Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 40

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
    నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
    ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
    ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
    యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
    వారు యెహోవాను నమ్ముకొంటారు.
ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
    ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
    ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
    మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
    నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.

యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
    బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
    దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
    నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
    నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
    యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
    ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
    నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
    నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
    లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
    నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
    నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
    త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
    ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
    వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
    “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
    యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
    నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

కీర్తనలు. 54

సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.

54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
    నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
దేవా, నా ప్రార్థనను,
    నేను చెప్పే సంగతులను ఆలకించుము.
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
    బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
    నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
    దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
    యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
    మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

కీర్తనలు. 51

సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.

51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
    నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
    నా పాపాలన్నీ తుడిచివేయుము.
దేవా, నా దోషం అంతా తీసివేయుము.
    నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
నేను పాపం చేశానని నాకు తెలుసు.
    నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
    దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
    నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
నేను పాపంలో పుట్టాను.
    పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
    అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
    నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
    నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
నా పాపాలను చూడకుము!
    వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
    నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
    నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
    కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
    నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
    వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
    నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15     నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
    లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
    దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.

18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
    యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
    మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.

యెహోషువ 9:22-10:15

22 యెహోషువ గిబియోను ప్రజలను పిలిచి, “మీరు ఎందుకు మాతో అబద్ధం చెప్పారు? మీ దేశం మా పాళెము పక్కనే ఉంది. కానీ మీరు చాలా దూర దేశంనుండి వచ్చినట్టు మాతో చెప్పారు. 23 ఇప్పుడు మీ ప్రజలకు చాల కష్టాలు ఎదురవుతాయి. మీ ప్రజలంతా బానిసలుగా ఉంటారు. దేవుని ఆలయం కోసం వాళ్లు కట్టెలు కొట్టాలి, నీరు మోయాలి” అని అతడు చెప్పాడు.

24 గిబియోనీ ప్రజలు ఇలా జవాబు చెప్పారు: “మీరు మమ్మల్ని చంపేస్తారని భయంతో మేము మీకు అబద్ధం చెప్పాము. ఈ దేశం అంతా మీకు ఇచ్చేస్తానని దేవుడు తన సేవకుడు మోషేతో చెప్పినట్టు మేము విన్నాము. ఈ దేశంలో నివసిస్తున్న మనుష్యులందరినీ చంపివేయమనికూడా దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. అందుకే మేము మీతో అబద్ధం చెప్పాము. 25 ఇప్పుడు మేము మీకు దాసులం మీకు సరియైనదిగా అనిపించిన ప్రకారం మీరు మాకు ఏమైనా చేయవచ్చు.”

26 కనుక గిబియోను ప్రజలు బానిసలు అయ్యారు. అయితే యెహోషువ వారి ప్రాణాలు రక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్లను చంపకుండా చేసాడు యెహోషువ. 27 యెహోషువ గిబియోను ప్రజలను ఇశ్రాయేలు ప్రజలకు బానిసలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజలకోసం, యెహోవా బలిపీఠం ఎక్కడ ఉండాలని యెహోవా కోరితే అక్కడ దానికోసం వారు కట్టెలు నరికి, నీరు మోసారు. ఆ ప్రజలు నేటికీ బానిసలే.

సూర్యుడు కదలక నిలచిన రోజు

10 అప్పట్లో అదోనీసెదెకు యెరూషలేము రాజు. యెహోషువ హాయిని ఓడించి, దానిని సర్వ నాశనం చేసాడని ఈ రాజు విన్నాడు. యెరికోకు, దాని రాజుకుకూడా యెహోషువ అలానే చేసాడని ఆ రాజు తెలుసుకొన్నాడు. గిబియోను ప్రజలు ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొన్నారని, ఆ ప్రజలు యెరూషలేంకు సమీపంగానే నివసిస్తున్నారని కూడా ఆ రాజు తెలుసుకొన్నాడు. అందుచేత ఈ విషయాల మూలంగా అదోనీసెదెకు, అతని ప్రజలు చాలా భయపడ్డారు. హాయివలె గిబియోను చిన్న పట్టణం కాదు. ఏ రాజధాని పట్టణమైనా ఎంత పెద్దగా ఉంటుందో, గిబియోను అంత పెద్ద పట్టణం. మరియు ఆ పట్టణంలోని పురుషులంతా మంచి శూరులు. కనుక వారు భయపడ్డారు. యెరూషలేము రాజు అదోనీసెదెక్, హెబ్రోను రాజైన హోహంతో మాట్లాడాడు. యార్మూత్ రాజైన పిరాముతో, లాకీషు రాజు యాఫీయతో, ఎగ్లోన్ రాజైన దెబీరుతో కూడా అతడు మాట్లాడాడు. “మీరు నాతో కూడా గిబియోను మీద దాడి చేసేందుకు వచ్చి సహాయం చేయండి. యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలతో గిబియోను శాంతి ఒడంబడిక కుదుర్చు కొంది” అని యెరూషలేము రాజు వీళ్లను బ్రతిమిలాడాడు.

