Chronological
యిర్మీయా దేవాలయ ప్రసంగం
7 యిర్మీయాకు యెహోవా నుండి ఇలా వర్తమానం వచ్చింది: 2 “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించుము:
“‘ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవాను ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా ఈ వర్తమానం వినండి! 3 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడు, మీ జీవన విధానం మార్చుకోండి. సత్కార్యములు చేయండి! మీరలా చేస్తే, ఈ స్థలంలో మిమ్మల్ని నివసించేలాగు చేస్తాను[a] 4 కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం;[b] ఇదే దేవాలయం ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు. 5 మీరు మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, మిమ్మల్ని ఈ ప్రదేశంలో నివసించేలా చేస్తాను. మీరు ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి. 6 క్రొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. 7 మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను.
8 “‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు అప్రయోజనకరమైనవి. 9 మీరు దొంగతనాలు, హత్యలు చేస్తారా? వ్యభిచార పాపానికి ఒడిగడతారా? మీరు ఇతరులపై అకారణంగా నేరారోపణ చేస్తారా? బూటకపు బయలు దేవుణ్ణి ఆరాధిస్తారా? మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరిస్తారా? 10 మీరీ పాపాలు చేసి, నా పేరుతో పిలవబడే ఈ ఆలయంలో నా ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? ఈ చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటానికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా? 11 ఈ ఆలయం నా పేరుతో పిలవబడుతూ ఉంది! అయితే మీకు ఈ స్థలం ఒక దొంగల గుడారముకంటె భిన్నంగా కన్పించటం లేదా? నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!’” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది!
12 “‘యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు షిలోహు నగరానికి వెళ్లండి. అక్కడ నేను మొదటిసారిగా ఎక్కడైతే నా నామం కోసం ఒక ఇంటిని నిర్మించానో ఆ చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయులు కూడ దుష్టకార్యాలు చేశారు. వారు చేసిన పాపకార్యాలకు ప్రతిగా ఆ స్థలానికి నేను ఏమి చేసియున్నానో వెళ్లి చూడండి[c] 13 ఇశ్రాయేలీయులారా, మీరీ చెడుకార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది! నేను మీతో అనేక పర్యాయాలు మాట్లాడి యున్నాను. కాని మీరు వినటానికి నిరాకరించారు. నేను మిమ్మల్ని పిలిచాను. అయినా మీరు పలకలేదు. 14 అందుచే యెరూషలేములో నాపేరు మీద పిలవబడే ఈ ఆలయాన్ని నాశనం చేస్తాను. షిలోహును నాశనం చేసినట్లు ఆ ఆలయాన్ని నాశనం చేస్తాను! ఆ ఆలయంలో మీరు విశ్వాసముంచారు. నేనా స్థలాన్ని మీకు, మీ పూర్వీకులకు ఇచ్చియున్నాను. 15 మీ సోదరులనందరినీ నేను ఎఫ్రాయిమునుండి వెడల గొట్టినట్లు, నానుండి మిమ్మల్ని దూరంగా వెడలగొడతాను.’
16 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు నీవు అడుగవద్దు; వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను ఆలకించను. 17 యూదా పట్టణాలలో ఆ ప్రజలు ఏమి చేస్తున్నారో నీవు గమనిస్తున్నావని నాకు తెలుసు. యెరూషలేము నగర వీధుల్లో వారేమి చేస్తున్నారో నీవు చూడవచ్చు. 18 యూదా ప్రజలు ఏమి చేస్తున్నారనగా: పిల్లలు కట్టెలను పోగుచేయటం; తండ్రులు వాటితో నిప్పు రాజేయటం; స్త్రీలు పిండి కలిపి, ఆకాశ రాణికి[d] నివేదించటానికి రొట్టెలు చేయటం, యూదా ప్రజలు ఇతర దేవతారాధనలో పానీయార్పణలను కుమ్మరిస్తున్నారు. నాకు కోపం తెప్పించటానికే ఇవన్నీ చేస్తున్నారు. 19 కాని వాస్తవానికి యూదా ప్రజలు బాధపర్చేది నన్నుగాదు వారిని వారే బాధపర్చుకుంటున్నారు. వారిని వారే అవమానపర్చుకుంటున్నారు” ఇది యెహోవా వాక్కు,
20 కావున యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “నా కోపాన్ని ఈ ప్రదేశంపై చూపిస్తాను. నేను మనుష్యులను, జంతువులను శిక్షిస్తాను. పొలాల్లో చెట్లను, భూమి మీద పంటను నాశనం చేస్తాను. నా కోపం ప్రళయాగ్నిలా వుంటుంది. దానిని ఆర్పగల శక్తి ఎవ్వరికీ లేదు.”
