Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఎస్తేరు 6-10

మొర్దెకైకి గౌరవ సత్కారాలు

సరిగ్గా ఆ రాత్రి మహారాజుకి నిద్రపట్టలేదు. అందుకని రాజవంశ చరిత్ర గ్రంథాన్ని తెచ్చి తనకి చదివి వినిపించమని ఒక ఉద్యోగికి పురమాయించాడు. (ఆ చరిత్ర గ్రంథంలో ఒక్కొక్క రాజు పరిపాలన కాలంలో సంభవించిన ప్రతి సంఘటనా నమోదు చెయ్యబడుతుంది.) ఆ ఉద్యోగి మహారాజుకి ఆ గ్రంథం చదివి వినిపించాడు. అహష్వేరోషు మహారాజును హత్య చేసేందుకు బిగ్తాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వారపాలకులు చేస్తున్న కుట్ర గురించి మొర్దెకై పసిగట్టి, ఆ సమాచారాన్ని ఎపరికో తెలియజెయ్యడం గురించి ఆ ఉద్యోగి చదివాడు.

అప్పుడు మహారాజు, “ఇందుకు ప్రతిఫలంగా ఆ మొర్దెకైకి ఎలాంటి ఆదర సత్కారాలు జరిగాయి?” అని ప్రశ్నించాడు.

“మొర్దెకైకి ఎలాంటి పారితోషికమూ దొరకలేదు మహారాజా” అని ఉద్యోగులు సమాధానమిచ్చారు.

హామాను సరిగ్గా అప్పుడే రాజభవనపు వెలుపటి ఆవరణలో ప్రవేశించాడు. తను నాటింపజేసిన ఉరి కంబం మీద మొర్దెకైని ఉరితీయించేందుకు మహారాజు అనుమతిని కోరేందుకే అతను వచ్చాడు. అతని అడుగుల చప్పుడు మహారాజు విన్నాడు. “ఆవరణ లోపలికి వచ్చింది ఎవరు?” అన్న మహారాజు ప్రశ్నకి రాజోద్యోగులు “హామాను ఆవరణలో వేచివున్నాడు మహారాజా” అని సమాధానమిచ్చారు.

మహారాజు, “అతన్ని లోపలికి తీసుకురండి” అని ఆదేశించాడు.

హామాను లోపలికి వచ్చాక మహారాజు అతన్ని, “మహారాజు ఎవరికైనా గౌరవ సత్కారాలు చెయ్యాలంటే, ఏం చెయ్యాలి హామానూ” అని ప్రశ్నించాడు.

హామాను తనలో తను, “మహారాజు నన్ను కాక మరెవరిని సత్కరించాలని అనుకుంటారు? మహారాజు అంటున్నది నిస్సందేహంగా నన్ను సత్కరించాలనే అయివుంటుంది.” అని తర్కించుకున్నాడు.

దానితో హమాను మహారాజుకి ఇలా సమాధాన మిచ్చాడు: “మహారాజు గౌరవించాలనుకున్న వ్యక్తి విషయంలో యిలా చెయ్యాలి. మహారాజు స్వయంగా ధరించిన రాజవస్త్రాలను సేవకులచేత తెప్పించాలి. మహారాజు స్వారీచేసిన ఒక గుర్రాన్ని కూడా తెప్పించాలి. సేవకులచేత ఆ గుర్రం ముఖాన తురాయివంటి ప్రత్యేకమైన ఒక గుర్తు వేయించాలి. తర్వాత ఆ పట్టు వస్త్రాన్ని, ఆ గుర్రాన్నీ ఒక ప్రముఖ ఉద్యోగి వద్ద వుంచాలి. అప్పుడు మహారాజు సత్కరించాలనుకున్న ఆ వ్యక్తిని ఆ ముఖ్య అధికారి గుర్రం మీద కూర్చోబెట్టి నగర వీధుల్లో ఊరేగిస్తూ, ‘ఈయనకి మహారాజు చేస్తున్న సన్మానం ఇది’ అంటూ చాటాలి.”

