Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 13

దేవుడు బేతేలుకు వ్యతిరేకంగా పలుకుట

13 ఒక రోజు యూదా దేశపువాడైన ఒక దైవజనుడ్ని బేతేలు నగరానికి వెళ్లమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దైవజనుడు అక్కడికి వెళ్లే సరికి రాజైన యరొబాము బలిపీఠం వద్ద నిలబడి ధూపం వేస్తూ వున్నాడు. ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా మాట్లాడమని యెహోవా దైవజనునికి ఆజ్ఞ ఇచ్చాడు. అతను ఇలా చెప్పాడు:

“బలిపీఠమా, నీకు యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘దావీదు వంశంలో యోషీయా అనువాడొకడు జన్మిస్తాడు. ఈ యాజకులు ఇప్పుడు కొండలపై, గుట్టలపై ఆరాధిస్తున్నారు కాని ఓ బలిపీఠమా, యోషీయా ఈ యాజకులను నీ మీద పెట్టి, వారిని చంపుతాడు. ఇప్పుడా యాజకులు నీ మీద ధూపం వేస్తున్నారు. కాని యోషీయా నీమీద మానవుల అస్తికలను తగులబెడతాడు. అప్పుడు నీవు దేనికీ ఉపయోగపడవు.’”

ఇవి జరిగి తీరుతాయనటానికి దైవజనుడు ఒక సూచనఇచ్చాడు. “యెహోవా ఈ సూచన నాకు తెలియజెప్పాడు. ఈ బలిపీఠం నిలువునా పగిలిపోతుంది. దాని మీది బూడిద కిందికి పడి పోతుంది” అని ప్రవక్త అన్నాడు.

బేతేలులో వున్న బలిపీఠాన్ని గురించి దైవజనుడు చెప్పిన సమాచారాన్ని రాజైన యరొబాము విన్నాడు. అతడు తన చేతిని బలిపీఠం మీదినుంచి తీసి ప్రవక్తవైపు చూస్తూ, “అతనిని నిర్బంధించండి!” అని అన్నాడు. రాజు అలా అన్నదే తడవుగా అతని చేయి చచ్చుపడిపోయింది. దానిని అతడు కదల్చలేక పోయాడు. అంతే గాకుండా, బలిపీఠం ముక్కలై పోయింది. దాని మీది బూడిద కిందికి పడిపోయింది. దేవుని సమాచారంగా ఆ దైవజనుడు దీనినే చెప్పాడు. అప్పుడు యరొబాము దైవజనునితో, “దయచేసి నా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. నా చేతిని బాగు చేయమని యెహోవాను అడుగు” అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకొరకు దైవజనుడు యెహోవాను ప్రార్థించాడు.

తక్షణమే రాజు చేయి స్వస్థపడింది. అది పూర్వపు చేయిలా ఆరోగ్యవంతంగా వుంది.

అప్పుడు రాజు ఆ దైవజ్ఞుడితో, “దయచేసి నాతో నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయి. నేను నీకు ఒక కానుక సమర్పించదలిచాను” అని అన్నాడు.

అది విన్న ప్రవక్త రాజుతో, “నేను నీతో నీ ఇంటికి రాను! నీవు నీ రాజ్యంలో సగంభాగం నాకిచ్చినా నేను నీతో రాను! ఈ స్థలంలో నేనేదీ తినను, త్రాగను. ఏదీ తినకూడదని త్రాగరాదని యెహోవా ఆజ్ఞ. నేనిక్కడికి వచ్చిన బాట వెంట మళ్లీ ప్రయాణం చేయవద్దని కూడా యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అని అన్నాడు. 10 అందువల్ల అతడు మరో మార్గాన తిరుగు ప్రయాణం సాగించాడు. బేతేలుకు వచ్చిన బాట వెంట తను తిరిగి వెళ్లలేదు.