యెహోవా కోరేది బలులు కాదు, విధేయత
21 సర్వ శక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నాడు: “మీరు వెళ్లి మీరు కోరినన్ని దహన బలులు, సాధారణ బలులు అర్పించండి. తద్వారా వచ్చిన మాంసాన్ని మీరే తినండి. 22 మీ పూర్వీకులను నేను ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. నేను వారితో మాట్లాడాను. కాని దహన బలుల గురించి, సాధరణ బలుల గురించి నేను వారికి ఏ రకమైన ఆజ్ఞలూ ఇవ్వలేదు. 23 వారికి ఈ ఆజ్ఞ మాత్రమే ఇచ్చియున్నాను, ‘నాకు విధేయులై వుండండి. అప్పుడు నేను మీ దేవుడనై యుంటాను. మీరు నా ప్రజలైయుంటారు. నేను చెప్పినదంతా చేయండి. మీకు శుభం కలుగుతుంది.’
24 “కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. నన్ను లెక్కచేయలేదు. మొండిగా, వారు చేయదలచుకున్నదంతా చేశారు. వారు సన్మార్గులు కాలేదు. వారు మరింత దుష్టులయ్యారు. ముందుకు సాగక వెనుకకు తిరిగారు. 25 మీ పూర్వీకులు ఈజిప్టును వదలిన నాటినుండి ఈనాటి వరకు నా సేవకులను మీవద్దకు పంపియున్నాను. వారే ప్రవక్తలు. వారిని మీ వద్దకు అనేకసార్లు పంపాను. 26 కాని మీ పూర్వికులు వారి మాట వినలేదు. వారు నన్ను లెక్కచేయలేదు. వారు మిక్కిలి మొండివారు. వారి తండ్రుల కంటె వారు ఎక్కువ చెడుకార్యాలు చేశారు.
27 “యిర్మీయా, నీవు ఇవన్నీ యూదా ప్రజలకు చెపుతావు. అయినా వారు నీమాట వినరు! నీవు వారిని పిలుస్తావు. కాని వారు పలుకరు. 28 అందువల్ల వారికి నీవీ మాటలు చెప్పాలి: తన యెహోవా దేవునికి విధేయతగా లేని దేశం ఇదే. దేవుని ఉపదేశములను ఈ ప్రజలు వినలేదు. సత్య ప్రవచనాలు ఈ ప్రజలు ఎరుగరు.
వధ లోయ
29 “యిర్మీయా, నీ జుట్టు కత్తిరించి పారవేయి[e] కొండమీదికి వెళ్లి దుఃఖించుము. ఎందుకంటావా? యెహోవా ఈ తరం ప్రజలను తిరస్కరించినాడు. ఈ ప్రజలకు యెహోవా విముఖుడైనాడు. కోపంతో ఆయన వారిని శిక్షిస్తాడు. 30 ఏడ్వండి, ఎందుకంటే యూదా ప్రజలు చెడుకార్యాలు చేయటం నేను చూసియున్నాను.” ఇది యెహోవా వాక్కు. “వారు విగ్రహాలను ప్రతిష్టించారు. నేనా విగ్రహాలను అసహ్యించుకుంటున్నాను! నా పేరుతో పిలువబడే ఆలయంలో వారు విగ్రహాలను పెట్టినారు. నా నివాసాన్ని వారు అపవిత్రపర్చారు. 31 యూదా ప్రజలు బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు[f] నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కమార్తెలను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటువంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ ఈ రకమైన ఆలోచనే నా మనస్సుకు రాలేదు! 32 కావున నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రజలు ఈ స్థలాన్ని తోఫెతు అనిగాని, బెన్ హిన్నోములోయ అనిగాని పిలవకుండా వుండే రోజులు వస్తున్నాయి” ఇది యెహోవా వాక్కు. పైగా వారు దీనిని కసాయి లోయ[g] అని పిలుస్తారు. “వారు ఈ పేరు పెడతారు కారణమేమంటే తోఫెతులో ఏమాత్రం ఇంకెవ్వరినీ పాతిపెట్టేందుకు ఖాళీ లేకుండా చనిపోయిన వారిని పాతిపెడతారు. 33 తరువాత శవాలను వట్టి నేలపై పడవేస్తారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. ఆ శవాలను అడవి జంతువులు పీక్కొని తింటాయి. శవాలను తినే పక్షులను, జంతువులను తోలి వేయటానికి అక్కడ బ్రతికి వున్న మనుష్యుడొక్కడూ మిగలడు. 34 యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను ఆనందోత్సాహాలు లేకుండా చేస్తాను. యూదాలోను, యెరూషలేములోను పెండ్లి సందడులు, వేడుకలు ఇక వుండవు. ఈ రాజ్యం పనికిరాని ఎడారిలా మారిపోతుంది.”