10 అప్పుడు మహారాజు హామానుకి ఇలా ఆజ్ఞాశించాడు: “వెన్వెంటనే పోయి, పట్టు వస్త్రాలూ గుర్రము తీసుకువచ్చి. భవనద్వారం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైకి నువ్వు చెప్పిన సత్కార కార్యక్రమమంతా అమలు జరుపుము.”

11 హామాను పోయి పట్టు వస్త్రమూ, గుర్రమూ తెచ్చాడు. ఆ వస్త్రాన్ని మొర్దెకైకి కప్పి, అతన్ని గుర్రం మీద కూర్చోబెట్టి, తను గుర్రం ముందు నడుస్తూ మొర్దెకైని నగర వీధుల్లో ఊరేగిస్తూ, “మహారాజు సత్కరించ కోరిన వ్యక్తికి జరుగుతున్న సన్మానం ఇదే” అని చాటాడు.

12 అటు తర్వాత మొర్దెకై రాజభవన ద్వారం దగ్గరికి తిరిగి వెళ్లాడు. కాని, హామాను సిగ్గుతో తల్లడిల్లుతూ హడావిడిగా ఇంటికి వెళ్లిపోయాడు. 13 తన భార్య జెరెషుకీ, తన మిత్రులందరికీ తనకి జరిగిన పరాభవ మంతటిని గురించి వివరంగా చెప్పాడు. హామాను భార్య, అతనికి ఇంతకు ముందు సలహా ఇచ్చిన మిత్రులూ అతనితో ఇలా అన్నారు: “మొర్దెకై యూదుడే అయితే, నీవు జయం పొందడం అసాధ్యం. నీ పతనం యిప్పటికే ప్రారంభమైంది. నీ నాశనం తథ్యం!”

14 హామానుతో వాళ్లింకా మాట్లాడుతూనే పున్నారు. అంతలోనే మహారాజుగారి నపుంసకులు హామాను ఇంటికి వచ్చారు. వాళ్లు హామానుని ఎస్తేరు సన్నద్ధం చేసిన విందుకి వెళ్లేందుకు తొందరచేశారు.

హామాను ఉరితీయ బడుట

మహారాజూ, హామానూ మహారాణి ఎస్తేరు విందుకి వెళ్లారు. విందు రెండోరోజున వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూవుండగా మహారాజు ఎస్తేరును మరల ఇలా అడిగాడు: “మహారాణి ఎస్తేరూ, నీకేం కావాలి? నువ్వేమి కోరుకున్నా సరే, దాన్ని నీకు ఇస్తాను. నీ కోరిక ఏమిటి? నీకు ఏదైనా సరే, చివరకు అర్ధ రాజ్యమైనా సరే ఇస్తాను.”

అప్పుడు మహారాణి ఎస్తేరు ఇలా సమాధానం యిచ్చింది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, మీరు నన్ను అనుగ్రహిస్తే, నాకూ, నా ప్రజలకీ కూడా ప్రాణదానం చెయ్యండి! నేను కోరుకొనేది అంత మాత్రమే. ఎందుకంటే నాశనం చేయబడేందుకు, చంపివేయబడేందుకు, నిర్మూలించబడేందుకు నేనూ, నా ప్రజలూ అమ్మివేయబడ్డాం. మేము కేవలం బానిసలుగా అమ్మివేయబడివుంటే, నేను ఊరక ఉండి పోదును. ఎందుకంటే, అది మహారాజును విసిగించవలసినంతటి సమస్య అయ్యుండేది కాదు.”

మహారాజు అహష్వేరోషు మహారాణి ఎస్తేరును ఇలా ప్రశ్నించాడు: “మీ విషయంలో ఇలా చేసింది ఎవరు? నీ ప్రజలకు ఇలా చేయ సాహసించిన వ్యక్తి ఎవరు?”

“మాకు విరోధి, శత్రువు దుర్మార్గుడైన ఈ హామానే” అని జవాబిచ్చింది ఎస్తేరు.

