమైన స్థలాలలోను దాచుకున్నారు. 3 తూర్పు ప్రాంతంనుండి మిద్యానీయులు, అమాలేకీయులు ఎల్లప్పుడు వచ్చి వారి పంటలను పాడుచేసేవారు గనుక వారు అలా చేశారు. 4 ఆ మనుష్యులు దేశంలో బసచేసి, ఇశ్రాయేలు ప్రజల పంటలను నాశనం చేశారు. గాజా పట్టణం వరకుగల దేశమంతటా ఇశ్రాయేలీయుల పంటలను వారు నాశనం చేశారు. ఇశ్రాయేలీయులు తినేందుకు ఆ ప్రజలు ఏమీ విడిచి పెట్టలేదు. వారి కోసం గొర్రెలుగాని, పశువులుగాని లేక గాడిదలు గాని ఏమీ వారు విడిచిపెట్టలేదు. 5 మిద్యానీయులు వచ్చి ఆ దేశంలో నివాసం చేశారు. వారు వారి కుటుంబాలను వారి పశువులను వారి వెంట తెచ్చుకున్నారు. వారు మిడతల దండులంత మంది ఉన్నారు! వారి మనుష్యులు, వారి ఒంటెలు విస్తారంగా ఉన్నందుచేత లెక్కించుటకు అసాధ్యం అయింది. ఈ మనుష్యులంతా దేశంలోకి వచ్చి దానిని పాడుచేశారు. 6 మిద్యాను ప్రజల మూలంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా దరిద్రులయ్యారు కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.
7 మిద్యానీయులు[a] ఆ చెడ్డ పనులన్నీ చేశారు. కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. 8 కనుక యెహోవా వారికి ఒక ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేలీయులతో ఆ ప్రవక్త ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఇదే: ‘మీరు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉంటిరి. నేను మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి ఆ దేశం నుండి బయటకు రప్పించాను. 9 ఈజిప్టు యొక్క బలమైన ప్రజలనుండి నేను మిమ్మల్ని రక్షించాను. తర్వాత కనాను దేశ ప్రజలు మిమ్మల్ని బాధ పెట్టారు. కనుక నేను మరల మిమ్మల్ని రక్షించాను. ఆ ప్రజలు వారి దేశం వదిలి పోయేటట్టు నేను చేశాను. మరియు వారి దేశాన్ని, నేను మీకు ఇచ్చాను.’ 10 ‘నేనే మీ యెహోవాను, మీ దేవుడనని అప్పుడు మీకు చెప్పాను. మీరు అమోరీయుల దేశంలో నివసిస్తారు. కాని వారి బూటకపు దేవుళ్లను మీరు పూజించకూడదు, అని నేను మీతో చెప్పాను.’ కాని మీరు నాకు విధేయులు కాలేదు.”
యెహోవాదూత గిద్యోనును దర్శించటం
11 ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి దగ్గరకు యెహోవాదూత వచ్చాడు. దేవుని దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. యోవాషు అబీయెజ్రీ వంశస్థుడు. యోవాషు గిద్యోనుకు తండ్రి. గిద్యోను ఒక ద్రాక్షా గానుగలో గోధుమలు నలుగకొడుతున్నాడు. యెహోవాదూత గిద్యోను దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని (గిద్యోను) చూడకుండునట్లు ద్రాక్షా గానుగ చాటున గోధుమలను నలుగగొట్టుచుండగా, 12 యెహోవాదూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సైనికుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు.
13 అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో చెప్పారు. కాని యెహోవా మనలను విడిచిపెట్టేశాడు. యెహోవా మిద్యానీయులు మనలను ఓడింపనిచ్చాడు.”
14 యెహోవా గిద్యోనువైపు తిరిగి, “నీ శక్తిని ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు.
15 అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మనష్షే వంశంలో నా కుటుంబం అతి బలహీనమైనది. నా కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని జవాబిచ్చాడు.
16 యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడుతున్నట్టుగా కనబడుతుంది.” అని చెప్పాడు.
17 అప్పుడు గిద్యోను యెహోవాతో చెప్పాడు: “నా మీద నీకు దయ ఉంటే, నీవే నిజంగా యెహోవా అనేందుకు నాకు ఒక ఋజువు చూపు. 18 దయచేసి ఇక్కడే వేచియుండు. నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేంతవరకు వెళ్లిపోవద్దు. నా కానుకను తెచ్చి నీ ఎదుట పెట్టనియ్యి.”
యెహోవా, “నీవు తిరిగి వచ్చేవరకూ నేను వేచి ఉంటాను,” అని చెప్పాడు.