8 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “ఆ సమయంలో యూదా రాజులయొక్క, ముఖ్యపాలకుల యొక్క ఎముకలను ప్రజలు సమాధులనుండి తీస్తారు. వారు యాజకుల యొక్క, ప్రవక్తల యొక్క ఎముకలను సమాధులనుండి తీస్తారు. యెరూషలేము ప్రజలు ఎముకలను కూడ వారి సమాధుల నుండి తీస్తారు. 2 ఆ మనుష్యులు ఆ ఎముకలను ఆరుబయట సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు కనపడేలా పడవేస్తారు. యోరూషలేము ప్రజలు సూర్య చంద్రులను, నక్షత్రాలను ఆరాధించటానికి యిష్టపడతారు. ఆ ఎముకలను తిరిగి ఎవ్వరూ ప్రోగుచేసి పాతిపెట్టరు. కావున ఆ యెముకలన్నీ పశువుల పేడవలె బయట పారవేయబడును.
3 “యూదా ప్రజలు వారి ఇండ్లను, రాజ్యాన్ని వదిలి పోయేలా నేను ఒత్తిడి చేస్తాను. ఆ ప్రజలు వారి దేశాన్నుండి పరరాజ్యానికి తీసికొని పోబడతారు. యుద్ధంలో చావగా మిగిలిన యూదా ప్రజలు (ఈ దుష్ట ప్రజలు) తాము కూడ చనిపోతే బాగుండేదని భావిస్తారు,” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
పాపము శిక్ష
4 “యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు తెలియజేయుము: ‘యెహోవా ఈ విషయాలు చెప్పినాడు:
“‘ఒక వ్యక్తి క్రింద పడితే
తిరిగి లేస్తాడని మీకు తెలుసు.
ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్లితే
అతడు మరల తిరిగి వెనుకకు వస్తాడు.
5 యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు.
కాని యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు పెడమార్గాన వెళ్లుచున్నారు?
వారి అబద్ధాలను వారే నమ్ముతారు.
వారు వెనుదిరిగి రావటానికి నిరాకరిస్తారు.
6 వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను.
కాని వారు ఏది సరైనదో తెలియజెప్పరు.
ప్రజలు వారి పాపాలకు విచారించుట లేదు.
ప్రజలు వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు.
ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు.
వారు యుధ్ధానికి పరుగెత్తే గుర్రాల్లా ఉన్నారు.
7 ఆకాశంలో ఎగిరే పక్షులకు సైతం
తమ పనులకు ఒక నిర్ణీత కాలం తెలుసు.
కొంగలు, గువ్వలు, వాన కోవిలలు, ఓదెకరువులు (ఒక జాతి కొంగ)
వీటన్నిటికీ ఇతర ప్రాంతాలకు వలసపోయే కాలము క్రమము తప్పక తెలుసు.
కాని నా ప్రజలకు మాత్రం వారి యెహోవా వారిని ఏమి చేయమని కోరుతున్నాడో తెలియదు.
8 “‘యెహోవా ధర్మశాస్త్రం (ఉపదేశములు) మావద్ద ఉన్నది! అందువల్ల మేము తెలివిగలవారము! అని మీరు చెప్పుకుంటూ వుంటారు.
కాని అది నిజం కాదు. ఎందువల్లనంటే లేఖకులు[h] (వ్రాత గాండ్రు) వారి కలాలతో అబద్ధమాడారు.
9 ఈ “తెలివిగలవారు” యెహోవా ఉపదేశములను వినటానికి నిరాకరించారు.
కావున నిజంగా వారు జ్ఞానవంతులు కారు.
ఆ “జ్ఞానవంతులు” అనబడే వారు మోసంలో పడ్డారు.
వారు విస్మయం పొంది, సిగ్గుపడ్డారు.
10 కావున వారి భార్యలను నేనితరులకిచ్చి వేస్తాను.
వారి పొలాలను క్రొత్త యజమానులకిచ్చివేస్తాను.