దానితో, మహారాజు ముందు నిలబడ్డ హామాను భయ భీతుడయ్యాడు. మహారాజుకి పట్టరాని కోపం వచ్చింది. ఆయన లేచి నిలబడ్డాడు. ద్రాక్షాసారా అక్కడే వదిలేసి, బయటి తోటలోకి వెళ్లాడు. కాని, హామాను మహారాణిని క్షమాభిక్ష వేడుకునేందుకు అక్కడే నిలిచిపోయాడు. అప్పటికే మహారాజు తనని చంపి వేయాలని నిర్ణయించుకున్నట్లు హామాను గ్రహించినందువల్లనే, మహారాణి ఎస్తేరును క్షమాభిక్ష అడుక్కునేందుకు అక్కడ ఉండి పోయాడు. సరిగ్గా తోటనుంచి విందుశాలకి వస్తూన్నప్పుడే ఎస్తేరు వాలి కూర్చున్న శయ్యమీద హామాను పడుతూవుండటం మహారాజు కంటపడింది. మహారాజు కోపస్వరంతో, “నేనీ ఇంట్లో ఉండగానే నువ్వు మహారాణి మీద దాడి చేస్తున్నావా?” అని గర్జించాడు.

మహారాజు కేక వినగానే, సేవకులు లోనికి వచ్చి హామానుని పట్టుకున్నారు. మహారాజు సేవకుల్లో ఒకడి పేరు హార్బోనా. ఆ నపుంసకుడు మహారాజుతో ఇలా చెప్పాడు: “హామాను యింటి దగ్గర 75 అడుగల ఉరికంబం వుంది మహారాజా. దానిమీద మొర్దెకైని ఉరి తీయించేందుకు హామాను దాన్ని నిర్మింపజేశాడు. మిమ్మల్మి హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నప్పుడు, ఆ సమాచారాన్ని తెలియజేసి, మీకు సహాయపడినది యీ మొర్దెకైయేనండి.”

“హామానుని అదే ఉరికంబం మీద ఉరి తియ్యండి” అని ఆజ్ఞాపించాడు మహారాజు.

10 దానితో, మొర్దెకైని ఉరితీయించేందు కోసం హామాను నిర్మించిన ఉరికంబం మీదనే హామాను ఉరితీయబడ్డాడు.

యూదులకు అనుకూలంగా మహారాజు శాసనం

అదే రోజున అహష్వేరోషు మహారాజు యూదులకు శత్రువైన హామానుకు చెందిన చర స్థిరాస్తులున్నింటినీ ఎస్తేరు మహారాణికి దత్తం చేశాడు. మొర్దెకై తనకు బంధువన్న విషయాన్ని ఎస్తేరు మహారాజుకి చెప్పింది. అప్పుడు మొర్దెకై మహారాజు దర్శనానికి వచ్చాడు. మహారాజు తన రాజముద్రికను హామానునుంచి వెనక్కి తెప్పించి, తన వేలికి పెట్టుకున్నాడు. మహారాజు ఆ ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. అప్పుడింక ఎస్తేరు హామానుకి చెందిన ఆస్తులన్నింటి అజమాయిషీనీ మొర్దెకైకి అప్పగించింది.

తర్వాత ఎస్తేరు మహారాజుతో మళ్లీ మాట్లాడింది. ఆమె రోదిస్తూ మహారాజు పాదాలపైపడి, అగాగీయుడైన హామాను దుష్ట పథకాన్ని రద్దు చేయవలసిందిగా మహారాజును వేడుకుంది. యూదులను హింసించేందుకు హామాను పన్నిన దుష్ట పథకం అది.