19 కనుక గిద్యోను వెళ్లి కాగుతున్న నీళ్లలో ఒక మేక పిల్లను వంటకం చేసాడు. గిద్యోను తూమెడు పిండిని తీసుకుని పొంగని రొట్టె చేసాడు. అప్పుడు గిద్యోను ఆ మాంసాన్ని ఒక బుట్టలో ఉంచి ఉడకపెట్టిన మాంసము యొక్క రసాన్ని ఒక పాత్రలో ఉంచాడు. గిద్యోను ఆ మాంసాన్ని, వండిన మాంసపు రసాన్ని, పొంగని రొట్టెను బయటకు తీశాడు. గిద్యోను ఆ భోజనాన్ని మస్తకి చెట్టు క్రింద యెహోవాకు ఇచ్చాడు.
20 దేవుని దూత, “ఆ మాంసాన్ని, పొంగని ఆ రొట్టెను అదిగో అక్కడ ఉన్న బండ మీద ఉంచు. తర్వాత నీళ్లు పారబోయి” అని గిద్యోనుతో చెప్పాడు. గిద్యోను తనకు చెప్పబడినట్టు చేశాడు.
21 యెహోవాదూత ఒక చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. యెహోవాదూత ఆ కర్ర కొనతో మాంసాన్ని, రొట్టెను తాకాడు. అప్పుడు బండనుండి అగ్ని బయలు వెళ్లింది! ఆ మాంసం, రొట్టె పూర్తిగా కాల్చివేయబడ్డాయి! అప్పుడు యెహోవాదూత అదృశ్యమయ్యాడు.
22 గిద్యోను తాను యెహోవాదూతతో మాట్లాడుతున్నట్లు అప్పుడు గ్రహించాడు. కనుక గిద్యోను, “సర్వశక్తిమంతుడైన యెహోవా! యెహోవాదూతను నేను ముఖాముఖిగా చూశాను!” అని అరిచాడు.
23 కానీ యెహోవా, “నిశ్శబ్దంగా ఉండు! భయ పడవద్దు! నీవు చనిపోవు!” అని గిద్యోనుతో చెప్పాడు.
24 కనుక యెహోవాను ఆరాధించేందుకు ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలిపీఠానికి, “యెహోవాయే శాంతి” అని గిద్యోను పేరు పెట్టాడు. ఒఫ్రా పట్టణంలో ఆ బలిపీఠం ఇంకా నిలిచి ఉంది. ఆబీయెజ్రీ కుటుంబం నివసించే చోట ఒఫ్రా ఉంది.
గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టటం
25 అదే రాత్రి గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీ తండ్రికి చెందిన బాగా ఎదిగిన ఎద్దును, అనగా ఏడు సంవత్సరాల ఎద్దును తీసుకో. నీ తండ్రికి బూటకపు బయలు దేవతా బలిపీఠము ఒకటి ఉంది. ఆ బలిపీఠము ప్రక్కగా ఒక కొయ్యస్తంభం ఉంది. బూటకపు దేవత అషేరా ఘనత కోసం ఆ స్తంభం చేయబడింది. బయలు బలిపీఠాన్ని పడదోసేందుకు, అషేరా స్తంభాన్ని విరగగొట్టేందుకు ఆ ఎద్దును ఉపయోగించు. 26 అప్పుడు నీ యెహోవా దేవునికి సరయిన బలిపీఠం నిర్మించు. ఎత్తైన ఈ స్థలంలో బలిపీఠాన్ని నిర్మించు. అప్పుడు బాగా ఎదిగిన ఆ ఎద్దును ఈ బలిపీఠం మీద చంపి దహించు. నీ అర్పణను దహించేందుకు అషేరా స్తంభపు కట్టెను ఉపయోగించు.”
27 కనుక గిద్యోను తన సేవకులు పది మందిని తీసుకొని యెహోవా చేయమని చెప్పినట్టు చేశాడు. కాని తన కుటుంబము వారు, పట్టణము వారు తాను చేస్తున్న దానిని చూస్తారేమోనని గిద్యోను భయపడ్డాడు. తాను ఏమి చేయాలని తనతో యెహోవా చెప్పాడో దానినే గిద్యోను చేశాడు. కానీ అతడు ఆ పనిని పగలు కాక రాత్రివేళ చేశాడు.