11 ఆ రోజులలో బేతేలు నగరంలో వృద్ధుడైన ఒక ప్రవక్త నివసిస్తూ వుండేవాడు. ఆ వృద్ద ప్రవక్త యొక్క కుమారులు దైవజనుడు వచ్చి బేతేలు నగరంలో చేసినదంతా తమ తండ్రితో చెప్పారు. రాజైన యరొబాముతో ఆ దైవజనుడు చెప్పినదంతా కూడా వారు తమ తండ్రికి వివరించారు. 12 అయితే “అతడు ఏ మార్గాన వెళ్లాడని” వృద్ధ ప్రవక్త అడిగాడు. యూదానుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారిని తమ తండ్రికి అతని కుమారులు చూపించారు. 13 వృద్ధ ప్రవక్త తన కుమారులతో అతని గాడిదపై గంత వేయమని చెప్పాడు. వారతిని గాడిదపై గంత వేయగా, దానిపై ఎక్కి ప్రవక్త ప్రయాణమై వెళ్లాడు.

14 ఆ వృద్ధ ప్రవక్త దైవజనుడిని వెతుక్కుంటూ పోయాడు. దైవజనుడు ఒక సింధూర వృక్షం కింద కూర్చుని వుండటం వృద్ద ప్రవక్త చూశాడు. “యూదానుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని వృద్ధ ప్రవక్త అడిగాడు.

“అవును నేనే” అన్నాడు దైవజనుడు.

15 “అయితే దయచేసి నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయండి” అంటూ వృద్ధ ప్రవక్త అడిగాడు.

16 కాని దైవజనుడిలా అన్నాడు: “నేను నీతో రాలేను. నీతో ఈ ప్రదేశంలో అన్నపానాదులు తీసుకోలేను. 17 ‘అక్కడ నీవేదీ తినరాదు; తాగరాదు. నీవు వెళ్లిన దారిన తిరిగి రాకూడదు; అని కూడ యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు.’”

18 “కాని నేను కూడా నీలాగే ఒక ప్రవక్తను” అన్నాడు ఆ వృద్ధ ప్రవక్త. అతడు ఒక అబద్ధం కూడా చెప్పాడు. “యెహోవా యొక్క దేవదూత నావద్దకు వచ్చాడు. ఆ యెహోవా యొక్క దేవదూత నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్లమని, నాతో నీవు భోజనాదులు చేసేలా అనుమతివ్వమనీ అన్నాడు” అని చెప్పాడు.

19 ఈ మాటలు నమ్మి ఆ దైవజనుడు వృద్ధ ప్రవక్త ఇంటికి వెళ్లాడు. అతనితో కలిసి భోజనాదికములు చేశాడు. 20 వారు బల్లవద్ద కూర్చునివుండగా, యెహోవా వృద్ధ ప్రవక్తతో మాట్లాడాడు. 21 ఆ వృద్ధ ప్రవక్త యూదా దేశపు దైవజనునితో ఇలా అన్నాడు: “ప్రభువాజ్ఞ నీవు పాటించలేదని ఆయన అన్నాడు! యెహోవా ఆదేశించిన దానిని నీవు చేయలేదు. 22 ఈ ప్రదేశంలో నీవు ఏమీ తినరాదనీ, త్రాగరాదనీ యెహోవా ఆజ్ఞాపించాడు. కాని నీవు తిరిగి వచ్చి భోజనాదికాలు నిర్వర్తించావు. అందువల్ల నీ శవం నీ పితరుల సమాధిలో ఉంచబడదు.”

23 దైవజనుడు భోజనం ముగించాడు. వృద్ధ ప్రవక్త గాడిదపై గంత వేయగా, దైవజనుడు దానిపై వెళ్లాడు. 24 తను ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో ఒక సింహం దైవజనుని మీదపడి చంపేసింది. దైవజనుని శరీరం బాటపై పడివుంది. గాడిద, సింహం శవం పక్కన నిలబడివున్నాయి. 25 కొందరు ఆ దారిన పోతూ, శవం పక్కన సింహం నిలబడివుండటం చూశారు. వృద్ధ ప్రవక్త వున్న నగరానికి వచ్చి, వారు దారిలో చూసినదంతా చెప్పారు.

