Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 55

సంగీత నాయకునికి: వాయిద్యాలతోపాడునది. దావీదు ప్రార్థన.

55 దేవా, నా ప్రార్థన వినుము.
    దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.
    నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.
    నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు.
    వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
నాలో నా గుండె అదురుతోంది.
    నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది.
నాకు భయము మరియు వణకుగా ఉంది.
    నేను భయపడిపోయాను.
ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.
    నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
    నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.

నేను పరుగెత్తి పోదును.
    నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.
    ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.
    ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.
    ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.

12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే
    దానిని నేను భరించగలను.
ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే
    నేను దాక్కోగలను.
13 కాని, అది చేస్తున్నది నీవే.
    నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14 మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము.
    దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.

15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.
    వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను.
    ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.

16 నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను.
    యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
17 సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను.
    ఆయన నా మాట వింటాడు.
18 నేను చాలా యుద్ధాలు చేశాను.
    కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు.
19 దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు.
    నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు.

నా శత్రువులు వారి బ్రతుకులు మార్చుకోరు.
    వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
20 నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు.
    అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
21 అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు.
    కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు.
వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి
    కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.

22 నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు
    ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు.
    మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
23 కాని దేవా! దుష్టులను సమాధి అనే గుంటలోనికి అణచివేస్తావు.
    రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్ధకాలమైనా జీవించరు.
కాని నేనైతే నీయందే విశ్వసిస్తాను.

కీర్తనలు. 138:1-139:23

దావీదు కీర్తన.

138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
    దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
    నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
    నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.

యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
    నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా మహిమ గొప్పది.
దేవుడు గొప్పవాడు.
    అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
    కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
    నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
    యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
    నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
    దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
    నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
    నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
    నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
    గ్రహించటం నాకు కష్టతరం.
నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
    యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
    పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
    పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
    ఆ చేతితో నన్ను నడిపిస్తావు.

11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
    “పగలు రాత్రిగా మారిపోయింది.
    తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
    రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
    నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
    నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
    నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
    ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
    నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
    కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.

19 దేవా, దుర్మార్గులను చంపివేయుము.
ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము.
20     ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు.
    వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.
21 యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను.
    నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను.
22 నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను!
    నీ శత్రువులు నాకూ శత్రువులే.
23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము.
    నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.

ఆదికాండము 41:1-13

ఫరో కలలు

41 రెండు సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఫరో నైలునది ప్రక్కగా నిలబడినట్లు అతనికి కల వచ్చింది. అప్పుడు ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు రావటం ఫరో చూశాడు. ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. ఆవులు అక్కడ నిలబడి గడ్డి తింటున్నాయి. అప్పుడు ఇంక ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు వచ్చాయి. కానీ ఈ ఆవులు చిక్కిపోయి, బక్కగా ఉన్నాయి. అందంగా ఉన్న ఏడు ఆవుల ప్రక్కగా ఈ ఏడు ఆవులు నిలబడ్డాయి. అసహ్యంగా ఉన్న ఏడు ఆవులు అందంగా బలిసి ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. అంతలో ఫరో మేల్కొన్నాడు.

ఫరో మరల నిద్రపోగా రెండవసారి కల వచ్చింది. ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం అతడు తన కలలో చూశాడు. ఆ ధాన్యపు గింజలు బలంగా, బాగుండటం అతడు చూశాడు.

తర్వాత అదే ధాన్యపు మొక్కకు మరో ఏడు వెన్నులు పెరగటం అతడు చూశాడు. అయితే ఈ వెన్నులు పీలగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి. అప్పుడు పీలగా ఉన్న వెన్నులు, బలంగా బాగున్న వెన్నులను తినివేశాయి. ఫరోకు మరల మెళకువ వచ్చింది. అదంతా కల మాత్రమేనని ఫరో గ్రహించాడు. మర్నాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కలవరం కలిగింది. కనుక అతడు ఈజిప్టులోని మంత్రగాళ్లందరిని పిలిపించాడు. విద్వాంసులందరిని అతడు పిలిపించాడు. ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు. అయితే వాళ్లలో ఒక్కడు కూడా ఆ కలను వివరించలేక పోయారు. దాని భావం చెప్పలేకపోయారు.

