Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 32-34

32 “ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను.
    భూమి నానోటి మాటలు వినునుగాక!
నా ప్రబోధం వర్షంలా పడుతుంది,
    నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది,
    మెత్తటి గడ్డిమీద పడే జల్లులా ఉంటుంది.
    కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది.
యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి!

“ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు
    ఆయన పని పరిపూర్ణం!
    ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవిగనుక.
ఆయన సత్యవంతుడు
    నమ్ముకోదగ్గ దేవుడు.
ఆయన చేసేది మంచిది, సరియైనది కూడా.
    మీరు నిజంగా ఆయన పిల్లలు కారు.
మీతప్పుల మూలంగా మీరు ఆయనను సమీపించలేని అపవిత్రులయ్యారు.
    మీరు వంకర మనుష్యులు, అబద్ధీకులు.
యెహోవాకు మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఇదేనా?
    మీరు బుద్ధిహీనులు, అజ్ఞానులు,
యెహోవా మీ తండ్రి, ఆయన మిమ్మల్ని చేసాడు.
    ఆయనే మీ సృష్టికర్త. ఆయన మిమ్మల్ని బల పరచేవాడు.

“పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి,
    అనేక తరాల సంవత్సరాలను గూర్చి ఆలోచించండి.
మీ తండ్రిని అడగండి, ఆయన చెబుతాడు;
    మీ నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు.
రాజ్యాలకు వారి దేశాన్ని సర్వోన్నతుడైన దేవుడు యిచ్చాడు.
    ప్రజలు ఎక్కడ నివసించాల్సిందీ ఆయనే నిర్ణయించాడు.
తర్వాత ఆయన ఇతరుల దేశాన్ని
    ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చాడు.
ఆయన ప్రజలే యెహోవా వంతు;
    యాకోబు (ఇశ్రాయేలు) యెహోవాకు స్వంతం.

10 “అరణ్య భూమిలో యాకోబును (ఇశ్రాయేలు) యెహోవా కనుగొన్నాడు,
    వేడి గాడ్పుల్లో కేకలు పెట్టే పనికిమాలిన అరణ్యంలో యెహోవా యాకోబు దగ్గరకు వచ్చి,
ఆతణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకున్నాడు.
    యెహోవా తన కంటి పాపలా ఆతడ్ని కాపాడాడు.
11 యెహోవా ఇశ్రాయేలీయులకు పక్షి రాజులా ఉన్నాడు.
    పక్షిరాజు తన పిల్లలకు ఎగరటం నేర్పించేందుకోసం అది వాటిని బయటకు తోస్తుంది.
అది తన పిల్లలను కాపాడేందుకు వాటితో కలిసి ఎగురుతుంది.
    అవి పడిపోతున్నప్పుడు వాటిని పట్టుకొనేందుకు తన రెక్కలు చాపుతుంది.
మరియు అది తన రెక్కల మీద వాటిని క్షేమ స్థలానికి మోసుకొని వెళ్తుంది.
    యెహోవా అలాగే ఉన్నాడు.
12 యెహోవా మాత్రమే యాకోబును (ఇశ్రాయేలు) నడిపించాడు.
    యాకోబు దగ్గర ఇతర దేవతలు లేవు.
13 భూమియొక్క ఉన్నత స్థలాల్లో యాకోబును యెహోవా నడిపించాడు,
    పొలంలోని పంటను యాకోబు భుజించాడు
యాకోబు బండలోనుండి తేనెను చెకుముకి
    రాతినుండి నూనెను తాగేటట్టు యెహోవా చేసాడు.
14 మందలోనుండి వెన్న, గొర్రెలనుండి పాలు
    గొర్రెపిల్లలు, పొట్టేళ్లు, బాషాను జాతి మగ మేకలు,
అతి శ్రేష్ఠమైన గోధుమలు ఆయన నీకు యిచ్చాడు.
    ద్రాక్షల ఎర్రటిరసం నుండి ద్రాక్షారసం నీవు త్రాగావు.