26 ఆ వృద్ధ ప్రవక్తే యూదా దేశాపు దైవజనుని వెనుకకు తీసుకొని వచ్చాడు. వృద్ధ ప్రవక్త జరిగినదంతావిని, “ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. అందువలన యెహోవా ఒక సింహాన్ని అతనిని చంపటానికి పంపాడు. ఇది చేస్తానని యెహోవా చెప్పియున్నాడు” అని అన్నాడు. 27 “తన గాడిదపై గంతవేయమని” తన కుమారులతో ప్రవక్త చెప్పాడు. తన కుమారులు గాడిదపై గంతవేశారు. 28 వృద్ధ ప్రవక్త దానిపై వెళ్లి శవం బాటపై పడివుండటం చూశాడు. గాడిద, సింహం ఇంకా శవం పక్కన నిలబడి వున్నాయి. పైగా ఆ సింహం శవాన్ని తినటం గాని, గాడిదను గాయపర్చటం గాని చేయలేదు.

29 వృద్ధ ప్రవక్త శవాన్ని తన గాడిదపై వేశాడు. దైవజనుని మృతికి సంతాపం తెలియజేయటానికి శవాన్ని ప్రవక్త వెనుకకు తీసుకుని వచ్చాడు. 30 శవాన్ని ప్రవక్త తన కుటుంబానికి సంబంధించిన సమాధిలో పెట్టాడు. వృద్ధ ప్రవక్త అతని మృతికి సంతాపం తెలియజేశాడు. ఆ ప్రవక్త, “ఓ నా సహోదరుడా, నీ మరణానికి మిక్కిలి విలపిస్తున్నాను” అని అన్నాడు. 31 వృద్ధ ప్రవక్త దైవజనుని శవాన్ని పాతిపెట్టాడు. తరువాత తన కుమారులతో ఇలా అన్నాడు: “నేను చనిపోయినప్పడు నా శవాన్ని ఇదే సమాధిలో ఉంచండి. నా ఎముకలను అతని అస్థికల పక్కనే ఉంచండి. 32 యెహోవా అతని ద్వారా చెప్పిన మాటలు నిజమయి తీరుతాయి. యెహోవా బేతేలులోని బలిపీఠానికి, సమరియ పట్టణాలలోని ఉన్నత స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి అతనిని ఉపయోగించుకున్నాడు.”

33 రాజైన యరొబాములో ఏమీ మార్పు రాలేదు. అతడు చెడ్డ పనులు చేస్తూనే వున్నాడు. వేర్వేరు వంశాల నుండి మనుష్యులను అతడు యాజకులుగా[a] ఎంపిక చేస్తూనే వున్నాడు. ఈ యాజకులు ఉన్నత ప్రదేశాలలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఎవరు యాజకుడు కావాలనుకుంటే వారికా అవకాశం ఇవ్వబడింది. 34 ఇది ఒక మహా పాపమై తన రాజ్యం సర్వ నాశనం కావటానికి ప్రధాన కారాణమయ్యింది.

ఫిలిప్పీయులకు 4

చివరి సలహా

నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి.

యువొదియ, సుంటుకే అనేవాళ్ళు ప్రభువు విశ్వాసులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావాలని అర్థిస్తున్నాను. నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతావాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతావాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.

అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.

మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి. దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.

కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్నవాటిని గురించి, ప్రశాంతమైనవాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి. మీరు నా ద్వారా నేర్చుకొన్నవాటిని, నా నుండి పొందినవాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసినవాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు.

