Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 31

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

31 యెహోవా, నీవే నా కాపుదల.
    నన్ను నిరాశపరచవద్దు.
    నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
    దేవా, నా మాట ఆలకించుము.
    వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
    నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
దేవా, నీవే నా బండవు, కోటవు
    కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
    వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
    నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
    నన్ను రక్షించుము.
వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం.
    యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.
దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది.
    నా కష్టాలు నీవు చూశావు.
    నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు.
నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు.
    వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.
యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉంచుము.
    నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి.
    నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది.
    నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి.
నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నాయి.
    నా బలం తొలగిపోతూ ఉంది.[a]
11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు.
    నా పొరుగు వాళ్లంతా కూడా నన్ను ద్వేషిస్తారు.
నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు.
    వారు నానుండి దూరంగా ఉంటారు.
12 నేను పాడైపోయిన పనిముట్టులా ఉన్నాను.
    నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను.
    ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.

14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
    నీవే నా దేవుడవు.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
    నన్ను రక్షించుము.
17 యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను.
    కనుక నేను నిరాశచెందను.
చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు,
    మౌనంగా వారు సమాధికి వెళ్తారు.
18 ఆ చెడ్డవాళ్లు గర్వించి,
    మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబుతారు.
ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు.
    కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.

19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.
    నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.
    ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు.
    కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.
    ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.
    కాని దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.

23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.
    యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు.
కాని తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.

కీర్తనలు. 35

దావీదు కీర్తన.

35 యెహోవా, నా పోరాటాలు పోరాడుము
    నా యుద్ధాలు పోరాడుము.
యెహోవా, కేడెము, డాలు పట్టుకొని,
    లేచి, నాకు సహాయం చేయుము.
ఈటె, బరిసె తీసుకొని
    నన్ను తరుముతున్న వారితో పోరాడుము.
“నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,

కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము.
    వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు.
    వారిని ఇబ్బంది పెట్టుము.
ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము.
    యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము.
    యెహోవా దూత వారిని తరుమును గాక!
నేనేమీ తప్పు చేయలేదు. కాని ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు.
    నేను తప్పు ఏమీ చేయలేదు. కాని వారు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు.
కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము.
    వారి స్వంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము.
    తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను.
    ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు.
    యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు.
దోచుకొనువారినుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు”
    అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబుతాను.
11 ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది.
    ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు.
12 నేను మంచి పనులు మాత్రమే చేశాను.
    కాని ఆ మనుష్యులు నాకు చెడ్డవాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.
13 ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను.
    ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను.
    నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది.
14 ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను.
    ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
15 అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు.
    ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు.
కొందరు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు.
    వాళ్లను నేను కనీసం ఎరుగను.
16 వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు.
    ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.

17 నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు?
    ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము.
    ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.

18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
19 అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు.
    నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.
20 నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు.
    శాంతియుతంగా ఉన్న ప్రజలకు చెడుపు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబుతున్నారు.
    వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీవేమి చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
22 యెహోవా, జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు.
    కనుక మౌనంగా ఉండవద్దు.
    నన్ను విడిచిపెట్ట వద్దు.
23 యెహోవా, మేలుకో! లెమ్ము!
    నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము.
24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము.
    ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వనీయ వద్దు.
25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము.
    “యెహోవా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము.
26 నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము.
    నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు.
తాము నాకంటె మేలైనవారము అని వారు తలంచారు.
    కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను, సిగ్గుతోను నింపి వేయుము.
27 నీతిని ప్రేమించే మనుష్యులారా,
    మీరు సంతోషించండి.
ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.”

28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబుతాను.
    నేను ప్రతి దినము స్తుతిస్తాను.

యెహోషువ 4:19-5:1

19 మొదటి నెల పదో రోజున ప్రజలు యొర్దాను నది దాటారు. యెరికోకు తూర్పున గిల్గాలులో ప్రజలు గుడారాలు వేసారు 20 యొర్దాను నదిలోనుంచి తీసుకొన్న పన్నెండు రాళ్లను ప్రజలు వారితో మోసుకొని వెళ్లారు. ఆ రాళ్లను గిల్గాలులో యెహోషువ నిలువ బెట్టాడు. 21 అప్పుడు యెహోషువ ప్రజలతో చెప్పాడు: “‘ఈ రాళ్లు ఏమిటి?’ అని భవిష్యత్తులో మీ పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతారు 22 ‘ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని ఆరిన నేలమీద దాటి వెళ్లారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్లు తోడ్పడుతాయి’ అని పిల్లలతో మీరు చెప్పాలి. 23 మీ యెహోవా దేవుడు ఆ నదిలో నీటి ప్రవాహాన్ని నిలిపివేసాడు. ప్రజలు దానిని దాటిపోయేంతవరకు నది ఎండిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర ప్రజలకు యెహోవా ఏమి చేసాడో, యొర్దాను నది దగ్గరకూడ ఆయన అలానే చేసాడు. ప్రజలు దాటి వెళ్లగలిగేందుకు ఎర్ర సముద్రంలో నీళ్లను యెహోవా నిలిపివేశాడని జ్ఞాపకం ఉంచుకోండి. 24 యెహోవాకు మహాశక్తి ఉందని ఈ దేశ ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన దీనిని చేసాడు. అప్పుడు ఆ ప్రజలు మీ యెహోవా దేవునికి ఎల్లప్పుడూ భయపడి ఉంటారు.”