15 “కానీ యెష్రూను కొవ్వు పట్టి బలిసిన ఎద్దులా తన్నుతన్నాడు.
    వాడు బాగా తిని బలిసాడు. వానికి మంచి పోషణ దొరికింది.
వాడు తనను చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసాడు.
    వాడు ఆ బండను (యెహోవాను) తన రక్షకునిగా అంగీకరించలేదు.
16 యెహోవా ప్రజలు యితర దేవుళ్లను పూజించి ఆయనకు రోషం పుట్టించారు.
    యెహోవాకు అసహ్యమైన వారి విగ్రహాల మీద ఆయనకు కోపం వచ్చేటట్లు వారు చేసారు.
17 నిజానికి దేవుళ్లు కాని దయ్యాలకు వారు బలులు అర్పించారు.
    వాళ్లకు తెలియని దేవుళ్లకు వారు బలులు అర్పించారు.
    ఈ దేవుళ్లు మీ పూర్వీకులు ఎన్నడూ పూజించని కొత్త దేవుళ్లు.
18 మిమ్మల్ని సృష్టించిన ఆశ్రయ దుర్గమును (దేవుణ్ణి) మీరు విడిచిపెట్టేసారు.
    మీకు జీవం ప్రసాదించిన దేవుణ్ణి మీరు మరచిపోయారు.

19 “యెహోవా కుమారులు, కుమార్తెలు ఆయనకు కోపం పుట్టించినందువల్ల
    ఆయన అది చూచి తన ప్రజలను నిరాకరించాడు.
20 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు,
‘వారినుండి నేను నా ముఖం దాచుకొంటాను.
    వాళ్ల అంతం ఏమిటో నేను చూడగలను.
ఎందుకంటే వారు చాలా చెడ్డ తరంవారు
వారు అపనమ్మకమైన పిల్లలు.
21-22 దేవుళ్లు కాని వాటితో వారు నాకు రోషం కలిగించారు.
    పనికిమాలిన ఈ విగ్రహాలతో వారు నాకు కోపం పుట్టించారు.
నిజానికి రాజ్యం కాని ఒక రాజ్యంతో నేను వారికి రోషం పుట్టిస్తాను.
    ఒక బుద్ధిహీనమైన రాజ్యంతో నేను వారికి కోపం పుట్టిస్తాను.
నా కోపం అగ్నిని రాజబెట్టింది;
    నా కోపం పాతాళ అగాధంవరకు మండుతుంది. భూమిని,
    దాని పంటను నా కోపం నాశనం చేస్తుంది.
    నా కోపం పర్వతాల పునాదులకు నిప్పు అంటిస్తుంది.

23 “‘ఇశ్రాయేలీయుల మీద నేను కష్టాలు ఉంచుతాను.
    నేను వాళ్లమీద నా బాణాలు విసురుతాను.
24 ఆకలిచేత వాళ్లు బలహీనమై సన్నబడిపోతారు. మండే వేడిచేత.
    భయంకర నాశనంచేత వారు నాశనమైపోతారు.
బురదలో ప్రాకే పాముల విషం,
    మృగాల కోరలు నేను వారిమీదికి పంపిస్తాను.
25 బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది;
    లోపల ఖడ్గం భయాన్ని పుట్టిస్తుంది.
యువకుడ్ని, కన్యనుకూడ అది నాశనం చేస్తుంది. పసివారిని,
    తలనెరిసిన వృద్ధులను కూడ అది నాశనం చేస్తుంది.

26 “‘నేనంటాను: ఇశ్రాయేలు వాళ్లను నేను దూరంగా ఊదేస్తాను.
    ప్రజలు ఇశ్రాయేలు వాళ్లను మరచిపోయేటట్టు నేను చేస్తాను.
27 ఆయితే వారి శత్రువు చెప్పేది నాకు తెలసు
    అది నాకు చికాకు కలిగిస్తుంది.
ఇశ్రాయేలీయుల శత్రువు అపార్థం చేసుకొని,
    మా స్వంత శక్తితో మేము గెలిచాము
    ఇది యెహోవా చేయలేదు’ అనవచ్చును.

