Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:49-72

జాయిన్

49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
    ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
    నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
    కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
    నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
    నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
    నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
    కనుక నాకు ఈలాగు జరుగుతుంది.

హేత్

57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
    నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
    మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
    అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
    అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
    నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.

తేత్

65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
    నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
    నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
    కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
    కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
    నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
    నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
    వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.

కీర్తనలు. 49

సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.

49 సర్వ దేశములారా, ఇది వినండి.
    భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
    ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
    నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
సామెతపైనా ఆసక్తినుంచుతాను.
    ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.

అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
    నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
    తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
    నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
    సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
    కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
    మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
    మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
    వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
    వారు జంతువుల్లా మరణిస్తారు.
13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది
    అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి.
    మరణం వారి కాపరి.
    వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.

15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు.
    సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు.
    వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడేమీ తీసుకొనిపోడు.
    వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు.
    ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు.
    అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు.
20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు.

కీర్తనలు. 53

సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.

53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
    అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
    సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
    దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
    కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
    ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
    ఒక్కడూ లేడు.

దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
    కాని వారు నన్ను ప్రార్థించరు.
    ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”

కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
    భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
    కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.

ఇశ్రాయేలు ప్రజలారా,
    సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
    యాకోబు సంతోషిస్తాడు.
    ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.

జెకర్యా 3

ప్రధాన యాజకుడు

పిమ్మట దేవదూత ప్రధాన యాజకుడైన యెహోషువను నాకు చూపించాడు. యెహోవా దూత ముందు యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోషువకు కుడి పక్కగా సాతాను నిలబడి ఉన్నాడు. యెహోషు మీద చెడు పనులు చేసినట్లు నింద మోపటానికి సాతాను అక్కడ ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత ఇలా చెప్పాడు: “సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక! నీవు అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూషలేమును యెహోవా తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది నిప్పులోనుండి లాగిన మండే కట్టెలా ఉంది.”

యెహోషువ దేవదూత ముందు నిలుచున్నాడు. యెహోషువ ఒక మురికి వస్త్రం ధరించివున్నాడు. అప్పుడు దేవదూత తనవద్ద నిలబడిన ఇతర దేవ దూతలతో, “యెహోషువ వేసుకున్న మురికి వస్త్రాలను తీసివేయండి” అని చెప్పాడు. పిమ్మట దేవదూత యెహోషువతో మాట్లాడాడు. అతడు ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ నేరాన్ని నేను తీసివేశాను. నీకు నూతన వస్త్రాలను ఇస్తున్నాను.”

అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచు” అని అన్నాను. కావున ఒక శుభ్రమైన తల పాగాను వారతని తలపై పెట్టారు. యెహోవా దూత అక్కడ నిలబడి వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు తొడిగారు. పిమ్మట యెహోషువకు యెహోవా దేవదూత ఈ విషయాలు చెప్పాడు:

సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
“నేను చెప్పిన విధంగా జీవించు.
    నేను చెప్పినవన్నీ చెయ్యి.
నీవు నా ఆలయానికి అధికారివిగా ఉంటావు.
    నీవు దాని ఆవరణ విషయం శ్రద్ధ తీసుకుంటావు.
ఇక్కడ నిలబడిన దేవదూతలవలె
    నీవు నా ఆలయంలో ఎక్కడికైనా వెళ్లటానికి నీకు స్వేచ్ఛ ఉంది.
కావున యెహోషువా, నీవూ, నీతో ఉన్న ప్రజలూ నేను చెప్పేది తప్పక వినాలి.
    నీవు ప్రధాన యాజకుడవు. నీతో ఉన్న జనులు నిజంగా అద్భుతాలు నెరవేర్చగలరు.
నేను నిజంగా నా ప్రత్యేక సేవకుని తీసుకువస్తాను.
    అతడు ‘కొమ్మ’ (చిగురు) అని పిలువబడతాడు.
చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను.
    ఆ రాతికి ఏడు పక్కలు (కండ్లు) ఉన్నాయి.
ఆ రాతి మీద నేనొక ప్రత్యేక వర్తమానం చెక్కుతాను.
    నేను ఒక్క రోజులో ఈ దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ జేస్తుంది.”

10 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు:
“ఆ సమయంలో ప్రజలు తమ స్నేహితులతోను,
    పొరుగువారితోను కూర్చొని మాట్లాడుకుంటారు.
ప్రతి ఒక్కడూ తన అంజూరపు చెట్టు క్రింద,
    తన ద్రాక్షాలత క్రింద ప్రశాంతంగా కూర్చుంటాడు.”

ప్రకటన 4:1-8

యోహాను పరలోకాన్ని చూడటం

ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది. నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంతమణివలె, పద్మరాగమువలె వున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది.

దాని చుట్టూ యిరవై నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరవై నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. సింహాసనం నుండి మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని ఏడు ఆత్మలు. గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది.

సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుక నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుక కళ్ళతో కప్పబడి ఉన్నాయి. మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి.[a] ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక:

“భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును
    ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు”

అని పాడుతూ ఉన్నాయి.

మత్తయి 24:45-51

మంచి దాసుడు, చెడ్డ దాసుడు

(లూకా 12:41-48)

45 “విశ్వాసము, తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహరణగా తీసుకోండి. అతని యజమాని అతణ్ణి తన యింట్లో పనిచేసే వాళ్ళకు సరియైన సమయంలో భోజనం పెట్టడానికి నియమించాడు. 46 యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్లు చేస్తూవుంటే ధన్యుడు. 47 నేను మీకు నిజం చెబుతున్నాను: యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు.

48 “ఒక వేళ ఆ సేవకుడు దుర్మార్గుడైతే తనలో తాను ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని 49 తన తోటి పని వాళ్ళను కొట్టడం మొదలు పెడ్తాడు. అంతేకాక త్రాగుబోతులతో కలసి తిని, త్రాగుతాడు. 50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, 51 అతణ్ణి చంపించి పాపులతో సహా నరకంలో పడవేస్తాడు. ఆ నరకంలో వాళ్ళంతా ఏడుస్తూ పండ్లు కొరుకుతూ బాధననుభవిస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International