Chronological
సమ్సోను జననం
13 ఇశ్రాయేలు ప్రజలు చెడ్డ పనులు చేయడం మళ్లీ యెహోవా చూశాడు. అందువల్ల ఫిలిష్తీయులు వారిని 40 సంవత్సరాల పాటు పరిపాలించేందుకు యెహోవా అనుమతించాడు.
2 జొర్యాకి చెందిన ఒకతను ఉండేవాడు. అతని పేరు మానోహ. అతను దాను వంశానికి చెందినవాడు. మానోహకు ఒక భార్య ఉంది. ఆమె పిల్లలెవరినీ కనలేక పోయింది. 3 యెహోవాదూత మానోహ భార్యకి ప్రత్యక్షమయ్యాడు. అతను ఇలా అన్నాడు: “నీవు పిల్లల్ని కనలేకపోయావు. కాని నీవు గర్భవతివవుతావు. ఒక కొడుకుని కంటావు. 4 ఏ మద్యంగాని, ఘాటైన పానీయంగాని నీవు తాగవద్దు. అపరిశుభ్రమైన ఆహారం కూడా నీవు తినవద్దు. 5 ఎందుకంటే నీవు గర్భవతివై, ఒక కొడుకుని కంటావు. ఒక ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. అతను నాజీరవుతాడు.[a] అందువల్ల ఎప్పుడూ అతని జుట్టు కత్తిరించకు. అతను జన్మించడానికి పూర్వమె అతను దేవుని ప్రత్యేకమైన వ్యక్తిగా వుంటాడు. అతను ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల అధికారం నుంచి కాపాడతాడు.”
6 తర్వాత ఆమె తన భర్త వద్దకు వెళ్లి అతనితో జరిగిన విషయం చెప్పింది. ఆమె ఇలా చెప్పింది: “దేవుని వద్దనుండి ఒక మనిషి నా వద్దకు వచ్చాడు. అతను దేవదూతగా కనిపించాడు. అతను నన్ను భయపెట్టాడు. ఎక్కడినుంచి అతను వచ్చాడో, ఆ సంగతి నేను కనుక్కోలేదు. అతను తన పేరు చెప్పలేదు. 7 కాని నాతో ఇలా అన్నాడు: ‘నీవు గర్భవతివి. నీకొక కుమారుడు కలుగుతాడు. మద్యంగాని, ఏ ఇతర ఘాటైన పానీయంగాని తాగవద్దు. అపరిశుభ్రంగా ఉండే ఆహారమూ తినవద్దు. ఎందుకంటే, ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. ఆ బాలుడు దేవుని ప్రత్యేక వ్యక్తి. పుట్టుకకు మునుపటినుంచి మరణించేంత వరకు అతను విలక్షణమైన[b] మనిషి.’”
8 ఆ తర్వాత మానోహ యెహోవాను ప్రార్థించాడు. అతను ఇలా అన్నాడు: “యెహోవా, దేవ దూతను మళ్లీ మా వద్దకు పంపవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. త్వరలోనే బాలుడుగా జన్మించనున్న అతనికి మేము ఏమి చేయాలో అది ఆ దేవదూత మాకు నేర్పాలి”
9 దేవుడు మానోహ ప్రార్థన ఆలకించాడు. దేవదూత మళ్లీ ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఒక పొలంలో కూర్చునివుంది. ఆమె భర్త మానోహ ఆమె వద్ద లేడు. 10 అందువల్ల అది చెప్పాలని భర్త వద్దకు పరుగెత్తి, “ఆ మనిషి తిరిగి వచ్చాడు! మొన్న వచ్చిన అతను ఇక్కడే వున్నాడు.” అని తన భర్తతో చెప్పింది.
11 మానోహ లేచి తన భార్యను అనుసరించాడు. అతను ఆ మనిషి వద్దకు రాగానే, “ఇంతకు మునుపు నా భార్యతో మాటలాడిన వ్యక్తివి నీవేనా” అని అడిగాడు.
“నేనే” అన్నాడు దేవదూత.
12 అందువల్ల మానోహ, “నీవు చెప్పినట్లు జరుగుతుందని భావిస్తున్నాను. బాలుడు ఎలాంటి జీవితం గడుపుతాడో, అతడేమి చేస్తాడో చెప్పు” అని అడిగాడు.