28 “వారు తెలివిలేని రాజ్యం, వారికి అవగాహన లేదు.
29 వారు తెలివిగల వాళ్లయితే
    వారు దీనిని గ్రహిస్తారు.
    భవిష్యత్తులో వారి అంతం గూర్చి ఆలోచిస్తారు.
30 ఒకడు 1,000 మందిని తరిమితే
    ఇద్దరు 10,000 మంది పారిపోయేటట్టు ఎలా చేయగలరు?
యెహోవా వారిని వారి శత్రువుకు అప్పగిస్తేనే
    అలా జరుగుతుంది.
ఆ ఆశ్రయ దుర్గం (యెహోవా) ఈ శత్రువులను అమ్మివేస్తే,
    యెహోవా ఈ శత్రువులను వారికి అప్పగిస్తే మాత్రమే యిలా జరుగుతుంది.
31 ఈ శత్రువుల ఆశ్రయ దుర్గం మన బండ[a] (యెహోవా) వంటి శక్తిమంతుడు కాడు.
ఇది సత్యమని మన శత్రువులుకూడ చూడగలరు.
32 ఈ శత్రువుల ద్రాక్ష సొదొమ ద్రాక్ష వంటిది. గొముర్రా[b] పొలాలలోని దాని వంటిది.
వారి ద్రాక్షా పండ్లు విషపు ద్రాక్షలు. వారి ద్రాక్షా పండ్ల గుత్తులు చేదు.
33     వారి ద్రాక్షారసం కృర సర్పాల విషం, నాగు పాముల కఠిన విషం.

34 “ఆ శిక్షను నేను భద్రం చేస్తున్నాను
‘నా గిడ్డంగిలో తాళం వేసి దీనిని
    నేను భద్రపరుస్తున్నాను అని యెహోవా చెబుతున్నాడు.
35 ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించే వాణ్ణి
    వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం యిచ్చేవాడ్ని నేనే;
ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది
    వారి శిక్ష త్వరగా వస్తుంది గనుక.’

36 “యెహోవా తన ప్రజలకు శిక్ష విధిస్తాడు.
    వారు ఆయన సేవకులు, ఆయన వారికి దయ చూపిస్తాడు.
వారి శక్తి పోయేటట్టు ఆయన చేస్తాడు.
    బానిసగాని స్వతంత్రుడు గాని వారంతా
    నిస్సహాయులయ్యేటట్టు ఆయన చేస్తాడు.
37 అప్పుడు ఆయన ఇలా అంటాడు,
    ‘అబద్ధపు దేవుళ్లు ఎక్కడ?
    భద్రత కోసం వారు ఆశ్రయించిన బండ ఎక్కడ?
38 ఈ ప్రజల దేవుళ్లు ప్రజల బలి అర్పణల కొవ్వు తిన్నారు.
    వారి పానార్పణపు ద్రాక్షారసం వారు తాగారు.
కనుక ఈ దేవుళ్లనే లేచి మీకు సహాయం చేయనివ్వండి.
    వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి!

39 “‘అప్పుడు చూడండి, నేనే, నేను మాత్రమే
    దేవుణ్ణి. ఇంకే దేవుడూ లేడు.
ప్రజలను బ్రతకనిచ్చేది,
    చంపేదీ నిర్ణయించే వాడ్ని నేనే.
నేను ప్రజల్ని బాధించగలను,
    బాగు చేయగలను.
నా శక్తినుండి ఒక మనిషిని ఏ మనిషి రక్షించ లేడు.
40 ఆకాశం వైపు నేను నాచేయి పైకెత్తి ఈ వాగ్దానం చేస్తున్నాను.
నేను శాశ్వతంగా జీవించటం సత్యమయితే,
    ఈ సంగతులన్నీ జరుగుతాయి అనేది కూడ సత్యమే.
41 నేను ప్రమాణం చేస్తున్నాను,
    తళతళలాడే నా ఖడ్గానికి పదునుపెడ్తాను.
    నా శత్రువుల్ని శిక్షించటానికి దానిని నేను ఉపయోగిస్తాను.
    నేను వారికి తగిన శిక్ష యిస్తాను.
42 నా శత్రువులు చంపబడతారు, ఖైదీలుగా తీసుకొనిపోబడతారు.
నా బాణాలు వారి రక్తంతో కప్పబడి ఉంటాయి.
నా ఖడ్గం వారి సైనికుల శిరస్సులను ఛేదిస్తుంది.’

