Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 72

సొలొమోను కీర్తన.

72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
    రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
    నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
    నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
    ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
    ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
    నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
    చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు
    అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము
    అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
    షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
    రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
    మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
    రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
    ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
15 రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక.
    షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక.
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.
    ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక.
    కొండలు పంటలతో నిండిపోవునుగాక.
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక.
    పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక.
    సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక.
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక.
    మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.

18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
    అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
    ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!

20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.

కీర్తనలు. 119:73-96

యోద్

73 యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు.
    నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
74 యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు.
    నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం.
75 యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు.
    నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే.
76 ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము.
77 యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బ్రతుకనిమ్ము.
    నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను.
78 నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు.
    యెహోవా, నేను నీ ఆజ్ఞలను అధ్యయనం చేస్తాను.
79 నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
    నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
80 యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము.
    అందుచేత నేను అవమానించబడను.

కఫ్

81 నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను.
    కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను.
82 నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి.
    యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు?
83 నేను చెత్తకుప్పలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా
    నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు.
84 నేను ఎంత కాలం జీవిస్తాను?
    యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు?
85 కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు.
    మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం.
86 యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు.
    అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము!
87 ఆ అబద్ధికులు నన్ను దాదాపుగా నాశనం చేశారు.
    నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు.
88 యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము.
    నీవు చెప్పే వాటిని నేను చేస్తాను.

లామెద్

89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు.
    యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి.
    యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే,
    నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది.
93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి
    కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము.
    ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు.
    అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
96 నీ ధర్మశాస్త్రానికి తప్ప
    ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.

నెహెమ్యా 13:4-22

4-5 అయితే, ఇది జరిగేందుకు ముందు, ఎల్వాషీబు టొబీయాకి ఆలయంలో ఒక గది ఇచ్చాడు ఎల్వాషీబు దేవుని ఆలయంలో వస్తువులను భద్రపరచే గదులకు బాధ్యుడైన యాజకుడు. ఎల్యాషీబు టోబీయాకి సన్నిహిత మిత్రుడు. ఆ గది ధాన్యార్పణలు ధూప సామగ్రి, ఆలయానికి చెందిన గిన్నెలు, వస్తువులు దాచేందుకు ఉద్దేశింపబడింది. లేవీయులు, గాయకులు ద్వారపాలకుల కోసం పంట ధాన్యాల్లో పదోవంతు కొత్త ద్రాక్షారసం, నూనె కూడా ఆ గదిలోనే ఉంచారు. యాజకులకు వచ్చిన కానుకలను కూడా ఆ గదిలోనే ఉంచారు. కాని, ఎల్యాషీబు ఆ గదిని టోబీయాకి ఇచ్చాడు.

ఇదంతా జరుగుతున్నప్పుడు నేను యెరూషలేములో లేను. నేను బబులోనుకి రాజును కలిసేందుకు వెళ్లాను. అర్తహషస్త బబులోను రాజుగావున్న 32వ ఏట నేను బబులోనుకి వెళ్లాను. తర్వాత, నేనా రాజును యెరూషలేముకి తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాను. అలా నేను యెరూషలేముకి తిరిగి వచ్చాను. యెరూషలేములో ఎల్యాషీబు చేసిన విచారకరమైన విషయం నేను విన్నాను. ఎల్యాషీబు టోబీయాకి మన దేవుని ఆలయంలో ఒక గది యిచ్చాడు! ఎల్యాషీబు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. కనుక నేను టోబీయా వస్తువులన్నీ గది బయటికి విసిరేశాను. ఆ గదులను స్వచ్ఛంగా, పరిశుభ్రం చేయాలని ఆజ్ఞనిచ్చాను. తర్వాత నేను గిన్నెలను, వస్తుపులను, ధాన్యాం కానుకలను, ధూప సామగ్రిని తిరిగి ఆ గదుల్లో పెట్టించాను.

