Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 25

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
    ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.

11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను.
    కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.

12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే
    అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు.
    అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు.
    ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు.
15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి.
    ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.

16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను.
    నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము.
    నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము.
    నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము,
    నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
21 దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను.
    కనుక నన్ను కాపాడుము.
22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

కీర్తనలు. 9

సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.

పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
    యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
    మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
    కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.

నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
    యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
    యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
    బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
శత్రువు పని అంతం అయిపోయింది.
    యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
    ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
    ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.

అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
    యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
    యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
    గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
    యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.

10 నీ నామం తెలిసిన ప్రజలు
    నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
    సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.

11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
    యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
    ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
    మరి యెహోవా వారిని మరచిపోలేదు.

13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
    నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
    ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
    నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”

15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
    కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
    ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
    కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
    యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]

17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
    ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
    కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
    వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
    వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.

కీర్తనలు. 15

దావీదు కీర్తన.

15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
    నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
    అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
    ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
    ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
    అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
    అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
    అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
    ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.

యెషయా 44:6-8

యెహోవా ఇశ్రాయేలీయుల రాజు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలును రక్షిస్తాడు. యెహోవా చెబుతున్నాడు: “నేను ఒక్కడను మాత్రమే దేవుణ్ణి. ఇంక ఏ దేవుళ్లూ లేరు. నేనే ఆది, అంతము. నావంటి దేవుడు ఇంకొకడు లేడు. అలా ఉంటే, ఆ దేవుడు ఇప్పుడు మాట్లాడాలి. ఆ దేవుడు వచ్చి, తాను నావలె ఉన్నట్టు రుజువు చూపించాలి. శాశ్వతంగా ఉండే ఈ ప్రజలను నేను సృజించినప్పుడు ఏమి జరిగిందో ఆ దేవుడు నాతో చెప్పాలి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అది అతనికి తెలిసినట్టు చూపించుటకు ఆ దేవుడు సూచనలు ఇవ్వాలి.

“భయపడవద్దు! దిగులుపడవద్దు! ఏమి జరుగుతుందో అది నేను నీతో ఎల్లప్పుడూ చెప్పలేదా? మీరే నాకు సాక్షులు. నాతోపాటు ఇంకొక దేవుడున్నాడా? ఏ దేవుడూ లేడు. నేను ఒక్కడను మాత్రమే. ఇంకొక దేవుడున్నట్టు నాకు తెలియదు.”

యెషయా 44:21-23

నిజమైన దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు సహాయం చేస్తాడు

21 “యాకోబూ, ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకో.
    ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవని జ్ఞాపకం ఉంచుకో.
నిన్ను నేను సృజించాను. నీవు నా సేవకుడవు.
    కనుక ఇశ్రాయేలూ, నన్ను మరచిపోవద్దు.
22 నీ పాపాలు ఒక పెద్ద మేఘంలా ఉండేవి.
    కాని ఆ పాపాలను నేను తుడిచి వేశాను.
గాలిలో అదృశ్యమైన ఒక మేఘంలా
    నీ పాపాలు పోయాయి.
నేను నిన్ను తప్పించి కాపాడాను,
    కనుక తిరిగి నా దగ్గరకు వచ్చేయి.”

23 యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. గనుక ఆకాశాలు ఆనందిస్తున్నాయి.
    భూమి, దాని అగాధ స్థలాల్లో సహితం సంతోషిస్తుంది.
పర్వతాలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటలు పాడుతున్నాయి.
    అరణ్యంలో చెట్లన్నీ ఆనందంగా ఉన్నాయి.
ఎందుకు? ఎందుకంటే యాకోబును యెహోవా రక్షించాడు గనుక.
    ఇశ్రాయేలుకు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు గనుక.

ఎఫెసీయులకు 4:1-16

క్రీస్తు దేహంలో ఐక్యత

ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించమని ప్రభువు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి. శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు.

క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:

“ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు.
    మానవులకు వరాలిచ్చాడు.”(A)

“ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి నాడనే అర్థం కదా! 10 క్రిందికి దిగినవాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి సమస్తమును నింపి వేసాడు. 11 పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. 12 అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. 13 కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు.

14 అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. 15 మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. 16 శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది.

మార్కు 3:7-19

ప్రజలు యేసును అనుసరించటం

యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాలనుండి, తూరు, సీదోను పట్టణాల చుట్టూవున్న ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.

చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు. 10 ఆయన చాలామందికి నయం చేసాడు. అందువల్ల రోగాలున్నవాళ్ళు ఆయన్ని తాకాలని ముందుకు త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు. 11 చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవి. 12 యేసు తానెవరో ఎవ్వరికి చెప్పవద్దని ఆ ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు.

యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం

(మత్తయి 10:1-4; లూకా 6:12-16)

13 యేసు కొండపైకి వెళ్ళి తనకు కావలసిన వాళ్ళను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు. 14 ఆయన పన్నెండుగురిని తన అపొస్తలులుగా నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, ప్రకటించటానికి వాళ్ళను ప్రపంచంలోకి పంపాలని ఆయన ఉద్దేశ్యం. 15 దయ్యాలను వదిలించే అధికారం వాళ్ళకిచ్చాడు. 16 ఆయన నియమించిన పన్నెండుగురు అపొస్తలుల పేర్లు యివి:

సీమోను, ఇతనికి పేతురు అనే పేరునిచ్చాడు.

17 జెబెదయి కుమారులైన యాకోబు అతని సోదరుడు యోహాను, వీళ్ళకు బోయనేర్గెసు అనే పేరునిచ్చాడు. బోయనేర్గెసు అంటే “ఉరుముకు పుత్రులు” అని అర్థం.

18 అంద్రెయ,

ఫిలిప్పు,

బర్తొలొమయి,

మత్తయి,

తోమా,

అల్ఫయి కుమారుడు యాకోబు,

తద్దయి,

జెలటు అని పిలవబడే సీమోను,

19 యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International