Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 97

97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
    దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
    నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
    ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
    ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
    భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
    ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!

మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
    వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
    వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
సీయోనూ, విని సంతోషించుము!
    యూదా పట్టణములారా, సంతోషించండి!
    ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
    ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
    కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.

కీర్తనలు. 99

99 యెహోవాయే రాజు.
    కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
    అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
సీయోనులో యెహోవా గొప్పవాడు.
    ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
    దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
    దేవా, నీతిని నీవు చేశావు.
    యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
    మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
    దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
    వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
    దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
    నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
    ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
    మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.

కీర్తనలు. 115

115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
    నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
    ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
    వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
    వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
    వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
    వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.

ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
    యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
    యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
    యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.

12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
    యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
    యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
    యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.

14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15     యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
    ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
    కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
    కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
    మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!

యెహోవాను స్తుతించండి!

నిర్గమకాండము 12:40-51

40 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో[a] 430 సంవత్సరాలు జీవించారు. 41 నాలుగువందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ[b] ఈజిప్టు దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి. 42 కనుక యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాలవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజలంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటారు.

43 మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు. 44 ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు. 45 అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”

46 “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు. 47 ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి. 48 ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు. 49 అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.”

50 మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు. 51 కనుక అదే రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపులుగా బయల్దేరారు.

1 కొరింథీయులకు 15:29-41

29 పునరుత్థానం లేనట్లయితే, మరి చనిపోయినవాళ్ళ కోసం, బాప్తిస్మము పొందినవాళ్ళ సంగతేమిటి? వాళ్ళు ఏ విధంగా బ్రతికి వస్తారు? చనిపోయినవాళ్ళు బ్రతికి రానట్లయితే ఇంకా బాప్తిస్మము ఎందుకు ఇస్తున్నారు.

30 మరి మేము ప్రతి గడియ మా ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో వేసుకొంటున్నాం? 31 సోదరులారా! నేను ప్రతీరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నాను. మన క్రీస్తు ప్రభువులో మిమ్మల్ని చూసి గర్విస్తాను. కనుక మీకు ఈ విషయం చెపుతున్నాను. 32 ఒకవేళ నేను ఎఫెసులో క్రూరమృగాలతో పోట్లాడటం, మానవ కారణంగా మాత్రమే అయినట్లయితే నాకొచ్చిన లాభం ఏమిటి? చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతకనట్లయితే, “తిని, త్రాగుదాం, ఎలాగో మరణిస్తాంగదా.”(A)

33 మోసపోకండి, “చెడు సహవాసం మంచివాణ్ణి చెడుపుతుంది.” 34 మేలుకోండి. పాపం చెయ్యటం మానుకొండి. మీలో కొందరికి దేవుణ్ణి గురించి తెలియదు. అది సిగ్గుచేటు.

బ్రతికి వచ్చిన దేహం

35 కొందరు, “చనిపోయినవాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” అని అడగవచ్చు. 36 ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు. 37 నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు. 38 దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు. 39 మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం. 40 ఆకాశంలో జ్యోతులున్నాయి, భూమ్మీద జ్యోతులున్నాయి, గాని వాటి వాటి ప్రకాశం వేరు. 41 సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు.

మత్తయి 28:1-16

యేసు బ్రతికి రావటం

(మార్కు 16:1-8; లూకా 24:1-12; యోహాను 20:1-10)

28 విశ్రాంతి రోజు గడిచింది. ఆదివారం సూర్యోదయమవుతుండగా మగ్దలేనే మరియ, యింకొక మరియ సమాధిని చూడటానికి వెళ్ళారు.

అప్పుడు ఒక భూకంపం వచ్చింది. పరలోకం నుండి ప్రభువు దూత వచ్చి ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ రాతిని దొర్లించి దాని మీద కూర్చొన్నాడు. ఆ రూపం మెరుపులా ఉంది. అతని దుస్తులు మంచువలె తెల్లగా ఉన్నాయి. సమాధిని కాపలా కాస్తున్న భటులు అతన్ని చూసి భయపడి వణికిపోయి, చనిపోయిన వాళ్ళలా అయ్యారు.

ఆ దేవదూత, స్త్రీలతో ఈ విధంగా అన్నాడు: “భయపడకండి, సిలువకు వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు. ఆయనిక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లు బ్రతికి వచ్చాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. ఆ తదుపరి వెంటేనే వెళ్ళి ఆయన శిష్యులతో, ‘ఆయన బ్రతికి వచ్చాడు. మీకన్నా ముందే గలిలయకు వెళ్ళబోతున్నాడు. మీరు ఆయన్ని అక్కడ కలుసుకొంటారు’ అని చెప్పండి. నేను చెప్పవలసింది చెప్పాను.”

ఆ స్త్రీలు ఆయన శిష్యులకు చెప్పాలని సమాధి దగ్గరనుండి భయంతో, ఆనందంతో పరుగెత్తికొంటూ వెళ్ళారు. యేసు వాళ్ళను కలుసుకొని, “శుభం!” అని అన్నాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళపైబడి ఆయనకు మ్రొక్కారు. 10 అప్పుడు యేసు వాళ్ళతో, “భయపడకండి. వెళ్ళి నా సోదరులతో గలిలయకు వెళ్ళమని చెప్పండి. వాళ్ళు అక్కడ నన్ను కలుసుకొంటారు” అని అన్నాడు.

ప్రధాన యాజకులు భటుల్నిఅబద్దమాడమని కోరటం

11 ఆ స్త్రీలు వెళ్ళిపొయ్యారు. అదే సమయంలో కొంతమంది భటులు పట్టణంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజకులతో చెప్పారు. 12 ప్రధాన యాజకులు పెద్దల్ని కలుసుకొని ఒక కుట్ర పన్నారు. వాళ్ళు భటులకు పెద్ద మొత్తాలిస్తూ వాళ్ళతో, 13 “అతని శిష్యులు, ‘మేము రాత్రి వేళ నిద్రిస్తుండగా వచ్చి అతని దేహాన్ని దొంగిలించుకు పొయ్యారు’ అని చెప్పండి. 14 ఈ వార్త రాష్ట్రపాలుకునిదాకా వెళ్తే అతణ్ణి శాంత పరచి మీకు కష్టం కలుగకుండా మేము చూస్తాము” అని అన్నారు. 15 భటులు డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేసారు. ఈ కథ బాగా వ్యాపించి ఈ నాటికి వాడుకలో ఉంది.

యేసు తన శిష్యులతో మాట్లాడటం

(మార్కు 16:14-18; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)

16 ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలిలయకు వెళ్ళి, యేసు చెప్పిన కొండ మీదికి వెళ్ళారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International