కానుకలకు కృతజ్ఞత

10 మీకు నా పట్ల ఉన్న అభిమానం మళ్ళీ మొలకెత్తినందుకు నేను ప్రభువు పేరిట చాలా ఆనందిస్తున్నాను. ఔను, మీకు నా పట్ల అభిమానం ఉంది కాని, దాన్ని చూపించుకొనే అవకాశం మీకు చిక్కలేదు. 11 నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను. 12 అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉన్నప్పుడును ఆకలితో ఉన్నప్పుడును, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో నేను తెలుసుకున్నాను. 13 నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను.

14 అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు. 15 పైగా దైవసందేశాన్ని గురించి మీరు క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్న మీరు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసిదోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చుకోలేదు. 16 నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా నా అవసరాన్ని బట్టి మీరు నాకు ఎన్నోసార్లు సహాయం చేసారు. 17 నేను మీ నుండి విరాళాలు పొందాలని యిలా మాట్లాడటం లేదు. మీ జీవితం యొక్క లెక్కలకు కొంత లాభం చేకూర్చాలని నా అభిప్రాయం. 18 నాకు కావలసినదానికన్నా ఎక్కవే చెల్లించారు. మీరు ఎపఫ్రొదితు ద్వారా నాకు పంపిన విరాళాలు నాకు ముట్టాయి. దానితో నా అవసరాలు పూర్తిగా తీరిపోయాయి. సుగంధ పరిమళాల వలే ఉన్న మీ విరాళాలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడు. 19 నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు. 20 మన తండ్రియైన దేవునికి చిరకాలపు కీర్తి కలుగుగాక! ఆమేన్.

21 యేసు క్రీస్తులో ఐక్యత పొందిన ప్రతి పవిత్రునికి నా వందనాలు తెలుపండి. నాతోవున్న సోదరులందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు. 22 పవిత్రులందరు, ముఖ్యంగా చక్రవర్తి భవనంలో నివసించేవాళ్ళు, మీకు వందనాలు తెలుపుతున్నారు.

23 యేసు క్రీస్తు ప్రభువుయొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!

యెహెజ్కేలు 43

యెహోవా తన ప్రజల మధ్య నివసించుట

43 ఆ మనుష్యుడు నన్ను తూర్పు ద్వారం వద్దకు నడిపించాడు. అక్కడ ఇశ్రాయేలు దేవుని మహిమతూర్పు నుండి వచ్చింది. దేవుని కంఠస్వరం సముద్ర ఘోషలా గంభీరంగా ఉంది. దేవుని మహిమవల్ల భూమి ప్రకాశమానమయ్యింది. నేను చూచిన ఆ దర్శనం గతంలో నేను కెబారు కాలువవద్ద చూచిన దర్శనంవలెనే ఉంది. నేను సాష్టాంగ నమస్కారం చేశాను. తూర్పు ద్వారం గుండా దేవుని మహిమ ఆలయంలోకి వచ్చింది.

అప్పుడు ఆత్మ నన్ను పట్టుకొని లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. ఆలయం లోపలి నుండి ఎవరో నాతో మాట్లాడుతున్నట్లు నేను విన్నాను. నా ప్రక్కన ఒక మనుష్యుడు నిలబడివున్నాడు. ఆలయంలో నుండి వచ్చిన కంఠస్వరం నాతో ఇలా అన్నది: “నరపుత్రుడా, ఇది నా సింహాసనం, పాదపీఠం నెలకొని వున్న చోటు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఈ ప్రదేశంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు వంశం మరెన్నడూ నా పవిత్ర నామాన్ని పాడు చేయదు. వ్యభిచార పాపాల చేత, ఈ ప్రదేశంలో రాజుల శవాలను పాతిపెట్టిన దోషాలచేత రాజులు, వారి ప్రజలు నా పేరును అవమాన పర్చరు. వారి గడప నా గడప ప్రక్కన; వారి ద్వారం నా ద్వారం ప్రక్కన నెలకొల్పి వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయరు. గతంలో కేవలం ఒక్క గోడ మాత్రమే నాకు, వారికి అడ్డంగా ఉండేది. అందుచే వారు పాపం చేసిన ప్రతిసారి, భయంకర కార్యాలు చేసినప్పుడల్లా వారు నా పేరును అవమానపర్చారు అందుచేత నాకు కోపం వచ్చి నేను వారిని నాశనం చేశాను. ఇప్పుడు వారు వ్యభిచార పాపాలకు దూరం కావాలి. వారి రాజుల కళేబరాలను నాకు దూరంగా తీసుకొనిపోవాలి. అప్పుడు నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను.