28 మరునాడు ఉదయాన్నే ఆ పట్టణ ప్రజలు మేల్కొన్నారు. బయలు బలిపీఠం పాడుచేయబడి ఉండటం వారు చూశారు. అషేరా స్తంభం నరకబడి ఉండటం కూడా వారు చూశారు. అషేరా స్తంభం బయలు బలిపీఠానికి పక్కగా వుంది. గిద్యోను కట్టిన బలిపీఠాన్ని కూడా ఆ మనుష్యులు చూశారు. ఆ బలిపీఠం మీద అర్పించబడిన ఎద్దును వారు చూశారు.
29 ఆ పట్టణస్తులు ఒకర్నొకరు చూసి, “మన బలిపీఠాన్ని ఎవరు పడగొట్టారు? మన అషేర స్తంభాన్ని ఎవరు నరికి వేసారు?” అని చెప్పుకొన్నారు. వారు ఎన్నో ప్రశ్నలు వేసుకొని, ఆ పనులు చేసినదెవరో తెలిసికొనేందుకు ప్రయత్నించారు.
“యోవాషు కుమారుడైన గిద్యోను ఈ పని చేసాడు” అని వారితో ఎవరో చెప్పారు.
30 కనుక ఆ పట్టణస్తులు యోవాషు దగ్గరకు వచ్చారు, “నీవు నీ కుమారుని బయటకు తీసుకురా! అతడు బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు. ఆ బలిపీఠం పక్కనే ఉన్న అషేరా స్తంభాన్ని అతడు నరికి వేసాడు. కనుక నీ కుమారుడు చావాల్సిందే” అని వారు యోవాషుతో చెప్పారు.
31 అప్పుడు యోవాషు తన చుట్టూరా ఉన్న జనంతో మాట్లాడాడు: “మీరు బయలు పక్షాన ఉంటారా? మీరు బయలును కాపాడుతారా? ఎవడైనా బయలు పక్షం వహిస్తే ఉదయానికల్లా వాడు చంపబడునుగాక. ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, వాని బలిపీఠాన్ని ఎవరైనా పడగొట్టుతున్నప్పుడు తనను తానే కాపాడుకోవాలి” అని యోవాషు చెప్పాడు. 32 “ఒకవేళ బయలు బలిపీఠాన్ని గిద్యోను పడగొట్టియుంటే అతనితోనే బయలును వాదించమనండి.” అని యోవాషు చెప్పాడు. కనుక ఆ రోజున యోవాషు గిద్యోనుకు యెరుబ్బయెలు[b] అని ఒక కొత్త పేరు పెట్టాడు.
గిద్యోను మిద్యాను ప్రజలను ఓడించటం
33 మిద్యాను, అమాలేకు తూర్పు ప్రాంతపు ఇతర ప్రజలు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసేందుకు సమావేశమయ్యారు. ఆ ప్రజలు యోర్దాను నది దాటి వెళ్లి యెజ్రెయేలు లోయలో నివాసం చేశారు. 34 యెహోవా ఆత్మ గిద్యోను మీదికి వచ్చి అతనికి గొప్ప శక్తిని ఇచ్చింది. అబీయెజెరు కుటుంబం తనను వెంబడించేందుకు గిద్యోను ఒక బూర ఊదాడు. 35 మనష్షే వంశం మనుష్యులందరి దగ్గరకు గిద్యోను వార్తాహరులను పంపించాడు. ఆయుధాలు తీసుకుని యుద్ధానికి సిద్ధం కావాలని ఆ వార్తాహరులు మనష్షే మనుష్యులతో చెప్పారు. ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వంశాలకు కూడా గిద్యోను వార్తాహరులను పంపించాడు. వార్తాహరులు అదే సందేశం తీసుకుని వెళ్లారు. కనుక ఆ వంశాల వారు కూడా గిద్యోనును, అతని మనుష్యులను కలుసుకొనటానికి వెళ్లారు.
36 అప్పుడు గిద్యోను దేవునితో చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు నీవు నాకు సహాయం చేస్తానని చెప్పావు. నాకు ఋజువు చూపు! 37 నేను కళ్ళెంలో గొర్రెచర్మం ఉంచుతాను. చుట్టూరా ఉన్న నేల అంతా పొడిగా ఉండి, ఆ చర్మం మీద మాత్రమే మంచుపడివుంటే, అప్పుడు నీవు చెప్పినట్టే ఇశ్రాయేలును రక్షించేందుకు నీవు నన్ను వాడుకొంటావని నేను తెలుసుకొంటాను.”
38 సరిగ్గా అలాగే జరిగింది. మరునాడు ఉదయాన్నే గిద్యోను లేచి ఆ గొర్రెచర్మాన్ని పిండాడు. ఆ గొర్రె చర్మం నుండి ఒక పాత్ర నిండుగా అతడు నీళ్లు పిండాడు.
