Book of Common Prayer
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
31 యెహోవా, నీవే నా కాపుదల.
నన్ను నిరాశపరచవద్దు.
నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
2 దేవా, నా మాట ఆలకించుము.
వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
3 దేవా, నీవే నా బండవు, కోటవు
కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
నన్ను రక్షించుము.
6 వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం.
యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.
7 దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది.
నా కష్టాలు నీవు చూశావు.
నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు.
8 నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు.
వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.
9 యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉంచుము.
నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి.
నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది.
నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి.
నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నాయి.
నా బలం తొలగిపోతూ ఉంది.[a]
11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు.
నా పొరుగు వాళ్లంతా కూడా నన్ను ద్వేషిస్తారు.
నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు.
వారు నానుండి దూరంగా ఉంటారు.
12 నేను పాడైపోయిన పనిముట్టులా ఉన్నాను.
నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను.
ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.
14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
నీవే నా దేవుడవు.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.
17 యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను.
కనుక నేను నిరాశచెందను.
చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు,
మౌనంగా వారు సమాధికి వెళ్తారు.
18 ఆ చెడ్డవాళ్లు గర్వించి,
మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబుతారు.
ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు.
కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.
19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.
నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.
ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు.
కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.
ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.
కాని దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.
23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.
యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు.
కాని తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.
దావీదు కీర్తన.
35 యెహోవా, నా పోరాటాలు పోరాడుము
నా యుద్ధాలు పోరాడుము.
2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని,
లేచి, నాకు సహాయం చేయుము.
3 ఈటె, బరిసె తీసుకొని
నన్ను తరుముతున్న వారితో పోరాడుము.
“నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,
4 కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు.
ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము.
వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు.
వారిని ఇబ్బంది పెట్టుము.
5 ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము.
యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము.
యెహోవా దూత వారిని తరుమును గాక!
7 నేనేమీ తప్పు చేయలేదు. కాని ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు.
నేను తప్పు ఏమీ చేయలేదు. కాని వారు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు.
8 కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము.
వారి స్వంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము.
తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
9 అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను.
ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు.
యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు.
దోచుకొనువారినుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు”
అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబుతాను.
11 ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది.
ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు.
12 నేను మంచి పనులు మాత్రమే చేశాను.
కాని ఆ మనుష్యులు నాకు చెడ్డవాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.
13 ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను.
ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను.
నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది.
14 ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను.
ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
15 అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు.
ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు.
కొందరు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు.
వాళ్లను నేను కనీసం ఎరుగను.
16 వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు.
ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.
17 నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు?
ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము.
ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.
18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
19 అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు.
నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.
20 నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు.
శాంతియుతంగా ఉన్న ప్రజలకు చెడుపు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబుతున్నారు.
వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీవేమి చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
22 యెహోవా, జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు.
కనుక మౌనంగా ఉండవద్దు.
నన్ను విడిచిపెట్ట వద్దు.
23 యెహోవా, మేలుకో! లెమ్ము!
నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము.
24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము.
ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వనీయ వద్దు.
25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము.
“యెహోవా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము.
26 నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము.
నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు.
తాము నాకంటె మేలైనవారము అని వారు తలంచారు.
కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను, సిగ్గుతోను నింపి వేయుము.
27 నీతిని ప్రేమించే మనుష్యులారా,
మీరు సంతోషించండి.
ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.”
28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబుతాను.
నేను ప్రతి దినము స్తుతిస్తాను.
ఇది ఆలయ నిర్మాణానికి సమయం
1 దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదా పాలనాధికారియైన జెరుబ్బాబెలుకు, మరియు ప్రధాన యాజకుడైన యెహోషువకు వినవచ్చింది. (జెరుబ్బాబెలు తండ్రి పేరు షయల్తీయేలు. యెహోషువ తండ్రి పేరు యెహోజాదాకు). ఈ వాక్కు రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి రోజున వచ్చింది. ఈ సందేశమేమంటే, 2 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “దేవుడైన యెహోవా ఆలయ నిర్మాణానికి తగిన సమయం రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.”
3 పిమ్మట దేపుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా వచ్చి ఇలా చెప్పింది: 4 “మీరు నగిషీ పనులు చేయబడ్డ చెక్క పలకలు గోడలకు అమర్చబడి అందంగా ఉన్న ఇండ్లలో నివసిస్తున్నారు. కాని యెహోవా ఇల్లు ఇంకా శిథిలావస్థలోనే ఉంది. 5 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘మీ ప్రవర్తన విషయం మీరు ఆలోచించండి! 6 నీవు నాటింది ఎక్కువ. కాని నీవు కోసేది తక్కువ. నీవు భోజనం తింటావు. అయినా నీ కడుపు నిండదు. నీవు నీరు తాగుతావు. అయినా నీ దాహం తీరదు. నీవు బట్టలు ధరిస్తావు. కాని నీకు వెచ్చగా ఉండదు. ధన సంపాదకుడు చిల్లులు ఉన్న సంచిలో డబ్బును వేయటానికే సంపాదిస్తాడు!’”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: “మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి! 8 మీరు పర్వతాలకు వెళ్లండి. కలప తెచ్చి ఆలయ నిర్మాణం చేయండి. అప్పుడు ఆలయం విషయంలో నేను సంతోషపడతాను. అది నాకు గౌరవప్రదం.” దేవుడైన యెహోవా ఇది చెప్పాడు.
