Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:137-144

సాదె

137 యెహోవా, నీవు మంచివాడవు.
    నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
    యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
    ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
    అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
    కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
    నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
    కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
    నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.

హబక్కూకు 1:5-17

దేవుడు హబక్కూకునకు సమాధానమివ్వటం

యెహోవా సమాధానమిచ్చాడు: “ఇతర జనులవైపు చూడు! వారిని గమనించు. నీకు విస్మయం కలుగుతుంది. నీ జీవిత కాలంలో నీకు విస్మయం కలిగించే ఒక పని చేస్తాను. నీవు అది నమ్మాలంటే చూసి తీరాలి. దాని విషయం నీకు చెపితే అది నీవు నమ్మవు. బబులోను ప్రజలను నేను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దుతాను. ఆ ప్రజలు నీచులు; శక్తిగల యుద్ధవీరులు. వారు భూమికి అడ్డంగా నడుస్తారు. వారికి చెందని ఇండ్లను, నగరాలను వారు వశపర్చుకుంటారు. బబులోనువారు ఇతర ప్రజలను భయపెడతారు. బబులోనువారు వారు చేయదల్చుకున్నది చేస్తారు; వెళ్ళదల్చుకున్న చోటుకి వెళతారు. వారి గుర్రాలు చిరుతపులులకంటే వేగం కలవి. సూర్యుడు అస్తమించాక అవి తోడేళ్ళకంటె నీచంగా ఉంటాయి. వారి గుర్రపు దళంవారు దూరప్రాంతలనుండి వస్తారు. ఆకలిగొన్న గరుడ పక్షి ఆకాశంనుండి కిందికి దూసుకు వచ్చినట్లు, వారు తమ శత్రువులను వేగంగా ఎదుర్కొంటారు. వారంతా చేయకోరుకునే ఒకే ఒక్క విషయం యుద్ధం. వారి సైన్యాలు ఎడారిలో గాలిలా వేగంగా నడుస్తాయి. మరియు బబులోను సైనికులు అనేకానేక మందిని చెరబడతారు. ఇసుక రేణువుల్లా లెక్కలేనంత మందిని పట్టుకుంటారు.

10 “బబులోను సైనికులు ఇతర దేశాల రాజులను చూసి నవ్వుతారు. పరదేశ పాలకులు వారికి హాస్యగాండ్రవలె ఉంటారు. పొడవైన, బలమైన గోడలు గల నగరాలను చూచి బబులోను సైనికులు నవ్వుతారు. ఆ సైనికులు గోడమీదికంటె మట్టి బాట సునాయాసంగా నిర్మించి, నగరాలను తేలికగా జయిస్తారు. 11 పిమ్మట వారు గాలిలా వెళ్లి మరో ప్రాంతంలో యుద్ధం చేస్తారు. బబులోనువారు ఆరాధించే ఒకే ఒక్క వస్తువు వారి స్వయంశక్తి.”

హబక్కూకు రెండవ ఫిర్యాదు

12 పిమ్మట హబక్కూకు చెప్పాడు:
“యెహోవా, నీవు ఎల్లకాలములయందు ఉండే దేవుడవు!
    నీవు చావులేని పవిత్ర దేవుడవు!
యెహోవా, జరుగవలసిన కార్యం జరిపించటానికే నీవు బబులోను ప్రజలను సృష్టించావు.
    మా ఆశ్రయ దుర్గమా, యూదా ప్రజలను శిక్షించటానికి నీవు వారిని సృష్టించావు.
13 నీ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు.
    ప్రజలు తప్పు చేయటాన్ని నీవు చూడలేవు.
మరి అటువంటి నీవు ఆ దుష్టులు జయించటం ఎలా చూడగలుగుతున్నావు?
    దుష్టులు మంచివారిని ఓడించటం నీవెలా చూడగలుగుతున్నావు?

14 “నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయారు చేశావు.
    నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు.
15 వారందరినీ గాలాలు, వలలు వేసి శత్రువు పట్టుకుంటాడు.
    శత్రువు వారిని తన వలలో పట్టి లాగుతాడు,
    తను పట్టుకున్న దానిని చూసి శత్రువు చాలా సంతోషిస్తాడు.
16 శత్రువు తను భాగ్యవంతుడుగా నివసించటానికి,
    మంచి ఆహారం తినటానికి అతని వల అతనికి సహాయపడుతుంది.
కావున శత్రువు తన వలను ఆరాధిస్తాడు.
    తన వల యొక్క గౌరవార్థం అతడు దానికి బలులు అర్పించి, ధూపంవేస్తాడు.
17 తన వలతో ధనాన్ని తీసుకుపోవటం అతడు కొనసాగిస్తాడా?
    దయా దాక్షిణ్యం లేకుండా అతడు (బబులోను సైన్యం) ప్రజలను నాశనం చేయటం కొనసాగిస్తాడా?”

2 పేతురు 1:1-11

యేసు క్రీస్తు సేవకుడును, అపొస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతినిబట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్ళకు వ్రాస్తున్నది.

దేవుణ్ణి గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తును గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.

మనకవసరమైన ప్రతిదాన్ని దేవుడు మనకిచ్చాడు

మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసినవాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు. ఈ విధంగా, అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేసాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాలనుండి తప్పించుకొని, తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసాడు.

అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి. ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను, ఉపయోగకరంగాను చేస్తాయి. ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటివాడు గ్రుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి, తాను యిదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయం మరిచిపోయాడన్నమాట.

10 సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు యింకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు. 11 తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం లభిస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International