Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 34

దీనాను చెరచుట

34 యాకోబు లేయాల కుమార్తె దీనా. ఒక రోజు, ఆ ఊరి స్త్రీలను చూడాలని దీనా బయటకు వెళ్లింది. ఆ దేశం రాజైన హమోరు కుమారుడు షెకెము దీనాను చూశాడు. అతడు ఆమెను బంధించి, బలవంతంగా ఆమెతో శయనించాడు. షెకెము దీనాను ప్రేమించాడు. ఆమె తనను పెళ్లి చేసుకునేలా ఒప్పించేందుకు ఆమెతో మాట్లాడాడు. “నేను పెళ్లి చేసుకోవటానికి దయచేసి ఈ అమ్మాయినే తెచ్చి పెట్టమని” షెకెము తన తండ్రితో చెప్పాడు.

ఆ యువకుడు తన కూతురికి చేసిన దుష్కార్యాన్ని గూర్చి యాకోబు విన్నాడు. అయితే యాకోబు కుమారులంతా పశువులతోబాటు పొలాల్లో ఉన్నారు. అందుచేత వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు యాకోబు ఏమీ చేయలేదు. అదే సమయంలో షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడేందుకు వెళ్లాడు.

జరిగినదాన్ని గూర్చి యాకోబు కుమారులకు పొలంలోనే తెలిసింది. ఇది విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. యాకోబు కూతురుతో షెకెము శయనించి, ఇశ్రాయేలీయుల వంశానికి అవమానం తెచ్చాడు గనుక వారికి పిచ్చి కోపం రెచ్చిపోయింది. షెకెము చాలా చెడ్డపని చేశాడు కనుక ఆ సోదరులంతా పొలాలనుండి వచ్చేశారు.

అయితే హమోరు ఆ సోదరులతో మాట్లాడాడు. “నా కుమారుడు షెకెముకు దీనా కావాలని ఉంది. దయచేసి వాడిని ఆమెను పెళ్లి చేసుకోనివ్వండి. మనకు ఒక ప్రత్యేక ఒడంబడిక ఉన్నట్లు ఈ వివాహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు మా మగవాళ్లు మీ అమ్మాయిలను, మీ మగవాళ్లు మా అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. 10 ఈ దేశంలోనే మీరు కూడ మాతో కలిసి ఉండవచ్చును. భూమిని స్వంతం చేసుకొనేందుకు, వ్యాపారం చేసేందుకు ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంటుంది” అన్నాడు.

11 షెకెము కూడ యాకోబుతోను, దీనా అన్నదమ్ములతో మాట్లాడాడు. షెకెము అన్నాడు: “దయచేసి నన్ను స్వీకరించండి, నేను చేసిన దాని విషయంలో నన్ను క్షమించండి. మీరు నన్నేమి చేయమంటే అది చేస్తా. 12 మీరు నన్ను దీనాను పెళ్లి చేసుకోనిస్తే, మీరు కోరిన కన్యాశుల్కం మీకు ఇస్తా. మీరు ఏమి అడిగితే అది ఇస్తా కాని దీనాను నన్ను పెళ్లాడనివ్వండి.”

13 షెకెముతో, అతని తండ్రితో అబద్ధం చెప్పాలని యాకోబు కుమారులు నిశ్చయించుకున్నారు. వారి సోదరి దీనాకు షెకెము చేసిన నీచకార్యాన్నిబట్టి ఆ సోదరులు ఇంకా కోపంగానే ఉన్నారు. 14 కనుక ఆ సోదరులు, “నీకు ఇంకా సున్నతి కాలేదు గనుక నిన్ను మా సోదరిని పెళ్లి చేసుకోనివ్వం. మా సోదరి నిన్ను చేసుకోవడం తప్పు అవుతుంది. 15 అయితే నీవు ఈ ఒక్క పని చేస్తే నిన్ను ఆమెను పెళ్లి చేసుకోనిస్తాం. మీ పట్టణంలో ప్రతి పురుషుడూ మాలాగే సున్నతి చేసుకోవాలి. 16 అప్పుడు మీ పురుషులు మా స్త్రీలను, మా పురుషులు మీ స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు మనమంతా ఒక్క ప్రజ అవుతాం. 17 సున్నతికి మీరు నిరాకరిస్తే, దీనాను మేము తీసుకెళ్ళిపోతాం” అని అతనితో చెప్పారు.