13 యెహోవాదూత మానోహతో ఇలా చెప్పాడు: “నేను చెప్పినదంతా నీ భార్య చేయాలి. 14 ద్రాక్షాతీగ మీద పెరిగే దానిని ఆమె తినకూడదు. ఆమె మద్యము తాగకూడదు. అపరిశుభ్రమైన ఆహారం తినకూడదు. ఏమి చేయుమని ఆమెను ఆజ్ఞాపించానో, ఆమె అదంతా చేయాలి.”
15 అప్పుడు ఆ యెహోవాదూతతో మానోహ ఇలా చెప్పాడు: “దయచేసి నీవు మాతోపాటు కొంత సేపు ఉండు. నీవు తినేందుకుగాను ఒక లేత మేకను వండిపెట్టాలని అనుకుంటున్నాము.”
16 యెహోవాదూత మానోహతో ఇలా అన్నాడు: “నేను వెళ్లకుండా మీరు చేసినా, నేను మీరు పెట్టే ఆహారం తినను. కాని మీరేదైనా చెయ్యదలుచుకుంటే, అప్పుడు యెహోవాకు దహనబలిని సమర్పించండి.” (ఆ వ్యక్తి నిజంగా యెహోవాదూత అని మానోహ అర్థం చేసుకోలేక పోయాడు).
17 అప్పుడు యెహోవాదూతను, “నీ పేరేమిటి? నీవు చెప్పినదంతా నిజంగా జరిగినప్పుడు, నిన్ను గౌరవించాలని మేమనుకుంటున్నాము. అందువల్లనే నీ పేరు తెలుసుకోదలచాను.”
18 యెహోవాదూత ఇలా చెప్పాడు: “నా పేరు మీరెందుకు అడుగుతున్నారు? ఇది మీరు నమ్మడానికి చాలా ఆశ్చర్యకరము”
19 అప్పుడు మానోహ ఒక బండ మీద ఒక లేత మేకను బలి ఇచ్చాడు. మేకను, ధాన్యమును యెహోవాకు, మరియు అద్భుతాలు చేసే వ్యక్తికీ సమర్పించాడు. 20 మానోహ, అతని భార్య జరిగిన వాటిని గమనిస్తూ వచ్చారు. మధ్యస్థానము నుండి ఆకాశానికి పొగలు లేచినప్పుడు, యెహోవాదూత ఆ మంటలలో పరమునకు వెళ్లిపోయాడు!
ఎప్పుడైతే అది మానోహ, అతని భార్య చూసారో, నేలకు తాకేలా తమ ముఖాలు వంచి నమస్కరించారు. 21 ఆ వ్యక్తి నిజంగానే యెహోవాదూత అని చివరికి మానోహ గ్రహించాడు. ఆ తర్వాత యెహోవాదూత మళ్లీ మానోహ, మరియు ఆయన భార్య ముందు ప్రత్యక్షం కాలేదు. 22 మానోహ తన భార్యతో ఇలా అన్నాడు: “మనం దేవుణ్ణి చూశాము. అందువల్ల తప్పకుండా మనం మరణిస్తాము!”
23 కాని అతని భార్య అతనితో, “మనల్ని చంపాలని దేవుడు భావించడం లేదు. యెహోవా కనుక మనల్ని చంపదలచుకుంటే, మనం సమర్పించిన వండిన వస్తువుని, ధాన్యాన్ని ఆయన స్వీకరించి ఉండడు. మనకీ విషయాలను ఆయన చూపివుండడు. పైగా వీటిని మనకు చెప్పి ఉండడు.” అని చెప్పింది.
24 తరువాత ఆ స్త్రీకి బాలుడు జన్మించాడు. అతనికి సమ్సోను అని పేరు పెట్టింది. సమ్సోను పెరిగాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు. 25 యెహోవా ఆత్మ సమ్సోనులో పనిచేయనారంభించింది. అతనప్పుడు మహెనుదాను నగరంలో ఉన్నాడు. ఆ నగరం జోర్యా, ఎష్తాయోలుకు మధ్య ఉంది.
సమ్సోను వివాహం
14 సమ్సోను తిమ్నాతు నగరానికి వెళ్లాడు. అక్కడ ఒక ఫిలిష్తీయుల యువతిని అతను చూశాడు. 2 అతను ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులతో ఇలా అన్నాడు: “తిమ్నాతులో నేనొక ఫిలిష్తీయుల స్త్రీని చూశాను. మీరామెను తీసుకు రావాలి అని నా కోరిక. నేనామెను పెళ్లి చేసుకుంటాను.”
