Book of Common Prayer
సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.
2 దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని
ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.
76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
2 దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.
4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
7 దేవా, నీవు భీకరుడవు.
నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.
11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
బలంగా, ధైర్యంగా ఉండుము.
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
యోసేపు ఇంటియందు సోదరులు
16 ఈజిప్టులో, వారితోబాటు బెన్యామీను ఉండటం యోసేపు చూశాడు. యోసేపు, “ఆ మనుష్యుల్ని నా ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట చేయండి. ఈవేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు. 17 అతను చెప్పినట్లే ఆ సేవకుడు చేశాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు.
18 వాళ్లు యోసేపు ఇంటికి తీసుకొని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. “పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉంచబడినందువల్లనే మనల్ని ఇక్కడకు తీసుకు వచ్చారు. మనల్ని నేరస్తులుగా నిరూపించటానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత మన గాడిదల్ని దొంగిలించి, మనల్ని బానిసలుగా చేస్తారు” అని వారనుకొన్నారు.
19 కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైనవాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు. 20 వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబుతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేము వచ్చాం. 21-22 ఇంటికి వెళ్తూ మార్గంలో మేము మా సంచులు విప్పితే, మా ప్రతి ఒక్కరి సంచిలోనూ డబ్బు కనబడింది. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు. అయితే ఆ డబ్బు మళ్లీ మీకు ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం. పైగా ఇప్పుడు మేము కొనాలనుకొంటున్న ధాన్యంకోసం ఇంకా ఎక్కువ మొత్తంకూడ మళ్లీ ఇప్పుడు తెచ్చాం.”
23 అయితే ఆ సేవకుడు, “భయపడకండి, నన్ను నమ్మండి. మీ దేవుడు, మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయినసారి ధాన్యంకోసం డబ్బును మీరు నాకే చెల్లించినట్లు నాకు గుర్తు” అని వారితో చెప్పాడు.
ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలోనుంచి బయటకు తీసుకొని వచ్చాడు. 24 ఆ సేవకుడు వాళ్లందరిని యోసేపు ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతడు వారికి నీళ్లు ఇస్తే, వాళ్లు కాళ్లు కడుక్కొన్నారు. తర్వాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు.
25 ఆ సోదరులు తాము యోసేపుతోబాటు భోంచేయబోతున్నట్లు విన్నారు. కనుక వారు అతనికోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నంవరకు సిద్ధం చేసుకొన్నారు.
26 యోసేపు ఇంటికి వచ్చాడు, ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు నేలమీద సాష్టాంగపడ్డారు.
27 వారెలా ఉన్నారని యోసేపు వాళ్లను అడిగాడు, “మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా?” అన్నాడు యోసేపు.
28 ఆ సోదరులు, “అయ్యా, మా తండ్రి బాగున్నాడు. ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడు” అని జవాబిచ్చారు. మళ్లీ వాళ్లంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు.
29 అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు, (బెన్యామీను, యోసేపు ఒక్క తల్లి పిల్లలు). “మీరు నాతో చెప్పిన మీ చిన్న సోదరుడు ఇతడేనా?” అని యోసేపు అడిగాడు. అప్పుడు యోసేపు, “కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక!” అన్నాడు బెన్యామీనుతో.
30 అప్పుడు యోసేపు ఆ గదిలోనుంచి పరుగెత్తిపోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న ప్రేమను అతనికి చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. అతనికి ఏడ్చెయ్యాలనిపించింది గాని అతడు ఏడ్వటం అతని సోదరులు చూడకూడదు అనుకొన్నాడు. కనుక యోసేపు తన గదిలోనికి పరుగెత్తి పోయి అక్కడ ఏడ్చాడు. 31 తర్వాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతడు తనను తాను ఓదార్చుకొని, “భోజనానికి వేళ అయ్యింది” అన్నాడు.
32 ఆ సేవకులు యోసేపు ఒక్కడిని ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. ఈజిప్టువాళ్లు హీబ్రూవారితో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టు మత విరోధం. 33 యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులను పెద్దవానితో మొదలుబెట్టి చిన్నవాని వరకు వరుసక్రమంలో కూర్చోబెట్టారు. అందువల్ల వాళ్ళకు ఆశ్చర్యమైంది. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్లు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు.[a] 34 సేవకులు యోసేపు బల్లమీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్లకంటె అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని త్రాగారు.
10 వివాహితులకు నా ఆజ్ఞ ఇది. ఇది నా ఆజ్ఞ కాదు. ప్రభువుయొక్క ఆజ్ఞ. భార్య తన భర్తను వదిలివేయరాదు. 11 అలా వదిలివేస్తే ఆమె తిరిగి పెళ్ళి చేసుకోకూడదు. లేదా భర్తతో సమాధాన పడాలి. అలాగే భర్త తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు.
12 మిగతా వాళ్ళకు నా ఆజ్ఞ యిది. ఇది ప్రభువు ఆజ్ఞ కాదు. నా ఆజ్ఞ. ఒక విశ్వాసి భార్య ప్రభువును నమ్మనిదై అతనితో ఉండటానికిష్టపడితే అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 13 అలాగే ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి అతడు ఆమెతో జీవించాలని అనుకొంటే ఆమె అతనికి విడాకులు ఇవ్వకూడదు. 14 అంటే, విశ్వాసం లేని భర్త విశ్వాసురాలైన భార్యతో కలిసి జీవించటంవల్ల పవిత్రమౌతాడు. అదే విధంగా అవిశ్వాసియైన భార్య విశ్వాసియైన భర్తతో కలసి జీవించటం వల్ల పవిత్రమౌతుంది. అలాకానట్లయితే మీ సంతానం అపవిత్రంగా ఉంటుంది. కాని ఇప్పుడున్న ప్రకారం వాళ్ళు పవిత్రులే.