18 ఈ ఒడంబడిక హమోరుకు, షెకెముకు చాలా సంతోషం కలిగించింది. 19 దీనా సోదరులు అడిగినట్లు చేయాలంటే షెకెముకు చాలా సంతోషంగా ఉంది.

షెకెము, అతని కుటుంబంలోకెల్లా చాలా గౌరవం గలవాడు. 20 హమోరు, షెకెము వారి పట్టణంలో సమావేశ స్థలానికి వెళ్లారు. ఆ పట్టణంలోని పురుషులతో వారు మాట్లాడి, అన్నారు: 21 “ఈ ఇశ్రాయేలీయులు మనతో నిజంగా స్నేహంగా ఉండాలని కోరుతున్నారు. వాళ్లను మన దేశంలోనే నివసించి వ్యాపారం చేసుకోనిద్దాం. మనందరికి సరిపోయేంత భూమి మనకు ఉంది. మనం వాళ్ల స్త్రీలను స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అలానే వారి పురుషులు వివాహం చేసుకొనేందుకు మన స్త్రీలను సంతోషంగా మనం ఇవ్వవచ్చు. 22 అయితే మన పురుషులంతా ఒక పని చేయడానికి ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగే మన మగవాళ్లంతా సున్నతి చేసుకొనేందుకు సమ్మతించాలి. 23 మనం ఇలా చేస్తే, వాళ్ల ఆల మందలు, జంతువులు, వస్తుజాలం అన్నీ మనకి దక్కి, మనం ధనికులం అవుతాం. కనుక మనం వాళ్లతో ఈ ఒడంబడిక చేయాల్సిందే, వాళ్లు మనతోనే ఉంటారు.” 24 సమావేశ స్థలంలో ఈ మాటను విన్న మగవాళ్లంతా షెకెము, హమోరులతో ఏకీభవించారు. ఆ సమయంలో ప్రతి పురుషునికి సున్నతి జరిగింది.

25 మూడు రోజుల తర్వాత, సున్నతి పొందిన మగవాళ్లు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఈ సమయంలో ఆ మనుష్యులు బలహీనంగా ఉంటారని యాకోబు ఇద్దరు కుమారులు షిమ్యోను, లేవీలకు తెలుసు. కనుక వారు పట్టణంలోకి వెళ్లి, ఆ పురుషులందర్నీ అక్కడే చంపేశారు. 26 దీనా సోదరులు షిమ్యోను, లేవీ కలిసి హమోరును, అతని కుమారుని చంపేసారు. అంతట వారు షెకెము యింటినుండి దీనాను తీసుకొని వెళ్లిపోయారు. 27 యాకోబు మిగిలిన కుమారులు ఆ పట్టణంలోకి వెళ్లి, అక్కడ ఉన్న సమస్తం దోచుకొన్నారు. వారి సోదరికి, షెకెము చేసిన దాని విషయంలో వారు ఇంకా కోపంగా ఉన్నారు. 28 కనుక వారి జంతువులన్నింటినీ ఆ సోదరులు తీసుకుపోయారు. వారి గాడిదలను, పట్టణంలో, పొలాల్లో మిగిలినదంతా వారు దోచుకొన్నారు. 29 ప్రజలకు ఉన్నదంతా ఆ సోదరులు దోచుకుపోయారు. చివరికి వారి భార్యలను, పిల్లలను కూడా ఆ సోదరులు తీసుకొని వెళ్లిపోయారు.

30 అయితే షిమ్యోనుతోనూ, లేవీతోనూ యాకోబు అన్నాడు, “మీరు నాకు చాలా కష్టం తెచ్చి పెట్టారు. ఈ దేశంలో ఉన్న ప్రజలంతా నన్ను అసహ్యించుకొంటారు. కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు అంతా నాకు వ్యతిరేకంగా లేస్తారు. మనమేమో చాలా కొద్దిమందిమే ఉన్నాం. ఈ దేశంలో ఉన్నవాళ్లంతా ఏకమై మనమీద యుద్ధానికి వస్తే, నన్ను నాశనం చేస్తారు. నాతోబాటే మన ప్రజలందర్నీ నాశనం చేస్తారు.”

