Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 107:33-108:13

33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు.
    నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికిమాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు.
    ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు.
    ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు.
    ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు.
    వారికి మంచి పంట వచ్చింది.
38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి.
    వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు
    చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు.
    బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు.
    ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు.
    కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు.
    ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.

దావీదు స్తుతి కీర్తన

108 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి.
    నేను పాడుటకు, స్తుతి కీర్తనలు
వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
    స్వర మండలములారా, సితారలారా,
    మనం సూర్యున్ని[a] మేల్కొలుపుదాం
యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
    ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
    నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
    సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
    నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.

యెహోవా తన ఆలయము నుండి[b] మాట్లాడి యిలా చెప్పాడు,
    “యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను.
    (ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను)
    నా ప్రజలకు షెకెమును ఇస్తాను.
    వారికి సుక్కోతులోయను ఇస్తాను.
    గిలాదు, మనష్షే నావి.
    ఎఫ్రాయిము నా శిరస్త్రాణం.
    యూదా నా రాజదండం.
    మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
    ఎదోము నా చెప్పులు మోసే బానిస.
    ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”

10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
    ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
    నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
    మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
    దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.

కీర్తనలు. 33

33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
    ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
దేవుని మాట సత్యం!
    ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
    యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
    భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
    మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
    ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
    ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
    వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
    ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
    దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
    మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
    ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
    ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
    ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
    తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
    ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
    ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
    ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
    నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
    కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.

2 రాజులు 19:21-36

21 “యెహోవా సన్హెరీబును గూర్చి ఇచ్చిన సందేశము: ఈ విధంగా ఉంది:

‘సీయోను (యెరూషలేము) కుమార్తె అయిన ఆ కన్య నీవు ముఖ్యుడవుకాదని భావిస్తున్నది.
    ఆమె నిన్ను ఎగతాళి చేస్తున్నది.
    యెరూషలేము కుమార్తె నీ వెనుక తన తల ఆడిస్తున్నది.
22 కాని నువ్వెవరిని అవమానించి యెగతాళి చేసావు?
    నీవు ఎవరికి విరుద్ధంగా మాట్లాడినావు?
నీవు ఇశ్రాయేలు పవిత్రునికి ప్రతికూలుడిగా వచ్చావు
    నీవు ఆయన కంటె మంచివాడివిగా ప్రవర్తించావు.
23 నీ దూతల ద్వారా యెహోవాను అవమానించి నీవు ఇలా చెప్పావు:
    “ఉన్నత పర్వతాలకు నేను వచ్చాను నా పెక్కు రథాలతో నేను లెబానోను లోపలికి వచ్చాను
    నేను ఉన్నత దేవదారుల వృక్షాలు మరియు లెబానోనులోని ఉత్తమ సరళ వృక్షాలను చేధించాను.
    పచ్చని అడవికి నేను వెళ్లాను. అదియె లెబానోనులోని ఉన్నత భాగము.
24 నూతన ప్రదేశాలలో నేను బావులు తవ్వాను
    మంచినీళ్లు తాగితిని ఈజిప్టు నదులను ఎండించాను.”
25 ఆ దేశము మీదుగా నడిచాను అదే నీవు చెప్పింది, కాని నీవు దేవుడు చెప్పింది వినలేదా?
నేను (దేవుడు) పూర్వమే పథకము వేశాను
    ప్రాచీన కాలం నుండి పథకం వేశాను
    ఇప్పుడది జరుగునట్లు చేశాను
బలిష్ఠమైన ఆ నగరాలు నాశనము చేయుటకును
    రాతి కుప్పలుగా మార్చుటకును నిన్ను అనుమతించాను.
26 నగరాలలో ఉన్నవారు శక్తివిహీనులు వారు
    భీతావహులు గందరగోళంలో ఉన్నావారు
క్ష్రేత్రంలోని పచ్చికలా మొక్కలవలె వారు ఛేదింపదగిన వారు.
వాడుటకు పూర్వము పెరగని విధంగా ఇండ్ల
    కప్పుల మీద పెరిగే పచ్చికవారు.
27 నీవు ఎప్పుడు క్రింద కూర్చుంటావో నాకు తెలియును.
    నీవు యుద్ధానికి వెళ్లడం నాకు తెలుసు
    నీవు ఇంటి దగ్గర ఉండినప్పుడు
నా పట్ల విసుగు చెందినది తెలుసును.
28 అవును. నీవు నాపట్ల విసుగు చెందితివి
    నీ గర్వపు నిందా వాక్యాలు నేను విన్నాను
అందువల్ల నీ ముక్కుకు గాలం వేస్తున్నాను
    నీ నోటికి నా కళ్లెము తగిలిస్తున్నాను ఆ
తర్వాత నిన్ను వెనుకకు మరల్చి
    నీవు వచ్చిన తోవనే నడిపిస్తాను.’”