మహారాజు తన బంగారు రాజదండంతో ఎస్తేరును తాకాడు. ఎస్తేరు లేచి, మహారాజు ముందు నిలబడింది. అప్పుడు ఎస్తేరు మహారాజుతో ఇలా విన్నవించుకుంది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, తమ దయవుంటే, నా కోసం ఇలా చెయ్యండి. ఇది మంచి ఊహ అనుకుంటేనే ఈ పని చేయండి. నేను తమకి ప్రీతిపాత్రురాలినైతే, హామాను పంపిన ఆజ్ఞను రద్దుచేస్తూ ఒక శాసనం చేయండి. అగాగీయుడైన హామాను మహారాజా వారి సామంత దేశాలన్నింటిలోని యూదులందరినీ సమూలంగా నాశనం చేయమని తాఖీదులు జారీచేశాడు. నా ప్రజలు ఇలాంటి ఘోరమైన విపత్తులకు గురికావడం నేను సహించలేను. నా కుటుంబ సభ్యులు హతమార్చబడటం నేను భరించలేను. అందుకే, మహారాజావారిని ఈ ఘోరాన్ని ఆపు చెయ్యవలసిందిగా అర్థిస్తున్నాను.”

అహష్వేరోషు మహారాజు ఎస్తేరు మహారాణికీ, యూదుడైన మొర్దెకైకీ ఇలా సమాధానమిచ్చాడు, “హామాను యూదులకు శత్రువు కనుకనే వాని ఆస్తిని ఎస్తేరుకి ఇచ్చాను. నా సైనికులు వాడిని ఉరికంబానికెక్కించి, ఉరిదీశారు. ఇప్పుడిక మహారాజు ఆజ్ఞ మేరకు మరో ఆజ్ఞాపత్రం వ్రాయండి. మీకు సర్వోత్తమమని తోచిన పద్ధతిలో, యూదులకు తోడ్పడే విధంగా శాసనాన్ని వ్రాయండి. తర్వాత దానిమీద రాజముద్రికతో ముద్రవేసి మూసెయ్యండి. మహారాజు ఆజ్ఞ మేరకు వ్రాయబడి, దానిమీద రాజముద్రిక గుర్తువేయబడిన ఏ ఆధికారిక ఆజ్ఞాపత్రాన్ని రద్దుచేయ సాధ్యం కాదు.”

మహారాజు వెంటనే లేఖకులను పిలువనంపించాడు. మూడవ నెల, అనగా సీవాను నెల 23వ రోజున యీ ఘటన జరిగింది. లేఖకులు మొర్దెకై ఆజ్ఞలన్నింటినీ వ్రాశారు. అవి యూదులకీ, సామంత రాజులకీ, రాజ్యాధిపతులకీ, 127 దేశాల అధికారులకీ పంపబడ్డాయి. ఆ దేశాలు భారత దేశంనుంచి ఇథియోపియాదాకా విస్తరించి వున్నాయి. ఆ ఆజ్ఞాపత్రాలు ఆయా దేశాల భాషల్లో వ్రాయబడ్డాయి. ఆవి ఆయా ప్రజాబృందాల భాషల్లోకి అనువదించబడ్డాయి. కాగా ఆ ఆజ్ఞాపత్రాలు యూదులకు వాళ్ల స్వంత భాషలో, స్వంతలిపిలో వ్రాయబడ్డాయి. 10 మొర్దెకై ఆ ఆజ్ఞలను అహష్వేరోషు మహారాజు ఆమోదంతో వ్రాశాడు. తర్వాత అతను వాటిమీద రాజముద్రికతో ముద్ర వేయించాడు. అప్పుడిక, మొర్దెకై అశ్వారూఢులైన వార్తాహరుల ద్వారా వాటిని పంపించాడు. మహారాజు అశ్వశాలలోని గుర్రాలు అవి.

11 ఆ లేఖల్లోని మహారాజు ఉత్తరువు ఇలా సాగింది: ప్రతి ఒక్క నగరంలోని యూదులూ తమ ప్రాణ రక్షణ కోసం ఒకచోట గుమిగూడేహక్కు కలిగున్నారు. తమ స్త్రీలపైనా, తమ బిడ్డలపైనా ఏ జాతీయులకు చెందిన ఏ సైన్యాన్నయినా సరే నాశనం చేసే, హత మార్చే, పూర్తిగా రూపు మాపే హక్కు వాళ్లకి వుంది. యూదులకు తమ శత్రువుల ఆస్తిని వశంచేసుకొనే హక్కూ, నాశనం చేసే హక్కూ వున్నాయి.

