Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
మత్తయి 23

యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం

(మార్కు 12:38-40; లూకా 11:37-52; 20:45-47)

23 ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “శాస్త్రులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చునివున్నారు. అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో చెయ్యండి. కాని వాళ్ళు బోధించినవి వాళ్ళే ఆచరించరు కనుక వాళ్ళు చేసేవి చెయ్యకండి. వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కాని వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదలించరు.

“పెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచులను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు. విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు. సంతల్లో, ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు.

“మీకందరికి బోధకుడు ఒకడే! మీరంతా సోదరులు. కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలువనీయకండి. ప్రపంచంలో ఎవ్వర్నీ ‘తండ్రి!’ అని సంబోధించకండి. మీ అందరికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. 10 అదే కాకుండా మిమ్మల్ని ‘గురువు!’ అని పిలువ నియ్యకండి. మీకు ఒకే గురువు ఉన్నాడు. ఆయనే ‘క్రీస్తు.’ 11 మీలో గొప్ప వాడు మీ సేవకునిగా ఉండాలి. 12 ఎందుకంటే గొప్పలు చెప్పుకొనేవాణ్ణి దేవుడు అణచి వేస్తాడు. అణకువతో ఉన్న వాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు.

13 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. 14 [a]

15 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు.

16 “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 17 మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?

18 “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? 20 అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 21 అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 22 అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా!

23 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. 24 గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు.

25 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. 26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.

27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.

29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!

33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.

35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.

యెరూషలేము విషయంలో దుఃఖించటం

(లూకా 13:34-35)

37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. 38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. 39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”

లూకా 20-21

యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం

(మత్తయి 21:23-27; మార్కు 11:27-33)

20 ఒక రోజు మందిరంలో యేసు ప్రజలకు బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధానయాజకులు, శాస్త్రులు, పెద్దలు అంతా కలిసి ఆయన దగ్గరకు వచ్చారు. “ఎవరిచ్చిన అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు? చెప్పు” అని వాళ్ళు అడిగారు.

ఆయన, “నన్నొక ప్రశ్న అడుగనివ్వండి. యోహానుకు బాప్తిస్మము నిచ్చే అధికారం ఎవరిచ్చారు? దేవుడా? లేక ప్రజలా” అని అన్నాడు.

వాళ్ళు పరస్పరం ఈ విధంగా చర్చించుకున్నారు: “దేవుడంటే, అతడు ‘మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అంటాడు ప్రజలంటే, ‘ప్రజలు యోహానును ఒక ప్రవక్త అని విశ్వాసిస్తూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు మనల్ని రాళ్ళతో కొడతారు.’ అందువల్ల ఆ అధికారం ఎక్కడినుండి వచ్చిందో మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.

యేసు, “మరి అలాగైతే నేను కూడా ఎవరి అధికారంతో యివన్నీ చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.

రైతుల ఉపమానం

(మత్తయి 21:33-46; మార్కు 12:1-12)

ఆ తర్వాత ప్రజలకు ఈ ఉపమానం చెప్పటం మొదలు పెట్టాడు: “ఒకడు ఒక ద్రాక్షాతోట వేసి రైతులకు కౌలుకిచ్చి చాలాకాలం దేశాంతరం వెళ్ళి పోయ్యాడు. 10 పండ్లు కోసే సమయానికి తన పాలు వసూలు చేసుకురమ్మని సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతుల్తో పంపారు. 11 ఆ ఆసామి మరొక సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కూడా బాగా కొట్టి అవమానించి వట్టిచేతుల్తో పంపారు. 12 అతడు మూడవవాణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తీవ్రంగా గాయపరచి తరిమి వేసారు.

13 “ఆ ద్రాక్షాతోట యజమాని, ‘నేనేం చెయ్యాలి? ఆ! నా ముద్దుల కొడుకుని పంపుతాను. బహుశా వాళ్ళతణ్ణి గౌరవించవచ్చు’ అని అనుకున్నాడు. 14 కాని రైతులు అతని కుమారుణ్ణి చూసి, తమలో ‘ఇతడు వారసుడు కనుక యితణ్ణి చంపేద్దాం. అప్పుడు ఈ తోట మనకే ఉంటుంది’ అని నిశ్చయించుకొన్నారు. 15 అతణ్ణి ద్రాక్షాతోట నుండి బైటకు తరిమి చంపివేసారు.