31 అయితే ఆ సోదరులు, “ఈ ప్రజలు మా సోదరిని ఒక వేశ్యలా చేస్తే, చూస్తూ ఊరుకోమంటావా? లేదు, మా సోదరికి అలా చేయటం వారిది తప్పు” అని చెప్పారు.

మార్కు 5

యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం

(మత్తయి 8:28-34; లూకా 8:26-39)

వాళ్ళు సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. యేసు పడవ నుండి క్రిందికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు స్మశానంలో నివసిస్తుండే వాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ పట్టి ఉంచలేక పోయారు. వాని చేతుల్ని, కాళ్ళను ఎన్నోసార్లు యినుప గొలుసులతో కట్టివేసే వాళ్ళు. కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్ళకు వేసిన యినుప కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగలశక్తి ఎవ్వరికి లేదు. వాడు స్మశానంలో సమాధుల దగ్గర, కొండల మీదా, రాత్రింబగళ్ళు బిగ్గరగా ఏడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకొనేవాడు.

వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాడు. “యేసూ! మహోన్నతుడైన దేవుని కుమారుడా! మాజోలికి రావద్దయ్యా! మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమాణంతో చెప్పండి” అని వాడు బిగ్గరగా అరుస్తూ ప్రాధేయ పడ్డాడు. ఎందుకంటే ఒక్క క్షణం క్రితం యేసు వానితో, “ఓ! దయ్యమా! ఆ మనిషి నుండి బయటకు రా!” అని అన్నాడు.

యేసు వాణ్ణి, “నీ పేరేమి?” అని అడిగాడు.

“నా పేరు ‘పటాలం’.[a] మా గుంపు చాలా పెద్దది” అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. 10 వానిలోని దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి పంపివేయవద్దని దీనంగా ఎన్నోసార్లు వేడుకొన్నాయి.

11 ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు మేస్తూవుంది. 12 ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల్లోకి పంపండి. వాటిలో ప్రవేశించటానికి అనుమతివ్వండి” అని అన్నాయి. 13 యేసు వాటికి అనుమతి యిచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. రెండువేల దాకా ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సున పడి మునిగిపొయ్యాయి.

14 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, ఈ సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. 15 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల పటాలం పట్టినవాడు దుస్తులు వెసుకొని సక్రమమైన బుద్ధితో, కూర్చొని ఉండటం గమనించారు. వాళ్ళకు భయం వేసింది. 16 జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్ళకందరికి చెప్పారు. 17 వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు.

18 యేసు పడవనెక్కుతుండగా దయ్యం పట్టిన వాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు. 19 యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, “ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబం లోని వాళ్ళతో చెప్పు” అని అన్నాడు.

20 అతడు వెళ్ళి దెకపొలిలో[b] యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.

యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం

(మత్తయి 9:18-26; లూకా 8:40-56)

21 యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే ఉన్నాడు. 22 ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడి, 23 “నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది” అని దీనంగా వేడుకొన్నాడు.

24 యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది.

25 పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది.

27 ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది. 28 తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది. 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది. 30 వెంటనే, యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, “నా దుస్తుల్ని ఎవరు తాకారు?” అని అన్నాడు.

31 ఆయన శిష్యులు, “ప్రజలు మిమ్మల్ని త్రోసుకొంటూ మీ మీద పడుతున్నారు గదా! అయినా ఎవరు తాకారని అడుగుతున్నారెందుకు?” అని అన్నారు.

32 కాని యేసు, “ఎవరు తాకారు?” అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. 33 అప్పుడా స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది. 34 ఆయనామెతో, “అమ్మా! నీ విశ్వాసమే నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి” అని అన్నాడు.

