Book of Common Prayer
95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
5 మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
7 ఆయన మన దేవుడు,
మనం ఆయన ప్రజలము.
మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
8 దేవుడు చెబుతున్నాడు, “మెరీబా[a] దగ్గర మీరు ఉన్నట్టుగా
అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి.
9 మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు.
కాని అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.
10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను.
వారు నమ్మకస్థులు కారని నాకు తెలుసు.
ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.
11 అందుచేత నాకు కోపం వచ్చి,
‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’”
సంగీత నాయకునికి: అయ్యలెత్ షహరు రాగం. దావీదు కీర్తన.
22 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
2 నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను.
కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు.
మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.
3 దేవా, నీవు పవిత్రుడవు.
నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం.
4 మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు.
అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
5 మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు.
వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
6 కాని, నేను మనిషిని కానా, పురుగునా?
మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
7 నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు.
నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
8 వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి.
ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో!
నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”
9 దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే.
నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు.
నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.
11 కనుక దేవా, నన్ను విడువకు.
కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు.
వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు.
(బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్ధికెక్కిన ప్రాంతం.)
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు.
వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి.
14 నేలమీద పోయబడ్డ నీళ్లలా
నా బలం పోయినది.
నా ఎముకలు విడిపోయాయి.
నా ధైర్యం పోయినది.
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది.
నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది.
“మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.
16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి.
ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది.
సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు.
17 నేను నా ఎముకల్ని చూడగలను.
ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు.
వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు!
18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు.
నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.
19 యెహోవా, నన్ను విడువకుము!
నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము.
22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
యెహోవా వారిని ద్వేషించడు.
ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.
25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు.
మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు.
చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు.
దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.
దావీదు స్తుతి కీర్తన.
141 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము.
త్వరపడి నాకు సహాయం చేయుము.
2 యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము.
నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.
3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము.
నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
4 నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు.
చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము.
చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
5 ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు.
అది నాకు మంచిదే.
వారి విమర్శను నేను అంగీకరిస్తాను.
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
6 ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు.
అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.
7 మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది.
అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడతాయి.
8 యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను.
నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
9 ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము.
ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
10 నేను హాని లేకుండా తప్పించుకొనగా
ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.
దావీదు స్తుతి కీర్తన.
143 యెహోవా, నా ప్రార్థన వినుము.
నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు యిమ్ము.
నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
2 నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు.
నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
3 కాని నా శత్రువులు నన్ను తరుముతున్నారు.
వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు.
ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి
నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
4 నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది.
నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
5 కాని చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను.
నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను.
యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
6 యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను.
ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.
7 యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము!
నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను.
నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము.
సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
8 యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము.
నేను నిన్ను నమ్ముకొన్నాను.
సరియైన మార్గాన్ని నాకు చూపించుము.
నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
9 యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము.
నీవు నా దేవుడవు.
11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు
నన్ను జీవించనిమ్ము.
నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి,
నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము.
ఎందుకంటే నేను నీ సేవకుడను.
బబులోనులో బంధీలకు ఉత్తరం
29 బబులోనులో బందీలుగా[a] వున్న యూదులకు యిర్మీయా ఒక లేఖ పంపాడు. బబులోనులో ఉంటున్న పెద్దలకు (నాయకులు), యాజకులకు, ప్రవక్తలకు, తదితర ప్రజలకు అతడు దానిని పంపాడు. వీరంతా నెబుకద్నెజరుచే యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొని రాబడినవారే.
4 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యోహోవా యెరూషలేము నుండి బబులోనుకు తాను బందీలుగా పంపిన ప్రజలందరి నుద్దేశించి ఈ విషయాలు చెపుతున్నాడు. 5 “మీరు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించండి. ఆ రాజ్యంలో స్థిరపడండీ. తోటలను పెంచి, మీరు పండించిన పండ్లను తినండి. 6 వివాహాలు చేసుకొని సంతానవంతులై వర్ధిల్లండి. మీ కుమారులకు కూడ వధువులను వెదకండి. మీ కుమార్తెలకు వివాహాది శుభకార్యాలు చేయండి. వారు కూడ తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొనే నిమిత్తం మీరలా చేయండి. మీ సంతానాన్ని విస్తరింపజేసి పెంచి బబులోనులో మీరు బాగా వ్యాపించండి. మీ సంఖ్యా బలం తగ్గిపోకూడదు. 7 నేను మిమ్ములను పంపిన నగరానికి మీరంతా మంచి పనులు చేయండి. మీరు నివసిస్తున్న నగర శ్రేయస్సుకు మీరు ప్రార్థనలు చేయండి. ఎందువల్లనంటే, ఆ నగరంలో శాంతి నెలకొంటే మీకూ శాంతి లభిస్తుంది.” 8 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్పేదేమనగా “మీ ప్రవక్తల, మంత్ర విద్యలు చేసే వారి యొక్క మోసంలో మీరు పడకండి. వారు కనిన కలలను మీరు వినవద్దు. 9 వారు అబద్ధాలను బోధిస్తున్నారు. వారు చెప్పే వర్తమానం నానుండి వచ్చినదేనని అంటున్నారు! కాని నేను పంపలేదు!” ఇదే యెహోవా వాక్కు.