12 యూదులకు ఈ హక్కు ఒక్క రోజే వుంటుంది. ఆ రోజు అదారు అనబడే 12వ నెల 13వ రోజు. అహష్వేరోషు సామ్రాజ్యంలోని దేశాలన్నింట్లోనూ యూదులకు హక్కు దాఖలు చేయబడింది. 13 మహారాజు ఆజ్ఞాపత్రపు ప్రతి ఒకటి బయటికి పంపబడింది. అదొక శాసనం అయింది. అది అన్ని సామంత దేశాల్లోనూ శాసనం అయింది. సామ్రాజ్యంలో నివసించే ప్రతి ఒక జాతి ప్రజలకీ ఈ శాసనం చాటబడింది. యూదులు ప్రత్యేకమైన ఈ రోజున సర్వసన్నద్ధంగా ఉండేందుకు వీలుగా వాళ్లీపని చేశారు. యూదులు తమ శత్రువులకు బదులు దెబ్బ కొట్టేందుకు ఆ రోజున అనుమతింపబడతారు. 14 వార్తాహరులు మహారాజావారి గుర్రాలమీద వేగంగా సాగిపోయారు. మహారాజు ఆ గుర్రాల రౌతులను వేగంగా వెళ్లమని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ రాజధాని అయిన షూషను నగరానికి కూడా వర్తింప జేయబడింది.

15 మొర్దెకై మహారాజు సమక్షం నుంచి బయల్దేరాడు. అతను మహారాజు సమర్పించిన నీలం, తెలుపు ప్రత్యేక దుస్తులు, ఒకపెద్ద బంగారు కిరీటం ధరించాడు. అతని పైవస్త్రం ఊదా రంగులో వుంది. అది చాలా మంచి ఉన్నితో నేసినది. ఆ రోజున షూషను నగరంలో ప్రత్యేకమైన ఒక ఉత్సవం జరుగుతోంది. 16 అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది.

17 మహారాజు ఆజ్ఞ చేరిన ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ, యూదుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యూదులు విందులు, వేడుకలు చేసుకున్నారు. ఇతర జాతులకు చెందిన చాలామంది సామాన్య ప్రజలకు యూదులంటే భయంకలిగి, వాళ్లు యూదా మతం పుచ్చుకున్నారు.

యూదుల విజయం

పన్నెండో నెల (అదారు) 13వ రోజున ప్రజలందరూ మహారాజు ఆజ్ఞను మన్నించవలసి వుంది. అది యూదులను చంపాలని యూదుల శత్రువులు ఆశించిన రోజు. అయితే, యిప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. తమను ద్వేషించిన తమ శత్రువులకంటె యూదులు ఇప్పుడు బలంగా వున్నారు. అహష్వేరోషు మహారాజు సామ్రాజ్యంలోని అన్ని నగరాల్లోని యూదులూ సమావేశమయ్యారు. తమను నాశనం చేయాలని కోరినవారి పైన దాడిచేసేటంత బలాన్ని సమకూర్చుకునేందుకుగాను వాళ్లు సమకూడారు. దానితో, వాళ్లని ఎదిరించి నిలబడగల శక్తిగలవారు ఎవ్వరూ లేకపోయారు. యూదులంటే జనం భయపడ్డారు. సామంత రాజ్యాల్లోని అధికారులు, సామ్రాజ్యాధిపతులు, రాజ్య పాలకులు, రాజోద్యోగులు అందరూ యూదులకు తోడ్పడ్డారు. వాళ్ల ఈ తోడ్పాటుకి మొర్దెకై పట్లనున్న భయమే కారణం. మహారాజు భవనంలోని అతి ముఖ్యుల్లో మొర్దెకై ఒకడయ్యాడు. సామంత రాజ్యాల్లోని ప్రతి ఒక్కరికి మొర్దెకై పేరు తెలుసు. అతనికెంత ప్రాముఖ్యం వుందో తెలుసు. మొర్దెకై నానాటికీ మరింత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు.