హిజ్కియాకు యెహోవా సందేశము

29 తర్వాత యెషయా హిజ్కియాతో ఈలాగు చెప్పెను. “నీకు సహాయము చేయనున్నందుకు ఇది ఒక గుర్తు. ఈ సంవత్సరము తనంతట తానే పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. ఆ మరు సంవత్సరము గింజనుండి పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. కాని ఆ మూడో సంవత్సరము నీవు నాటిన గింజలనుండి లభించే ధాన్యము నీవు భుజిస్తావు. నీవు ద్రాక్షా పొలాలు సాగుచేసి, లభించే ఆ ద్రాక్షలు భుజిస్తావు. 30 తప్పించుకున్న ప్రజలు, యూదా వంశంలో మిగిలిన వారు మరల పండించడము మొదలు పెడతారు. 31 కొద్దిమంది సజీవులై వుంటారు, కనుక వారు యెరూషలేమును విడిచి వెళతారు. తప్పించుకున్న ప్రజలు సీయోను కొండలో నుండి వెలుపలికి వెళతారు. యెహోవా యొక్క గాఢాభిప్రాయం అలా చేస్తుంది.

32 “అందువల్ల అష్షూరు రాజుని గురించి యెహోవా చెప్పేదేమనగా:

‘అతడీ నగరంలోకి రాడు.
    అతడీ నగరంలో అస్త్రప్రయోగం చెయ్యలేడు.
అతడు తన కవచాలు ఈ నగరానికి తీసుకురాడు.
    నగరములను దాడి చేసేందుకు ముట్టడి దిబ్బను నిర్మించలేడు.
33 అతడు వచ్చిన త్రోవనే తిరిగి వెళ్తాడు.
    అతడీ నగరంలోకి రాలేడు
అని యెహోవా చెప్పుచున్నాడు!
34 నేనీ నగరాన్ని రక్షిస్తాను.
    నేను నా కొరకు ఇది చేస్తాను నా సేవకుడు దావీదు కొరకు కూడా, ఇది చేస్తాను.’”

అష్షూరు సైన్యం నాశనం చేయబడుట

35 రాత్రి, యెహోవా దూత వెలుపలికి పోయి అష్షూరు శిబిరములోని 1,85,000 మందిని చంపాడు. ప్రజలు ఉదయాన మేల్కొనగా, వారు శవాలు చూశారు.

36 అందువల్ల అష్షూరు రాజయిన సన్హెరీబు తిరిగివెళ్లి నీనెవెకి మరలిపోయాడు. అక్కడే అతడు నిలిచాడు.

1 కొరింథీయులకు 10:1-13

ఇశ్రాయేలు చరిత్ర నుండి హెచ్చరికలు

10 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వికులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు. అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే. అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతావాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.

వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు. కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”(A) మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవై మూడు వేలమంది మరణించారు. వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి. 10 వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.

11 మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. 12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్నవాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి. 13 మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్థుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.

మత్తయి 8:18-27

యేసును వెంబడించటం

(లూకా 9:57-62)

18 యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి, తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు. 19 అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా! మీరెక్కడికి వేళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.

20 యేసు, “నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి. గాలిలో ఎగిరే పక్షులు ఉండటానికి గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడ స్థలం లేదు” అని అతనితో అన్నాడు.

21 మరొక శిష్యుడు, “ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి” అని అన్నాడు.

22 యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.

యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం

(మార్కు 4:35-41; లూకా 8:22-25)

23 యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. 24 అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, “ప్రభూ! రక్షించండి. మునిగిపోతున్నాము!” అని అన్నారు.

26 యేసు, “మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు?” అని అంటూ లేచి గాలిని, అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి.

27 వాళ్ళు ఆశ్చర్యపడి, “ఈయనేలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయన మాట వింటున్నాయే!” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International