35 యేసు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరానికి అధికారియైన యాయీరు ఇంటి నుండి కొందరు మనుష్యులు వచ్చి యాయీరుతో, “మీ కూతురు మరణించింది. బోధకునికి శ్రమ కలిగించటం దేనికి?” అని అన్నారు.

36 యేసు వాళ్ళన్న దాన్ని విని లెక్క చేయకుండా సమాజమందిరపు అధికారితో, “భయపడకు. నమ్మకంతో ఉండు” అని అన్నాడు.

37 యేసు పేతుర్ని, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును తప్ప మరెవ్వరిని తనవెంట రానివ్వలేదు. 38 యాయీరు యింటికి వచ్చాక అక్కడున్న వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ పెడ బొబ్బలు పెడుతూ ఉండటం యేసు చూసాడు. ఏమీ తోచక అందరూ దిగులుతో ఉండినారు. 39 ఆయన యింట్లోకి వెళ్ళి వాళ్ళతో, “ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె చనిపోలేదు. నిద్రలోవుంది! అంతే!” అని అన్నాడు. 40 కాని వాళ్ళాయన్ని హేళన చేసారు. యేసు వాళ్ళనందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని తనతోవున్న శిష్యుల్ని వెంటబెట్టుకొని, ఆమె ఉన్న గదికి వెళ్ళాడు. 41 ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “తలీతాకుమీ!” అని అన్నాడు. (తలీతాకుమీ అంటే “చిన్నమ్మాయి! నేను చెబుతున్నాను లెమ్ము!” అని అర్థం.) 42 ఆమె వెంటనే లేచి నడవటం మొదలు పెట్టింది. (ఆమె వయస్సు పన్నెండు సంవత్సరాలు.) ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. 43 దీన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తినటానికి ఏదైనా యివ్వమని వాళ్ళకు చెప్పాడు.

యోబు 1

యోబు మంచి మనిషి

ఊజు దేశంలో ఒక మంచి మనిషి జీవించాడు. అతని పేరు యోబు. యోబు మంచివాడు, నమ్మక మైనవాడు. యోబు తన జీవితాంతము దేవుని ఆరాధించాడు. యోబు చెడు క్రియలకు దూరంగా ఉండేవాడు. యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలుండిరి. యోబుకు ఏడు వేల గొర్రెలు, మూడు వేల ఒంటెలు, వెయ్యి ఎద్దులు, ఐదు వందల ఆడ గాడిదలు సొంతంగా ఉన్నాయి. వీటికి తోడు అతనికి చాలా మంది పనివాళ్లు ఉన్నారు. తూర్పు ప్రాంతంలో యోబు మిక్కిలి ధనవంతుడుగా ఉండేవాడు.

యోబు కుమారులు వంతుల ప్రకారం వారి ఇండ్లలో విందులు చేసుకొంటూ, వారి సోదరీలను ఆహ్వానిస్తుండేవారు. యోబు పిల్లలు విందు చేసుకొన్న తర్వాత, అతడు ఉదయం పెందలాడే లేచేవాడు. అతడు తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం ఒక్కోక్క దహనబలి అర్పించేవాడు. “ఒకవేళ నా పిల్లలు నిర్లక్ష్యంగా ఉండి, వారి విందులో దేవునికి విరోధంగా పాపం చేశారేమో” అని అతడు తలచేవాడు. తన పిల్లలు వారి పాపాల విషయంలో క్షమించబడాలని అతడు ఎల్లప్పుడు ఇలా చేస్తూ ఉండేవాడు.

అప్పుడు దేవదూతలు యెహోవా సముఖంలో సమావేశమయ్యే ఒక రోజు వచ్చింది. అప్పుడు ఆ దేవదూతలతోబాటు సాతానుకూడ వచ్చాడు. “ఎక్కడి నుండి వస్తున్నావు?” అని సాతానును యెహోవా అడిగాడు.

“నేను భూలోకంలో సంచారం చేస్తూ వచ్చాను” అని యెహోవాకు సాతాను జవాబు చెప్పాడు.