యూదులు తమ శత్రువులందర్నీ ఓడించారు. వాళ్లు తమ శత్రువుల్ని హతమార్చేందుకూ, నాశనం చేసేందుకూ కత్తులు ప్రయోగించారు. తమని ద్వేషించినవారి పట్ల యూదులు తమ చిత్తం వచ్చినట్లు వ్యవహరించారు. యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు. యూదులు ఈ క్రిందివారిని కూడా మట్టు పెట్టారు: పర్షందాతా, దల్పోను, అస్పాతా, పోరాతా, అదల్యా, అరీదాతా, పర్శష్తా, అరీసై, అరీదై, వైజాతా. 10 ఈ పదిమందీ హామాను కొడుకులు. హమ్మెదాతా కొడుకైన హామాను యూదులకు గర్భశత్రువు. యూదులు హామాను కొడుకులందర్నీ చంపేశారుగాని, వాళ్లకి చెందిన ఆస్తిపాస్తులు వేటినీ వాళ్లు తాకలేదు.

11 ఆ రోజున రాజధాని అయిన షూషను నగరంలో చంపివేయబడిన వాళ్ల సంఖ్యను మహారాజ తెలుసు కున్నాడు. 12 అప్పుడు మహారాజు మహారాణి ఎస్తేరుతో ఇలా అన్నాడు: “షూషను నగరంలో యూదులు హామాను కొడుకులు పదిమందితో బాటు 500 మందిని చంపేశారు. ఇప్పుడిక మహారాజు సామ్రాజ్యంలోని యితర సామంత రాజ్యాల్లో ఏమి జరగాలని నీవు కోరుకుంటున్నావో చెప్పు. నేను అలా చేయిస్తాను. నీవు కోరుకో, కోరుకున్నదేదైనా సరే, నేను చేయిస్తాను.”

13 ఎస్తేరు ఇలా కోరింది, “మహారాజుకి సమ్మతమైతే, షూషను నగరంలోని యూదులను రేపుకూడా యీ కార్యక్రమం కొనసాగించనివ్వండి, హామాను కొడుకులు పదిమంది కళేబరాలనూ ఉరికంబం మీద వేలాడదీయించండి.”

14 మహారాజు అలాగే ఉత్తరువు ఇచ్చాడు. ఆ ఉత్తరువు షూషను నగరంలో మరోక రోజు అమలు జరిగింది. హామాను కొడుకులు పదిమందీ ఉరి కొయ్యలకు వేలాడదీయబడ్డారు. 15 అదారు నెల 14వ రోజున షూషను నగరంలో యూదులందరూ గుమికూడి, మరో 300 మంది పురుషులను చంపేశారు. అయితే, వాళ్లకి చెందిన ఏ వస్తువుల్నీ యూదులు ముట్టలేదు.

16 అదే సమయంలో యితర సామంత రాజ్యాల్లోని యూదులు కూడా తమని తాము కాపాడుకోగల బలాన్ని పుంజుకునేందుకు గాను వాళ్లు సమావేశ మయ్యారు. వాళ్లు అలా తమ శత్రువులను వదిలించుకున్నారు. యూదులు తమ శత్రువుల్లో 75,000 మందిని హతమార్చారు. అయితే, వాళ్లకి చెందిన వస్తువులు వేటినీ యూదులు చేజిక్కించుకోలేదు. 17 అదారు నెల 13వ రోజున యిది జరిగింది. 14వ రోజున యూదులు విశ్రమించారు. యూదులు ఆరోజును తమ సంతోషకరమైన సెలవు దినం చేసుకున్నారు.