3 అతని తల్లిదండ్రులు ఇలా సమాధానం చెప్పారు: “నీవు పెళ్లి చేసుకోవటానికి! ఇశ్రాయేలు ప్రజల మధ్య తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది. కాని ఫిలిష్తీయుల మధ్యగల ఒక స్త్రీని నీవు పెళ్లి చేసుకుంటావా? ఆ ప్రజలు సున్నతి కూడా చేసుకోలేదు.”
కాని సమ్సోను ఇలా అన్నాడు: “ఆ స్త్రీని నా కోసం తీసుకురండి ఆమె నాకు కావాలి.” 4 (యెహోవా ఇది జరగాలని ఆశించినట్టు సమ్సోను తల్లిదండ్రులకు తెలియదు. ఫిలిష్తీయులకు విరుద్ధంగా ఏదో ఒకటి చేయటానికి యెహోవా ఒక అవకాశం కోసం చూడసాగాడు. ఫిలిష్తీయులు అప్పట్లో ఇశ్రాయేలు ప్రజల మీద ఆధిపత్యం చలాయించే వారు.)
5 సమ్సోను తన తల్లిదండ్రుల్ని వెంట బెట్టుకుని తిమ్నాతు నగరానికి వెళ్లాడు. నగరానికి దగ్గరగా ఉన్న ద్రాక్షతోటలదాకా వారు వెళ్లారు. అప్పుడు ఒక మదించిన సింహం ఉన్నట్టుండి గర్జించింది. అది సమ్సోను మీదికి దుమికింది. 6 అప్పుడు యెహోవా ఆత్మ సమ్సోనుని బలపరచగా, గొప్ప శక్తితో, వట్టి చేతులతోనే అతను సింహాన్ని చీల్చివేశాడు. అది అతనికి సులభంగా తోచింది. ఒక పడుచు మేకను చీల్చునంత సులభంగా తోచిందాపని. కాని అతనేమి చేశాడో, ఆ సంగతి తల్లికి గాని తండ్రికి గాని తెలుపలేదు.
7 అందువల్ల సమ్సోను నగరానికి వెళ్లి, ఆ ఫిలిష్తీయుల స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనిని సంతోషపెట్టింది. 8 చాలారోజుల తర్వాత, సమ్సోను ఫిలిష్తీయుల స్త్రీని వివాహమాడేందుకు తిరిగి వచ్చాడు. త్రోవలో చచ్చిపోయిన ఆ సింహాన్ని చూడటానికి వెళ్లాడు. మృత సింహం శరీరం మీద తేనెటీగల గుంపు చూశాడు. అవి కొంచెం తేనె తయారు చేశాయి. 9 తన చేతులతో సమ్సోను ఆ తేనెను తీసుకున్నాడు. ఆ తేనె తింటూ అతను నడిచాడు. తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఆ తేనె కొంచెం వారికి ఇచ్చాడు. వారు కూడా తిన్నారు. కాని మృత సింహం శరీరంనుంచి తాను తేనెను తెచ్చినట్లు సమ్సోను తల్లిదండ్రులకు చెప్పలేదు.
10 సమ్సోను తండ్రి ఆ ఫిలిష్తీయుల స్త్రీని చూసేందుకు వెళ్లాడు. పెళ్లికొడుకు విందు ఇవ్వడం ఆ రోజులలో ఆచారంగా ఉండేది. అందువల్ల సమ్సోను ఒక విందు ఇచ్చాడు. 11 ఫిలిష్తీయుల ప్రజలు అతను విందు యివ్వడం చూసి అతనికి తోడుగా ముప్ఫై మంది మనుషుల్ని పంపారు.
12 అప్పుడు సమ్సోను ముప్ఫై మంది మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను మీకో విప్పుడుకథను చెపుతాను. ఈ విందు ఏడు రోజులపాటు సాగుతుంది. ఈలోగా మీరు సమాధానం వెతకాలి. ఈలోగా కనుక మీరు విప్పుడుకథకు సమాధానం చెప్పగలిగితే, నేను మీకు ముప్ఫై నార వస్త్రాలు, ముప్ఫై మార్పు గుడ్డలు ఇస్తాను. 13 కానీ మీకు సమాధానం దొరక్కపోతే అప్పుడు మీరు ముప్ఫైనార వస్త్రాలు, ముప్ఫై మార్పు గుడ్డలను ఇవ్వాలి.” అప్పుడు ఆ ముప్ఫై మంది మనుష్యులు ఇలా అన్నారు. “నీ విప్పుడుకథ ఏమిటో మాకు చెప్పు. అది మేము వినదలచాము.”