43 “దేవుని ప్రజలకోసం సర్వప్రపంచం సంతోషించాలి.
    ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు గనుక.
    తన సేవకులను చంపే వాళ్లను ఆయన శిక్షిస్తాడు గనుక.
ఆయన తన శత్రువులకు తగిన శిక్షయిస్తాడు.
ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు.”

మోషే తన కీర్తనను ప్రజలకు నేర్పుట

44 మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలు వినగలిగేటట్లు ఈ పాటలోని మాటలన్నీ చెప్పాడు. నూను కుమారుడైన యెహోషువ మోషేతో ఉన్నాడు. 45 మోషే ప్రజలకు ఈ ప్రబోధాలు చేయటం ముగించినప్పుడు 46 వాళ్లతో అతడు ఇలా చెప్పాడు: “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆదేశాలన్నింటిని మీరు గమనించి తీరాలి. మరియు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటికీ మీ పిల్లలు విధేయులు కావాలని మీరు వారికి చెప్పాలి. 47 ఈ ప్రబోధాలు ముఖ్యమైనవి కావు అనుకోవద్దు. అవి మీకు జీవం. యొర్దాను నదికి అవతల మీరు స్వాధీనం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో ఈ ప్రబోధాల ద్వారా మీరు చాలా కాలం జీవిస్తారు.”

నెబో కొండ మీద మోషే

48 ఈ రోజే మోషేతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు, 49 “అబారీము పర్వతాలకు వేళ్లుము. ఎరికో పట్టణం అవతల మోయాబు దేశంలో నెబో కొండమీదికి ఎక్కివెళ్లు. అప్పుడు నీవు ఇశ్రాయేలు ప్రజలు నివసించటానికి నేను వారికి ఇస్తున్న కనాను దేశాన్ని చూడవచ్చు. 50 నీవు ఆ కొండమీద చనిపోతావు. హూరు కొండమీద నీ సోదరుడు ఆహరోను చనిపోయి, తన ప్రజలను చేరుకున్నట్టు నీవు కూడ చనిపోయిన నీ ప్రజలను చేరుకుంటావు. 51 ఎందుకంటే సీను అరణ్యంలో కాదేషు సమీపంలో మెరీబా నీళ్ల దగ్గర నీవు నాకు వ్యతిరేకంగా పాపం చేసావు. అది చూసేందుకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉన్నారు. నీవు నన్ను గౌరవించలేదు. ఆ సంగతి నీవు ప్రజలకు చూపెట్టావు. 52 కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు ఇప్పుడు నీముందర చూడ వచ్చు గాని నీవు దానిలో ప్రవేశించలేవు.”

మోషే ప్రజలను ఆశీర్వదించటం

33 దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన ఆశీర్వాదం ఇది. మోషే చేప్పినది:

“యెహోవా సీనాయినుండి వచ్చెను.
    యెహోవా శేయీరులో ప్రభాత వెలుగులా ఉన్నాడు.
    ఆయన పారాను కొండ నుండి ప్రకాశించే వెలుగులా ఉన్నాడు.
యెహోవా 10,000 మంది పరిశుద్ధులతో వచ్చాడు.
    ఆయన కుడిచేతి వైపున దేవుని గొప్ప గొప్ప మహా సైనికులు ఉన్నారు.
అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు.
    ఆయన పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో ఉన్నారు.
వారు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు.
    ప్రతి ఒక్కరూ ఆయన ప్రబోధాలు అంగీకరిస్తారు.
మోషే మనకు ధర్మశాస్త్రం యిచ్చాడు.
    అది యాకోబు ప్రజలందరికీ చెందుతుంది.
ప్రజలు, వారి నాయకులు
    సమావేశమైనప్పుడు యెషూరూనుకు[c] రాజు ఉన్నాడు.
    యెహోవాయే వారి రాజు.