పూరీము పండుగ

18 షూషను నగరంలోని యూదులు అదారు నెల 13, 14 తేదీల్లో సమావేశమయ్యారు. తర్వాత 15వ రోజున వాళ్లు విశ్రమించారు. అందుకని, 15వ రోజును వాళ్లు సంతోషకరమైన పండుగ దినం చేసుకున్నారు. 19 కాగా దేశంలో, చిన్నచిన్న గ్రామాల్లో జీవించే యూదులు ఈ పూరీము పండుగను అదారు నెల 14వ రోజున జరుపుకుంటారు. వాళ్లీ 14వ రోజును ఆనందదాయకమైన పండుగగా జరుపుకుంటారు. వాళ్లు ఆ రోజున విందులు జరుపుకుంటారు. ఒకరి కొకరు బహూమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

20 అప్పుడు జరిగిన ఘటనలన్నింటినీ మొర్దెకై గ్రంథస్తం చేయించాడు. తర్వాత అతను అహష్వేరోషు మహారాజు సామంత రాజ్యాలన్నింటిలోని యూదులందరికీ లేఖలు పంపాడు. అతనా లేఖలను దగ్గర ప్రాంతాలకే కాకుండా దూర ప్రాంతాలకు కూడా పంపాడు. 21 ఏటా అదారు నెల 14, 15 తేదీల్లో యూదులందరూ పూరీము పండుగను పాటించాలని తెలియ చెప్పేందుకుగాను మొర్దెకై ఈ పని చేశాడు. 22 అవి యూదులు తమ శత్రువులను నిశ్శేషం చేసిన రోజులు. అందుకని యూదులు పండుగ దినాలుగా జరుపుకోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన ఆ నెలను కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను ఆ రోజులను ఆనందం వెల్లివిరిసే పండుగ దినాలుగా జరుపుకోమని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లో విందులు జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవాలి, పేదలకు కానుకలివ్వాలి.

23 యూదులు మొర్దెకై తమకు వ్రాసిన విధంగా చేసేందుకు అంగీకరించారు. తాము ప్రారంభించిన వేడుకలను కొనసాగించేందుకు సమ్మతించారు.

24 అగాగీయుడైన హామ్మెదాతా కొడుకు హామాను యూదులందరికీ గర్భశతృవు. యూదులను నాశనం చేసేందుకుగాను వాళ్లకి వ్యతిరేకంగా అతనొక దుష్ట పథకం వేశాడు. యూదులను నాశనం చేసేందుకూ, నిర్మూలించేందుకూ అనువైన రోజును ఎంపిక చేసేందుకుగాను అతను చీట్లు వేశాడు. ఆ కాలంలో దాన్ని “పూరు” అనేవారు, అందుకే ఆ పండుగను “పూరీము” అంటారు 25 హామాను దుష్కార్యాలు చేశాడు. ఎస్తేరు మహారాజు సన్నిధికి వెళ్లి, మాట్లాడింది. దానితో అతను కొత్త ఆజ్ఞలు పంపాడు. ఆ ఆజ్ఞలు హామాను దుష్ట పథకాలను భగ్నం చయడమేగాక, హామాను దుష్ట పథకంలోని దుష్కార్యాలు హామానుకీ, అతని కుటుంబ సభ్యులకీ సంభవించేలా చేశాయి! దానితో హామానూ, అతని కొడుకులూ ఉరికంబాలకు వేలాడదీయబడ్డారు.

26-27 ఆ కాలంలో చీట్లను “పూరీము” అనేవారు, అందుకే ఈ పండుగను “పూరీము” అంటారు. మొర్దెకై ఒక లేఖ వ్రాసి, యూదులను ఈ పండుగ చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అందుకే, యూదులు ఏటా ఈ పండుగను రెండు రోజులపాటు జరుపుకోవడం ఆచారం అయింది. 28 వాళ్లీ పండుగను తమకు గతంలో జరిగినవాటిని గుర్తుంచుకోగలిగేందుకు గాను జరుపుకుంటారు. యూదులూ, వాళ్లతో చేరేవాళ్లూ ఏటా యీ పండుగను సరైన కాలంలో, సక్రమమైన పద్ధతిలో జరుపుకుంటారు. ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ యీ రెండు రోజులనూ గుర్తుంచుకుంటాయి. వాళ్లీ పండుగను ప్రతి సామంత రాజ్యంలోనూ, ప్రతి పట్టణంలోనూ జరుపుకుంటారు. పూరీము రోజుల్లో పండుగ జరుపుకోవడాన్ని యూదులు ఎన్నడూ మానరు. యూదుల ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ ఈ పండుగను సదా గుర్తుంచుకుంటారు.

