Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 97

97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
    దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
    నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
    ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
    ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
    భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
    ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!

మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
    వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
    వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
సీయోనూ, విని సంతోషించుము!
    యూదా పట్టణములారా, సంతోషించండి!
    ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
    ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
    కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.

కీర్తనలు. 99-100

99 యెహోవాయే రాజు.
    కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
    అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
సీయోనులో యెహోవా గొప్పవాడు.
    ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
    దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
    దేవా, నీతిని నీవు చేశావు.
    యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
    మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
    దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
    వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
    దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
    నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
    ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
    మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.

కృతజ్ఞత కీర్తన.

100 భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు!
    ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
యెహోవా దేవుడని తెలుసుకొనుము.
    ఆయనే మనలను సృజించాడు.
    మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి.
    స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి.
    ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.
యెహోవా మంచివాడు.
    ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
    ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.

కీర్తనలు. 94-95

94 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు.
    నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి.
    గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు?
    యెహోవా, ఇంకెన్నాళ్లు?
ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి
    ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు.
    నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
మా దేశంలో నివసించే విధవరాండ్రను, పరదేశస్థులను ఆ దుర్మార్గులు చంపుతారు.
    తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు.
    జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబుతారు.

దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు.
    మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు?
దుర్మార్గులారా, మీరు అవివేకులు
    మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
దేవుడు మన చెవులను చేశాడు.
    కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు.
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి.
    జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు.
    ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు.
    ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.

12 యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు.
    సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు.
    దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
    సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది.
    అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.

16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు.
    చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే
    నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు.
    కాని యెహోవా తన అనుచరుని బలపరిచాడు.
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను.
    కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.

20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు.
    ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు.
    అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే.
    నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు.
    వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు.
    మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.

95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
    మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
    సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
    ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
    దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
    మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
ఆయన మన దేవుడు,
    మనం ఆయన ప్రజలము.
    మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.

దేవుడు చెబుతున్నాడు, “మెరీబా[a] దగ్గర మీరు ఉన్నట్టుగా
    అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి.
మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు.
    కాని అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.
10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను.
    వారు నమ్మకస్థులు కారని నాకు తెలుసు.
    ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.
11 అందుచేత నాకు కోపం వచ్చి,
    ‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’”

ఆదికాండము 31:1-24

వెళ్లాల్సిన సమయం—యాకోబు పారిపోవుట

31 ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు ధనికుడైపోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు లాబాను ఇదివరలో ఉన్నంత స్నేహంగా తనతో యిప్పుడు లేనట్లు యాకోబు గమనించాడు. అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్లిపో. నేను నీకు తోడుగా ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు.

కనుక యాకోబు తన గొర్రెలు, మేకల మందలను ఉంచిన పొలాల్లో తనను కలిసికోమని రాహేలు, లేయాలకు చెప్పాడు. రాహేలు, లేయాలతో యాకోబు ఇలా చెప్పాడు: “మీ తండ్రి నామీద కోపంగా ఉన్నాడు. ఇది వరకు ఎప్పుడూ అతడు నాతో స్నేహంగా ఉండేవాడు, కాని ఇప్పుడు లేడు. అయితే, నా తండ్రి దేవుడు నాతో వున్నాడు. నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు. అయితే మీ తండ్రి నన్ను మోసం చేశాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటినుండి దేవుడు నన్ను కాపాడాడు.

“ఒకసారి లాబాను అన్నాడు: ‘మచ్చలు ఉన్న మేకలన్నీ నీవు ఉంచుకోవచ్చు. ఇది నీ జీతం.’ అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న పిల్లలనే కన్నాయి. కనుక అవి అన్నీ నావే. కానీ అప్పుడు లాబాను, ‘మచ్చలు గల మేకలను నేను తీసుకొంటాను, చారలున్న మేకలన్నీ నీవే. అది నీకు జీతం’ అన్నాడు. అతడు యిలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు గల పిల్లల్ని పెట్టాయి. కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు.

10 “జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. అలా కలుస్తున్న మగ మేకలు మాత్రమే మచ్చలు, చారలు గలవిగా నేను చూశాను. 11 కలలో ఆ దేవదూత నాతో మాట్లాడాడు. ఆ దేవదూత, ‘యాకోబూ!’ అన్నాడు.

“‘చిత్తం’ అన్నాను నేను.

12 “ఆ దేవదూత అన్నాడు: ‘చూడు, మచ్చలు, చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. ఇలా జరిగేటట్లు నేను చేస్తున్నాను. లాబాను నీ యెడల చేస్తోన్న అపకారం అంతా నేను చూశాను. క్రొత్తగా పుట్టిన మేక పిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తున్నాను. 13 బేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద ఒలీవ నూనె నీవు పోశావు. అక్కడ నాకు నీవు ఒక వాగ్దానం చేశావు. నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు.’”

14-15 రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: “మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయివాళ్లుగా చూశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేశాడు, మరియు ఆ తరువాత మాకు రావలసిన సొమ్ము అంతా వాడేసుకొన్నాడు. 16 మా తండ్రి దగ్గర్నుండి ఈ ఆస్తి అంతా దేవుడు తీసివేశాడు, ఇప్పుడు అది మనది మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి!”

