Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 148-150

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
    ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
    సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
    నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
    దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
    ఆయన వారిని రక్షించాడు!
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
    పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.

ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
    ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
    వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
ఆ రాజులకు, ప్రముఖులకు
    దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
    దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.

యెహోవాను స్తుతించండి!

150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
    ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
    ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
    స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
    తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
    పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!

సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!

యెహోవాను స్తుతించండి.

కీర్తనలు. 114-115

114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
    యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
    ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
    యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
    కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.

ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
    యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
    కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?

యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
    ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.

115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
    నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
    ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
    వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
    వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
    వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
    వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.

ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
    యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
    యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
    యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.

12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
    యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
    యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
    యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.

14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15     యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
    ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
    కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
    కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
    మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!

యెహోవాను స్తుతించండి!

ఆదికాండము 7:1-10

జల ప్రళయం ప్రారంభం

అప్పుడు నోవహుతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ కాలపు దుర్మార్గుల మధ్య నీవు మంచి వాడివిగా నాకు కనబడ్డావు. కనుక నీ కుటుంబం అంతటినీ కలుపుకొని మీరంతా ఓడలోపలికి వెళ్లండి. శుద్ధమయిన జంతువులన్నింటిలో నుండి ఏడేసి జాతులు (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో, భూమి మీద ఉన్న ఇతర జంతువులన్నింటిలోనుండి ఒక్క జత (మగది ఒకటి, ఆడది ఒకటి) తీసుకో. ఈ జంతువులన్నింటిని నీతోబాటు ఓడలోనికి నడిపించు. ఆకాశంలో ఎగిరే పక్షులన్నింటిలో నుండి ఏడేసి జతలు (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో. ఇలా చేయటంవల్ల మిగతా జంతువులన్ని నాశనం చేయబడిన తర్వాత కూడా ఈ జంతువులన్ని భూమిమీద జీవించడానికి వీలవుతుంది. ఇంక ఏడు రోజులకు భూమిమీద విస్తారమైన వర్షం కురిపిస్తాను. 40 పగళ్లు, 40 రాత్రులు వర్షం కురుస్తుంది. భూమిమీద జీవించే ప్రతిప్రాణి నాశనం చేయబడుతుంది. నేను చేసినవన్నీ నశించిపోతాయి.” యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నిటి విషయంలో నోవహు విధేయుడయ్యాడు.

ఈ జలప్రళయము వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరాలు. వరద నీటినుండి తప్పించుకొనేందుకు నోవహు, అతని కుంటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడ ఓడలో ఉన్నారు. 8-9 పవిత్ర జంతువులన్నీ, భూమిమీది ఇతర జంతువులన్నీ, పక్షులన్నీ, నేలమీద ప్రాకు ప్రాణులన్నీ నోవహుతో పాటు ఓడలోకి వెళ్లాయి. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్లుగా ఆడ, మగ అనే జంటలుగ లోపలికి వెళ్లాయి. 10 ఏడు రోజుల తర్వాత వరద ప్రారంభమయింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది.

ఆదికాండము 7:17-23

17 40 రోజుల పాటు నీళ్లు భూమిమీద వరదలై పారాయి. నీటిమట్టం పెరుగుతూ ఓడను నేలమీదనుండి పైకి లేపడం మొదలయింది. 18 నీటిమట్టం పెరగటం కొనసాగుతూనే ఉంది. ఓడ నేలకు చాలా ఎత్తుగా నీటిమీద తేలుతోంది. 19 నీటి మట్టం చాలా పైకి లేచినందువల్ల గొప్ప ఎత్తయిన పర్వతాలు అన్నీ నీళ్లలో మునిగిపోయాయి. 20 పర్వత శిఖరాలకు పైగా నీటిమట్టం లేస్తూనే ఉంది. అన్నింటికంటే ఎత్తయిన పర్వత శిఖరానికి ఇంకా 20 అడుగులు ఎత్తుగానే నీటిమట్టం ఉంది.

21-22 భూమిమీద బ్రతికి ఉన్న ప్రతి ప్రాణీ చనిపోయింది. ప్రతి పురుషుడు, స్త్రీ మరణించారు. పక్షులు, పశువులు, జంతువులు ఎగిరే ప్రతి ప్రాణి చంపివేయబడ్డాయి. బ్రతికి శ్వాసించే ప్రతి జీవి చనిపోయింది. 23 కనుక భూమిమీద ఉన్న సకల ప్రాణులను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి అన్నింటినీ దేవుడు నాశనం చేశాడు. ఇవన్నీ భూమిమీద నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలోవున్న నోవహు అతనితో ఉన్న మనుష్యులు, జంతువులు మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు.

ఎఫెసీయులకు 4:1-16

క్రీస్తు దేహంలో ఐక్యత

ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించమని ప్రభువు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి. శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు.

క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:

“ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు.
    మానవులకు వరాలిచ్చాడు.”(A)

“ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి నాడనే అర్థం కదా! 10 క్రిందికి దిగినవాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి సమస్తమును నింపి వేసాడు. 11 పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. 12 అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. 13 కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు.

14 అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. 15 మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. 16 శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది.

మార్కు 3:7-19

ప్రజలు యేసును అనుసరించటం

యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాలనుండి, తూరు, సీదోను పట్టణాల చుట్టూవున్న ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.

చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు. 10 ఆయన చాలామందికి నయం చేసాడు. అందువల్ల రోగాలున్నవాళ్ళు ఆయన్ని తాకాలని ముందుకు త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు. 11 చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవి. 12 యేసు తానెవరో ఎవ్వరికి చెప్పవద్దని ఆ ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు.

యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం

(మత్తయి 10:1-4; లూకా 6:12-16)

13 యేసు కొండపైకి వెళ్ళి తనకు కావలసిన వాళ్ళను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు. 14 ఆయన పన్నెండుగురిని తన అపొస్తలులుగా నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, ప్రకటించటానికి వాళ్ళను ప్రపంచంలోకి పంపాలని ఆయన ఉద్దేశ్యం. 15 దయ్యాలను వదిలించే అధికారం వాళ్ళకిచ్చాడు. 16 ఆయన నియమించిన పన్నెండుగురు అపొస్తలుల పేర్లు యివి:

సీమోను, ఇతనికి పేతురు అనే పేరునిచ్చాడు.

17 జెబెదయి కుమారులైన యాకోబు అతని సోదరుడు యోహాను, వీళ్ళకు బోయనేర్గెసు అనే పేరునిచ్చాడు. బోయనేర్గెసు అంటే “ఉరుముకు పుత్రులు” అని అర్థం.

18 అంద్రెయ,

ఫిలిప్పు,

బర్తొలొమయి,

మత్తయి,

తోమా,

అల్ఫయి కుమారుడు యాకోబు,

తద్దయి,

జెలటు అని పిలవబడే సీమోను,

19 యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International