Book of Common Prayer
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.
66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.
5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
6 సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.
8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.
16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
14 “కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటారు. మీకు అది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా ఈ పండుగను ఆచరించి యెహోవాను ఘనపర్చాలి. 15 ఈ పండుగనాడు ఏడు రోజుల పాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఈ పండుగ మొదటి రోజున పులిసే పదార్థాన్ని మీ ఇండ్లలోనుంచి తీసివేయాలి. ఈ పండుగ జరిగే మొత్తం ఏడు రోజుల్లోనూ పులిసిన పదార్థాన్ని ఏ ఒక్కరూ తినకూడదు. ఎవరైనా సరే పులిసే పదార్థం తింటే, ఆ వ్యక్తిని ఇశ్రాయేలు వాళ్లనుండి మీరు వేరుచేయాలి. 16 పండుగలో మొదటి రోజున, చివరి రోజున పరిశుద్ధ సమావేశాలు ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఏ పనీ చేయకూడదు. ఇలాంటి రోజుల్లో మీరు భోంచేయటానికి అవసరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవడం ఒక్కటే మీరు చెయ్యొచ్చు. 17 పులియని పిండితో చేసే రొట్టెల పండుగను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుచేతనంటే, సరిగ్గా ఈ రోజే మీ వంశాలన్నింటినీ ఈజిప్టు నుండి నేను బయటకు నడిపిన రోజు. అందుచేత మీ తర్వాత మీ సంతానమంతా ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది శాశ్వతంగా ఉండిపోయే చట్టం. 18 కనుక మొదటి నెల (నిసాను) 14వ రోజు సాయంత్రం నుండి మీరు పులియని రొట్టెలు తినడం మొదలు పెట్టాలి. అదే నెల 21 రోజు సాయంత్రం వరకు అలాంటి రొట్టెలే మీరు తినాలి. 19 ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో ఎక్కడా పులిసిన పదార్థం ఉండకూడదు. ఇశ్రాయేలు పౌరుడేకాని, విదేశీయుడేగాని ఏ వ్యక్తిగాని ఈ సందర్భంలో పులిసిన పదార్థం తింటే, మిగిలిన ఇశ్రాయేలీయులందరినుండి ఆ వ్యక్తి వేరు చేయబడాలి. 20 ఈ పండుగ సమయంలో మీరు పులిసిన పదార్థం తినకూడదు. మీరు ఎక్కడ ఉన్నాసరే, పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి.”
21 కనుక పెద్దలందర్నీ మోషే పిలిచి, “మీ కుటుంబాల కోసం గొర్రెపిల్లల్ని తెచ్చుకొని, పస్కా పండుగకు ఆ గొర్రెపిల్లల్ని తీసుకోండి. 22 హిస్సోపు కొమ్మలు తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి. ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తాన్ని పూయండి. తెల్లారేవరకు ఎవరూ తమ ఇండ్లు విడిచి వెళ్ల కూడదు. 23 ఈజిప్టులో జ్యేష్ఠ సంతానాన్ని చంపడానికి యెహోవా సంచరించే సమయంలో, ద్వారబంధాల నిలువు కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు యెహోవా ఆ ఇంటిని కాపాడుతాడు[a] నాశనకారుడ్ని యెహోవా మీ ఇంట్లోకి రానివ్వడు. మిమ్మల్ని బాధింపనియ్యడు. 24 ఈ ఆజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చట్టం మీకు, మీ సంతానానికి శాశ్వతంగా ఉంటుంది. 25 యెహోవా మీకు ఇచ్చే దేశానికి వెళ్లిన తర్వాత కూడ మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి. 26 ‘ఈ ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు 27 ‘యెహోవాను ఘనపర్చడం కోసమే ఈ పస్కా పండుగ. ఎందుచేతనంటే, మనం ఈజిప్టులో ఉన్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు గృహాలను దాటిపోయాడు[b] యెహోవా ఈజిప్టు వాళ్లను చంపేసాడు. కానీ మన ఇళ్లల్లో వారిని ఆయన రక్షించాడు. అందుచేత ఇప్పుడు ప్రజలు సాష్టాంగపడి యెహోవాను ఆరాధిస్తున్నారు’ అని మీరు చెప్పాలి.” అని అన్నాడు.
క్రీస్తు బ్రతికి రావటం
15 సోదరులారా! నేను మీకు ప్రకటించిన సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించారు. దాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం. 2 నేను బోధించిన సువార్తను మీరు విడవకుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది.
3 నేను పొందినదాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు. 4 లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతిపెట్టబడి మూడవ రోజున బ్రతికింపబడ్డాడు. 5 పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు. 6 ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపొయ్యారు. 7 ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు. 8 చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు.
9 ఎందుకంటే, అపొస్తలుల్లో నేను అధముణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కనుక అపొస్తలుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను. 10 కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృథా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది. 11 నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు.
యేసు బ్రతికి రావటం
(మత్తయి 28:1-8; లూకా 24:1-12; యోహాను 20:1-10)
16 విశ్రాంతి రోజు[a] ముగియగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ మరియు సలోమే యేసు దేహానికి పూయటానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2 ఆదివారం ఉదయం సూర్యోదయం అవుతుండగా వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్ళాలని బయలుదేరారు. 3 “ఇంతకూ సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఎవరు తీస్తారు?” అని పరస్పరం దారిలో మాట్లాడుకొన్నారు.
4 వాళ్ళు కళ్ళెత్తి సమాధి వైపు చూసారు. ఆ పెద్దరాయి దొర్లిపోయి ఉంది. 5 వాళ్ళు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపు ఒక యువకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూసారు. వాళ్ళకు భయం వేసింది.
6 ఆ యువకుడు, “భయపడకండి, సిలువకు వేయబడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన యిక్కడ లేడు. ఆయన బ్రతికి వచ్చి వెళ్ళిపొయ్యాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి. 7 కాని మీరు వెళ్ళి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా చెప్పండి: ‘యేసు మీకు ముందే గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందే చెప్పినట్లు, మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.’”
8 ఆ స్త్రీలు దిగ్భ్రాంతి చెంది వణుకుతూ ఆ సమాధినుండి పరుగెత్తి పోయారు. భయంవల్ల వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పలేదు.[b]
© 1997 Bible League International