Book of Common Prayer
95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
5 మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
7 ఆయన మన దేవుడు,
మనం ఆయన ప్రజలము.
మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
8 దేవుడు చెబుతున్నాడు, “మెరీబా[a] దగ్గర మీరు ఉన్నట్టుగా
అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి.
9 మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు.
కాని అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.
10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను.
వారు నమ్మకస్థులు కారని నాకు తెలుసు.
ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.
11 అందుచేత నాకు కోపం వచ్చి,
‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’”
కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.
88 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
2 దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
3 నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
4 జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
5 మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
6 యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
7 నీవు నా మీద కోపగించావు.
నీవు నన్ను శిక్షించావు.
8 నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
9 నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10 యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!
11 చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14 యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
శిక్ష నన్ను చంపేస్తుంది.
17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
చీకటి మాత్రమే నాకు మిగిలింది.
91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
అని నేను యెహోవాకు చెబుతాను.
3 దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
4 కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
5 రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
6 చీకటిలో దాపురించే రోగాలకు గాని
మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
7 నీ ప్రక్కన వేయిమంది,
నీ కుడి ప్రక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు.
నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.
8 ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా
నీకు కనబడుతుంది.
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
92 యెహోవాను స్తుతించుట మంచిది.
సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
5 యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు.
నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
6 నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు.
మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
7 దుర్మార్గులు గడ్డిలా మొలిచినా,
చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
8 కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు.
9 యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు.
చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు.
10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు.
సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను.
నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
ఆయనలో అవినీతి లేదు.
ఒడంబడిక ఉల్లంఘన
11 ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినదిః 2 “యిర్మీయా, ఈ ఒడంబడికలోని మాటలను వినుము. యూదా ప్రజలకు వీటి విషయం తెలియజేయుము. యెరూషలేము నగర వాసులకు కూడా ఈ విషయాలు తెలియజేయుము. 3 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినది ఇది: ‘ఈ ఒడంబడికను అనుసరించని ప్రతి వానికి కీడు వాటిల్లుతుంది.’ 4 నేను మీ పూర్వీకులతో చేసుకొన్న ఒడంబడిక విషయం మాట్లాడుతున్నాను. వారిని ఈజిప్టునుండి నేను తీసుకొని వచ్చినప్పుడు నేనా ఒడంబడికను వారితో చేసుకొన్నాను. ఈజిప్టు అనేక కష్టాలున్న స్థలము అది ఇనుము కూడా కరిగి పోయేటంత వేడిగల పొయ్యిలాఉంది. నాకు విధేయులై, నేనాజ్ఞాపించినదంతా చేయండని ఆ ప్రజలకు చెప్పాను. మీరిది చేస్తే, మీరు నా ప్రజలవుతారు. పైగా నేను మీ దేవుడనవుతాను.
5 “నేను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేర్చటానికి నేనిది చేశాను. వారికి నేనొక సారవంతమైన భూమిని ప్రసాదిస్తానని వాగ్దానం చేశాను. పాలు, తేనెలు ప్రవహించే భూమిని ఇస్తానని అన్నాను. ఈనాడు మీరు ఆ రాజ్యంలో నివసిస్తున్నారు.”
నేను (యిర్మీయా) “ఆ ప్రకారమే జరగాలి ప్రభువా” అని అన్నాను.
6 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, ఈ సమాచారం యూదా పట్టణాలలోను, యెరూషలేము వీధులలోను ప్రకటించుము: ఈ ఒడంబడిక నియమాలు వినండి. ఆ ఒడంబడికలోని న్యాయసూత్రాలను పాటించండి. 7 ఈజిప్టునుండి విడుదల చేసి మీ పితరులను నేను తీసుకొని వచ్చినప్పుడు వారికి ఒక హెచ్చరిక చేశాను. ఈ రోజువరకూ వారికి పదే పదే హెచ్చరికలు చేస్తూనే వచ్చాను. నాకు విధేయులై వుండమని వారికి చెప్పాను. 8 కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. వారు మొండివైఖరి దాల్చారు. వారి దుష్ట హృదయాలు ఎలా చెపితే అలా ప్రవర్తించారు. ఒడంబడిక ప్రకారం వారు దానిని అనుసరించకపోతే వారికి కీడు వాటిల్లుతుంది. అందువల్లనే వారికి కష్టాలు సంభవించేలా నేను చేశాను! ఒడంబడికకు కట్టుబడి ఉండమని వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను. కాని వారు పాటించలేదు.”