“ఆ ద్రాక్షాతోట ఆసామి వాళ్ళనేమి చేస్తాడు? 16 వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షాతోట యింకొకరికి కౌలుకు యిస్తాడు” అని అన్నాడు.

ప్రజలు యిది విని, “అలా ఎన్నటికి జరుగకూడదు” అని అన్నారు. 17 యేసు వాళ్ళవైపు సూటిగా చూసి, “మరి అలాగైతే లేఖనాల్లో వ్రాయబడిన ఈ వాక్యానికి అర్థమేమిటి:

‘పనికి రానిదని ఇళ్ళుకట్టేవాళ్ళు పారవేసిన రాయి ముఖ్యమైన రాయి అయింది’?(A)

18 ఆ రాయిమీద ఎవరు పడతారో వాళ్ళు ముక్కలై పోతారు. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్ళు నలిగిపోతారు” అని అన్నాడు.

19 శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈ ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడి పోయారు.

యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:15-22; మార్కు 12:13-17)

20 వాళ్ళు సరియైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. కనుక వాళ్ళు తమ వాళ్ళను కొందర్ని రహస్యంగా ఆయన దగ్గరకు పంపారు. వాళ్ళు మంచి వాళ్ళుగా నటిస్తూ యేసు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు పట్టి ఆయన్ని ఆ ప్రాంతం యొక్క రాజ్యాధికారికి అప్పగించటానికి ప్రయత్నించసాగారు. ఆ రాజ్యాధికారికి శిక్షించటానికి అధికారం ఉంది. 21 ఒక రోజు వాళ్ళు యేసుతో, “బోధకుడా! మీరు సత్యం మాట్లాడుతారు. సత్యం బోధిస్తారు. పక్షపాతం చూపరు. దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిస్తారని మాకు తెలుసు. 22 మరి మేము చక్రవర్తికి పన్నులు కట్టాలా వద్దా?” అని అడిగారు.

23 వాళ్ళ పన్నాగం గమనించి 24 యేసు, “ఒక దేనారా చూపండి. దాని మీద ఎవరి బొమ్మవుంది? ఎవరి పేరు ఉంది?” అని అడిగాడు.

“చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చేప్పారు.

25 ఆయన, “అలాగైతే చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి. దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు.

26 ఆయన అక్కడ ప్రజల సమక్షంలో చెప్పిన ఈ సమాధానంలో వాళ్ళు ఏ తప్పూ పట్టలేక పోయారు. పైగా వాళ్ళాయన సమాధానానికి ఆశ్చర్యపడి మౌనం వహించారు.

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:23-33; మార్కు 12:18-27)

27 చనిపొయ్యాక మళ్ళీ బ్రతికిరారని వాదించే సద్దూకయ్యుల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు: 28 “బోధకుడా! మోషే ‘ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు ఆ చనిపోయిన వానికి సంతానం కలుగ చేయటానికి అతని భార్యను వివాహం చేసుకోవాలి’ అని వ్రాశాడు. 29 ఒక్కప్పుడు ఏడుగురు సోదరులుండే వారు. మొదటి వాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. 30 రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకొని మరణించాడు. 31 మూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం లేకుండా మరణించారు. 32 చివరకు ఆమెకూడా మరణించింది. 33 మరణించిన వాళ్ళందరూ బ్రతికి వచ్చినప్పుడు ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకొంటారు గనుక ఆమె ఎవరి భార్య అవుతుంది?” అని అడిగారు.

34 యేసు, “ఈ భూమ్మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. చేసుకొంటారు. 35 పరలోకమునకు పునరుత్థానమగుటకు అర్హత ఉన్నవాళ్ళు అనంత జీవితం పొంది రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, చెయ్యరు. 36 వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారులవలె ఉంటారు. కనుక వారిక చావరు. వాళ్ళు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్ళు కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు. 37 మండుచున్న పొదను గురించి వ్రాస్తూ, ‘ప్రజలు చావునుండి బ్రతికింపబడతారు’ అని మోషే సూచించాడు. ఎందుకంటే, అతడు ప్రభువును గురించి ప్రస్తావిస్తూ ‘ప్రభువు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు’(B) అని వ్రాసాడు. 38 ప్రభువు చనిపోయిన వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్నవాళ్ళకే దేవుడు. ఆయన అందర్ని జీవిస్తున్న వాళ్ళుగా పరిగణిస్తాడు” అని అన్నాడు.