14 సమ్సోను ఈ విప్పుడుకథ వాళ్లకి చెప్పాడు:
“బలమైన దానిలోనుండి తీపి వచ్చింది.
తినుదానిలో నుండి తిండి వచ్చింది.”
మూడు రోజుల పాటు ఆ ముప్ఫైమంది మనుష్యులు సమాధానం కోసం ప్రయత్నించారు. కాని కనుగొనలేకపోయారు.
15 నాలుగవ రోజున,[c] ఆ మనుష్యులు సమ్సోను భార్య వద్దకు వచ్చారు. వారన్నారు: “మమ్మల్ని పేదవారుగా చేసేందుకు ఇక్కడికి ఆహ్వానించావా? ఆ విప్పుడుకథకు సమాధానం చెప్పవలసిందిగా నీవు నీ భర్తను ప్రేరేపించాలి. మా కోసం కనుక నీవు సమాధానం రప్పించకపోతే మేము నిన్ను కాల్చివేస్తాము. అలాగే మీ తండ్రి వద్ద ఉన్న మనుష్యులందరినీ చంపివేస్తాము.”
16 అందువల్ల సమ్సోను భార్య అతనిని సమీపించి విలపించింది. ఆమె అన్నది: “నీవు నన్ను ద్వేషిస్తున్నావు. నీవు నిజంగా నన్ను ప్రేమించడంలేదు. నీవు మా మనుష్యులకో విప్పుడుకథ ఇచ్చావు. నీవు నాకైనా సమాధానం చెప్పవా?”
అప్పుడు సమ్సోను ఇలా అన్నాడు: “నేను నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు. నేను నీకు ఎందుకు చెప్పాలి?”
17 విందులోని కడమ యేడు రోజులూ సమ్సోను భార్య ఏడుస్తూ కూర్చుంది. చివరికతను సమాధానం చెప్పాడు. ఏడవ రోజున ఆ విప్పుడుకథకు సమాధానం తెలియజేశాడు. ఆమె తనను వేధించుకు తినడంవల్ల ఆమెకు సమాధానం చెప్పాడు. తర్వాత ఆమె తన మనుష్యుల వద్దకు వెళ్లి, విప్పుడుకథకు సమాధానం చెప్పింది.
18 ఏడవ రోజున సూర్యుడు అస్తమించేలోగా ఫిలిష్తీయుల మనుష్యులకు సమాధానం లభించింది. వారు సమ్సోను వద్దకు వచ్చి, ఇలా అన్నారు:
“తేనె కంటె మధురమైనదేది?
సింహంకంటె బలంకలది ఏది?”
తర్వాత సమ్సోను వాళ్లతో ఇలా అన్నాడు:
“మీరు కనుక నా ఆవుతోనే దున్నక పోతే
మీరు నా విప్పుడుకథను పరిష్కరించి ఉండలేరు.”
19 సమ్సోను ఉగ్రుడయ్యాడు. యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనుని నింపింది. అతను అష్కెలోను నగరానికి వెళ్లాడు. ఆ నగరంలో అతను ముప్ఫైమంది ఫిలిష్తీయులను చంపివేశాడు. తర్వాత వారి మృత శరీరాల మీది నుంచి అన్ని వస్త్రాలు, సొమ్ములు తీసుకున్నాడు. అతను ఆ వస్త్రాలను తిరిగి తీసుకు వచ్చి, తన విప్పుడుకథకు సమాధానం చెప్పిన ఆ ముప్ఫై మంది మనుష్యులకు ఇచ్చివేశాడు. తర్వాత అతను తన తండ్రి ఇంటికి వెళ్లాడు. 20 సమ్సోను తన భార్యను తీసుకుపోలేదు. ఆమె తండ్రి ఇష్టము చొప్పున అటు తరువాత ఆమెను సమ్సోను ప్రాణ స్నేహితుడు ఒకడు భార్యగా అంగీకరించెను.