అంతట యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు చూశావా? భూమి మీద అతనిలాంటి వారు ఎవ్వరూ లేరు. యోబు నిజంగా మంచి మనిషి మరియు నమ్మకమైనవాడు. అతడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. దుర్మార్గపు పనులకు అతడు దూరంగా ఉంటాడు” అని సాతానుతో అన్నాడు.

“ఓ తప్పకుండా! కానీ యోబు దేవుణ్ణి ఆరాధించటానికి ఒక గట్టి కారణం ఉంది! 10 అతణ్ణి, అతని కుటుంబాన్ని, అతనికి ఉన్న సర్వాన్ని నీవు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నావు. అతడు చేసే ప్రతిపనిలో నీవు అతణ్ణి విజయుణ్ణి చేస్తున్నావు. అవును, నీవు అతణ్ణి ఆశీర్వదించావు. అతడు చాలా ధనికుడు గనుక అతని పశువుల మందలు, గొర్రెల మందలు దేశం అంతటానిండి ఉన్నాయి. 11 కానీ అతనికి ఉన్న సర్వాన్నీ నీవు గనుక నాశనం చేస్తే అతడు నీకు వ్యతిరేకంగా, నీముఖం మీదనే శపిస్తాడని ప్రమాణం చేస్తున్నాను” అని సాతాను జవాబిచ్చాడు.

12 “సరే, యోబుకు ఉన్న వాటన్నింటికీ నీవు ఏమైనా చేయి. కాని అతని శరీరానికి మాత్రం హానిచేయవద్దు” అని యెహోవా సాతానుతో చెప్పాడు.

అప్పుడు సాతాను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు.

యోబు సర్వం పోగొట్టుకొన్నాడు

13 ఒకరోజు యోబు కుమారులు, కుమార్తెలు అతని జ్యేష్ఠ కుమారుని ఇంటివద్ద తినుచూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. 14 అంతలో ఒక సందేశకుడు యోబు దగ్గరకు వచ్చి, “ఎడ్లు దున్నుతూ, ఆ దగ్గరలోనే గాడిదలు గడ్డి మేస్తూ వుండగా, 15 షెబాయీయులు[a] మా మీద దాడి చేసి నీ జంతువులను తీసుకొనిపోయారు! నన్ను తప్ప మిగిలిన నీ సేవకులనందరినీ షెబాయీయులు చంపేశారు. నీతో చెప్పటానికే నేనొక్కడినే తప్పించుకొన్నాను” అని చెప్పాడు.

16 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరో సందేశకుడు యోబు దగ్గరకు వచ్చాడు. “ఆకాశంనుండి మెరుపుల ద్వారా అగ్నిపడి నీ గొర్రెలను, సేవకులను కాల్చివేసింది. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను!” అని రెండో సందేశకుడు చెప్పాడు.

17 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూండగానే ఇంకో సందేశకుడు వచ్చాడు. “కల్దీయులు పంపిన మూడు గుంపులవారు వచ్చి మా మీద పడి ఒంటెలను తీసుకొని పోయారు. పైగా వారు సేవకులను చంపేశారు. నీతో చెప్పేందుకు నేనొక్కణ్ణి మాత్రం తప్పించుకొన్నాను” అని ఈ మూడో సందేశకుడు చెప్పాడు.

18 మూడో సందేశకుడు ఇంకా చెబుతూ ఉండగానే మరో సందేశకుడు వచ్చాడు. “నీ పెద్ద కుమారుని యింటి వద్ద నీ కుమారులు, కుమార్తెలు భోజనం చేస్తూ, ద్రాక్షారసం తాగుతూ ఉండగా. 19 అకస్మాత్తుగా ఎడారినుండి ఒక బలమైన గాలి వీచి ఇంటిని పడ గొట్టేసింది. ఆ ఇల్లు నీ కుమారులు, కుమార్తెల మీద పడగానేవారు మరణించారు. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను” అని నాలుగో సందే శకుడు చెప్పాడు.