10 లేవీయులకి వాళ్ల వంతులను జనం ఇవ్వలేదని కూడా నేను విన్నాను. దానితో లేవీయులూ, గాయకులూ తమ స్వంత పొలాల్లో పని చేసుకునేందుకు తిరిగి వెళ్లిపోయారు. 11 అందుకని, నేనా అధికారులకు వాళ్లు చేసింది తప్పని చెప్పాను. “మీరు దేవుని ఆలయం విషయంలో తగిన శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు?” అని నేను వాళ్లని నిలదీశాను. తర్వాత, లేవీయులందర్నీ నేను సమావేశపరచాను. నేను వాళ్లకి తమ తమ స్థానాలకి, ఆలయంలో కొలువులకి తిరిగి రమ్మని చెప్పాను. 12 తర్వాత, యూదాలోని వాళ్లందరూ ఆలయంలో తమ ధాన్యంలో పదోవంతును, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెని సమర్పించారు. ఆ వస్తువులు వస్తువులను భద్రపరచు గదుల్లో ఉంచబడ్డాయి.

13 ఆ గిడ్డంగులకి నేనీ క్రింది వారిని భద్రపరచు వారుగా నియమించాను: యాజకుడు షెలెమ్యా, ఉపదేశకుడు సాదోకు, లేవీయుడు పెదయా. వారికి సహాయకుడుగా హానానును నియమించాను. హానాను జక్కూరు కొడుకు, మత్తన్యా మనుమడు. వీళ్లు విశ్వాసపాత్రులన్న విషయం నాకు తెలుసు. వాళ్లు తమ బంధువులకు ఆయా వస్తువులు అందచేసే విషయంలో బాధ్యులు.

14 దేవా, నేను చేసిన ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుపెట్టుకో, నా దేవుని ఆలయ నిర్మాణంకోసం, దాని కొలువులకోసం నేను చిత్తశుద్ధితో నమ్మకంగా చేసినవన్నీ గుర్తంచుకో దేవా.

15 ఆ రోజుల్లో యూదాలో జనం సబ్బాతు (విశ్రాంతి) నాడు కూడా పనిచేయడం నేను గమనించాను. జనం ద్రాక్షాపళ్లు తొక్కి రసం తీయడం చూశాను. జనం ధాన్యం తీసుకురావడం, దాన్ని గాడిదలమీద మోపడం చూశాను. నగరంలో జనం ద్రాక్షాను, అంజూరపళ్లను, రకరకాల వస్తువులను తీసుకు రావడం చూశాను. వాళ్లు సబ్బాతు (విశ్రాంతి) రోజున ఈ వస్తుపులన్నింటినీ యెరూషలేముకి తెస్తున్నారు. అందుకని, నేను వాళ్లకి ఈ విషయంలో హెచ్చరిక చేశాను. నేను వాళ్లకి సబ్బాతు రోజున ఆహారం అమ్మకూడదని చెప్పాను.

16 తూరు నగరానికి చెందిన కొందరు యెరూషలేములో వున్నారు. వాళ్లు చేపలను, రకరకాల వస్తువులను యెరూషలేములోకి తెచ్చి, సబ్బాతు రోజున అమ్ముతున్నారు. యూదులు ఆ వస్తువులను కొంటున్నారు. 17 యూదాలోని ముఖ్యులకు వాళ్లు చేస్తున్నది పొరపాటని చెప్పాను. నేనా ముఖ్యులకి ఇలా చెప్పాను: “మీరు చాలా చెడ్డపని చేస్తున్నారు. మీరు సబ్బాతును నాశనం చేస్తున్నారు. మీరు సబ్బాతును అన్ని ఇతర రోజుల మాదిరిగా మారుస్తున్నారు. 18 మీ పూర్వీకులు కూడా సరిగ్గా ఈ పనులే చేశారన్న విషయం మీకు తెలుసు. అందుకే యెహోవా మనకీ, ఈ నగరానికీ, ఈ ఇబ్బందులూ, విపత్తులూ తెచ్చాడు. మీరు సరిగ్గా అవే పనులు చేస్తున్నారు. అందుకని, ఇలాంటి చెడుగులే ఇశ్రాయేలుకి మరిన్ని దాపురిస్తాయి. ఎందుకంటే, సబ్బాతు రోజు ముఖ్యమైనది కాదన్నట్లు దాన్ని మీరు నాశనం చేస్తున్నారు.”