10 “నరపుత్రుడా, ఇప్పుడు ఇశ్రాయేలు వంశానికి ఈ ఆలయాన్ని గురించి చెప్పు. అప్పుడు వారు తమ పాపాల పట్ల సిగ్గుపడతారు. వారు ఆలయానికి సంబంధించిన నమూనాలు నేర్చుకొంటారు. 11 పైగా వారు తాము చేసిన చెడ్డ పనులన్నిటినీ తలపోసి సిగ్గుపడతారు. ఆలయ నమూనాను వారు తెలుసుకోవాలి. అది ఎలా నిర్మింపబడిందో, ఎక్కడెక్కడ లోపలికి వచ్చే, బయటకు వెళ్లే ద్వారాలున్నాయో, ఇంకా దాని మీద వున్న చెక్కడపు పనులను గురించే వారిని తెలిసికోనిమ్ము. దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నింటినీ వారికి నేర్పు. వారు చూడగలిగే విధంగా నీవు ఈ విషయాలన్నీ వ్రాసి పెట్టు. అప్పుడు ఆలయానికి సంబంధించిన నియమ నిబంధనలు వారు తప్పక పాటిస్తారు. అప్పుడు వారు వీటన్నిటినీ చేయగులుగుతారు. 12 ఆలయ ధర్మం ఇది, పర్వతం మీది శిఖరాగ్ర ప్రదేశమంతా అతి పవిత్ర స్థలం. ఇది ఆలయ ధర్మం.

బలిపీఠం

13 “పెద్ద కొలకర్రతో కొలవగా బలిపీఠం యొక్క కొలతలు ఇలా ఉన్నాయి, బలిపీఠం క్రింది అరుగు చుట్టూ మురికి నీరు పోయే దారి ఉంది. దాని లోతు ఒక మూర ఉంది. దాని ప్రతి ప్రక్కా ఒక మూర వెడల్పు ఉంది. దానిమీద అంచు చుట్టూ ఉన్న కట్టు జానెడు ఉంది. బలిపీఠం ఎత్తు 14 భూమి నుండి క్రింది అంచు వరకు అస్థిభారం రెండు మూరలు. అది ఒక మూర వెడల్పు. చిన్న అంచునుండి పై అంచు వరకు నాలుగు మూరలుంది. అది రెండు మూరల వెడల్పు ఉంది. అది చిన్న చూరు నుండి పెద్ద చూరు వరకు ఏడడుగులు ఉంది. అది మూడడుగుల ఆరంగుళాల వెడల్పు ఉంది. 15 బలిపీఠం మీద అగ్నిస్థానం (హోమగుండం) నాలుగు మూరల ఎత్తు ఉంది. నాలుగు మూలలు నాలుగు కొమ్ముల్లా మలచబడి ఉన్నాయి. 16 బలిపీఠం మీది అగ్ని గుండం పొడవు పన్నెండు మూరలు, వెడల్పు పన్నెండు మూరలు అది ఖచ్చితమైన నలుమూలల చదరంగా ఉంది. 17 అంచు కూడ పొడవు వెడల్పులు పన్నెండు మూరలు చొప్పున చదరంగా ఉంది. దాని చుట్టూ వున్న అంచు అరమూర ఉంది. అడుగు దిమ్మ చుట్టూ నీరు పోయే మార్గపు వెడల్పు రెండు మూరలు ఉంది. బలిపీఠం మీదికి మెట్లు తూర్పు దిక్కున ఉన్నాయి.”