14 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు అర్థించవద్దు. వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను వినను. ఆ ప్రజలకు బాధలు మొదలవుతాయి. అప్పుడు సహాయం కొరకు నన్ను పిలుస్తారు. కాని నేను వినను.
15 “నా ప్రియురాలు (యూదా) నా ఇంట్లో (ఆలయం) ఎందుకు ఉన్నది?
అక్కడ ఉండే హక్కు ఆమెకు లేదు. ఆమె చాలా చెడుపనులు చేసింది.
యూదా! నీవర్పించే ప్రత్యేక ప్రమాణాలు, బలులు నీవు నాశనంగాకుండా ఆపగలవని నీవనుకుంటున్నావా?
నాకు బలులు అర్పించటం ద్వారా నీవు శిక్షనుండి తప్పించుకోగలవని తలుస్తున్నావా?”
16 యెహోవా నీకొక పేరు ఇచ్చాడు.
“కంటికింపైన పచ్చని ఒలీవ చెట్టు” అని నిన్ను పిలిచాడు
కాని ఆ చెట్టును బలమైన గాలిచే విసరబడే అగ్నితో యెహోవా కాల్చివేస్తాడు.
దాని కొమ్మలన్నీ బూడిదై పోతాయి.[a]
17 సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్ములను నాటి స్థిరపర్చినా
కాని ఆయనే మీకు విపత్తు వస్తుందని ప్రకటించాడు.
ఎందువల్లనంటే, ఇశ్రాయేలు వంశం వారు,
యూదా వంశం వారు చెడు కార్యాలు చేశారు.
మీరు బూటకపు దేవత బయలుకు బయట సమర్పించి
యెహహోవాకు కోపం తెప్పించారు.
యిర్మీయాపై కుట్ర
18 అనాతోతు ప్రజలు[b] నాపై కుట్ర పన్నుతున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది. 19 వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని యెహోవా తెలియపర్చక ముందు, నేనొక అమాయకపు గొర్రె పిల్లవలె నరకబడటానికి సిద్ధంగా వున్నాను. వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అర్థం చేసికోలేదు. నన్ను గురించి వారిలా అంటున్నారు: “మనం చెట్టును, దాని పండును నాశనం చేద్దాం! మనం వానిని చంపివేద్దాం! అప్పుడు ప్రజలు అతన్ని మర్చిపోతారు.” 20 యెహోవా, నీవు సత్య వర్తనుడవైన న్యాయాధి పతివి. ప్రజల మనస్సులను, హృదయాలను పరీక్షించే విధానం నీకు బాగా తెలుసు. నేను నా వాదనలను నీకు వినిపిస్తాను. వారికి తగిన శిక్ష నీవే యిమ్ము.
పాపం విషయంలో మరణించాము గాని క్రీస్తులో బ్రతికినాము
6 దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? 2 ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము? 3 బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా? 4 ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.
5 మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం. 6 మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. 7 ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు.
8 మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. 9 దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. 10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. 11 అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.
33 వాళ్ళు, “మేము అబ్రాహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు?” అని అన్నారు.
34 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు. 35 బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు. 36 కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. 37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. 38 నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి[a] నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు.
39 “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు! 40 నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు. 41 మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు.
వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు.
42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు. 43 మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. 44 మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి.
45 “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు. 46 నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. 47 దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”
© 1997 Bible League International