Readings for Celebrating Advent
వాక్యము మానవాతారం ఎత్తటం
1 సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు. 2 ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు. 3 ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు. 4 ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చెను. 5 వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు.
6 దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. 7 తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు. 8 అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. 9 ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ వుండెను.
10 ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు. 11 ఆయన తన స్వంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు. 12 అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు. 13 కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరక వాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.
14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. 15 యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’”
16 ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము. 17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు. 18 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.
© 1997 Bible League International