ఇశ్రాయేలు ప్రజలంతా అధిక ధనసంపాదనపై ఆసక్తిగలవారు.
ప్రాముఖ్యంలేని అతి సామాన్యుల నుండి ముఖ్యుల వరకు ప్రజలంతా అలాంటివారే.
ప్రవక్తల నుండి యాజకుల వరకు ప్రజలంతా అబద్ధాలు చెప్పేవారే.
11 నా ప్రజలు బాగా గాయపడ్డారు.
కాని అదేదో బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజకులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మాన్పజూస్తారు.
“అంతా మంచిగా వుంది; అంతా మంచిగా వుంది!” అని వారంటారు.
కాని పరిస్థితి ఏమీ బాగా లేదు!
12 ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి.
కాని వారు సిగ్గుపడనే లేదు.
వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వారికి తెలియదు.
అందరితో పాటు వారూ శిక్షించబడతారు.
నేను వారిని శిక్షిస్తాను; వారిని క్రిందికి పడవేస్తాను.’”
ఇది యెహోవా వాక్కు.
13 “‘వారి ఫలాలను, పంటను నేను తీసుకుంటాను
అందుచేత అక్కడ పంటకోత ఉండదు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది
ద్రాక్ష తీగలపై కాయలేమాత్రం ఉండవు. అంజూరపు చెట్లకు కూడ కాయలుండవు.
వాటి ఆకులు సైతం ఎండిపోయి చనిపోతాయి.
నేను వారికిచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను.’”[i]
14 “మనమిక్కడ అనవసరంగా ఎందుకు కూర్చున్నాము?
రండి, బలమైన నగరాలకు పారిపోదాం.
మన దేవుడైన యెహోవా మనల్ని చంపబోతూవుంటే, మనం అక్కడే చనిపోదాం.
మనం యెహోవా పట్ల తీరని పాపం చేశాం.
అందుచేత దేవుడు విషం కలిపిన నీటిని మనకు తాగటానికి ఇచ్చాడు.
15 మనం శాంతిని కోరుకున్నాం;
కాని శాంతి కలుగలేదు.
స్వస్థత సమయం కొరకు ఎదురు చూశాం,
కాని విపత్తు మాత్రమే ముంచుకొచ్చింది.
16 దాను వంశీయుల రాజ్యంనుండి
శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి.
వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది.
వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ
నాశనం చేయాలని వచ్చియున్నారు.
వారీ నగరాన్ని, నగరవాసులను
సర్వనాశనం చేయటానికి వచ్చారు.
17 “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను[j] పంపుతున్నాను.
ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు.
ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!
18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది.
19 నా ప్రజల మొరాలకించుము!
దేశంలో ప్రతిచోటా వారు సహాయాన్ని అడుగుచున్నారు.
“సీయోనులో యెహోవా ఇంకా వున్నాడా?
సీయోను రాజు ఇంకా అక్కడ ఉన్నాడా?” అని వారంటున్నారు.
కాని దేవుడిలా అంటున్నాడు: “యూదా ప్రజలు వారి విగ్రహాలను ఆరాధించి నాకెందుకు కోపం కల్గించారు?
వారు అన్యదేశాల వారి పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
20 మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు:
“పంటకోత కాలం అయిపోయింది.
వేసవి వెళ్లిపోయింది. అయినా మేము రక్షించబడలేదు.”
21 నా జనులు బాధపడియుండుటచేత[k] బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.
22 వాస్తవానికి గిలియాదులో తగిన ఔషధం ఉంది!
వాస్తవానికి గిలియాదులో వైద్యుడు కూడా ఉన్నాడు!
అయితే నా ప్రజల గాయాలు ఎందుకు నయం చేయబడలేదు?
9 నా తల నీటితో నిండియున్నట్లయితే,
నా నేత్రాలు కన్నీటి ఊటలైతే హతులైన
నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్లు దుఃఖిస్తాను!
2 ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం
ఎడారిలో నాకొకటి ఉంటే
అక్కడ నా ప్రజలను వదిలి వేయగలను.
వారినుండి నేను దూరంగా పోగలను!
ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు.
వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు.
3 “వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు.
వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి.
సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది.
వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు.
వారు నన్నెరుగకున్నారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.
4 “మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి!
మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు!
ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే.
ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే.
5 ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును.
ఎవ్వడూ సత్యం పలుకడు.
యూదా ప్రజలు అబద్ధమాడుటలో
తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు.
వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది!