రూబేనుకు ఆశీర్వాదాలు

“రూబేను మరణించక, జీవించునుగాక!
    ఆతని వంశంలో అనేకమంది ప్రజలు ఉందురు గాక!”

యూదాకు ఆశీర్వాదాలు

యూదా వంశం గూర్చి మోషే ఈ విషయాలు చెప్పాడు:

“యెహోవా, యూదా నాయకుడు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆలకించు.
    అతణ్ణి తన ప్రజల దగ్గరకు చేర్చు.
అతణ్ణి బలంవతుణ్ణి చేయి. అతడు తన శత్రువులను ఓడించటానికి సహాయం చేయి!”

లేవీకి ఆశీర్వాదాలు

లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు.

“నీ నిజమైన అనుచరుడు లేవీ ఊరీము, తుమ్మీమునకు[d] కాపలా ఉండేవాడు.
    నీ పత్యేక మనిషి వాటిని కాపాడుతాడు.
మస్సా దగ్గర నీవు లేవీ ప్రజలను పరీక్షించావు.
వాళ్లు నీ వాళ్లని (నిన్ను ప్రేమించుటకు) మెరీబా[e] నీళ్ల దగ్గర నీవు రుజువు చేసావు.
లేవీ తన తండ్రి, తల్లిని గూర్చి చెప్పాడు.
‘వారి విషయం నేను లెక్క చేయను’
అతడు తన సొంత సోదరులను స్వీకరించలేదు.
తన సొంత పిల్లల్ని తెలుసుకోలేదు.
లేవీయులు నీ మాటకు విధేయులయ్యారు
    నీ ఒడంబడికను నిలబెట్టారు.
10 యాకోబుకు[f] నీ నియమాలను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు.
వాళ్లు నీ యెదుట ధూపం వేస్తారు.
    నీ బలిపీఠం మీద పరిపూర్ణ దహన బలులు అర్పిస్తారు.

11 “యెహోవా, లేవీకి చెందిన వాటిని ఆశీర్వదించు
    అతడు జరిగించే వాటిని స్వీకరించు.
అతని మీద దాడి చేసే వాళ్లను నాశనం చేయి.”

బెన్యామీనుకు ఆశీర్వాదాలు

12 బెన్యామీను గూర్చి మోషే ఇలా చెప్పాడు.

“యెహోవా బెన్యామీనును ప్రేమిస్తున్నాడు.
    బెన్యామీను ఆయన చెంత క్షేమంగా జీవిస్తాడు.
అతనిని యెహోవా ఎల్లప్పుడూ కాపాడతాడు.
    మరియు యెహోవా అతని దేశంలో నివసిస్తాడు.”[g]

యోసేపుకు ఆశీర్వాదాలు

13 యోసేపును గూర్చి మోషే ఇలా చెప్పాడు:

