Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 50

ఆసాపు కీర్తనలలో ఒకటి.

50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
    సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
    ఆయన యెదుట అగ్ని మండుతుంది.
    ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
    క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
“నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
    వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.

అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
    ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.

దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
    నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.
మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను.
    మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
    వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు.
    పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు
    ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.”

14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,
    దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.
15 “ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!
    నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”

16 దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు,
    “నా న్యాయ విధులను చదువుటకు,
    నా ఒడంబడికకు బద్ధులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?[a]
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.
    నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడతారు.
    వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.
19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు.
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబుతారు.
    మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను
    నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు.
కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను.
    మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
    దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
    అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
    నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”

కీర్తనలు. 53

సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.

53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
    అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
    సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
    దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
    కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
    ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
    ఒక్కడూ లేడు.

దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
    కాని వారు నన్ను ప్రార్థించరు.
    ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”

కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
    భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
    కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.

ఇశ్రాయేలు ప్రజలారా,
    సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
    యాకోబు సంతోషిస్తాడు.
    ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.

కీర్తనలు. 60

సంగీత నాయకునికి: “ఒప్పందపు లిల్లి పుష్పం” రాగం. దావీదు అనుపదగీతం. ఉపదేశించదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను, అరమోజబాయీలతోను యుద్ధం చేయగా యోవాబు ఉప్పు లోయలో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పటిది.

60 దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు.
    నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు.
    దయచేసి మమ్ములను ఉద్ధరించుము.
భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు.
    మా ప్రపంచం పగిలిపోతోంది.
    దయచేసి దాన్ని బాగు చేయుము.
నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు.
    త్రాగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము.
నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను
    స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.

నీ మహాశక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు,
    నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.

దేవుడు తన ఆలయంలో నుండి[a] మాట్లాడుతున్నాడు.
    “నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను.
    నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను.
    షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.
    గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము.
    యూదా నా రాజదండము.
    మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను.
    ఎదోము నా చెప్పులు మోసే బానిసగా ఉంటుంది. ఫిలిష్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”

బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు?
    ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?
10 దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు.
    కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.
11 దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము.
    మనుష్యులు మాకు సహాయం చేయలేరు.
12 కాని దేవుని సహాయంతో మేము జయించగలం.
    దేవుడు మా శత్రువులను ఓడించగలడు.

కీర్తనలు. 75

సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
    మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
    నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.

దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
    న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
    దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”

4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
    కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”

తూర్పునుండిగాని పడమరనుండిగాని
    ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
    దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
    ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
    అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
    దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
    ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
    మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International