Revised Common Lectionary (Semicontinuous)
దావీదు ప్రార్థన.
145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
2 ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
3 యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
4 యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!
ఇది ఆలయ నిర్మాణానికి సమయం
1 దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదా పాలనాధికారియైన జెరుబ్బాబెలుకు, మరియు ప్రధాన యాజకుడైన యెహోషువకు వినవచ్చింది. (జెరుబ్బాబెలు తండ్రి పేరు షయల్తీయేలు. యెహోషువ తండ్రి పేరు యెహోజాదాకు). ఈ వాక్కు రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి రోజున వచ్చింది. ఈ సందేశమేమంటే, 2 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “దేవుడైన యెహోవా ఆలయ నిర్మాణానికి తగిన సమయం రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.”
3 పిమ్మట దేపుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా వచ్చి ఇలా చెప్పింది: 4 “మీరు నగిషీ పనులు చేయబడ్డ చెక్క పలకలు గోడలకు అమర్చబడి అందంగా ఉన్న ఇండ్లలో నివసిస్తున్నారు. కాని యెహోవా ఇల్లు ఇంకా శిథిలావస్థలోనే ఉంది. 5 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘మీ ప్రవర్తన విషయం మీరు ఆలోచించండి! 6 నీవు నాటింది ఎక్కువ. కాని నీవు కోసేది తక్కువ. నీవు భోజనం తింటావు. అయినా నీ కడుపు నిండదు. నీవు నీరు తాగుతావు. అయినా నీ దాహం తీరదు. నీవు బట్టలు ధరిస్తావు. కాని నీకు వెచ్చగా ఉండదు. ధన సంపాదకుడు చిల్లులు ఉన్న సంచిలో డబ్బును వేయటానికే సంపాదిస్తాడు!’”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: “మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి! 8 మీరు పర్వతాలకు వెళ్లండి. కలప తెచ్చి ఆలయ నిర్మాణం చేయండి. అప్పుడు ఆలయం విషయంలో నేను సంతోషపడతాను. అది నాకు గౌరవప్రదం.” దేవుడైన యెహోవా ఇది చెప్పాడు.
9 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “మీరు ఎంతో పెద్ద పంటకొరకు ఎదురుచూస్తారు. కానీ మీకు లభించే ధాన్యం కొంతమాత్రమే. దానిని మీరు ఇంటికి తెచ్చినప్పుడు, నేను గాలిని పంపించి ఎగురగొడతాను. ఎందుకని ఈ సంగతులు జరుగుతున్నాయి? ఎందుకనగా నా ఇల్లు ఇంకా శిథిలావస్థలో ఉంది. కాని మీలో ప్రతి ఒక్కడూ తన ఇంటిని భద్రపరచుకోవడానికి పరుగు పెడతాడు. 10 ఈ కారణంవల్ల ఆకాశం మంచును పడనీయదు. మరియు భూమి పంటలను పండనీయదు.”
11 ప్రభువిలా చెపుతున్నాడు, “నేను భూమిని, పర్వతాలను ఎండి పోవాలని ఆజ్ఞ ఇచ్చాను. భూమి పండించే ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, ఒలీవ నూనె అన్నీ పాడై పోతాయి. మరియు మనుష్యులందరూ, జంతువులన్నీ బలహీనమౌతాయి.”
క్రొత్త ఆలయం పని ప్రారంభమవటం
12 పిమ్మట షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, మరియు యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువయు, మిగిలియున్న ప్రజలును తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తమకు తెలియజేసిన మాటలను విని, దేవుడైన యెహోవాపట్ల భయభక్తులను చూపారు.
13 దేవుడైన యెహోవా తన వార్తాహరుడైన హగ్గయికి ఒక వర్తమానం పంపాడు. ఈ వర్తమానం ప్రజలకొరకు ఉద్దేశించబడింది. ఆ వర్తమానం ఇలా ఉంది: దేవుడైన యెహోవా “నేను మీతో ఉన్నాను!” అని ప్రకటిస్తున్నాడు.
14 పిమ్మట యూదా దేశపు పాలనాధికారియు, షయల్తీయేలు కుమారుడును అయిన జెరుబ్బాబెలును దేవుడగు యెహోవా ప్రేరేపించాడు. దేవుడైన యెహోవా యెహోజాదా కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువాను కూడా ప్రేరేపించాడు. మరియు దేవుడైన యెహోవా మిగిలివున్న జనులందరినీ ప్రేరేపించాడు. అప్పుడు వారంతా వచ్చి తమ దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు. 15 వారు ఈ పనిని, రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఆరవ నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు.
యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం
(మత్తయి 21:23-27; మార్కు 11:27-33)
20 ఒక రోజు మందిరంలో యేసు ప్రజలకు బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధానయాజకులు, శాస్త్రులు, పెద్దలు అంతా కలిసి ఆయన దగ్గరకు వచ్చారు. 2 “ఎవరిచ్చిన అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు? చెప్పు” అని వాళ్ళు అడిగారు.
3 ఆయన, “నన్నొక ప్రశ్న అడుగనివ్వండి. 4 యోహానుకు బాప్తిస్మము నిచ్చే అధికారం ఎవరిచ్చారు? దేవుడా? లేక ప్రజలా” అని అన్నాడు.
5 వాళ్ళు పరస్పరం ఈ విధంగా చర్చించుకున్నారు: “దేవుడంటే, అతడు ‘మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అంటాడు 6 ప్రజలంటే, ‘ప్రజలు యోహానును ఒక ప్రవక్త అని విశ్వాసిస్తూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు మనల్ని రాళ్ళతో కొడతారు.’ 7 అందువల్ల ఆ అధికారం ఎక్కడినుండి వచ్చిందో మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
8 యేసు, “మరి అలాగైతే నేను కూడా ఎవరి అధికారంతో యివన్నీ చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.
© 1997 Bible League International