17 అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు. 18 అప్పుడు వాళ్లు అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలుబెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు తీసికొని వెళ్లాడు. 19 ఈ సమయంలో లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగిలించింది.

20 సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేశాడు. అతడు వెళ్లిపోతున్నట్లు లాబానుతో చెప్పలేదు. 21 యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణం అయ్యారు.

22 యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. 23 కనుక లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకోబును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు. 24 ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయి, “నీవు యాకోబుతో చెప్పే ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు.

1 యోహాను 2:1-11

యేసు మన సహాయకుడు

బిడ్డలారా! మీరు పాపం చెయ్యకూడదని మీకు లేఖను వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, మన పక్షాన తండ్రితో మాట్లాడేందుకు న్యాయవాది అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయన మన పాప పరిహారార్థం బలి అయ్యాడు. మన పాపాల కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపాలకోసం బలి అయ్యాడు.

ఆయన ఆజ్ఞల్ని మనం ఆచరిస్తే, ఆయన మనకు తెలుసుననే విశ్వాసం మనలో కలుగుతుంది. ఆయన నాకు తెలుసని అంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించనివాడు అబద్ధాలాడుతున్నాడన్నమాట. అలాంటి వ్యక్తిలో సత్యం ఉండదు. యేసు ఆజ్ఞల్ని పాటించినవానిలో దేవుని ప్రేమ సంపూర్ణంగా ఉంటుంది. తద్వారా మనం ఆయనలో ఉన్నామని తెలుసుకొంటాము. యేసులో జీవిస్తున్నానని చెప్పుకొనేవాడు, ఆయనలా నడుచుకోవాలి.

మనం యితరుల్ని ప్రేమించాలని యేసు చెప్పాడు

ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటినుండి మీ దగ్గర ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత ఆజ్ఞ. అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది.

తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట. 10 సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు. 11 కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసింది కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.

యోహాను 9:18-41

18 ఇదివరలో గ్రుడ్డివానిగా ఉన్నవాడు యితడేనని; యిప్పుడతనికి దృష్టి వచ్చిందని, అతని తల్లిదండ్రుల్ని పిలువనంపే దాకా యూదులు నమ్మలేదు. 19 అతని తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడా! గ్రుడ్డి వానిగా జన్మించింది ఇతడేనా? ఇతడు ఇప్పుడెట్లా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు.

20 అతని తల్లిదండ్రులు, “అతుడు మా కుమారుడని, గ్రుడ్డివానిగా జన్నించాడని మాకు తెలుసు. 21 కాని అతడు ఇప్పుడేవిధంగా చూడగలుగు తున్నాడో. అతనికి దృష్టి ఎవరిచ్చారో మాకు తెలియదు. అతణ్ణే అడగండి! తనను గురించి సమాధానం చెప్పుకోగల వయస్సు అతనికి ఉంది” అని అన్నారు. 22 యేసే, “క్రీస్తు” అన్న ప్రతి ఒక్కణ్ణి సమాజ మందిరం నుండి బహిష్కరించాలని యూదులు యిది వరకే నిశ్చయించారు. కనుక వాళ్ళకు భయపడి అతని తల్లిదండ్రులు ఈ విధంగా సమాధానం చెప్పారు. 23 అందుకే వాళ్ళు, “అతనికి వయస్సు వచ్చింది. అతణ్ణే అడగండి!” అని అన్నారు.

24 యూదులు గ్రుడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో, “దేవుణ్ణి స్తుతించు, అతణ్ణి కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు.

25 “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు. నేనిదివరలో గ్రుడ్డి వాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని అతడు సమాధానం చెప్పాడు.

26 “అతడు ఏమి చేసాడు? ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు?” అని వాళ్ళు అడిగారు.

27 అతుడు, “నేను యిది వరకే చెప్పాను. కాని మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారా?” అని అన్నాడు.

28 వాళ్ళు అతణ్ణి అవమానపరచారు. అతనితో, “నువ్వు అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులము. 29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఇక ఇతని గురించా? ఇతడెక్కడినుండి వచ్చాడో కూడా మాకు తెలియదు” అని అన్నారు.

30 అతడు, “ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు. 31 దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు. 32 పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించటం ఇది వరకు ఎవ్వరూ వినలేదు. 33 ఇతడు దేవుని నుండి రానట్లైతే ఏమి చెయ్యలేకపొయ్యేవాడు” అని అన్నాడు.

34 ఇది విని వాళ్ళు, “నీవు పాపంలో పుట్టావు. పాపంలో పెరిగావు. మాకు ఉపదేశించటానికి నీకెంత ధైర్యం?” అని అంటూ అతణ్ణి వెలివేశారు.

ఆత్మీయ అంధత్వము

35 అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు.

36 ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు.

37 యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే!” అని అన్నాడు.

38 అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు.

39 యేసు, “నేను తీర్పు చెప్పటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆ తీర్పేదనగా-గ్రుడ్దివాళ్ళు చూడగలగాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గ్రుడ్డివాళ్ళు కావాలని నేను వచ్చాను” అని అన్నాడు.

40 ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, “మేము కూడా గ్రుడ్డివాళ్ళ మంటున్నావా?” అని అన్నారు.

41 యేసు, “మీరు గ్రుడ్డి వాళ్ళైనట్లైతే మిమ్ములను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని దోషులనవలిసిందే!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International