అందుచేత ఈ అయిదుగురు ఆమోరీ రాజులు వారి సైన్యాలను ఏకం చేసారు. (అయిదుగురు రాజులు ఎవరనగా, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు) మరియు వారి సైన్యాలు గిబియోను మీదికి వెళ్లాయి. ఆ సైన్యాలు పట్టణాన్ని చుట్టు ముట్టడించి, దానిమీద పోరాటం మొదలు పెట్టాయి.

గిల్గాలులో తన పాళెములో ఉన్న యెహోషువ దగ్గరకు గిబియోను పట్టణం లోని ప్రజలు సందేశం పంపించారు. “మేము నీ సేవకులము. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకు. వచ్చి మాకు సహాయంచేయి. త్వరపడు. మమ్మల్ని రక్షించు. కొండ దేశంలోని అమోరీ రాజులంతా వారి సైన్యాలను ఏకంచేసారు. మామీద వాళ్లు యుద్ధం చేస్తున్నారు” ఇదీ ఆ సందేశం.

కనుక యెహోషువ తన సైన్యం అంతటితో గిల్గాలునుండి బయల్దేరాడు. యెహోషువ యొక్క మంచి శూరులంతా అతనితో ఉన్నారు. యెహోవా, “ఆ సైన్యాల విషయమై భయపడకు. నీవు వాళ్లను జయించేటట్టు నేను చేస్తాను. ఆ సైన్యాల్లో ఏదీ నిన్ను జయించజాలదు” అని యెహోషువతో చెప్పాడు.

యెహోషువ, అతని సైన్యం రాత్రంతా గిబియోనుకు ప్రయాణం చేసారు. (యెహోషువ వస్తున్నట్టు శత్రువుకు తెలియదు.) అందుచేత యెహోషువ వారిమీద దాడి చేసి వాళ్లకు ఆశ్చర్యం కలిగించాడు.

10 ఇశ్రాయేలీయులు దాడి చేసినప్పుడు అవతలి సైన్యాలను యెహోవా చాల గలిబిలి చేసాడు. కనుక ఇశ్రాయేలీయులు గొప్ప విజయంతో వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు గిబియోనునుండి వారిని తరిమివేసారు. బేత్‌హోరోను మార్గంవరకు ఇశ్రాయేలీయులు వారిని తరిమివేసారు. అజెకా, మక్కెదా వరకు ఇశ్రాయేలు సైన్యం ఆ మనుష్యుల్ని చంపారు. 11 ఇశ్రాయేలు సైన్యం వారి శత్రువుల్ని బెత్‌హోరోను నుండి అజెకావరకు దారి పొడవునా తరిమారు. వారు శత్రువును తరుముతూ ఉండగా, యెహోవా ఆకాశంనుండి పెద్ద వడగండ్లు కురిపించాడు. ఈ పెద్ద వడగండ్ల మూలంగా శత్రువులు అనేకమంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గంతో చంపిన వారికంటె ఈ వడగండ్ల మూలంగానే చాల ఎక్కువమంది మరణించారు.

12 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు:

“ఓ సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకాశంలో నిలిచి ఉండు,
    ఓ చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలిచి ఉండు.”