సమ్సోను ఫిలిష్తీయులకు కష్టాలు కలిగించుట
15 గోధుమ పంట కోతల సమయంలో, సమ్సోను తన భార్యను చూడటానికి వెళ్లాడు. ఆమెకు కానుకగా ఒక పిల్ల మేకను తీసుకు వెళ్లాడు. అతను ఇలా అన్నాడు: “నేను నా భార్య గదికి వెళ్తున్నాను.”
2 కాని ఆమె తండ్రి సమ్సోనుని లోపలికి వెళ్లనీయలేదు. ఆమె తండ్రి సమ్సోనుతో ఇలా అన్నాడు; “ఆమెను నీవు ద్వేషించినట్లు భావించాను. అందువల్లనే వివాహమునకు వచ్చిన తోడి పెండ్లి కుమారుడ్ని వివాహము చేసుకోమన్నాను. ఆమె చిన్న చెల్లెలు చాలా సౌందర్యవతి. ఆ చిన్న చెల్లెలిని తీసుకువెళ్లు”
3 కాని సమ్సోను అతనితో ఇలా అన్నాడు; “మీ ఫిలిష్తీయులను బాధించేందుకు తగిన కారణం ఇప్పుడు నాకు కనిపించింది. ఇప్పుడు నన్నెవ్వరూ నిందించరు.”
4 అందువల్ల సమ్సోను బయటికి వెళ్లి మూడు వందల నక్కల్ని పట్టుకున్నాడు. ఒకేసారి రెండేసి నక్కల్ని తీసుకుని వాటి తోకల్ని జతలు జతలుగా కట్టివేశాడు. ప్రతి రెండు నక్కల తోకలకు మధ్య ఒక దివిటీ కట్టి వేశాడు. 5 తరువాత నక్కల తోకల మధ్య ఉన్న దివిటీలు వెలిగించాడు. ఆ తర్వాత ఫిలిష్తీయుల ధాన్యపు రాసుల గుండా నక్కల్ని పరుగెత్తనిచ్చాడు. ఆ విధంగా, అతను వారి పొలాలలో పెరిగిన మొక్కల్నీ, కోసిపెట్టిన ధాన్యపు రాసుల్నీ కాల్చివేశాడు. అతను వాళ్ల ద్రాక్ష తోటల్ని, వాళ్ల ఒలీవ చెట్లని కూడా కాల్చివేశాడు.
6 “ఈ పని ఎవరు చేశారు?” అని ఫిలిష్తీయులు అడిగారు.
ఎవరో ఇలా చెప్పారు: “తిమ్నాతుకు చెందిన ఆ మనిషియొక్క అల్లుడైన సమ్సోను ఈ పనిచేశాడు. అతను ఈ విధంగా ఎందుకు చేశాడంటే, అతని మామగారు సమ్సోను భార్యని పెళ్లిలోని అతని స్నేహితునికి ఇచ్చివేశాడు.” అందువల్ల సమ్సోను భార్యనీ, ఆమె తండ్రినీ ఫిలిష్తీయులు కాల్చి వేశారు.
7 అప్పుడు ఫిలిష్తీయులను ఉద్దేశించి సమ్సోను ఇలా అన్నాడు; “మీరు నాకు ఈ విధంగా కీడు చేశారు. అందువల్ల మీకు ఇప్పుడు నేను కీడు చేస్తాను. అప్పుడు నేను మీమీద పగతీర్చుకోవడం మానేస్తాను.”
8 తర్వాత సమ్సోను ఫిలిష్తీయుల మీద దాడిచేశాడు. చాలా మందిని చంపివేశాడు. తర్వాత అతను వెళ్లి ఒక గుహలో నివసించెను. ఏతాము బండ అనే ప్రదేశంలో ఆ గుహ ఉన్నది.
9 అప్పుడు ఫిలిష్తీయులు యూదా ప్రాంతానికి తరలిపోయారు. లేహీ అనే చోట వారు నిలిచారు. వారి సైనికులు అక్కడ విడిదిచేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. 10 యూదా వంశానికి చెందిన మనుష్యులు వారిని ఇలా ప్రశ్నించారు: “ఫిలిష్తీయులైన మీరు మాతో యుద్ధం చేసేందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు?”