39 అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోపగించకు. మరొక్క విషయం నిన్ను అడుగనియ్యి. గొర్రెచర్మంతో నిన్ను మరొక్కసారి పరీక్షించనియ్యి. ఈసారి దాని చుట్టూరా ఉన్న నేల మంచుతో తడిసి గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉండనియ్యి” అని చెప్పాడు.
40 ఆ రాత్రి దేవుడు సరిగ్గా అలాగే చేసాడు. గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉంది, కానీ దాని చుట్టూరా నేల మంచుతో తడిసి ఉంది.
కొర్నేలీ పేతురును పిలిపించటం
10 కైసరియ అనే పట్టణంలో కొర్నేలీ అనే పేరుగల ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు, “ఇటలి” దళంలో శతాధిపతిగా[a] పని చేస్తూ ఉండేవాడు. 2 అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికి దేవుడంటే భయభక్తులుండేవి. అతడు తన డబ్బును ధారాళంగా దానం చేసేవాడు. దేవుణ్ణి ఎల్లప్పుడు ప్రార్థించేవాడు. 3 ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అతనికి ఒక దివ్య దర్శనంలో ఒక దేవదూత తన ముందు ప్రత్యక్షం కావటం స్పష్టంగా చూసాడు. ఆ దేవదూత అతణ్ణి సమీపించి, “కొర్నేలీ!” అని పిలిచాడు.
4 కొర్నేలీ అతని వైపు చూసి భయంతో, “ఏమిటి ప్రభూ!” అని అడిగాడు.
ఆ దేవదూత కొర్నేలీతో, “నీ ప్రార్థనలు, పేదవాళ్ళకు నీవు చేస్తున్న దానాలు దేవుడు గుర్తించాడు. 5 ఇప్పుడు నీవు కొందర్ని సీమోను అని పిలువబడే పేతురును పిలుచుకొని రావటానికి యొప్పేకు పంపు. 6 అతడు ప్రస్తుతం సీమోను అనే చెప్పులు కుట్టేవాని యింట్లో అతిథిగా ఉంటున్నాడు. అతని యిల్లు సముద్రము తీరాన ఉంది” అని అన్నాడు. 7 ఇలా చెప్పి దేవదూత వెళ్ళిపోయాడు. ఆ తదుపరి కొర్నేలీ తన సేవకుల్లో యిద్దర్ని పిలిచాడు. ఇంటి పనులు చేసే భటుల్లో ఒకణ్ణి పిలిచాడు. ఈ భటుడు దైవభక్తి కలవాడు. 8 జరిగినదంతా వాళ్ళకు చెప్పి వాళ్ళను యొప్పేకు పంపాడు.
9 మరుసటి రోజు వాళ్ళు యొప్పేను సమీపించారు. అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు. అదే సమయంలో పేతురు ప్రార్థించటానికి మిద్దె మీదికి వెళ్ళాడు. 10 పేతురుకు ఆకలి వేసింది. ఏదైనా తినాలనుకొన్నాడు. అతని కోసం ఇంటివారు వంట సిద్ధం చేస్తుండగా అతనికి దర్శనం కలిగింది. 11 ఆ దర్శనంలో ఆకాశం తెరుచుకొని ఏదో క్రిందికి దిగి రావటం చూశాడు. అది ఒక పెద్ద దుప్పటిలా ఉంది. ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు అది భూమ్మీదికి దిగింది. 12 అందులో నాలుగు కాళ్ళున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు, గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి. 13 ఒక స్వరం, “పేతురూ, లే! వాటిని చంపి తిను” అని అన్నది.
14 పేతురు, “ప్రభూ! నేనలా చెయ్యలేను. అధమమైన దాన్ని, పరిశుభ్రంగా లేనిదాన్ని నేను ఎన్నడూ తినలేదు” అని సమాధానం చెప్పాడు.
15 ఆ స్వరం రెండవసారి, “దేవుడు పవిత్రం చేసినవాటిని అపవిత్రం అనకు” అని అన్నది. 16 ఇలా మూడు సార్లు జరిగిన వెంటనే అది ఆకాశానికి తీసుకు వెళ్ళబడింది. 17 పేతురు ఈ దివ్య దర్శనానికి అర్థం తెలియక దాన్ని గురించి ఆశ్చర్యంతో ఆలోచిస్తున్నాడు.