20 యోబు ఇది వినగానే తన విచారాన్ని, కలవరాన్ని తెలియజేయడానికి తన బట్టలు చింపుకొని, తల గుండు చేసుకొన్నాడు. తరువాత యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు. 21 అతడు ఇలా చెప్పాడు:

“నేను ఈ లోకంలో పుట్టినప్పుడు
    నేను దిగంబరిని, నాకు ఏమీ లేదు.
నేను మరణించి లోకాన్ని విడిచి పెట్టేటప్పుడు
    నేను దిగంబరినిగా ఉంటాను. నాకు ఏమీ ఉండదు.
యెహోవా ఇచ్చాడు.
    యెహోవా తీసుకున్నాడు.
యెహోవా నామాన్ని స్తుతించండి!”

22 ఇవన్నీ సంభవించినాగానీ యోబు మాత్రం పాపం చేయలేదు. అతడు దేవుణ్ణి నిందించనూలేదు.

రోమీయులకు 5

దేవునితో స్నేహము

మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది. మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసంగల మనకు యేసు క్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకొంటామనే ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతోంది. అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలుగదు.

నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు. నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు. కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు.

దేవుడు యేసు క్రీస్తు రక్తంద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసు క్రీస్తు ద్వారా సంభవిస్తుంది. 10 ఒకప్పుడు మనం దేవుని శత్రువులం. అయినా తన కుమారుని మరణంవల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. 11 పైగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము.

ఆదాము వల్ల మరణం, క్రీస్తు వల్ల జీవం

12 పాపం ఈ ప్రపంచంలోకి ఆదాము ద్వారా ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. అంతేకాక అందరూ పాపం చేసారు కనుక అందరికీ మరణం ప్రాప్తించింది. 13 ధర్మశాస్త్రానికి ముందే పాపం ఈ ప్రపంచంలో ఉండేది. కాని ధర్మశాస్త్రం లేక పోయినట్లైతే పాపం లెక్కలోకి వచ్చేది కాదు. 14 అయినా, ఆదాము కాలంనుండి మోషే కాలం వరకు మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతనివలే పాపం చెయ్యనివాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది.

ఆదాముకు, రానున్నవానికి కొంత పోలిక ఉంది. 15 కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఒకడు చేసిన పాపం వల్ల చాలా మంది మరణించారు. మరొకని అనుగ్రహం వల్ల, అంటే యేసు క్రీస్తు అనుగ్రహంవల్ల, దేవునిలో వరము, ఆయన అనుగ్రహము ఉచితంగా లభించాయి. 16 పైగా ఆదాము ఒక్కసారి చేసిన పాపానికి నేరస్థుడుగా తీర్పు ఇవ్వబడింది. కాని ఎన్నో పాపాలు చేసిన మనకు దేవుని నుండి నీతిమంతులముగా అయ్యే వరం లభించింది. అందువల్ల ఆదాము పాపాన్ని దేవుని వరంతో పోల్చలేము. 17 ఆదాము పాపం చేసాడు. ఆ ఒక్కని పాపంవల్ల మరణం రాజ్యం చేసింది. కాని ఆ “ఇంకొకని” ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితం పొంది రాజ్యం చెయ్యటం తథ్యం. ఇది దేవుని నుండి నీతియను వరాన్ని, సంపూర్ణమైన ఆయన అనుగ్రహాన్ని పొందినవాళ్ళకు సంభవిస్తుంది.

18 అందువల్ల ఒకడు చేసిన పాపంవల్ల ప్రజలందరికీ శిక్ష విధించబడింది. అదే విధంగా ఒకడు ఒక నీతికార్యాన్ని చేయటంవల్ల, అందరూ శిక్షను తప్పించుకొని అనంతజీవితం పొందుటకు మార్గమేర్పడింది. 19 ఒకని అవిధేయతవల్ల అనేకులు పాపులుగా చేయబడిరి. అలాగే ఒకని విధేయతవల్ల అనేకులు నీతిమంతులగుదురు. 20 పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటే అనుగ్రహం ఇంకా అధికమయ్యింది. 21 పాపం మరణం ద్వారా రాజ్యం చేసినట్లు దైవానుగ్రహం నీతిద్వారా రాజ్యం చేసింది. మన యేసు క్రీస్తు ప్రభువుద్వారా అది మనకు అనంత జీవం కలిగిస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International