9 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “మీరు ఎంతో పెద్ద పంటకొరకు ఎదురుచూస్తారు. కానీ మీకు లభించే ధాన్యం కొంతమాత్రమే. దానిని మీరు ఇంటికి తెచ్చినప్పుడు, నేను గాలిని పంపించి ఎగురగొడతాను. ఎందుకని ఈ సంగతులు జరుగుతున్నాయి? ఎందుకనగా నా ఇల్లు ఇంకా శిథిలావస్థలో ఉంది. కాని మీలో ప్రతి ఒక్కడూ తన ఇంటిని భద్రపరచుకోవడానికి పరుగు పెడతాడు. 10 ఈ కారణంవల్ల ఆకాశం మంచును పడనీయదు. మరియు భూమి పంటలను పండనీయదు.”
11 ప్రభువిలా చెపుతున్నాడు, “నేను భూమిని, పర్వతాలను ఎండి పోవాలని ఆజ్ఞ ఇచ్చాను. భూమి పండించే ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, ఒలీవ నూనె అన్నీ పాడై పోతాయి. మరియు మనుష్యులందరూ, జంతువులన్నీ బలహీనమౌతాయి.”
క్రొత్త ఆలయం పని ప్రారంభమవటం
12 పిమ్మట షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, మరియు యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువయు, మిగిలియున్న ప్రజలును తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తమకు తెలియజేసిన మాటలను విని, దేవుడైన యెహోవాపట్ల భయభక్తులను చూపారు.
13 దేవుడైన యెహోవా తన వార్తాహరుడైన హగ్గయికి ఒక వర్తమానం పంపాడు. ఈ వర్తమానం ప్రజలకొరకు ఉద్దేశించబడింది. ఆ వర్తమానం ఇలా ఉంది: దేవుడైన యెహోవా “నేను మీతో ఉన్నాను!” అని ప్రకటిస్తున్నాడు.
14 పిమ్మట యూదా దేశపు పాలనాధికారియు, షయల్తీయేలు కుమారుడును అయిన జెరుబ్బాబెలును దేవుడగు యెహోవా ప్రేరేపించాడు. దేవుడైన యెహోవా యెహోజాదా కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువాను కూడా ప్రేరేపించాడు. మరియు దేవుడైన యెహోవా మిగిలివున్న జనులందరినీ ప్రేరేపించాడు. అప్పుడు వారంతా వచ్చి తమ దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు. 15 వారు ఈ పనిని, రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఆరవ నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు.
తుయతైరలోని సంఘానికి
18 “తుయతైరలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“అగ్ని జ్వాలల్లా మండుతున్న కళ్ళు కలవాడు, కొలిమిలో కాల్చి మెరుగు పెట్టబడిన యిత్తడిలా పాదాలు కలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.
19 “నీవు చేస్తున్న పనులు, నీ ప్రేమ, విశ్వాసము, సేవ, పట్టుదల నాకు తెలుసు. నీవు మొదట చేసినదానికన్నా, యిప్పుడు ఎక్కువ చేస్తున్నావని నాకు తెలుసు. 20 తానొక ప్రవక్తనని చెప్పుకొంటున్న యెజెబెలు చేస్తున్న పనుల్ని నీవు సహిస్తున్నావు. ఇది నాకు యిష్టం లేదు. ఆ స్త్రీ తన బోధలతో నా సేవకులను తప్పు దారి పట్టిస్తోంది. దాని కారణంగా వాళ్ళు నీతి లేని కామ కృత్యాలు చేస్తున్నారు. విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ఆహారం తింటున్నారు.[a] 21 అది చేసిన అవినీతికి మారుమనస్సు పొందమని నేను దానికి కొంత గడువునిచ్చాను. కాని అది దానికి అంగీకరించలేదు.
22 “అందువల్ల దానికి కష్టాలు కలిగిస్తాను. అవినీతిగా దానితో కామకృత్యాలు చేసినవాళ్ళు తమ పాపానికి మారుమనస్సు పొందకపోతే, వాళ్ళను తీవ్రంగా శిక్షిస్తాను. 23 దాని బిడ్డల్ని చంపివేస్తాను. అప్పుడు హృదయాల్ని, బుద్ధుల్ని శోధించేవాణ్ణి నేనేనని అన్ని సంఘాలు తెలుసుకొంటాయి. చేసిన కార్యాలను బట్టి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం యిస్తాను.
24 “తుయతైరలో ఉన్న మిగతా ప్రజలకు, అంటే, దాని బోధల్ని ఆచరించని వాళ్ళకు, మరియు సాతాను రహస్యాలను అభ్యసించని వాళ్ళకు నేను చెప్పేదేమిటంటే, నేను మీ మీద మరే భారము వెయ్యను. 25 నేను వచ్చేదాకా మీరు అనుసరిస్తున్న వాటినే అనుసరిస్తూ ఉండండి.
26 “విజయాన్ని సాధించి నా ఇచ్ఛానుసారం చివరిదాకా ఉన్నవానికి నేను జనములపై అధికారం యిస్తాను. 27 అతడు వాళ్ళను కఠిన శాసనాలతో పాలిస్తాడు. వాళ్ళను కుండల్ని పగులకొట్టినట్లు పగులగొడ్తాడు.[b]
28 “ఈ అధికారం నేను నా తండ్రినుండి పొందాను. అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. నేను అతనికి వేకువచుక్కను కూడా యిస్తాను. 29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.
27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.
29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!
33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.
35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.
యెరూషలేము విషయంలో దుఃఖించటం
(లూకా 13:34-35)
37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. 38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. 39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”
© 1997 Bible League International