అందుకు వారు ఇలా అన్నారు: “మేము సమ్సోనును పట్టుకోడానికి వచ్చాము. అతనిని మేము మా బందీగా చేసుకోవడానికి వచ్చాము. అతను మా ప్రజలకి చేసిన పనులకు బదులుగా అతనిని శిక్షిస్తాము.”
11 అప్పుడు యూదా వంశస్థులైన మూడువేల మంది మనుష్యులు సమ్సోనును పట్టుకొనుటకు ఏతాము బండకి దగ్గరగా వున్న ఆ గుహ వద్దకు వెళ్లి. అతనితో ఇలా అన్నారు: “నీవు మాకేమి చేశావు? ఫిలిష్తీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారని నీకు తెలియదా?”
“వారు నాకు చేసిన కీడుకు బదులుగా వారిని నేను శిక్షించాను.” అని సమ్సోను సమాధానం చెప్పాడు.
12 అప్పుడు వారు సమ్సోనుతో ఇలా అన్నారు: “మేము నిన్ను బంధించడానికి వచ్చాము. మేము నిన్ను ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము.”
యూదా నుండి వచ్చిన మనుష్యులతో సమ్సోను ఇలా అన్నాడు: “మీరు నాకు ఏమీ అపకారం చేయమని నాకు మాట ఇవ్వాలి.”
13 యూదా నుండి వచ్చిన మనుష్యులు ఇలా అన్నారు: “అందుకు మేము సమ్మతిస్తున్నాము. మేము నిన్ను బంధించి, ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము. మేము నిన్ను చంపమని మాట ఇస్తున్నాము.” అప్పుడు వారు రెండు కొత్త తాళ్లతో సమ్సోనును బంధించారు. ఆ ప్రాంతంలోని గుహనుంచి అతనిని తీసుకువెళ్లారు.
14 లేహీ అనే చోటికి సమ్సోను రాగానే, ఫిలిష్తీయులు అతనిని కలుసుకోడానికి అక్కడికి వచ్చారు. సంతోషంతో వారు కేకలు వేశారు. అప్పుడు యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనును నింపగా, సమ్సోను తాళ్లు తెంపుకున్నాడు. కాలిపోయిన దారంవలె ఆ తాళ్లు బలహీనముగా కనిపించాయి. కరిగిపోయినట్లుగా ఆ తాళ్లు సడలిపోయాయి. 15 సమ్సోను చచ్చిపోయిన ఒక గాడిద దవడ ఎముకను చూశాడు. అతను ఆ దవడ ఎముకను తీసుకున్నాడు. దానితో వేయి మంది ఫిలిష్తీయుల్ని చంపివేశాడు.
16 తర్వాత సమ్సోను అన్నాడు:
“గాడిద దవడ ఎముకతో
వెయ్యి మందిని చంపాను!
గాడిద దవడ ఎముకతో
వారిని ఎత్తైన కుప్పగా పేర్చాను!”
17 సమ్సోను ఈలాగు చెప్పిన తర్వాత, ఆ దవడ ఎముకను అతడు క్రిందికి విసరివేశాడు. అందువల్ల ఆ ప్రదేశానికి రామత్లేహీ[d] అనే పేరు వచ్చింది.
18 సమ్సోనుకు బాగా దాహం వేసింది. అందువల్ల అతను యెహోవాను ఉద్దేశించి కేకపెట్టాడు. అతను అన్నాడు: “నేను నీ భక్తుడను. నీవు నాకు మహా విజయం సమకూర్చావు. ఇప్పుడు దప్పిక బాధతో నన్ను మరణం పాలుచేయవద్దు. సున్నతి కూడా చేసుకోని మనుష్యులకు నన్ను పట్టుబడకుండా చెయ్యి”
19 లేహీలోని నేలలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం బద్దలయ్యేలా దేవుడు చేసెను. నీళ్లు వెలికి వచ్చాయి. ఆ నీటిని సమ్సోను తాగి, హాయిపొందాడు. అతను మళ్లీ బలవంతుడయ్యాడు. అందువల్ల అతను ఆ నీటి బుగ్గకి ఎన్ హకోరె[e] అని పేరు పెట్టాడు. నేటికీ లేహీ నగరంలో అది ఉంది.
20 ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాలపాటు వ్యవహరించాడు. ఇది ఫిలిష్తీయులు నివసించిన కాలంలో జరిగింది.
© 1997 Bible League International