39 కొందరు శాస్త్రులు, “బోధకుడా! చక్కగా చెప్పారు” అని అన్నారు. 40 ఆ తదుపరి ఆయన్ని ప్రశ్నించటానికి ఎవరికి ధైర్యం చాలలేదు.

క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?

(మత్తయి 22:41-46; మార్కు 12:35-37)

41 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు? 42-43 దావీదు, తన కీర్తనలో ఈ విధంగా వ్రాశాడు కదా!

‘ప్రభువు నా ప్రభువుతో:
నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకూ
    నా కుడి వైపు కూర్చో’(C)

44 దావీదు ఆయన్ని ‘ప్రభూ!’ అని అన్నాడు కదా! అలాంటప్పుడు ఆయన దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అని అన్నాడు.

శాస్త్రుల్ని విమర్శించటం

(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 11:37-54)

45 ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు: 46 “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవటానికి ప్రాకులాడుతారు. 47 వితంతువుల్ని మోసం చేసి వాళ్ళ ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”

నిజమైన కానుక

(మార్కు 12:41-44)

21 యేసు చుట్టూ చూసాడు. ధనవంతులు హుండీలో కానుకలు వేయటం ఆయన గమనించాడు. అతి పేదరాలైన ఒక వితంతువు రెండు పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమనించాడు. ఆయన, “నేను చెప్పేదేమిటంటే ఈ బీదవితంతువు అందరికన్నా ఎక్కువ ఆ హుండిలో వేసింది. యితర్లు తమ దగ్గరున్న సంపద నుండి కొంత మాత్రమే కానుకగా వేసారు. కాని ఆమె తాను జీవించటానికి దాచుకొన్నదంతా ఆ హుండీలో వేసింది” అని అన్నాడు.

యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం

(మత్తయి 24:1-14; మార్కు 13:1-13)

ఆయన శిష్యుల్లో కొందరు ఆ మందిరానికి చెక్కబడిన రాళ్ళ అందాన్ని గురించి, ప్రజలు యిచ్చిన కానుకలతో చేసిన అలంకరణను గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు.

కాని యేసు, “మీరిక్కడ చూస్తూన్నవన్నీ రాయి మీద రాయి నిలువకుండా నేలమట్టమై పోయ్యే సమయం వస్తుంది” అని అన్నాడు.

వాళ్ళు, “అయ్యా! యివి ఎప్పుడు సంభవిస్తాయి! ఇవి జరుగబోయేముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి” అని అడిగారు.

ఆయన, “జాగ్రత్త! మోసపోకండి. నా పేరిట అనేకులు వచ్చి, ‘నేనే ఆయన్ని అని, కాలం సమీపించింది’ అని అంటారు. వాళ్ళను అనుసరించకండి. యుద్ధాల్ని గురించి, తిరుగుబాట్లను గురించి వింటే భయపడకండి. ఇవన్నీ ముందు జరిగి తీరవలసిందే. కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు.

10 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “దేశం దేశంతో, రాజ్యం రాజ్యంతో యుద్ధం చేస్తుంది. 11 అన్నిచోట్లా తీవ్రమైన భూకంపాలు, కరువులు, రోగాలు సంభవిస్తాయి. ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆకాశంలో భయంకర గుర్తులు కనిపిస్తాయి.

12 “కాని యివన్నీ జరుగక ముందే యూదులు మిమ్మల్ని బంధించి, హింసించి సమాజ మందిరాలకు అప్పగిస్తారు. ఆ సమాజ మందిరాల అధికారులు మిమ్మల్ని కారాగారంలో పడవేస్తారు. రాజుల ముందు, రాజ్యాధికారుల ముందు నిలబెడతారు. ఇవన్నీ నాపేరు కారణంగా జరుగుతాయి. 13 తద్వారా వాళ్ళకు సువార్తను గురించి చేప్పే అవకాశం మీకు కలుగుతుంది. 14 వాళ్ళ సమక్షంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి సిద్ధం కారాదని మీ మనస్సులో నిర్ణయించుకోండి. 15 ఎందుకంటే సరియైన సమయానికి మాట్లాడటానికి అవసరమైన పదాన్ని నేను మీకు అందిస్తాను. కావలసిన జ్ఞానం యిస్తాను. మీ ప్రతివాదులు మీ మాటల్ని ఖండించకుండా ఉండేటట్లు చేస్తాను. వాళ్ళలో తిరిగి వాదించే శక్తి లేకుండా చేస్తాను. 16 మీ తల్లి తండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు మీకు ద్రోహం చేస్తారు. మీలో కొందర్ని చంపి వేస్తారు. 17 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. 18 కాని మీ తల మీదనున్న ఒక్కవెంట్రుక కూడా రాలిపోదు. 19 సహనంతో ఉండండి. అప్పుడే మిమ్మల్ని మీరు వీటన్నిటియందు విశ్వాసం ద్వారా రక్షించుకోగలుగుతారు.