ఇంతలో కొర్నేలీ పంపిన మనుష్యులు సీమోను యిల్లు ఎక్కడుందో కనుక్కొని అతని యింటి ముందు ఆగారు. 18 “పేతురు అని పిలుస్తారే, ఆ సీమోను యిక్కడ అతిథిగా ఉంటున్నాడా?” అని యింటి వాళ్ళను అడిగారు.
19 దివ్య దర్శనాన్ని గురించి పేతురు యింకా ఆలోచిస్తుండగా దేవుని ఆత్మ అతనితో, “ఇదిగో! ముగ్గురు వ్యక్తులు నీ కోసం వెతుకుతున్నారు. 20 లేచి క్రిందికి వెళ్ళు. వాళ్ళను పంపింది నేనే. కనుక వాళ్ళ వెంట వెళ్ళటానికి కొంచెం కూడా సంకోచపడకు” అని చెప్పాడు. 21 పేతురు క్రిందికి వెళ్ళి వాళ్ళతో, “ఇదిగో! మీరు చూస్తున్నది నా కొరకే! ఎందుకొచ్చారు!” అని అడిగాడు.
22 వాళ్ళు, “మేము కొర్నేలీ అనే శతాధిపతి దగ్గర్నుండి వచ్చాము. అతడు మంచివాడు. దేవుని పట్ల భయభక్తులు కలవాడు. యూదులందరు అతణ్ణి గౌరవిస్తారు. మిమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మీరు చెప్పింది వినవలెనని పవిత్రమైన దేవదూత అతనితో చెప్పాడు” అని సమాధానం చెప్పారు. పేతురు వాళ్ళను యింట్లోకి రమ్మని పిలిచి ఆ రాత్రికి అక్కడే ఉండమన్నాడు.
23 మరుసటి రోజు పేతురు వాళ్ళతో ప్రయాణమయ్యాడు. యొప్పేలోని కొందరు సోదరులు కూడా అతని వెంట వెళ్ళారు. 24 ఆ మరుసటి రోజు వాళ్ళు కైసరియకు చేరుకొన్నారు. వీళ్ళు రానున్నారని తెలిసి కొర్నేలీ సన్నిహితులైన బంధువుల్ని తన యింటికి ఆహ్వానించాడు.
25 పేతురు యింట్లోకి అడుగు పెడ్తుండగానే కొర్నేలీ అతనికి ఎదురు వెళ్ళి అతని కాళ్ళ ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. 26 పేతురు అతనిని లేపుతూ, “లెమ్ము! నేను కూడా ఒక మనిషినే” అని అన్నాడు. 27 పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ప్రజలు సమావేశమై ఉండటం చూసాడు.
28 పేతురు వాళ్ళతో, “యూదుడు, యూదుడు కానివానితో కలిసి ఉండరాదనీ, అతని యింటికి వెళ్ళరాదనీ యూదుల న్యాయశాస్త్రం అంటుంది. ఇది తప్పని మీకందరికి తెలుసు. కాని ‘ఏ వ్యక్తినీ అధమంగా భావించరాదు. పరిశుభ్రత లేనివాడని అనకూడదు’ అని నాకు దేవుడు తెలియజేసాడు. 29 కాబట్టి నా కోసం పిలవనంపగానే వచ్చాను. నన్నెందుకు పిలిచారో నేను యిప్పుడు కారణం అడగవచ్చా?” అని అన్నాడు.
30 కొర్నేలీ యిలా చెప్పాడు: “నాలుగు రోజుల క్రితం యిదే సమయంలో యింట్లో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అప్పుడు పగలు మూడు గంటలు. అకస్మాత్తుగా తెల్లటి మెరిసే దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. 31 అతడు నాతో, ‘కొర్నేలీ! దేవుడు నీ ప్రార్థనల్ని విన్నాడు. నీవు పేదలకు చేస్తున్న దానాలను గుర్తించాడు. 32 పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు. అతడిప్పుడు సీమోను అనే చెప్పులు కుట్టేవాని యింట్లో అతిథిగా ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టేవాని యిల్లు సముద్ర తీరాన ఉంది’ అని చెప్పాడు. 33 మిమ్మల్ని పిలుచుకు రావటానికి తక్షణం మనుష్యుల్ని పంపాను. మీరొచ్చి మంచి పని చేసారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. మాకు చెప్పుమని ప్రభువు మీకాజ్ఞాపించినవన్నీ వినటానికి సిద్ధంగా ఉన్నాము.”
పేతురు వాక్యోపదేశం
34-35 పేతురు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు: “దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులున్న వాళ్ళను, నిజాయితీ పరుల్ని వాళ్ళు ఏ దేశస్థులైనా అంగీకరిస్తాడని యిప్పుడు నాకు బాగా తెలిసింది. 36 ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు.
