Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.
76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
2 దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.
4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
7 దేవా, నీవు భీకరుడవు.
నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.
11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.
జనములన్నింటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు
66 యెహోవా చెబుతోంది ఇదే,
“ఆకాశాలు నా సింహాసనం.
భూమి నా పాదపీఠం.
అందుచేత నాకు ఒక గృహం నిర్మంచగలం అని మీరనుకొంటున్నారా?
లేదు, నిర్మించ లేరు.
2 నా అంతట నేనే అన్నింటినీ చేశాను.
అన్నింటిని నేను చేసాను కనుక అవి అన్నీ ఇక్కడ ఉన్నాయి.” యెహోవా ఈ సంగతులు చెప్పాడు.
“నేను ఏ ప్రజల్ని లక్ష్యపెడతాను, నాతో చెప్పండి? పేదప్రజల్ని నేను లక్ష్యపెడతాను.
వీరు చాల దుఃఖంలో ఉన్న ప్రజలు. నా మాటలకు విధేయులయ్యే వారిని నేను లక్ష్యపెడతాను
3 కొంతమంది నాకు బలులు ఇచ్చేందుకు ఎడ్లను వధిస్తారు.
కానీ వారు ప్రజల్నికూడా కొడతారు.
ఆ మనుష్యులు నాకు బలులు ఇచ్చేందుకని గొర్రెలను వధిస్తారు.
అయితే వారు కుక్కల మెడలు కూడ విరుగగొడ్తారు.
మరియు పందుల[a] రక్తం వారు నాకు అర్పిస్తారు.
ఆ మనుష్యులు ధూపం వేయటం జ్ఞాపకం ఉంచుకొంటారు. కాని పనికిమాలిన వారి విగ్రహాలను కూడా వారు ప్రేమిస్తారు.
ఆ మనుష్యులు నా మార్గాలను గాక వారి స్వంత మార్గాలనే ఎంచుకొంటారు.
భయంకరమైన వారి విగ్రహాలనే వారు పూర్తిగా ప్రేమిస్తారు.
4 కనుక వారి స్వంత రహస్యాలనే నేను ఉపయోగించాలని నేను నిర్ణయించుకొన్నాను.
అంటే, దేనికైతే వారు ఎక్కువగా భయపడతారో వాటినే ప్రయోగించి వారిని శిక్షించాలని నా ఉద్దేశం.
నేను ఆ ప్రజలను పిలిచాను
కాని వారు వినిపించుకోలేదు.
నేను వారితో మాట్లాడాను
కానీ వారు నా మాట వినలేదు కనుక నేనుకూడా వారికి అదే విధంగా చేస్తాను.
నేను కీడు అని చెప్పిన వాటినే ఆ ప్రజలు చేశారు.
నాకు ఇష్టంలేని వాటినే వారు జరిగించేందుకు ఎంచుకొన్నారు.”
5 యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యే ప్రజలారా,
మీరు యెహోవా చెప్పేవాటిని వినాలి.
“మీ సోదరులు మిమ్మల్ని ద్వేషించారు.
మీరు నన్ను వెంబడించినందువల్ల వారు మీకు విరోధంగా తిరిగారు.
యెహోవా ఘనపరచబడినప్పుడు మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము.
అప్పుడు మేము మీతోకూడ సంతోషిస్తాం, అని మీ సోదరులు చెప్పారు.
ఆ మనుష్యులు శిక్షించబడతారు.”
శిక్ష మరియు ఒక క్రొత్త జనం
6 వినండి! పట్టణం నుండి, దేవాలయం నుండి పెద్ద శబ్దం వస్తుంది. యెహోవా తన శత్రువులను శిక్షిస్తున్న శబ్దం అది. వారికి రావాల్సిన శిక్షనే యెహోవా వారికి ఇస్తున్నాడు.
7-8 “ఒక స్త్రీ నొప్పులు లేకుండా ప్రసవించదు. ఒక స్త్రీ నొప్పులు అనుభవించకుండనే తన శిశువును చూడటం అనేది ఎన్నడూ సంభవించలేదు. అదే విధంగా, ఒకే రోజున ఒక క్రొత్త ప్రపంచం ప్రారంభం అగుట ఎవ్వరూ ఎన్నడూ చూడలేదు. ఒకే రోజున ఒక క్రొత్త రాజ్యం ప్రారంభం అయినట్లు ఎవ్వరూ ఎన్నడూ వినలేదు. ప్రసవ వేదనలాంటి నొప్పులు దేశం మొదట అనుభవించాలి. ప్రసవ వేదనల తర్వాత దేశం తన పిల్లలకు – ఒక క్రొత్త దేశానికి—జన్మనిస్తుంది. 9 అదే విధంగా ఏదో క్రొత్తది జన్మించాల్సిన అవసరం లేకుండా నేను బాధ కలిగించను.”
యెహోవా ఇది చెబుతున్నాడు: “నేను నీకు పురిటినొప్పులు రానిచ్చినట్లయితే, అప్పుడు నీ క్రొత్త దేశం నీకు రాకుండా నేను ఆపుజేయను.” మీ దేవుడే ఇది చెప్పాడు.
10 యెరూషలేమా, సంతోషించు! యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి.
విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి. కనుక మీరు కొంతమంది మనుష్యులు విచారించారు. కానీ, అలాంటి మీరు ఇప్పుడు ఎంతో ఎంతో సంతోషించాలి.
11 ఎందుకంటే ఆమె స్థనాలనుండి పాలు వచ్చినట్లుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ “పాలు” నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి.
ప్రజలారా, మీరు పాలు త్రాగుతారు.
మరియు మీరు యెరూషలేము మహిమను నిజంగా అనుభవిస్తారు.
12 యెహోవా చెబుతున్నాడు:
“చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది.
భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి.
మీరు చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు ‘పాలు’ త్రాగుతారు.
మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు.
మీరు నా మోకాళ్లమీద ఊపబడతారు.
13 యెరూషలేములో మీరు ఓదార్చబడతారు.
ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను.”
మరికొన్ని కర్తవ్యాలు
23 “మనకు ఏది చెయ్యటానికైనా స్వేచ్ఛ ఉంది” కాని అన్నీ లాభదాయకం కావు. “మనకు అన్నీ చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు. 24 ఎవరూ తమ మంచి కొరకే చూసుకోరాదు. ఇతరుల మంచి కోసం కూడా చూడాలి.
25 మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి. 26 “ఎందుకంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ ప్రభునివే.”(A)
27 క్రీస్తును విశ్వసించనివాడు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది ఉంచితే అది తినండి. 28 కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి. 29 అంటే, మీ మనస్సు కోసం అని కాదు, ఆ చెప్పినవాని మనస్సు కోసం దాన్ని తినకండి. నా స్వాతంత్ర్యం విషయంలో అవతలివాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి? 30 నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి?
31 కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి. 32 యూదులకు గాని, యూదులుకానివాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, కష్టం కలిగించకుండా జీవించండి. 33 నేను చేస్తున్నట్లు మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసుకోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింపబడాలని నా ఉద్దేశ్యం.
11 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు నన్ను అనుసరించండి.
© 1997 Bible League International