కనుక ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నది దాటి వెళ్లేంతవరకు యెహోవా దానిని ఎండి పోయేటట్టు చేసాడు. యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న కనానీ ప్రజలు ఇది విని చాల భయపడిపోయారు. అంతటితో ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించే ధైర్యం వారికి లేక పోయింది.

యెహోషువ 5:10-15

10 ఇశ్రాయేలు ప్రజలు యెరికో మైదానాల్లో గిల్గాలులో దిగియున్నప్పుడే వారు పస్కా విందు చేసారు. అది ఆ నెల 14వ తేదీ సాయంత్రం. 11 మరునాడు పస్కా తర్వాత ప్రజలు ఆ దేశంలో పండిన ఆహారం కొంత భోజనం చేసారు. పులుపు పదార్థం లేని రొట్టెను, వేయించిన గింజలను వారు తిన్నారు. 12 ఆ రోజు ప్రజలు ఈ ఆహారం భోజనంచేసిన తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఆగిపోయింది. ఆ తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఇశ్రాయేలు ప్రజలకు లభించలేదు. అప్పట్నుంచి కనాను దేశంలో పండిన పంటనే వారు తిన్నారు.

యెహోవా సైన్యాధిపతి

13 యెహోషువ యెరికోకు సమీపంగా ఉన్నప్పుడు అతడు పైకి చూడగా అతని యెదుట ఒక మనిషినిలిచి ఉండటం కనబడింది. ఆ మనిషి చేతిలో ఒక ఖడ్గం ఉంది. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు.

14 ఆ మనిషి, “నేను శత్రువును కాను. నేను యెహోవా సైన్యములకు సేనాధిపతిని. ఇప్పుడే నేను మీ దగ్గరకు వచ్చాను” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ, ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి, “నా యజమానీ, తన సేవకుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగాడు.

15 అందుకు యెహోవా సైన్యాధిపతి, “నీ చెప్పులు తీసివేయి. ఇప్పుడు నీవు నిలిచిన స్థలం పవిత్ర స్థలము” అని చెప్పాడు. కనుక యెహోషువ ఆయనకు విధేయుడయ్యాడు.

రోమీయులకు 12:9-21

ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి. 10 సోదర ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి. 11 ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి. 12 పరలోకం లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమయాల్లో సహనం వహించి, అన్ని వేళలా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి. 13 మీ సహాయం అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతిథ్యాన్ని మరువకండి.

14 మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి కాని, దూషించకూడదు. 15 ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. 16 అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగలవాళ్ళతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి.

17 కీడు చేసినవాళ్ళకు కీడు చెయ్యకండి. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచిదనిపించేదాన్ని చెయ్యటానికి జాగ్రత్త పడండి. 18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. 19 మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో,

“పగ తీర్చుకోవటం నా వంతు.
    నేను ప్రతీకారం తీసుకొంటాను”(A)

అని వ్రాయబడి ఉంది. 20 దానికి మారుగా,

“మీ శత్రువు ఆకలితో ఉంటే
    అతనికి ఆహారం ఇవ్వండి.
అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి.
    ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని
తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది”(B)

అని వ్రాయబడి ఉంది. 21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి.

మత్తయి 26:17-25

పస్కా భోజనం

(మార్కు 14:12-21; లూకా 22:7-14, 21-23; యోహాను 13:21-30)

17 పులియని రొట్టెలు తినే పండుగ రోజులు వచ్చాయి. మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పస్కా పండుగ భోజనం ఎక్కడ సిద్ధం చేయమంటారు?” అని అడిగారు.

18 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పట్టణంలోకి నేను చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. అతనితో ‘నా సమయం దగ్గరకొచ్చింది. నేను నా శిష్యులతో కలసి పస్కా పండుగ భోజనం మీ యింట్లో చెయ్యాలనుకొంటున్నానని మా ప్రభువు చెప్పమన్నారు’ అని చెప్పండి.” 19 శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కాపండుగ విందు సిద్దం చేసారు.

20 సాయంత్రం కాగానే యేసు పన్నెండు మందితో కలసి భోజనానికి కూర్చున్నాడు. 21 అంతా భోజనం చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.

22 వాళ్ళకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడు ఆయనతో, “ప్రభూ! నేను కాదు కదా!” అని అన్నాడు.

23 యేసు సమాధానం చెబుతూ, “నాతో కలసి గిన్నెలో చెయ్యి ఉంచిన వాడు నాకు ద్రోహం చేస్తాడు. 24 మనుష్యకుమారుడు లేఖనాల్లో వ్రాసినట్లు చనిపోతాడు. కాని ఆయనకు ద్రోహంచేసిన వానికి బహుశ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండక పోయినట్లయితే బాగుండేది” అని అన్నాడు.

25 అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ”[a] అని అన్నాడు.

యేసు, “ఔను! నువ్వే!”[b] అని సమాధానం చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International