“యెహోవా అతని దేశాన్ని ఆశీర్వదించును గాక.
    ఆకాశం నుండి శ్రేష్ఠమైన వాటితో
    భూమి క్రింద దాగి ఉన్న లోతైన ధన సంపదతో
14 సూర్యుని శ్రేష్ఠఫలాలతో
    నెల నెలా శ్రేష్ఠపంటలతో
15 ప్రాచీన పర్వతాల నుండి శ్రేష్ఠఫలాలతో
    కొండల్లో శాశ్వతంగా ఉంచబడే శ్రేష్ఠ పదార్థాలతో
16 భూమి నుండి శ్రేష్ఠమైన బహుమానాలు, దాని పూర్ణ ఆశీర్వాదాలతో,
మండుతూ ఉండే పొదలో నివాసం చేసే యెహోవా కటాక్షంతో,
    తన సోదరులనుంచి వేరుగావించబడ్డ యోసేపు తలమీద యోసేపు నడినెత్తి మీద ఆశీర్వాదం వచ్చునుగాక.
17 యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన ఎద్దుకు ఎంతో శోభ,
    ఈ ఎద్దు కొమ్ములు అడవి దున్నపోతు కొమ్ములంత పెద్దవిగా ఉంటాయి.
యోసేపు మందలు మనుష్యుల్ని తోసివేస్తాయి. అందర్నీ,
    భూదిగాంతాల వరకు తోసివేస్తాయి.
అవును, మనష్షేకు వేలాదిమంది ప్రజలు ఉన్నారు,
    అవును, ఎఫ్రాయిముకు పది వేలమంది ప్రజలు ఉన్నారు.”

జెబూలూనుకు, ఇశ్శాఖారుకు ఆశీర్వాదాలు

18 జెబూలూను గూర్చి మోషే చెప్పినది:

“జెబూలూనూ, నీవు బయటకు వెళ్లినప్పుడు,
ఇశ్శాఖారూ, నీ యింటివద్ద నీ గుడారాలలో సంతోషంగా ఉండు.
19 వారు తమ ప్రజలను కొండకు (కర్మెలు) పిలుస్తారు.
    అక్కడ వారు సరైన బలులు అర్పిస్తారు.
ఎందుకంటే, సముద్రాల్లోని సమృద్ధిని వారు తీసుకొంటారు.
    ఇసుకలో దాగి ఉన్న ఐశ్వర్యాలను మీరు తీసుకుంటారు గనుక.”

గాదుకు ఆశీర్వాదాలు

20 గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు:

“గాదును విశాలపర్చే దేవునికి స్తోత్రాలు!
గాదు సింహంలా పడుకుంటాడు,
    చేతిని, నడినెత్తిని చీల్చేస్తాడు.
21 శ్రేష్ఠభాగం అతడు తనకోసం ఎంచుకుంటాడు
    అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది.
ప్రజానాయకులు అతని దగ్గరకు వస్తారు ఇశ్రాయేలీయుల యెడల అతడు దయ చూపుతాడు.
    యెహోవా దృష్టికి మంచివాటిని అతడు చేస్తాడు
    యెహోవా అతని పక్షంగా తీర్పుతీరుస్తాడు.”

దానుకు ఆశీర్వాదాలు

22 దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు:

“దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల.”

నఫ్తాలీకి ఆశీర్వాదాలు

23 నఫ్తాలీ గూర్చి మోషే ఇలా చెప్పాడు.

“నఫ్తాలీ, నీవు దయపొంది తృప్తిగా ఉన్నావు,
    యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు,
(గలలీ) పశ్చిమ, దక్షిణాల భూమిని నీవు తీసుకో.”

ఆషేరుకు ఆశీర్వాదాలు

24 ఆషేరును[h] గూర్చి మోషే ఇలా చెప్పాడు:

“కుమారులలో ఆషేరు అత్యధికంగా ఆశీర్వదించబడినవాడు;
    అతణ్ణి తన సోదరులకు ప్రియమైన వాడ్నిగా ఉండనియ్యండి.
    అతణ్ణి తన పాదాలు తైలముతో కడుగుకోనివ్వండి.
25 నీ తాళాలు యినుపవి, యిత్తడిని,
    నీ బలం జీవితం అంతా ఉంటుంది.”