37 “యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు. 38 నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు. అద్భుతమైన శక్తి యిచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సాతాను పీడవలన బాధపడ్తున్న వాళ్ళకు నయం చేసాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు.
39 “యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు. 40 కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం. 41 అందరూ ఆయన్ని చూడలేదు. ఇదివరకే దేవుడు ఎన్నుకొన్న కొందరు మాత్రం చూసారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేసాం.
42 “ఆయన అందరికి న్యాయాధిపతి. అంటే బ్రతికి ఉన్నవాళ్ళకు, పునర్జీవం పొందనున్న వాళ్ళకు. ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీన్ని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పమని, సువార్తను ప్రకటించమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. 43 యేసును నమ్మినవాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు చెప్పారు.”
దేవుడందర్ని అంగీకరిస్తాడని చూపించాడు
44 పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడివాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. 45 పేతురుతో వచ్చిన వాళ్ళందరు యూదులు. 46 యేసునందు విశ్వసించినవారు. వీళ్ళు యూదులు కానివాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కానివాళ్ళకు కూడా యిచ్చాడని గ్రహించి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు యిలా అన్నాడు: 47 “వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.” 48 యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును తమతో కొద్దిరోజులు ఉండమని అడిగారు.
పగిలిన జాడీ
19 యెహోవా నాతో ఇలా చెప్పినాడు: “యిర్మీయా, నీవు ఒక కుమ్మరి వాని వద్దకు వెళ్లి ఒక మట్టి జాడీ కొనుగోలు చేయి. 2 యెరూషలేము నగర కుమ్మరి ద్వారానికి[a] ఎదురుగా ఉన్న బెన్‌హిన్నోము లోయలోనికి వెళ్లు. నీతో పాటు కొందరు నాయకులను, యాజకులను తీసికొని వెళ్లు. ఆ స్థలంలో నేను నీకు ఏమి చెపుతానో దానిని వారికి తెలియజేయుము. 3 నీతో ఉన్న వారితో ఇలా చెప్పు, ‘యూదా రాజా, యెరూషలేము వాసులారా, యెహోవా వాక్కు వినండి! ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: ఈ ప్రదేశానికి త్వరలో నేను ఘోర విపత్తు సంభవించేలా చేస్తాను! దానిని గురించి విన్న ప్రతి ఒక్కడు ఆశ్ఛర్యపడి భయంతో నిండిపోతాడు. 4 నేను ఇదంతా ఎందుకు చేస్తాననగా యూదా ప్రజలు నన్ననుసరించటం మానివేశారు. ఈ ప్రదేశాన్ని వారు పరదేశాల ఇతర దేవుళ్లకు స్థావరంగా మార్చి వేశారు. అన్య దేవతలకు యూదా ప్రజలు ఇక్కడ ధూపనైవేద్యాలు సమర్పించారు. పూర్వ కాలంలో ఆ దేవతలను ప్రజలు ఆరాధించలేదు. వారి పూర్వీకులు ఆ దేవతలను ఆరాధించలేదు. ఇవి ఇతర దేశాల నుండి దిగుమతి అయిన క్రొత్త దేవతలు. యూదా రాజులు ఈ ప్రదేశాన్ని అమాయక పిల్లల రక్తంతో నింపివేశారు. 5 బయలు దేవతకు యూదా రాజులు ఉన్నత (పూజా) స్థలాలను నిర్మించినారు. ఆ స్థలాలను వారు తమ కుమారులను అగ్నిలో కాల్చి బయలు ముందు బలి అర్పించటానికి ఉపయోగించారు. బయలు దేవతకు వారి కుమారులను దహన బలులుగా అర్పించారు. అలా చేయమని నేనెన్నడూ వారికి చెప్పియుండలేదు. మీ కుమారులను బలియివ్వమని నేనెన్నడూ మిమ్మల్ని అడగలేదు. అటువంటి అకృత్యాన్ని నేను మనసులో కూడా ఎన్నడూ తలపోయలేదు. 6 మరియు బెన్‌హిన్నోములో గల ఈ స్థలాన్ని వారిప్పుడు తోఫెతు అని పిలుస్తారు. కాని నేను మీకీ హెచ్చరిక ఇస్తున్నాను: ప్రజలీ స్థలాన్ని కసాయి లోయ అని పిలిచే రోజులు వస్తున్నాయి. ఇది యెహోవా వాక్కు. 7 యూదా ప్రజల, యెరూషలేము వాసుల పథకాలన్నీ నేనీ ప్రదేశంలో వమ్ము చేస్తాను. శత్రువు ఈ ప్రజలను తరిమికొడతాడు. యూదా ప్రజలు ఈ ప్రదేశంలో శత్రువు కత్తికి ఆహుతైపోయేలా నేను చేస్తాను. వారి శవములను పక్షులకు, అడవి మృగాలకు ఆహారమయ్యేలా చేస్తాను. 8 ఈ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను. యెరూషలేము మీదుగా వెళ్లే ప్రయాణీకులు విభ్రాంతితో చలించి తమ తలలు పంకిస్తారు. నగరం నాశనం చేయబడిన తీరు చూచి వారు విస్మయం చెందుతారు. 9 శత్రు సైన్యాలు నగరాన్ని చుట్టు ముడతాయి. ఆ సైన్యం నగర వాసులను తమ ఆహారం సంపాదించుకోవటానికి బయటికి పోనీయదు. అందువల్ల నగర వాసులు ఆకలితో అలమటిస్తారు. వారు ఆకలి భాధను తట్టుకొలేక తమ పిల్లల శరీరాలనే తినివేస్తారు. ఆ తరువాత వారు ఒకరి నొకరు చంపుకు తింటారు.’
