Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 20-21

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
    యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
    సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
    నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
    నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
    దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.

ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
    దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
    ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
    కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
    కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!

దేవుడు రాజును రక్షించును గాక!
    మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

21 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.
    నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.
    మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు.

యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు.
    బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.
    నీవు రాజుకు నిరంతరం సాగే దీర్ఘాయువు నిచ్చావు.
రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది.
    నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.
    నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.
రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.
    సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.
    నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
నీవు కనబడినప్పుడు
    ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు.
యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది.
    మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.
    వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.
    చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.
    ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.

13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి
    మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.

కీర్తనలు. 110

దావీదు స్తుతి కీర్తన.

110 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.”
    అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.

నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను
    వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు.
    నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది.
ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం
    రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది.[a]

యెహోవా ఒక వాగ్దానం చేసాడు.
    యెహోవా తన మనస్సు మార్చుకోడు.
“నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు.
    నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా ఉన్నట్లు ఉంది.”

నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు.
    ఆయన కోపముతో రాజులను చితకగొడతాడు.

దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు.
    చచ్చిన వారి శవాలతో నేలనిండి పోతుంది!

మార్గంలోని సెలయేటినుండి[b] రాజు మంచినీరు తాగుతాడు.
    శక్తివంతమైన రాజ్యాల నాయకులను దేవుడు శిక్షిస్తాడు.
    ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.

కీర్తనలు. 116-117

116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
    నాకు ఎంతో సంతోషం.
సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
    ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
    సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
    నేను భయపడి చింతపడ్డాను.
అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
    “యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
    యెహోవా దయగలవాడు.
నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
    నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
నా ఆత్మా, విశ్రమించు!
    యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
    నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
    నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.

10 “నేను నాశనమయ్యాను!”
    అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే”
    అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను.

12 యెహోవాకు నేను ఏమివ్వగలను?
    నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు.
13 నన్ను రక్షించినందుకు
    నేను ఆయనకు పానార్పణం యిస్తాను.
    యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
    ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను.

15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము.
    యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను.
    యెహోవా, నీవే నా మొదటి గురువు.
17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను.
    యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
    ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను.
19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను.
    యెహోవాను స్తుతించండి!

117 సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి.
    సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు.
    దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు.

యెహోవాను స్తుతించండి!

యెషయా 43:1-13

దేవుడు ఎల్లప్పుడు తన ప్రజలతో ఉన్నాడు

43 యాకోబూ, యెహోవా నిన్ను సృష్టించాడు. ఇశ్రాయేలు, యెహోవా నిన్ను సృజించాడు. ఇప్పుడు యెహోవా చెబుతున్నాడు: “భయపడవద్దు. నేను నిన్ను రక్షించాను. పేరుపెట్టి నిన్ను పిలిచాను. నీవు నా స్వంతం. నీకు కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నదులు దాటి వెళ్లేటప్పుడు, అవి నీమీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే యెహోవానైన నేను నీకు దేవుడను గనుక, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను మీకు రక్షకుణ్ణి గనుక. మీకు విలువగా చెల్లించేందుకు నేను ఈజిప్టును ఇచ్చాను. నిన్ను నా స్వంతం చేసుకొనేందుకు ఇథియోపియాను, సెబాను నేను ఇచ్చాను. నీవు నాకు ప్రియుడివి గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు బతుకునట్లు నీకు మనుష్యులనూ, నీకిష్టమైన జనాంగాలను నేను ఇచ్చివేస్తాను.”

“కనుక భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీ పిల్లలను సమకూర్చి వారిని నీ దగ్గరకు రప్పిస్తాను. తూర్పునుండి, పడమరనుండి నేను వారిని సమకూరుస్తాను. నా మనుష్యుల్ని నాకు ఇచ్చివేయి అని నేను ఉత్తరానికి చెబుతాను. నా మనుష్యుల్ని బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి చెబుతాను. దూర దేశాలనుండి నా కుమారులను, కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి. నా ప్రజలందరినీ, నా నామం పెట్టబడిన మనుష్యులందరినీ నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే సృష్టించుకొన్నాను. వాళ్లను నేనే సృష్టించాను. వాళ్లు నావాళ్లు.”

“కళ్లుండి చూడలేని వాళ్లను బయటకు తీసుకొనిరండి. చెవులు ఉండి వినలేని వాళ్లను బయటకు తీసుకొని రండి. ప్రజలందరూ, రాజ్యాలు అన్నీ సమావేశపర్చబడాలి. ఆదిలో జరిగిన దానిని గూర్చి వాళ్ల తప్పుడు దేవుళ్లలో ఎవరైనా వారితో చెప్పాలని కోరుతున్నారేమో, వారు వారి సాక్షులను తీసుకొని రావాలి. సాక్షులు సత్యం చెప్పాలి. వారిదే సరి అని ఇది తెలియజేస్తుంది.”

10 యెహోవా చెబుతున్నాడు: “ప్రజలారా, మీరే నా సాక్షులు. నేను ఏర్పాటు చేసికొన్న ఆ సేవకులు మీరే. ప్రజలు నన్ను విశ్వసించుటకు వారికి మీరు సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాను. ‘నేనే ఆయనను’ అని, నేనే సత్య దేవుడను అని మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు ముందుగా ఏ దేవుడూ లేడు, నా తర్వాత ఏ దేవుడూ ఉండడు. 11 నా మట్టుకు నేనే యెహోవాను. నేను ఒక్కడనే రక్షకుడను, మరి ఎవరూలేరు. 12 మీతో మాట్లాడిన వాడను నేనే. నేనే మిమ్మల్ని రక్షించాను. ఆ సంగతులు నేనే మీకు చెప్పాను. మీతో ఉన్న ఎవరో క్రొత్తవాడు కాదు. మీరే నా సాక్షులు, నేనే దేవుడను.” సాక్షాత్తు యెహోవా చెప్పిన మాటలు ఇవి. 13 “నేను ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాను. నేనేదైనా చేశాను అంటే నేను చేసిన దానిని ఎవరూ మార్చలేరు. నా శక్తి నుండి మనుష్యులను ఎవ్వరూ రక్షించలేరు.”

ఎఫెసీయులకు 3:14-21

ఎఫెసీయుల కోసం ప్రార్థన

14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. 15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. 16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. 17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. 18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.

20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. 21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.

మార్కు 2:23-3:6

యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు

(మత్తయి 12:1-8; లూకా 6:1-5)

23 ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని దాన్యపు కంకుల్ని త్రుంచారు. 24 పరిసయ్యులు ఆయనతో, “అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.

25 యేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసివచ్చింది. అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ చదవలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తానుతిని, తన సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప యితరులు తినకూడదు” అని అన్నాడు.

27 యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు. 28 అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి రోజుపై కూడా అధికారం ఉంది.”

విశ్రాంతి రోజు యేసు నయం చేయటం

(మత్తయి 12:9-14; లూకా 6:6-11)

ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు. అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం. యేసు ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు.

అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు.

ఆయన కోపంతో చుట్టూ చూసాడు. వాళ్ళవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, “నీ చేయి చాపు” అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది. ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International