6 ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది.
అబద్ధాలను అబద్ధాలు అనుసరించాయి!
ప్రజలు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.” ఈ
విషయాలను యెహోవా చెప్పినాడు!
7 కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెబుతున్నాడు,
“లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను!
నాకు వేరే మార్గం లేదు.
నా ప్రజలు పాపం చేశారు.
8 యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు.
వారి నాలుకలు అబద్ధాలనే మాట్లాడతాయి.
ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు.
కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు.
9 మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేను వారిని శిక్షించవద్దా?”
“ఆ రకమైన ప్రజలను నేను శిక్షించాలని నీకు తెలుసు.
నేను వారికి తగిన శిక్ష విధించాలి.”
ఇది యెహోవా వాక్కు.
10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను.
వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను.
ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి.
ఎవ్వడూ అక్కడ పయనించడు.
ఆ ప్రదేశాలలో పశువుల అరుపులు వినరావు.
పక్షులు ఎగిరి పోయాయి:
పశువులు పారిపోయాయి.
11 “నేను (యెహోవా) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను.
అది గుంట నక్కలకు[l] స్థావరమవుతుంది.
నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను.
అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”
12 ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా?
యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా?
యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా?
రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది?
జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.
13 యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు.
వారికి నా ఉపదేశములు ఇచ్చాను.
కాని వారు వినటానికి నిరాకరించారు.
వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు.
14 యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు.
వారు మొండివారు.
వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు.
బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”
15 సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు,
“యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను.
విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను.
16 యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను.
వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది.
వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు.
కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను.
యూదా ప్రజలను వారు చంపివేస్తారు.
ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”
17 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు,
“ఇప్పుడు నీవీ విషయాల గురించి అలోచించుము!
శవాలకు అంత్యక్రియలు జరిపించేటప్పుడు విలపించేందుకు సొమ్ము తీసుకొనే స్త్రీలను పిలిపించుము.
కార్యములు నిర్వహించుటలో అనుభవమున్న వారిని పిలువనంపుము.
18 ‘ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించమనండి.
అప్పుడు మా నేత్రాలు కన్నీటితో నిండిపోతాయి.
కన్నీరు కాలువలై ప్రవహిస్తుంది’ అని ప్రజలంటారు.
19 “సీయోను నుండి గట్టిగా విలపించే రోదన,
‘మేము నిజంగా నాశనమయ్యాము!
మేము నిజంగా అవమానం పాలైనాము!
మా ఇండ్లు నాశనం చేయబడినాయి కావున మేము మా రాజ్యాన్ని వదిలి పోవాలి’ అంటూ వినిపిస్తూ ఉంది.”
20 యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి.
యెహోవా వాక్కు వినటానికి మీ చెవులనివ్వండి.
యెహోవా ఇలా అంటున్నాడు, మీ కుమార్తెలకు గగ్గోలుగా విలపించటం ఎలానో నేర్పండి.
ప్రతీ స్త్రీ ఈ విలాపగీతం పాడటం నేర్చుకోవాలి:
21 “మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి వచ్చింది.
మృత్యువు మా భవనాలలో ప్రవేశించింది.
వీధుల్లో ఆడుకొంటున్న మా పిల్లల వద్దకు మృత్యువు వచ్చింది.
బహిరంగ స్థలాలలో కలుసుకొనే యువకుల వద్దకు మృత్యువు వచ్చింది.”
22 “యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము,
పొలాలలో పశువుల పేడలా శవాలు పడివుంటాయి.
పంటకోత కాలంలో చేల నిండా వేసిన పనల్లా శవాలు భూమి మీద పడివుంటాయి
కాని వాటిని తీసి వేయటానికి ఒక్కడూ ఉండడు.’”
23 యెహోవా ఇలా చెబుతున్నాడు:
“తెలివిగల వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి
గొప్పలు చెప్పుకోరాదు.
బలవంతులు తమ బలాన్ని గురించి
గొప్పలు చెప్పుకోరాదు.
శ్రీమంతులు తమ ఐశ్వర్యాన్ని గూర్చి
గొప్పలు చెప్పుకోరాదు.
24 ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము.
నన్నతను అర్థం చేసుకున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము.
నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము.
నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనిమ్ము.
యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము.
నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.”
ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది.
25 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన వారిని నేను శిక్షించే సమయము ఆసన్నమవుతూ ఉంది. 26 తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.”
© 1997 Bible League International