10 “యిర్మీయా, ఈ విషయాలన్నీ వారికి తెలియచెప్పు. వారు చూస్తూ ఉండగా నీ వద్ద నున్న జాడీని క్రింద పడవేసి పగుల గొట్టుము. 11 అప్పుడీ మాటలు చెప్పు: ‘ఒకానొకడు మట్టి జాడీని పగులగొట్టినట్లు నేను యూదా రాజ్యాన్ని, యెరూషలేము నగరాన్నీ విచ్ఛిన్నం చేస్తానని సర్వశక్తిమంతుడగు యెహోవా చెపుతున్నాడు! ఈ ముక్కలను మరల క్రొత్త జాడీగా కూర్చలేము. 12 యూదా రాజ్యం విషయంలో కూడ అలాగే జరుగుతుంది. చనిపోయిన వారంతా తోఫెతులో, సందు లేకుండా పాతిపెట్టిబడతారు. 13 యెరూషలేము లోని ఇండ్లన్నీ తోఫెతువలె “అపవిత్ర” పర్చబడతాయి. తోఫెతువలె యూదా రాజుల రాజభవనాలన్నీ పాడవుతాయి. ఇది ఎందువల్ల జరుగుతుందంటే ప్రజలు వారి ఇండ్లలో కప్పుల మీద బూటకపు దేవతలను ఆరాధించినారు. నక్షత్రాలను వారు ఆరాధించి, వాటి గౌరవార్థం బలులు సమర్పించేవారు. బూటకపు దేవతలకు పానీయార్పణలు సమర్పించారు.’”
14 తోఫెతును వదిలి, దేవుడు తనను బోధించమన్న చోటికి యిర్మీయా వెళ్లాడు. యిర్మీయా దేవాలయానికి వెళ్లి, గుడి ఆవరణలో నిలబడినాడు. అక్కడి ప్రజలనుద్దేశించి యిర్మీయా ఇలా అన్నాడు: 15 “ఇశ్రాయేలు దేవుడు. సర్వశక్తిమంతుడగు యెహోవా యిలా సెలవిచ్చినాడు: ‘యెరూషలేముకు, దాని చుట్టు పట్ల గ్రామాలకు చాలా విపత్తులను కలుగజేస్తానని చెప్పియున్నాను. త్వరలోనే నేనీ విషయాలను జరిపిస్తాను. ఎందువల్లననగా ప్రజలు మొండి వారయ్యారు. నేను చెప్పేది వారు వినటం లేదు. నాకు విధేయులై వుండటానికి నిరాకరిస్తున్నారు.’”
యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం
(మత్తయి 8:28-34; లూకా 8:26-39)
5 వాళ్ళు సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. 2 యేసు పడవ నుండి క్రిందికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు. 3 వాడు స్మశానంలో నివసిస్తుండే వాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ పట్టి ఉంచలేక పోయారు. 4 వాని చేతుల్ని, కాళ్ళను ఎన్నోసార్లు యినుప గొలుసులతో కట్టివేసే వాళ్ళు. కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్ళకు వేసిన యినుప కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగలశక్తి ఎవ్వరికి లేదు. 5 వాడు స్మశానంలో సమాధుల దగ్గర, కొండల మీదా, రాత్రింబగళ్ళు బిగ్గరగా ఏడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకొనేవాడు.