15 కాని, విశ్వాసి కానివాడు వెళ్ళిపోవాలని అనుకొంటే వెళ్ళిపోనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసికి కాని, విశ్వాసురాలికి కాని ఏ నిర్భంధం ఉండకూడదు. దేవుడు శాంతితో జీవించటానికే మనల్ని పిలిచాడు. 16 ఓ స్త్రీ! నీ వల్ల నీ భర్త రక్షింపబడుతాడో లేదో! నీకేమి తెలుసు? ఓ పురుషుడా! నీ వల్ల నీ భార్య రక్షింబడుతుందో లేదో! నీకేమి తెలుసు?
దేవుడు నిన్ను పిలిచినట్లే జీవించు
17 ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదించిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం ప్రభువు నియమించిన ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా ఉండాలి. ఈ నియమాన్ని అన్ని సంఘాలు పాటించాలని ఆజ్ఞాపిస్తున్నాను. 18 సున్నతి చేయించుకొన్నవాడు దేవుని పిలుపును అంగీకరిస్తే, అతడు ఆ సున్నతి లేనివానిగా ఉండుటకు ప్రయత్నించరాదు. సున్నతి చేయించుకొననివాడు దేవుని పిలుపును అంగీకరిస్తే అతడు సున్నతి చేయించుకోవటానికి ప్రయత్నం చేయరాదు. 19 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోక పోయినా జరిగేది ఏమిలేదు. దేవుని ఆజ్ఞల్ని పాటించటం ముఖ్యం. 20 ప్రతి ఒక్కడూ, దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఉండాలి. 21 దేవుడు పిలిచినప్పుడు నీవు బానిసవా? చింతించకు. కాని నీవు స్వేచ్ఛ పొందగలిగితే అందుకు ప్రయత్నం చేయి. 22 ప్రభువు పిలిచినప్పుడు బానిసగా ఉన్నవాడు, ప్రభువులో ఐక్యత పొందటంవల్ల స్వేచ్ఛను పొందుతాడు. అదే విధంగా ప్రభువు పిలిచినప్పుడు స్వేచ్ఛగా ఉన్నవాడు ప్రభువుకు బానిస అవుతాడు. 23 మీకోసం వెల చెల్లించి దేవుడు మిమ్మల్ని కొన్నాడు. మానవులకు బానిసలు కాకండి. 24 సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి దేవునితో కలిసి ఉండండి.
యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం
(మత్తయి 8:28-34; లూకా 8:26-39)
5 వాళ్ళు సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. 2 యేసు పడవ నుండి క్రిందికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు. 3 వాడు స్మశానంలో నివసిస్తుండే వాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ పట్టి ఉంచలేక పోయారు. 4 వాని చేతుల్ని, కాళ్ళను ఎన్నోసార్లు యినుప గొలుసులతో కట్టివేసే వాళ్ళు. కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్ళకు వేసిన యినుప కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగలశక్తి ఎవ్వరికి లేదు. 5 వాడు స్మశానంలో సమాధుల దగ్గర, కొండల మీదా, రాత్రింబగళ్ళు బిగ్గరగా ఏడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకొనేవాడు.
6 వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాడు. 7 “యేసూ! మహోన్నతుడైన దేవుని కుమారుడా! మాజోలికి రావద్దయ్యా! మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమాణంతో చెప్పండి” అని వాడు బిగ్గరగా అరుస్తూ ప్రాధేయ పడ్డాడు. 8 ఎందుకంటే ఒక్క క్షణం క్రితం యేసు వానితో, “ఓ! దయ్యమా! ఆ మనిషి నుండి బయటకు రా!” అని అన్నాడు.
9 యేసు వాణ్ణి, “నీ పేరేమి?” అని అడిగాడు.
“నా పేరు ‘పటాలం’.[a] మా గుంపు చాలా పెద్దది” అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. 10 వానిలోని దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి పంపివేయవద్దని దీనంగా ఎన్నోసార్లు వేడుకొన్నాయి.
11 ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు మేస్తూవుంది. 12 ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల్లోకి పంపండి. వాటిలో ప్రవేశించటానికి అనుమతివ్వండి” అని అన్నాయి. 13 యేసు వాటికి అనుమతి యిచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. రెండువేల దాకా ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సున పడి మునిగిపొయ్యాయి.
14 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, ఈ సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. 15 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల పటాలం పట్టినవాడు దుస్తులు వెసుకొని సక్రమమైన బుద్ధితో, కూర్చొని ఉండటం గమనించారు. వాళ్ళకు భయం వేసింది. 16 జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్ళకందరికి చెప్పారు. 17 వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు.
18 యేసు పడవనెక్కుతుండగా దయ్యం పట్టిన వాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు. 19 యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, “ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబం లోని వాళ్ళతో చెప్పు” అని అన్నాడు.
20 అతడు వెళ్ళి దెకపొలిలో[b] యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.
© 1997 Bible League International