Book of Common Prayer
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.
17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
9 సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు:
“ఈ రాజ్యంలో మిగిలిన
వారినందరినీ ప్రోగు చేయుము[a]
నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే
ద్రాక్షా కాయల్లా కూడదీయుము.
ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా
నీవు ప్రతి తీగను వెదకుము.”
10 నేనెవరితో మాట్లాడగలను?
ఎవరిని హెచ్చరించగలను?
నా మాట ఎవరు వింటారు?
ఇశ్రాయేలు ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా
తమ చెవులు మూసుకున్నారు.
యెహోవా ఉపదేశములు వారికిష్టము లేదు.
కావున నా హెచ్చరికలు వారు వినలేరు.
యెహోవా యొక్క బోధనలను ప్రజలు సహించరు.
యెహోవా మాటలను వినుటకు వారు ఇష్టపడరు.
11 కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉంది!
దానిని నేను లోపల ఇముడ్చుకోలేక పోతున్నాను!
అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను,
గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు.
భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.
12 వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి.
వారి పొలాలు, వారి భార్యలు ఇతరులకివ్వబడతారు.
నా చెయ్యెత్తి యూదా రాజ్య ప్రజలను శిక్షిస్తాను.”
ఈ వాక్కు యెహోవా నుండివచ్చినది.
13 “ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు.
క్రింది వర్గాలనుండి పై తరగతి వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి ఉంటారు!
ప్రవక్తలు, యాజకులు అంతా కపట జీవనం సాగిస్తారు.
14 ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను మాన్పజూస్తారు.
అవేవో స్వల్ఫ గాయాలుగా. భావిస్తారు.
‘ఏమీ పరవాలేదు, ఏమీ పరవాలేదు’ అని అంటారు.
కాని, నిజానికి ప్రమాదం చాలా ఉంది.
15 ప్రవక్తలు, యాజకులు వారు చేయు చెడుకార్యాలకు సిగ్గుపడాలి!
కాని వారికి సిగ్గనేది లేదు.
వారి పాపానికి తగిన కలవరపాటు వారెరుగరు.
అందువల్ల ఇతరులందరితో పాటు వారుకూడా శిక్షించబడతారు.
నేను వారిని శిక్షించేటప్పుడు వారు నేల కరచేలా క్ర్రిందికి తోయబడతారు.”
ఇది యెహోవా వాక్కు.
లైంగిక అవినీతి
12 “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.” కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను కాను, 13 “తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు. 14 దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు. 15 మీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? మరి అలాంటప్పుడు క్రీస్తు అవయవాల్ని, వేశ్య దేహంతో కలుపమంటారా? అసంభవము. 16 తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపినవాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి”(A) అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. 17 కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు.
18 లైంగిక అవినీతికి దూరంగా ఉండండి, మనిషి చేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి కావు. కాని వ్యభిచారం చెయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత దేహంపట్ల పాపం చేసినట్లౌతుంది. 19 మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు. 20 మీ కోసం వెల చెల్లించబడింది. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి.
యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం
(మత్తయి 8:28-34; లూకా 8:26-39)
5 వాళ్ళు సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. 2 యేసు పడవ నుండి క్రిందికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు. 3 వాడు స్మశానంలో నివసిస్తుండే వాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ పట్టి ఉంచలేక పోయారు. 4 వాని చేతుల్ని, కాళ్ళను ఎన్నోసార్లు యినుప గొలుసులతో కట్టివేసే వాళ్ళు. కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్ళకు వేసిన యినుప కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగలశక్తి ఎవ్వరికి లేదు. 5 వాడు స్మశానంలో సమాధుల దగ్గర, కొండల మీదా, రాత్రింబగళ్ళు బిగ్గరగా ఏడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకొనేవాడు.
6 వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాడు. 7 “యేసూ! మహోన్నతుడైన దేవుని కుమారుడా! మాజోలికి రావద్దయ్యా! మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమాణంతో చెప్పండి” అని వాడు బిగ్గరగా అరుస్తూ ప్రాధేయ పడ్డాడు. 8 ఎందుకంటే ఒక్క క్షణం క్రితం యేసు వానితో, “ఓ! దయ్యమా! ఆ మనిషి నుండి బయటకు రా!” అని అన్నాడు.
9 యేసు వాణ్ణి, “నీ పేరేమి?” అని అడిగాడు.
“నా పేరు ‘పటాలం’.[a] మా గుంపు చాలా పెద్దది” అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. 10 వానిలోని దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి పంపివేయవద్దని దీనంగా ఎన్నోసార్లు వేడుకొన్నాయి.
11 ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు మేస్తూవుంది. 12 ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల్లోకి పంపండి. వాటిలో ప్రవేశించటానికి అనుమతివ్వండి” అని అన్నాయి. 13 యేసు వాటికి అనుమతి యిచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. రెండువేల దాకా ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సున పడి మునిగిపొయ్యాయి.
14 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, ఈ సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. 15 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల పటాలం పట్టినవాడు దుస్తులు వెసుకొని సక్రమమైన బుద్ధితో, కూర్చొని ఉండటం గమనించారు. వాళ్ళకు భయం వేసింది. 16 జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్ళకందరికి చెప్పారు. 17 వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు.
18 యేసు పడవనెక్కుతుండగా దయ్యం పట్టిన వాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు. 19 యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, “ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబం లోని వాళ్ళతో చెప్పు” అని అన్నాడు.
20 అతడు వెళ్ళి దెకపొలిలో[b] యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.
© 1997 Bible League International