10 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బలమైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులోనులో నివసిస్తున్న మీ వద్ధకు వస్తాను. మిమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చుతాను. 11 ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయటానికి వ్యూహరచన చేస్తాను. 12 అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. 13 మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు.
13 యూదులుకాని ప్రజలారా! ఇప్పుడిక నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీ కోసం క్రీస్తు అపొస్తలునిగా పని చేస్తున్నాను కనుక, నేను చేస్తున్న పనిపట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. 14 ఈ విధంగానైనా నా వాళ్ళలో ఈర్ష్య కలుగచేసి, వాళ్ళలో కొందర్నైనా రక్షించ కలుగుతానని ఆశిస్తున్నాను. 15 వాళ్ళు నిరాకరించటం వల్ల ప్రపంచానికి దేవునితో స్నేహం కలిగింది. అలాంటప్పుడు వాళ్ళు అంగీకరించియుంటే మరణంనుండి జీవానికి వచ్చినట్లే. 16 పిండిముద్దలో ఒక భాగం ప్రథమ ఫలంగా దేవునికి సమర్పిస్తే, అది పవిత్రమైతే, ముద్ద అంతా పవిత్రమైనట్లే కదా! వేర్లు పవిత్రమైతే కొమ్మలు పవిత్రమైనట్లే కదా!
17 చెట్టు కొమ్మల్ని కొన్నిటిని కొట్టివేసి, అడవి ఒలీవ చెట్ల కొమ్మలవలెనున్న మిమ్మల్ని దేవుడు అంటుకట్టాడు. తద్వారా వేరులోనున్న బలాన్ని మీరు పంచుకొంటున్నారు. 18 కాని ఆ కొమ్మలపైగా గర్వించకండి. మీ వల్ల వేరు పోషింపబడుటలేదు. వేరు వల్ల మీరు పోషింపబడుతున్నారు. 19 మమ్మల్ని అంటు కట్టాలని కొమ్మలు కొట్టివేయబడ్డాయి అని మీరనవచ్చు. 20 నిజమే! విశ్వాసం లేనందువల్ల అవి కొట్టి వేయబడ్డాయి. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీరా చెట్టునంటుకొని ఉన్నారు. అలా అని గర్వించకండి. భయంతో ఉండండి. 21 ఎందుకంటే, సహజంగా పెరిగిన కొమ్మల్ని దేవుడు లెక్క చేయలేదంటే మిమ్మల్ని కూడా లెక్క చేయడు.
22 అందువల్ల దేవుని కరుణను, కోపాన్ని అర్థం చేసుకొనండి. విశ్వసించని కొమ్మల్ని నరికి వేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మీరు ఆయన కరుణను అంటి పెట్టుకొని జీవిస్తుంటే కరుణను చూపుతూ ఉంటాడు. లేని పక్షాన మిమ్మల్ని కూడా కొట్టివేస్తాడు. 23 వాళ్ళు, మేము విశ్వాసహీనంగా ఉంటామని మొండి పట్టు పట్టకుండా ఉంటే, దేవుడు మళ్ళీ వాళ్ళను అంటు కడతాడు. వాళ్ళను తిరిగి అంటుకట్టే శక్తి దేవునికి ఉంది. 24 స్వాభావికంగా అడవి జాతికి చెందిన ఒలీవల చెట్లనుండి కొట్టిన కొమ్మలవలెనున్న మిమ్మల్ని మేలురకపు చెట్టుకు అంటు వేయగలిగితే, మేలు రకపు ఒలీవల చెట్ల కొమ్మల్ని స్వజాతికి చెందిన చెట్టుకు అంటు వేయటం ఇంకెంత సులభమో ఆలోచించండి.
లాజరు మరణము
11 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు. 2 ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు. 3 ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.
4 యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కలుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు. 5 యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది. 6 లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి, 7 ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.
8 వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.
9 యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు. 10 రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.
11 ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”
12 ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు. 13 యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.
14 అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. 15 నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.
16 దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో, “యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.
లాజరు కుటుంబాన్ని ఓదార్చుట
17 యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది. 18 బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది. 19 చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.
20 యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది. 21 మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు. 22 కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అన్నది.
23 యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.
24 మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.
25 యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు. 26 జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.
27 ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.
యేసు బేతనియలో తన స్నేహితులతో
(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)
12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. 2 అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. 3 మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.
4-5 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. 6 యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.
7 యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది. 8 మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.
లాజరుకు విరోధముగా కుట్ర
9 ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు. 10-11 తద్వారా ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని పన్నాగం పన్నారు. ఎందుకంటే యితని కారణంగానే చాలామంది యూదులు యేసు దగ్గరకు వెళ్ళి ఆయన యందు నమ్మకం ఉంచారు.
© 1997 Bible League International