యేసు యెరూషలేము నాశనమౌతుందని చెప్పటం

(మత్తయి 24:15-21; మార్కు 13:14-19)

20 “యెరూషలేము చుట్టూ సైన్యాలు చూసినప్పుడు అది నాశనమయ్యే రోజులు వచ్చాయని గ్రహించండి. 21 అప్పుడు యూదయలో ఉన్న మీరు పరుగెత్తి కొండల మీదికి వెళ్ళండి. పట్టణంలో ఉన్న వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపొండి. గ్రామాల్లో ఉన్న వాళ్ళు పట్టణాల్లోకి వెళ్ళకండి. 22 ఇది శిక్షా సమయం. ఇదివరకు లేఖనాల్లో వ్రాసినవన్నీ నిజంకానున్న సమయం. 23 ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత కష్టం కలుగుతుందో కదా! ఈ దేశానికి పెద్ద దుఃఖంకలుగనున్నది. దేవుడు తన కోపాన్ని ఈ దేశంపై చూపనున్నాడు. 24 కొందరు కత్తికి బలి అవుతారు. మరి కొందరు ఖైదీలుగా యితర దేశాలకు తీసుకు వెళ్ళబడతారు. యూదులుకాని వాళ్ళ కాలం ముగిసేదాకా వాళ్ళు యెరూషలేమును అణగత్రొక్కి ఉంచుతారు.

భయపడవద్దు

(మత్తయి 24:29-31; మార్కు 13:24-27)

25 “సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో సూచనలు కన్పిస్తాయి. సముద్రాల రోదనకు, తీవ్రమైన అలలకు దేశాలు భయపడి కలవరం చెందుతాయి. 26 రానున్న ఘోరాన్ని తలంచుకొని ప్రజలు భయంతో మూర్చపోతారు. ఆకాశపు జ్యోతులు గతి తప్పుతాయి. 27 అప్పుడు శక్తితో, గొప్ప తేజస్సుతో మేఘం మీద మనుష్యకుమారుడు రావటం వాళ్ళు చూస్తారు. 28 ఇవి జరగటం మొదలైనప్పుడు లేచి మీ తలలెత్తి చూడండి. అంటే మీకు రక్షణ దగ్గరకు వచ్చిందని అర్థం” అని అన్నాడు.

చెట్ల ఉపమానం

(మత్తయి 24:32-35; మార్కు 13:28-31)

29 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఆ అంజూరపు చెట్టును చూడండి. అంతెందుకు; చెట్లన్నిటిని చూడండి. 30 చెట్టు చిగురు వేయగానే ఎండాకాలం దగ్గరకు వచ్చిందని గ్రహిస్తారు. 31 అదే విధంగా ఈ సంఘటనలు జరగటం చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని గ్రహించండి.

32 “ఇది నిజం. ఇవన్నీ సంభవించేవరకు ఈ తరంవాళ్ళు గతించరు. 33 ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి.

అన్ని వేళలా సిద్ధంగా ఉండండి

34 “జాగ్రత్త! విందులు, వినోదాలు చేసుకొంటూ త్రాగుబోతులై జీవించకండి. ప్రాపంచిక విషయాల్లో మునిగిపోకండి. అలా చేస్తే మీ బుద్ధి పని చెయ్యటం మానేస్తుంది. అప్పుడు ఆ దినం మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చి మీ మీద పడుతుంది. 35 అది ప్రపంచం మీదికంతా వస్తుంది. 36 అన్ని వేళలా జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్ఘటనలనుండి తప్పించుకొనే శక్తి, మనుష్యకుమారుని సమక్షంలో నిలబడగలిగే శక్తి కలగాలని ప్రార్థించండి.”

37 యేసు ప్రతి రోజు మందిరంలో బోధిస్తూ ఉండేవాడు. ప్రతిరాత్రి ఒలీవలకొండ మీదికి వెళ్ళి గడిపేవాడు. 38 ప్రజలందరు ఆయన బోధనలు వినాలని తెల్లవారుఝామునే మందిరానికి వెళ్ళేవాళ్ళు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International