18 అప్పుడు ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: ‘ఈ బలిపీఠం కట్టబడిన రోజున ఈ బలులు, దాని మీద రక్తం చల్లడం అనే నియమాలు పాటించు. 19 సాదోకు వంశపు యాజకులకు పాప పరిహారార్థ బలి నిమిత్తం ఒక కోడె దూడను ఇవ్వాలి. వీరు లేవీ తెగకు చెందిన యాజకులు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, 20 “వారు నాకు బలులు తెచ్చి, నాకు సేవ చేస్తారు. మీరు కోడెదూడ రక్తాన్ని కొంత తీసుకొని బలిపీఠపు నాలుగు కొమ్ముల మీద, దాని చూరు నాలుగు మూలల మీద, మరియు దాని అంచు చుట్టూ వుంచాలి. తద్వారా మీరు బలిపీఠాన్ని పవిత్ర పర్చుతారు. 21 పాప పరిహారార్థ బలికొరకు మీరు కోడెదూడను తేవాలి. ఆలయంలోని భవనం బయట ఒక ప్రత్యేక స్థలంలో కోడెదూడ దహనపర్చ బడుతుంది.

22 “రెండవ రోజున దోషరహితమైన ఒక మేక పోతును బలి ఇవ్వాలి. ఇది పాపపరిహారార్థమైన బలి. కోడెదూడను బలి ఇచ్చిన సందర్భంగా బలిపీఠాన్ని పరిశుద్ధపర్చినట్లే యాజకులు ఇప్పుడు కూడా చేస్తారు. 23 మీరు బలిపీఠాన్ని శుద్ధి పర్చిన పిమ్మట దోష రహితమైన ఒక కోడెదూడను, మందలో ఏ దోషం లేని ఒక పొట్టేలును బలికి తెస్తారు. 24 మీరు వాటిని యెహోవా ముందు బలి ఇస్తారు. యాజకులు వాటి మీద ఉప్పు జల్లుతారు. పిమ్మట యాజకులు గిత్తను, పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పిస్తారు. 25 ఏడు రోజులపాటు ప్రతిరోజూ మీరు ఒక మేకను పాపపరిహారార్థ బలికి సిద్ధం చేస్తారు. అలాగే మీరు ఒక కోడెదూడను, మందలో నుండి ఒక పొట్టేలును సిద్ధం చేస్తారు. కోడెదూడ, పొట్టేలు ఏ దోషమూ లేనివై యుండాలి. 26 ఏడు రోజుల పాటు యాజకులు బలిపీఠాన్ని శుద్ధిపర్చుతారు. తరువాత వారు దానిని యెహోవాకు అంకితం చేస్తారు. 27 ఏడు రోజులు అయిన తరువాత ఎనిమిదవ రోజు నుండి యాజకులు మీ దహనబలులను, సహవాస బలులను బలిపీఠం మీద ఇవ్వాలి. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను.” నా ప్రభువైన యెహోవా ఇది చెప్పాడు.

కీర్తనలు. 95-96

95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
    మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
    సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
    ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
    దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
    మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
ఆయన మన దేవుడు,
    మనం ఆయన ప్రజలము.
    మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.

దేవుడు చెబుతున్నాడు, “మెరీబా[a] దగ్గర మీరు ఉన్నట్టుగా
    అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి.
మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు.
    కాని అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.
10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను.
    వారు నమ్మకస్థులు కారని నాకు తెలుసు.
    ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.
11 అందుచేత నాకు కోపం వచ్చి,
    ‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’”

96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
    సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
    శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
    దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
    ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
    కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
    దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
    స్తుతి కీర్తనలు పాడండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
    యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10     యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
    యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
    సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
    అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
    ప్రపంచాన్ని పాలించుటకు[b] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International