13 కనుక సూర్యుడు కదలలేదు. ప్రజలు తమ శత్రువులను ఓడించేంతవరకు చంద్రుడు కూడ నిలిచిపోయాడు. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆకాశం మధ్యలో సూర్యుడు స్తంభించిపోయాడు. ఒక రోజంతా అది కదల్లేదు. 14 ఆ రోజుకు ముందు ఎన్నడూ అలా జరుగలేదు. ఆ తర్వాత కూడ ఎన్నడూ మళ్లీ అలా జరుగలేదు. ఆ రోజు మనిషి మాట యెహోవా విన్నరోజు. నిజంగా ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా యుద్ధం చేసాడు!

15 ఇది జరిగిన తర్వాత యెహోషువా, అతని సైన్యం తిరిగి గిల్గాలు దగ్గర గుడారాలకు వెళ్లిపోయారు.

రోమీయులకు 15:14-24

ఉద్దేశ్యం

14 సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది. 15 అయినా నేను కొన్ని విషయాల్ని గురించి మీకు జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. ఆ వరము ఏదనగా 16 నేను యాజకునిగా పని చేస్తూ దైవసందేశాన్ని యూదులు కానివాళ్ళకు బోధించాలని దేవుడు నన్ను యేసు క్రీస్తుకు సేవకునిగా చేసాడు. ఇందువలన యూదులు కానివాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం కాగలరు.

17 అందువల్ల, నేను యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవ చేస్తున్నందుకు గర్విస్తున్నాను. 18 క్రీస్తు నా ద్వారా చేసినవాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కానివాళ్ళు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేసాడు. 19 గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను. 20 క్రీస్తును గురించి తెలియని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్లు కట్టటం నాకిష్టం లేదు. 21 అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఆయన్ని గురించి చెప్పబడినవాళ్ళు చూస్తారు.
    కాని వాళ్ళు తెలుసుకొంటారు. ఆయన్ని గురించి విననివాళ్ళు అర్థం చేసుకొంటారు.”(A)

రోము నగరాన్ని దర్శించాలని ప్రయత్నం

22 మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి.

23 ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ముగిసింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల నుండి మిమ్ముల్ని కలుసుకోవాలనుకొంటున్నాను. 24 నేను స్పెయిను దేశానికి వెళ్ళేటప్పుడు రోము నగరానికి వచ్చి కొన్ని రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. అక్కడి నుండి నేను ప్రయాణం సాగించినప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.

మత్తయి 27:1-10

రాష్ట్రపాలకుడైన పిలాతుయొద్దకు యేసుని తీసికొనిపొవటం

(మార్కు 15:1; లూకా 23:1-2; యోహాను 18:28-32)

27 తెల్లవారాక ప్రధాన యాజకులు, పెద్దలు అంతా సమావేశమై యేసును చంపటానికి నిశ్చయించారు. వాళ్ళాయన్ని బంధించి తీసుకెళ్ళి రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు.

యూదా ఆత్మహత్య

(అపొ. కా. 1:18-19)

యేసుకు ద్రోహం చేసిన యూదా యేసుని చంపటానికి నిశ్చయించారని విని చాలా బాధ పడ్డాడు. తాను తీసుకొన్న ముప్పై వెండి నాణాల్ని ప్రధాన యాజకులకు, పెద్దలకు తిరిగి యిచ్చేస్తూ, “నేను పాపం చేసాను. ఆ అమాయకుణ్ణి చావుకు అప్పగించాను” అని అన్నాడు.

వాళ్ళు, “అది నీ గొడవ. మాకు సంబంధం లేదు” అని సమాధానం చెప్పారు.

యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.

ప్రధానయాజకులు నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు” అని అన్నారు. వాళ్ళు ఆలోచించి ఆ ధనంతో విదేశీయుల్ని సమాధి చెయ్యటానికి ఉపయోగపడేటట్లు ఒక కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు. అందువల్లే ఈ నాటికీ ఆ పొలాన్ని “రక్తపు భూమి” అని అంటారు. 9-10 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ వాక్యాలు నెరవేరాయి,

“వాళ్ళు ముప్పై వెండి నాణెములను తెచ్చారు. ఇది అతని విలువ. ఇది ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించిన విలువ. ప్రభువు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు ఆ ధనంతో కుమ్మరి పొలాన్ని కొన్నారు.”[a]

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International