Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 80

సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
    యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
    వచ్చి మమ్మల్ని రక్షించుము.
దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
    మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
    మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
    నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
    మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
    నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
    ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
    నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
“ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
    దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
    దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11     దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
    ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
    అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
    పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
    నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
    నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
    నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
    అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
    నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

కీర్తనలు. 77

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.

77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
    దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
    రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
    నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
    నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
నీవు నన్ను నిద్రపోనియ్యవు.
    నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను.
గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
    చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
    నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
“మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
    ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
    ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
    ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది.

10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
    అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.

11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
    దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
    ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
    దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
    నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
    యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.

16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
    లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
    ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
    అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
    మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
    భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
    కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
    మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.

కీర్తనలు. 79

ఆసాపు స్తుతి కీర్తన.

79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
    ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
    యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
    అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
    మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
    మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
    బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
    నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
    వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
    త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
    నీవు మాకు ఎంతో అవసరం.
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
    నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
    నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
    అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
    నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
    దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
    ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
    మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
    దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.

లేవీయకాండము 25:35-55

బానిసల యజమానులకు నియమాలు

35 “ఒకవేళ మీ దేశ ప్రజల్లో ఒకడు పోషణ సాగనంత పేదరికంలో పడవచ్చు. మీరు అతణ్ణి అతిథిలా మీతో జీవింపనియ్యాలి. 36 మీరు అతనికి అప్పుగా యిచ్చే మొత్తంమీద వడ్డీ కట్టవద్దు. ఆ సోదరుణ్ణి నీతో నివసింపనిచ్చి, నీ దేవుణ్ణి ఘనపరచు. 37 అతనికి వడ్డీకి అప్పు ఇవ్వవద్దు. అతడు భోజనం చేసే ఆహారం మీద లాభాలు గడించేందుకు ప్రయత్నించవద్దు. 38 నేను మీ దేవుడైన యెహోవాను. కనాను దేశాన్ని మీకు ఇచ్చి, మీకు దేవుణ్ణిగా ఉండేందుకు నేనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చాను.

39 “ఒకవేళ నీ సోదరుల్లో ఒకడు మరీ దరిద్రుడై, నీకు బానిసగా అమ్ముడుపోవచ్చును. నీవు అతణ్ణి ఒక బానిసలా పని చేయించకూడదు. 40 అతడు ఒక కిరాయి పనివానిలా, అతిధిలా బూరధ్వని చేసే మహోత్సవ కాలం వరకు నీతో ఉంటాడు. 41 తర్వాత అతడు నిన్ను విడిచి పెట్టవచ్చును. అతడు తన పిల్లలను తీసుకొని తిరిగి తన కుటుంబంలోనికి వెళ్ళిపోవచ్చును. అతడు తన పూర్వీకుల ఆస్తులను తిరిగి పొందవచ్చును. 42 ఎందుచేతనంటే, వాళ్లు నా సేవకులు, ఈజిప్టు బానిసత్వంలో నుండి నేను వాళ్లను తీసుకొనివచ్చాను. వాళ్లు మరల బానిసలు కాకూడదు. 43 ఇలాంటి వ్యక్తిని నీవు కఠినంగా పాలించగూడదు. నీ దేవుణ్ణి నీవు ఘనపర్చాలి.

44 “నీ స్త్రీ, పురుష బానిసల విషయం: మీ చుట్టు పక్కల దేశాలనుండి ఆడ, మగ బానిసలను మీరు తెచ్చుకోవచ్చును. 45 మరియు, మీ దేశంలో నివసిస్తున్న విదేశీయుల పిల్లలు వస్తానంటే వారిని కూడ మీరు బానిసలుగా తీసుకోవచ్చును. ఆ పిల్ల బానిసలు మీకు చెందుతారు. 46 ఈ విదేశీ బానిసలు మీ పిల్లల వశం అయ్యేటట్టు, మీ మరణానంతరం మీరు వారిని మీ పిల్లలకు అప్పగించవచ్చును. వాళ్లు శాశ్వతంగా మీకు బానిసలు. ఈ విదేశీయుల్ని మీరు బానిసలుగా చేసుకోవచ్చును. కానీ మీ స్వంత సోదరులైన ఇశ్రాయేలు ప్రజలను మాత్రం కఠినంగా పాలించగూడదు.

47 “ఒకవేళ ఒక విదేశీయుడు లేక అతిథి మీ మధ్యధనికుడు కావచ్చు, ఒకవేళ మీ దేశంలో ఒకడు దరిద్రుడై మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయునికి బానిసగా లేక అతని కుటుంబంలో సభ్యునిగా అమ్ముడు పోయాడనుకోండి. 48 ఆ వ్యక్తి తిరిగి కొనబడి, స్వంతంత్రుడు అయ్యేందుకు అతనికి హక్కు ఉంటుంది. అతని సోదరుల్లో ఒకరు అతణ్ణి తిరిగి కొనవచ్చును. 49 అతని పినతండ్రిగాని, పిన తండ్రి కుమారుడు గాని అతణ్ణి కొనవచ్చును. లేక అతని వంశంలో అతని రక్తసంబంధి ఎవరైనా అతణ్ణి కొనవచ్చును. లేక ఒకవేళ ఆ వ్యక్తి తానే సరిపడినంత ధనం సంపాయించు కొంటే, తానే డబ్బు చెల్లించి మరల స్వతంత్రుడు కావచ్చును.

