Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 26

దావీదు కీర్తన.

26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
    యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
    నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
    నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
పనికిమాలిన ఆ మనుష్యుల్లో
    నేను ఒకడ్ని కాను.
ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
    ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.

యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
    నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
    నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
    మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.

యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
    ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
    చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
    కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
    యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.

కీర్తనలు. 28

దావీదు కీర్తన.

28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
    నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
    అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
    నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
    ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
    కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
    ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
    ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
    వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.

యెహోవాను స్తుతించండి.
    కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
    నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
    మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
    ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.

దేవా, నీ ప్రజలను రక్షించుము.
    నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
    కాపరిలా వారిని నిత్యం నడిపించుము.

కీర్తనలు. 36

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.

36 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
    అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
    ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
    కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
    అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
    అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
    ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.

యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
    నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
    నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
    కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
    అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
    నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
    నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
    దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.

12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
    “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
    వారు చితుకగొట్టబడ్డారు.
    వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”

కీర్తనలు. 39

సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.

39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
    నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
    నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]

మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
    నేనేమి చెప్పలేదు.
    కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
నాకు కోపం వచ్చింది.
    దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
    కనుక నేను ఏదో అన్నాను.

యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
    నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
    నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
    నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.

మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
    మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
    కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
    నీవే నా ఆశ.
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
    దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
నేను నా నోరు తెరవను.
    నేను ఏమీ చెప్పను.
    యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
    నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
    వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
    మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
    నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
    నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
    నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.

సామెతలు 30:1-4

యాకె కుమారుడు ఆగూరు జ్ఞాన సూక్తులు

30 యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం:

భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు. జ్ఞానము కలిగి ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి నాకు ఏమీ తెలియదు. ఏ మనిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. ఏ మనిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. ఈ సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది?

సామెతలు 30:24-33

24 భూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి.

25 చీమలు చిన్నవి, బలహీనమైనవి. కాని అవి వేసవి కాలం అంతా ఆహారం నిల్వచేసుకొంటాయి.

26 కుందేలు చిన్న జంతువు. కాని అది బండల్లో నివాసం ఏర్పాటు చేసుకోగలుగుతుంది.

27 మిడతలకు రాజు లేడు. కాని అవన్నీ కలిసికట్టుగా పని చేయగలుగుతున్నాయి.

28 బల్లులు నీవు చేతితో పట్టుకోగలిగినంత చిన్నవి. కాని అవి రాజుల గృహాలలో నివసించటం నీవు చూడ గలవు.

29 నడుస్తున్నప్పుడు ముఖ్యమైనవిగా కనుపించేవి మూడు ఉన్నాయి. నిజానికి నాలుగు ఉన్నాయి.

30 సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు.

31 చాలా గర్వంగా నడిచే కోడి పుంజు,

ఒక మేక పోతు,

తన ప్రజల మధ్య ఉన్న రాజు.

32 నీవు తెలివితక్కువవాడవై యుండి ఇతరులకంటె నీవే మంచివాడవు అని తలిస్తే, మరియు నీవు దుర్మార్గాన్ని తల డితే, నీవు ఆగిపోయి, నీవు చేస్తున్నదాన్ని గూర్చి ఆలోచించాలి.

33 ఒక మనిషి పాలను చిలికితే వెన్న వస్తుంది. ఒకడు మరొకని ముక్కు మీద కొడితే, రక్తం వస్తుంది. అదే విధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు కలిగిస్తావు.

ఫిలిప్పీయులకు 3:1-11

నిజమైన ధర్మము

సోదరులారా! చివరి మాట, ప్రభువు మీకు కావలసినంత ఆనందం ప్రసాదించుగాక! వ్రాసిన విషయాలే మళ్ళీ వ్రాయటానికి నేను వెనుకాడను. దాని వల్ల మీకు యింకా ఎక్కువ లాభం కలుగుతుంది.

దుర్మార్గులైన ఆ కుక్కల విషయంలో శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా ఆరాధిస్తున్నాము.[a] ఇది నిజమైన సున్నతి. వాళ్ళు పొందిన సున్నతిలాంటిది కాదు. మనము యేసు క్రీస్తులో ఉన్నందుకు గర్విస్తున్నాము. కనుక బాహ్యంగా కనిపించే ఈ ఆచారాలను మనము విశ్వసించము. కాని అలాంటి ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లయితే వాటిని నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి. నేను పుట్టిన ఎనిమిదవ రోజు నాకు సున్నతి చేసారు. నేను బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. పుట్టుకతో ఇశ్రాయేలు దేశస్థుణ్ణి. హెబ్రీయులకు జన్మించిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే పరిసయ్యుణ్ణి. ఉత్సాహంతో సంఘాన్ని హింసించిన వాణ్ణి. ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాటించటంలో నేను ఒక్క తప్పు కూడా చేయలేదు.

నేను క్రీస్తు విశ్వాసిని అయినందుకు, ఇదివరలో లాభంగా పరిగణించిన వాటిని నేను ప్రస్తుతం నష్టంగా పరిగణిస్తున్నాను. అంతేకాక, నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి చూస్తే అన్నీ వృథా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను. ఆయనలో ఐక్యత పొంది ఉండటమే నా ఉద్దేశ్యము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి పొందే నీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం ఉండటంవల్ల లభించే నీతి నాకు కావాలి. 10 నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలుపంచుకొని ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది. 11 ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది.

యోహాను 18:28-38

పిలాతు సమక్షంలో యేసు

(మత్తయి 27:1-2, 11-31; మార్కు 15:1-20; లూకా 23:1-25)

28 ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి రోము రాజ్యాధికారి భవానానికి తీసుకు వెళ్ళారు. తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళలేదు. 29 పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు.

30 “అతడు నేరస్థుడు కానట్లైతే మీకు అప్పగించే వాళ్ళంకాదు!” అని అన్నారు.

31 పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ శాస్త్రాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని అన్నాడు.

32 యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం లేదే!” అని సమాధానం చెప్పారు. యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా జరిగింది.

33 పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.

34 యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు.

35 పిలాతు, “నేను యూదుణ్ణి అని అనుకుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు.

36 యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు.

37 “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు.

యేసు జవాబు చెబుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.”

38 “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International