29 పూరీమును గురించిన ఉత్తరువు లేఖను అబీహాయిలు కూతురు ఎస్తేరు మహారాణీ, యూదుడైన మొర్దెకైలు కలిసి వ్రాశారు. ఈ రెండవ లేఖ నిజమని నిరూపించేందుకుగాను దాన్ని వారు మహారాజు పూర్తి అనుమతి (ఆజ్ఞ)తో వ్రాశారు. 30 మొర్దెకై ఆ లేఖలను అహష్వేరోషు మహారాజు వారి 127 సామంత రాజ్యాల్లోని యూదులందరికీ పంపాడు. ఈ పండుగ శాంతినీ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్నీ[a] పెంపొందించాలని జనానికి మొర్దెకై సూచించాడు. 31 పూరీము పండుగ సంబరాలు మొదలు పెట్టమని చెప్పేందుకుగాను మొర్దెకై ఈ లేఖలు వ్రాశాడు. ఈ కొత్త పండుగను ఎప్పుడు మొదలు పెట్టాలోకూడా అతను ఆ లేఖల్లో వాళ్లకి తెలియచేశాడు. యూదులకు యీ ఉత్తరువును యూదుడైన మొర్దెకై, మహారాణి ఎస్తేరూ పంపారు. తద్వారా వాళ్లు యీ రెండు రోజుల పండుగను తమ తరతరాల యూదుల కోసం స్థిరపరిచారు. తాము ఉపవాసాలు చేసి, జరిగిన చెడుగుల విషయంలో విలపించే ఇతర పండుగలను గుర్తు పెట్టుకొనేటట్లే యూదులు ఈ పండుగను కూడా గుర్తు పెట్టుకుంటారు. 32 ఎస్తేరు ఉత్తరువు పూరీము పండుగ నియమాలను స్థిరపరచింది. ఆ విషయాలు గ్రంథాల్లో నమోదు చేయబడ్డాయి.

మొర్దెకైకి గౌరవస్థానం

10 అహష్వేరోషు మహారాజు ప్రజల దగ్గర్నుంచి పన్నులు వసూలు చేసేవాడు. సుదూర ప్రాంతాల్లో సముద్ర తీరాన వున్న నగర వాసులతో బాటు, సామ్రాజ్యంలోని ప్రజలందరూ పన్నులు చెల్లించవలసి వచ్చేది. అహష్వేరోషు మహారాజు చేసిన ఘనకార్యాలన్నీ మాదీయ, పారశీక రాజ్యాల చరిత్ర గ్రంథంలో లిఖింపబడ్డాయి. అలాగే మొర్దెకై చేసిన ఘనకార్యాలన్నీ కూడా ఆ చరిత్ర గ్రంథాల్లో చేర్చబడ్డాయి. మహారాజు మొర్దెకైకి ఘనమైన గౌరవస్థానం కల్పించాడు. సామ్రాజ్యంలో అహష్వేరోషు తర్వాత ప్రాముఖ్యంలో మొర్దెకైది ద్వితీయ స్థానం. యూదులందరిలో మొర్దెకైయే అతి ముఖ్యమైన వ్యక్తి. అతని తోటి యూదులు అతన్నెంతగానో గౌరవించేవారు. మొర్దెకై తన జాతీయ ప్రజల సంక్షేమ సౌభాగ్యాల కోసం విశేషంగా కృషి చేశాడు. మొర్దెకై యూదులందరికీ శాంతిని చేకూర్చాడు. అందుకే, సాటి యూదులందరికీ మొర్దెకై అంటే ఎంతో గౌరవం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International