50 “వెల మీరెలా నిర్ణయిస్తారు? అతడు విదేశీయునికి తనను తాను అమ్ముకొన్న సమయంనుండి వచ్చే బూరధ్వని చేసే మహోత్సవ కాలంవరకు ఎన్ని సంవత్సరాలో మీరు లెక్కగట్టాలి. వెల నిర్ణయం చేయటానికి ఆ లెక్కను ఉపయోగించాలి. ఎందుచేతనంటే అవతలి వ్యక్తి యితణ్ణి వాస్తవానికి కొన్ని సంవత్సరాలకోసమే ‘కిరాయికి’ పెట్టుకొన్నాడు. 51 బూరధ్వని చేసే మహోత్సవ కాలానికి ఇంకా చాల సంవత్సరాలు కావాల్సిఉంటే, ఆ వ్యక్తి వెలలో అధిక భాగం తిరిగి చెల్లించాలి. అదంతా సంవత్సరాల సంఖ్యమీద ఆధారపడి ఉంటుంది. 52 ఉత్సవ సంవత్సరానికి మరికొన్ని యేండ్లు మాత్రమే మిగిలి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అసలు వెలలో కొద్ది మాత్రమే చెల్లించాలి. 53 అయితే ఆ వ్యక్తి కిరాయి పని వాడిలాగానే ఆ విదేశీయుని దగ్గర ప్రతి సంవత్సరం నివసిస్తాడు. ఆ విదేశీయుడు ఆ వ్యక్తి మీద కఠినంగా ప్రవర్తించకుండును గాక.

54 “ఆ వ్యక్తిని ఎవకూ కొనకపోయినప్పటికి, అతడు స్వతంత్రుడు అవుతాడు. బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో అతడు, అతని పిల్లలు స్వతంత్రులవుతారు. 55 ఎందుచేతనంటే, ఇశ్రాయేలు ప్రజలు నా సేవకులు. వాళ్లు నా సేవకులు. ఈజిప్టు బానిసత్వం నుండి నేను వాళ్లను తీసుకొని వచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను!

కొలొస్సయులకు 1:9-14

ఆత్మీయ జ్ఞానము, తనను గురించిన జ్ఞానము, మీకు ప్రసాదించమని మిమ్మల్ని గురించి విన్ననాటి నుండి విడువకుండా మీకోసం దేవుణ్ణి ప్రార్థించాము:

మీకు “దైవేచ్ఛ” ను తెలుసుకొనే జ్ఞానం కలగాలని మా అభిలాష. 10 మీరు ప్రభువు యిచ్ఛానుసారం జీవించాలనీ, అన్ని వేళలా ఆయనకు ఆనందం కలిగించే వాటిని మాత్రమే చేయాలనీ మా అభిలాష. సత్కార్యాలు చేసి ఫలం చూపించండి. దేవుణ్ణి గురించి మీకున్న జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోండి. 11 సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మీకు శక్తినిచ్చు గాక! అప్పుడు అన్నిటినీ సంతోషంతో భరించగల సహనము మీలో కలుగుతుంది.

12 దేవుడు తన వెలుగు రాజ్యంలో, అంటే తన విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ఉంచిన దానిలో మీకు భాగం లభించేటట్లు చేసాడు. దానికి మీరు తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండండి. 13 మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు. 14 కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు.

మత్తయి 13:1-16

రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం

(మార్కు 4:1-9; లూకా 8:4-8)

13 అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు. ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు. ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు,

“ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి. వినేవాళ్లు వినండి!”

యేసు బోధించుటకు ఉపమానములను ఎందుకు ఉపయోగించాడు

(మార్కు 4:10-12; లూకా 8:9-10)

10 శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు.

11 ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు. 12 దేవుడు గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. 13 నేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. విన్నా అర్దంచేసుకోరు, గ్రహించరు. 14 తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది:

‘మీరు తప్పక వింటారు,
    కాని అర్థంచేసుకోలేరు.
మీరు తప్పక చూస్తారు
    కాని గ్రహించలేరు.
15 వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని,
    హృదయాలతో అర్థం చేసుకొని నావైపు మళ్ళితే
    నేను వాళ్ళను నయం చేస్తాను.
కాని అలా జరుగరాదని
    ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి.
    వాళ్ళకు బాగా వినిపించదు.
    వాళ్ళు తమ కళ్ళు మూసికొన్నారు.’(A)

16 కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International