మోషే దేవుణ్ణి స్తుతించుట

26 “ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ లేరు.
దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు.
    మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు.
27 నిత్యుడైన దేవుడు
    నీకు భద్రతా స్థలం.
శాశ్వతంగా ఆదుకునే హస్తాలు
    నీక్రింద ఉన్నాయి.
దేవుడు శత్రువును నీదగ్గర నుండి వెళ్లగొట్టేస్తాడు.
‘శత్రువును నాశనం చేయి’ అంటాడు.
28 కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు,
    ధాన్యం, ద్రాక్షారసం ఉండే దేశంలో
యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది.
    అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది.
29 ఇశ్రాయేలూ, నీవు సంతోషంగా ఉన్నావు.
    యెహోవా చేత రక్షించబడిన దేశంగా నీవలె ఏ దేశమూ లేదు.
యెహోవాయే నీకు సహాయం చేసేవాడు.
    నీ విజయానికి యెహోవాయే ఖడ్గం.
    నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు.
వారి అబద్ధపు దేవతల పూజా స్థలాల
    మీద మీరు నడుస్తారు.”

మోషే మరణించటం

34 మోషే మోయాబు పల్లపు ప్రాంతాల నుండి యెరికో లోయలోని నెబో కొండ మీద పిస్గా శిఖరం మీదికి వెళ్లాడు. గిలాదునుండి దానువరకు దేశం మొత్తం యెహోవా మోషేకు చూపించాడు. ఎఫ్రాయిము, మనష్షేల దేశం అంతా, నఫ్తాలీ అంతా యెహోవా అతనికి చూపించాడు. యూదా దేశం మధ్యదరా సముద్రం వరకు ఆయన అతనికి చూపించాడు. నెగెవు ప్రాంతాన్ని, సోయెరు నుండి ఈతచెట్ల పట్టణం యెరికోకు పోయే లోయ అంతా మోషేకు యెహోవా చూపించాడు. “అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానంచేసిన దేశం యిదే. ‘మీ సంతతివారికి ఈ దేశం నేను యిస్తాను’ అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడనిచ్చాను, నీవు అక్కడికి వెళ్లలేవు” అని మోషేతో యెహోవా చెప్పాడు.

అప్పుడు యెహోవా సేవకుడు మోషే అక్కడ మోయాబు దేశములో చనిపోయాడు. ఇలా జరుగుతుందని యెహోవా మోషేతో ముందే చెప్పాడు. బెత్పెయోరు అవతల మోయాబు దేశంలోని లోయలో యెహోవా మోషేను పాతి పెట్టాడు. అయితే మోషే సమాధి ఎక్కడ ఉందో ఈ రోజువరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు 120 సంవత్సరాలు. అతని కళ్లు మసక కాలేదు. అతడు ఇంకా బలంగానే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు పల్లపు ప్రాంతాల్లో 30 రోజుల పాటు మోషే కోసం ఏడ్చారు. ఇది పూర్తి సంతాప దినాల సమయము.

యెహోషువ క్రొత్త నాయకుడవటం

అప్పుడు నూను కుమారుడైన యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానాత్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేసారు.

10 కాని ఆ సమయమునుండి మళ్లీ మోషేవంటి ప్రవక్త జన్మించలేదు. యెహోవా దేవునికి మోషే ముఖాముఖిగా తెలుసు. 11 ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి మోషే చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు, ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహాత్కార్యాలు ఈజిప్టులో ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలందరికి చూపించబడ్డాయి. 12 మోషే చేయగా ఇశ్రాయేలు ప్రజలంతా చూసిన ఆ శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు.

కీర్తనలు. 91

91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
    సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
“నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
    అని నేను యెహోవాకు చెబుతాను.
దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
    ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
    పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
    దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
    పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
చీకటిలో దాపురించే రోగాలకు గాని
    మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
నీ ప్రక్కన వేయిమంది,
    నీ కుడి ప్రక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు.
    నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.
ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా
    నీకు కనబడుతుంది.
ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
    సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
    నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
    దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
    నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
    నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
    నేను వారికి జవాబు ఇస్తాను.
    వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
    నేను వాళ్లను రక్షిస్తాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International