19 అందుకని, నేనేమి చేశానంటే: ప్రతి శుక్రవారము సాయంత్రము (విశ్రాంతి దినానికి ముందు) చీకటి పడేందుకు సరిగ్గా ముందు, యెరూషలేము ద్వారాలను మూసేసి, తాళాలు బిగించమని ద్వార పాలకులను నేను ఆదేశీంచాను. ఆ తలుపులను సబ్బాతు రోజు ముగిసేదాకా తియ్యరాదు. ద్వారాల దగ్గర నా స్వంత మనుషుల్లో కొందర్ని పెట్టాను. సబ్బాతు రోజున యెరూషలేము నగరంలోకి ఎట్టి పరిస్థితిల్లోనూ ఎలాంటి సరుకుల మూటలూ రాకుండా చూడమని నేను వాళ్లని కట్టడిచేశాను.

20 ఒకటి రెండు సార్లు వ్యాపారస్తులూ, చిల్లర వర్తకులూ రాత్రి పూట యెరూషలేము ప్రాకారం వెలుపల గడపవలసివచ్చింది. 21 అయితే, నేనా వ్యాపారస్తుల్నీ చిల్లర వర్తకుల్నీ, “రాత్రిపూట ద్వారం ముందర గడపవద్దు. మీరు మరోసారి అలా చేస్తే మిమ్మల్ని పట్టుకొంటాను” అని హెచ్చరించాను. దానితో, అప్పట్నుంచి వాళ్లు తమ సరుకులు అమ్ముకునేందుకు సబ్బాతు రోజున మళ్లీరాలేదు.

22 తర్వాత తమని తాము పరిశుద్ధుల్నీ చేసుకోమని నేను లేవీయుల్ని ఆదేశించాను. వాళ్లలా చెశాక, వాళ్లు పోయి, ద్వారాలను కావలి కాయాలి. సబ్బాతు రోజును ఒక పవిత్ర దినంగా వుంచేందుకు గాను ఇవన్నీ చేశాను. ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో దేవా.

నామీద దయవుంచి, ఘనమైన నీ ప్రేమా, దయ నామీద ప్రసరింపచెయ్యి.

ప్రకటన 12:1-12

స్త్రీ, ఘటసర్పం

12 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది.

అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది.

ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళబడ్డాడు. ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు.

పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది. ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.

10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. 11 గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు. 12 కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో ఉన్నవారలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో సాతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సాతానుకు తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు.”

మత్తయి 13:53-58

యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం

(మార్కు 6:1-6; లూకా 4:16-30)

53 యేసు ఈ ఉపమానాలన్నిటిని చెప్పటం ముగించాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు. 54 వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు ఎక్కడ నుండి లభించాయి? 55 ఈయన వడ్రంగి కుమారుడే కదూ! ఈయన తల్లి పేరు మరియ కదూ! ఇతని సోదరులు యాకోబు, యోసేవు, సీమోను, యూదా కదూ! 56 ఇతని అక్క చెల్లెండ్రందరూ మన గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ! మరి ఈయనకు యివన్నీ ఎక్కడనుండి లభించాయి?” అని అన్నారు. 57 ఆయనపై వాళ్ళకు కోపం వచ్చింది.

యేసు వాళ్ళతో, “స్వగ్రామం వాళ్ళు, యింటి వాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు” అని అన్నాడు. 58 వాళ్ళు విశ్వసించలేదు. కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International