Revised Common Lectionary (Semicontinuous)
దేవునికి ఒక స్తుతిపాట
12 ఆ సమయంలో మీరంటారు:
“యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
నీకు నామీద కోపం వచ్చింది.
కానీ ఇప్పుడు నామీద కోపగించకుము.
నీ ప్రేమ నాకు చూపించు.”
2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు.
యెహోవా, యెహోవాయే నా బలం.[a]
ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి.
అప్పుడు మీరు సంతోషిస్తారు.
4 “యెహోవాకు స్తోత్రాలు!
ఆయన నామం ఆరాధించండి!
ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి”
అని అప్పుడు మీరు అంటారు.
5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి.
ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక.
దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి.
పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు.
అందుచేత, సంతోషంగా ఉండండి!
యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు
14 మార్గం సరళం చేయండి; మార్గం సరళం చేయండి.
నా ప్రజలకోసం మార్గం చక్కజేయండి.
15 మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు
శాశ్వతంగా జీవించేవాడు,
పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు:
“నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను.
అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను.
ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను.
హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.
16 నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను.
నేను ఎప్పటికీ కోపంగానే ఉండను.
నేను కోపంగా కొనసాగితే మనిషి ఆత్మ,
వారికి నేను ఇచ్చిన జీవం నా ఎదుటనే మరణిస్తుంది.
17 ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు కోపం కలిగించింది.
కనుక నేను ఇశ్రాయేలును శిక్షించాను.
నేను కోపంగా ఉన్నాను గనుక
అతని నుండి నేను తిరిగిపోయాను.
మరియు ఇశ్రాయేలు నన్ను విడిచిపెట్టాడు.
ఇశ్రాయేలు తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు.
18 ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్లింది నాకు తెలుసు. కనుక నేను అతణ్ణి స్వస్థపరుస్తాను (క్షమిస్తాను).
నేను అతణ్ణి ఆదరించి, అతడు బాగానే ఉంది అనుకొనేట్టు చేసే మాటలు నేను చెబుతాను. అప్పుడు అతడు, అతని ప్రజలు విచారంగా ఉండరు.
19 ఆ ప్రజలకోసం ‘శాంతి’ అనే క్రొత్త పదం నేను ఉపదేశిస్తాను.
నాకు సమీపంగా ఉన్న ప్రజలకు, చాలా దూరంగా ఉన్న ప్రజలకు, నేను శాంతి ప్రసాదిస్తాను.
ఆ ప్రజలను నేను స్యస్థపరుస్తాను (క్షమిస్తాను).”
ఈ సంగతులు యెహోవా చెప్పాడు.
20 అయితే చెడ్డవాళ్లు భీకరంగా ఉన్న మహాసముద్రంలాంటి వాళ్లు.
వారు నెమ్మదిగా, శాంతంగా ఉండలేరు.
వారు కోపంగా ఉన్నారు,
మహాసముద్రంలా మట్టిని కెలుకుతారు.
21 “దుష్టులకు శాంతి లేదు”
అని నా దేవుడు చెబుతున్నాడు.
యూదులుకానివాళ్ళు చేసిన పాపాలు
18 భక్తిహీనులై దుర్బుద్ధితో సత్యాన్ని అణిచిపెట్టే ప్రజలపై, దేవుడు స్వర్గంనుండి తన ఆగ్రహాన్ని చూపుతాడు. 19 తనను గురించి తెలియవలసిన విషయాలు దేవుడు వాళ్ళకు తెలియచేసాడు కనుక అవి వాళ్ళకు స్పష్టంగా తెలుసు.
20 కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటినుండి సృష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
21 ఎందుకంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అంధకారమైపోయాయి. 22 వాళ్ళు తాము తెలివిగలవాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు. 23 ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు.
24 అందువల్ల దేవుడు వాళ్ళను, వాళ్ళ హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చుకోవటానికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకొన్నారు. 25 దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్!
© 1997 Bible League International