6 వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాడు. 7 “యేసూ! మహోన్నతుడైన దేవుని కుమారుడా! మాజోలికి రావద్దయ్యా! మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమాణంతో చెప్పండి” అని వాడు బిగ్గరగా అరుస్తూ ప్రాధేయ పడ్డాడు. 8 ఎందుకంటే ఒక్క క్షణం క్రితం యేసు వానితో, “ఓ! దయ్యమా! ఆ మనిషి నుండి బయటకు రా!” అని అన్నాడు.
9 యేసు వాణ్ణి, “నీ పేరేమి?” అని అడిగాడు.
“నా పేరు ‘పటాలం’.[a] మా గుంపు చాలా పెద్దది” అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. 10 వానిలోని దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి పంపివేయవద్దని దీనంగా ఎన్నోసార్లు వేడుకొన్నాయి.
11 ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు మేస్తూవుంది. 12 ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల్లోకి పంపండి. వాటిలో ప్రవేశించటానికి అనుమతివ్వండి” అని అన్నాయి. 13 యేసు వాటికి అనుమతి యిచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. రెండువేల దాకా ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సున పడి మునిగిపొయ్యాయి.
14 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, ఈ సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. 15 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల పటాలం పట్టినవాడు దుస్తులు వెసుకొని సక్రమమైన బుద్ధితో, కూర్చొని ఉండటం గమనించారు. వాళ్ళకు భయం వేసింది. 16 జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్ళకందరికి చెప్పారు. 17 వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు.
18 యేసు పడవనెక్కుతుండగా దయ్యం పట్టిన వాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు. 19 యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, “ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబం లోని వాళ్ళతో చెప్పు” అని అన్నాడు.
20 అతడు వెళ్ళి దెకపొలిలో[b] యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.
యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం
(మత్తయి 9:18-26; లూకా 8:40-56)
21 యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే ఉన్నాడు. 22 ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడి, 23 “నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది” అని దీనంగా వేడుకొన్నాడు.
24 యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది.
25 పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది.
27 ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది. 28 తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది. 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది. 30 వెంటనే, యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, “నా దుస్తుల్ని ఎవరు తాకారు?” అని అన్నాడు.
31 ఆయన శిష్యులు, “ప్రజలు మిమ్మల్ని త్రోసుకొంటూ మీ మీద పడుతున్నారు గదా! అయినా ఎవరు తాకారని అడుగుతున్నారెందుకు?” అని అన్నారు.
32 కాని యేసు, “ఎవరు తాకారు?” అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. 33 అప్పుడా స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది. 34 ఆయనామెతో, “అమ్మా! నీ విశ్వాసమే నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి” అని అన్నాడు.
35 యేసు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరానికి అధికారియైన యాయీరు ఇంటి నుండి కొందరు మనుష్యులు వచ్చి యాయీరుతో, “మీ కూతురు మరణించింది. బోధకునికి శ్రమ కలిగించటం దేనికి?” అని అన్నారు.
36 యేసు వాళ్ళన్న దాన్ని విని లెక్క చేయకుండా సమాజమందిరపు అధికారితో, “భయపడకు. నమ్మకంతో ఉండు” అని అన్నాడు.
37 యేసు పేతుర్ని, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును తప్ప మరెవ్వరిని తనవెంట రానివ్వలేదు. 38 యాయీరు యింటికి వచ్చాక అక్కడున్న వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ పెడ బొబ్బలు పెడుతూ ఉండటం యేసు చూసాడు. ఏమీ తోచక అందరూ దిగులుతో ఉండినారు. 39 ఆయన యింట్లోకి వెళ్ళి వాళ్ళతో, “ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె చనిపోలేదు. నిద్రలోవుంది! అంతే!” అని అన్నాడు. 40 కాని వాళ్ళాయన్ని హేళన చేసారు. యేసు వాళ్ళనందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని తనతోవున్న శిష్యుల్ని వెంటబెట్టుకొని, ఆమె ఉన్న గదికి వెళ్ళాడు. 41 ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “తలీతాకుమీ!” అని అన్నాడు. (తలీతాకుమీ అంటే “చిన్నమ్మాయి! నేను చెబుతున్నాను లెమ్ము!” అని అర్థం.) 42 ఆమె వెంటనే లేచి నడవటం మొదలు పెట్టింది. (ఆమె వయస్సు పన్నెండు సంవత్సరాలు.) ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. 43 దీన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తినటానికి ఏదైనా యివ్వమని వాళ్ళకు చెప్పాడు.
© 1997 Bible League International