Revised Common Lectionary (Semicontinuous)
దేవునికి హబక్కూకు ఫిర్యాదు చేయటం
1 ప్రవక్తయైన హబక్కూకునకు ఇవ్వబడిన వర్తమానం ఇది.
2 యెహోవా, నేను సహాయం కొరకు అర్థిస్తూనే వున్నాను. నీవు నా మొర ఎన్నడు ఆలకిస్తావు? దౌర్జన్యం విషయంలో నేను నీకు మొరపెట్టాను. కాని నీవేమీ చేయలేదు! 3 ప్రజలు వస్తువులను దొంగిలిస్తున్నారు. ఇతరులను బాధపెట్టుతున్నారు. ప్రజలు వాదులాడుతూ, కలహిస్తున్నారు. నీవెందుకు నన్నీ భయంకర విషయాలు చూసేలా చేస్తున్నావు? 4 న్యాయవ్యవస్థ బలహీనపడింది. ప్రజలకు న్యాయం జరుగటం లేదు. మంచివారిపై దుష్టులు తమ తగాదాలలో గెలుస్తున్నారు. అందువల్ల న్యాయం ఎంతమాత్రం పక్షపాత రహితంగా లేదు.
2 నేనొక కాపలాదారునిగా నిలబడి గమనిస్తాను.
యెహోవా నాకు ఏమి చెపుతాడో వినటానికి నేను వేచి ఉంటాను.
ఆయన నా ప్రశ్నలకు ఎలా సనాధానమిస్తాడో నేను వేచివుండి తెలుసుకుంటాను.
హబక్కూకునకు దేవుడు సమాధానమివ్వటం
2 యెహోవా నాకు సమాధానమిచ్చాడు: “నేను నీకు చూపించేవాటిని వ్రాయి. ప్రజలు సులభంగా చదవగలిగే రీతిలో దానిని ఒక పలకమీద స్పష్టంగా వ్రాయి. 3 ఈ వర్తమానం భవిష్యత్తులో ఒక ప్రత్యేక సమయం గురించినది. ఈ వర్తమానం పరిసమాప్తిని గురించినది. అది నిజమవుతుంది! ఆ సమయం ఎన్నడూ రానట్టుగా కన్పించవచ్చు. కాని ఓపికతో దానికొరకు వేచివుండు. ఆ సమయం వస్తుంది. అది ఆలస్యం కాదు. 4 దీనిని విన నిరాకరించే వారికి ఈ వర్తమానం సహాయపడదు. కాని మంచివాడు ఈ వర్తమానాన్ని నమ్ముతాడు. తన విశ్వాసం కారణంగా, ఆ మంచి వ్యక్తి దీనిని నమ్ముతాడు.”
సాదె
137 యెహోవా, నీవు మంచివాడవు.
నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
1 పౌలు, సిల్వాను మరియు తిమోతిల నుండి మన తండ్రియైన దేవునికి మరియు యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి:
2 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహము, శాంతి ప్రసాదించు గాక!
3 సోదరులారా! మీ విశ్వాసం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. మీ మధ్య ఉన్న ప్రేమ వర్ధిల్లుతోంది. కనుక మీ విషయంలో మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతగా ఉండాలి. 4 మీరు ఓర్పుతో సహిస్తున్న హింసలను గురించి, కష్టాలను గురించి విశ్వాసాన్ని గురించి మేము పొగడుతూ దేవుని ఇతర సంఘాలకు చెపుతూ ఉంటాము.
11 ఇది మనస్సులో పెట్టుకొని తాను పిలిచిన పిలుపుకు తగినట్లు మీ జీవితాలను నడపమని మేము దేవుణ్ణి ప్రతిరోజూ ప్రార్థిస్తూ ఉంటాము. అంతేకాక, మీరు మంచి చేయాలని ఆశిస్తూ కోరుకొన్న ప్రతి కోరికను, విశ్వాసంవల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు తన శక్తి ద్వారా పూర్తి చేయాలనీ ప్రార్థిస్తూ ఉంటాము. 12 మీ ద్వారా మన యేసు క్రీస్తు ప్రభువు మహిమ పొందాలని, మీకు ఆయన ద్వారా తన మహిమలో భాగం కలగాలని మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఇది మన దేవుని అనుగ్రహంవల్ల, యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప వల్ల సంభవిస్తుంది.
జక్కయ్య
19 యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా వెళ్తూవున్నాడు. 2 ఆ గ్రామంలో జక్కయ్య అనేవాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. 3 జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకొన్నాడు. కాని ప్రజలు గుంపులు గుంపులుగా వుండిరి అతడు పొట్టివాడు అవటంవలన యేసును చూడలేకపోయాడు. 4 యేసు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి ఆయన్ని చూడటానికి అందిరకన్నా ముందు పరుగెత్తి ఒక మెడి చెట్టెక్కి కూర్చున్నాడు.
5 యేసు ఆ చెట్టుదగ్గరకు వచ్చాక పైకి చూసి, “జక్కయ్యా! జక్కయ్యా! వెంటనే క్రిందికి దిగిరా! ఈ రోజు నేను నీ యింట్లో బసచెయ్యాలి!” అని అన్నాడు.
6 అతడు వెంటనే క్రిందికి దిగి ఆనందంతో యేసుకు స్వాగతం చెప్పాడు. 7 ప్రజలు జరిగినదంతా చూసి, “యేసు ఒక పాపి యింట్లో బస చెయ్యటానికి వెళ్తున్నాడే!” అని గొణిగారు.
8 కాని జక్కయ్య ప్రభువుతో, “ప్రభూ! నేనుయిక్కడే నా ఆస్తిలో సగం పేదవాళ్ళకు యిస్తాను. నేను ఎవరినుండైనా ఏదైనా మోసం చేసి తీసుకొని ఉంటే దానికి నాలుగు రెట్లు వాళ్ళకు చెల్లిస్తాను” అని అన్నాడు.
9 అప్పుడు యేసు, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. కనుక ఈ యింటికి ఈ రోజు రక్షణ వచ్చింది. 10 మనుష్యకుమారుడు తప్పిపోయిన వాళ్ళను వెతికి రక్షించటానికి వచ్చాడు” అని అన్నాడు.
© 1997 Bible League International