Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
మత్తయి 23-24

యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం

(మార్కు 12:38-40; లూకా 11:37-52; 20:45-47)

23 ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “శాస్త్రులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చునివున్నారు. అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో చెయ్యండి. కాని వాళ్ళు బోధించినవి వాళ్ళే ఆచరించరు కనుక వాళ్ళు చేసేవి చెయ్యకండి. వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కాని వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదలించరు.

“పెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచులను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు. విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు. సంతల్లో, ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు.

“మీకందరికి బోధకుడు ఒకడే! మీరంతా సోదరులు. కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలువనీయకండి. ప్రపంచంలో ఎవ్వర్నీ ‘తండ్రి!’ అని సంబోధించకండి. మీ అందరికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. 10 అదే కాకుండా మిమ్మల్ని ‘గురువు!’ అని పిలువ నియ్యకండి. మీకు ఒకే గురువు ఉన్నాడు. ఆయనే ‘క్రీస్తు.’ 11 మీలో గొప్ప వాడు మీ సేవకునిగా ఉండాలి. 12 ఎందుకంటే గొప్పలు చెప్పుకొనేవాణ్ణి దేవుడు అణచి వేస్తాడు. అణకువతో ఉన్న వాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు.

13 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. 14 [a]

15 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు.

16 “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 17 మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?

18 “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? 20 అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 21 అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 22 అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా!

23 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. 24 గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు.

25 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. 26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.

27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.

29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!

33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.

35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.

యెరూషలేము విషయంలో దుఃఖించటం

(లూకా 13:34-35)

37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. 38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. 39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”

యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం

(మార్కు 13:1-31; లూకా 21:5-33)

24 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు.

యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.

యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు. దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట.

“ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. 10 ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. 11 దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. 12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. 13 కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. 14 ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది.

15 “అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠకుడు దీని అర్థం గ్రహించాలి. 16 అప్పుడు యూదయ ప్రాంతలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం మంచిది. 17 మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి వెళ్ళి ఏదీ తీసుకోరాదు. 18 పొలంలో వున్నవాడు తన వస్త్రాన్ని తీసుకు రావటానికి వెనక్కు మళ్ళరాదు.

19 “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా! 20 ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ కూడదని ప్రార్థించండి. 21 ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు.

22 “దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక పోయినట్లయితే, ఎవ్వరూ బ్రతికి ఉండే వాళ్ళు కాదు. కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల సంఖ్య తగ్గించాడు.

23 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి. 24 ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. 25 చూడండి! ముందే మీకు చెబుతున్నాను.

26 “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి. 27 తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు. 28 శవమున్న చోటే రాబందులు ప్రోగౌతాయి.

29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే,

‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు.
    చంద్రుడు వెలుగునివ్వడు
నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి
    ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’[b]

30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.

32 “ఇక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని గురించి నేర్చుకొండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు తెలిసి పోతుంది. 33 అదే విధంగా నేను చెప్పినవన్నీ చూసిన వెంటనే ఆయన దగ్గరలోనే ఉన్నాడని అంటే మీ తలుపు ముందే ఉన్నాడని తెలుసుకొంటారు. 34 ఇది సత్యం. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం వాళ్ళు జీవించే ఉంటారు. 35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి!

ఆ దినం కాని, ఆ ఘడియ కాని ఎవ్వరికీ తెలియదు

(మార్కు 13:32-37; లూకా 17:26-30, 34-36)

36 “ఆ రోజును గురించి లేక ఆ ఘడియను గురించి పరలోకంలోని దేవ దూతలకు గాని, కుమారునికి గాని ఎవ్వరికి తెలియదు. తండ్రికి మాత్రం తెలుసు.

37 “నోవహు కాలంలో ఏ విధంగా ఉందో మనుష్యకుమారుడు వచ్చినప్పుడు కూడా అదే విధంగా వుంటుంది. 38 నోవహు తన నావలో ప్రవేశించేదాకా, ప్రళయానికి ముందు రోజుల్లో ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకొంటూ, పెళ్ళిళ్ళు చేస్తూ జీవించారు. 39 ప్రళయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని పోయేదాకా ఆ విధంగా జరుగుతుందని వాళ్ళకు తెలియదు.

“మనుష్యకుమారుడు కూడా అదే విధంగా అకస్మాత్తుగా వస్తాడు. 40 ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడతాడు. రెండవ వాడు వదిలి వేయబడతాడు. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒక స్త్రీని తన వెంట తీసుకువెళ్తాడు. రెండవ స్త్రీని వదిలి వేస్తాడు.

42 “మీ ప్రభువు ఏ రోజు రానున్నాడో మీకు తెలియదు కనుక సిద్ధముగా ఉండండి. 43 కాని ఈ విషయం తెలుసుకొండి. ఇంటి యజమానికి దొంగ ఎప్పుడు వస్తాడో తెలిసి ఉంటే, తన యింట్లోకి దొంగను రానీయకుండా కాపలాకాస్తాడు. 44 మనుష్య కుమారుడు కూడా మీరు అనుకోని ఘడియలో వస్తాడు. కనుక మీరు కూడా అదే విధంగా సిద్ధంగా ఉండాలి.

మంచి దాసుడు, చెడ్డ దాసుడు

(లూకా 12:41-48)

45 “విశ్వాసము, తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహరణగా తీసుకోండి. అతని యజమాని అతణ్ణి తన యింట్లో పనిచేసే వాళ్ళకు సరియైన సమయంలో భోజనం పెట్టడానికి నియమించాడు. 46 యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్లు చేస్తూవుంటే ధన్యుడు. 47 నేను మీకు నిజం చెబుతున్నాను: యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు.

48 “ఒక వేళ ఆ సేవకుడు దుర్మార్గుడైతే తనలో తాను ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని 49 తన తోటి పని వాళ్ళను కొట్టడం మొదలు పెడ్తాడు. అంతేకాక త్రాగుబోతులతో కలసి తిని, త్రాగుతాడు. 50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, 51 అతణ్ణి చంపించి పాపులతో సహా నరకంలో పడవేస్తాడు. ఆ నరకంలో వాళ్ళంతా ఏడుస్తూ పండ్లు కొరుకుతూ బాధననుభవిస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International