సేవకుడు యోసేపును గూర్చి ఫరోతో చెప్పుట

అప్పుడు ద్రాక్షాపాత్రల సేవకునికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు: “నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. 10 నా మీద, మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది. మీరు మమ్మల్ని చెరసాలలో వేసారు. 11 చెరసాలలో మా యిద్దరికీ ఒకే రాత్రి కలలు వచ్చాయి. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంది. 12 హెబ్రీ యువకుడు ఒకడు మాతో బాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు. రాజు సంరక్షక ధళాధిపతికి అతడు సేవకుడు. మేము మా కలలు అతనితో చెబితే, అతడు వాటిని మాకు వివరించాడు. ఒక్కో కల అర్థం అతడు మాకు చెప్పాడు. 13 అతడు చెప్పిన అర్థాలు సత్యం. నాకు విడుదల అవుతుందని, నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు నాకు చెప్పాడు. అది సత్యమే. వంటల పెద్ద మరణిస్తాడని అతడు చెప్పాడు, అదీ సత్యమే.”

1 కొరింథీయులకు 4:1-7

క్రీస్తు యొక్క అపొస్తలులు

అందువల్ల మమ్మల్ని మీరు క్రీస్తు సేవకులుగా, దేవుని రహస్యాలు అప్పగింపబడ్డ వాళ్ళుగా పరిగణించండి. బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి. మీరు నాపై తీర్పు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారము తీర్పు చెప్పినా నేను లెక్కచెయ్యను. నాపై నేనే తీర్పు చెప్పుకోను. నా మనస్సు నిర్మలమైనది. అంత మాత్రాన నేను నిర్దోషినికాను. ప్రభువు నాపై తీర్పు చెపుతాడు. అందువల్ల తీర్పు చెప్పే సమయం వచ్చే దాకా, ఎవరిమీదా తీర్పు చెప్పకండి. ప్రభువు వచ్చేదాకా ఆగండి. ఆయన చీకట్లో దాగివున్నదాన్ని వెలుగులోకి తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగివున్న ఉద్దేశ్యాలను బహిరంగ పరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు.

సోదరులారా! “లేఖనాల్లో వ్రాయబడినవాటిని అతిక్రమించకండి” అనే లోకోక్తి యొక్క అర్థం మీరు నేర్చుకోవాలని, దానివల్ల మీరు లాభం పొందాలని మేము, అంటే నేను, అపొల్లో ఆ లోకోక్తి ప్రకారం నడుచుకొన్నాము. మీరు ఒకరిని పొగిడి యింకొకరిని ద్వేషించకండి. ఇతరులకన్నా మీలో ఏమి ప్రత్యేకత ఉంది? మీదగ్గరున్నవన్నీ మీరు దేవుని నుండే కదా పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు యివ్వనట్లు ఎందుకు చెప్పుకొంటున్నారు?

మార్కు 2:23-3:6

యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు

(మత్తయి 12:1-8; లూకా 6:1-5)

23 ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని దాన్యపు కంకుల్ని త్రుంచారు. 24 పరిసయ్యులు ఆయనతో, “అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.

25 యేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసివచ్చింది. అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ చదవలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తానుతిని, తన సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప యితరులు తినకూడదు” అని అన్నాడు.

27 యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు. 28 అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి రోజుపై కూడా అధికారం ఉంది.”

విశ్రాంతి రోజు యేసు నయం చేయటం

(మత్తయి 12:9-14; లూకా 6:6-11)

ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు. అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం. యేసు ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు.

అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు.

ఆయన కోపంతో చుట్టూ చూసాడు. వాళ్ళవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, “నీ చేయి చాపు” అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది. ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International