Revised Common Lectionary (Semicontinuous)
కోరహు కుమారుల స్తుతి కీర్తన.
87 యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
2 ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
3 దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబుతారు.
4 దేవుడు తన ప్రజలందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబులోనులోను జీవిస్తున్నారు.
ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది.
5 సీయోనుగడ్డ మీద జన్మించిన
ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును.
సర్వోన్నతుడైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు.
6 దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు.
ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు.
7 దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు.
దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు.
“మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.
యూదా శత్రువులు శిక్షింపబడుదురు
3 “ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదాను, యెరూషలేమును నేను తిరిగి తీసుకొని వస్తాను. 2 రాజ్యాలన్నింటిని కూడా నేను సమావేశ పరుస్తాను. ఈ రాజ్యాలన్నింటిని క్రిందికి యెహోషాపాతు లోయలోకి నేను తీసుకొని వస్తాను. అక్కడ వారికి నేను తీర్పు చెప్తాను. ఆ రాజ్యాలు నా ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టాయి. వారు ఇతర రాజ్యాలలో జీవించేలా వారు వారిని బలవంత పెట్టారు. కనుక ఆ రాజ్యాలను శిక్షిస్తాను. ఆ రాజ్యాలు నా దేశాన్ని విభజింపచేశాయి. 3 నా ప్రజల కోసం వారు చీట్లు వేసుకొన్నారు. ఒక వేశ్యను కొనేందుకు వారు ఒక బాలుని అమ్ముకొన్నారు. మరియు తాగడానికి ద్రాక్షామద్యం కొనేందుకు వారు ఒక బాలికను అమ్ముకొన్నారు.
4 “తూరూ! సీదోనూ! ఫిలిష్తీయలోని అన్నిప్రాంతాలూ! మీరు నాకు ముఖ్యం కాదు. నేను ఏదైనా చేసినందుకు మీరు నన్ను శిక్షిస్తున్నారా? మీరు నన్ను శిక్షిస్తున్నారని తలస్తుండవచ్చు. కానీ త్వరలో నేను మిమ్ముల్ని శిక్షిస్తాను. 5 నా వెండి, బంగారం మీరు తీసుకొన్నారు. నా ప్రశస్త ఐశ్వర్యాలు మీరు తీసుకొని మీమీ ఆలయాల్లో పెట్టుకొన్నారు.
6 “యూదా, యెరూషలేము ప్రజలను మీరు గ్రీకువాళ్ళకు అమ్మేశారు. ఆ విధంగా మీరు వారిని దేశానికి దూరంగా తీసికొని వెళ్ళగలిగారు. 7 మీరు నా ప్రజలను అంత దూరస్థలానికి పంపించి వేశారు. కానీ నేను వారిని వెనుకకు తీసికొని వస్తాను. మరియు మీరు చేసినదానికి నేను మిమ్ముల్ని శిక్షిస్తాను. 8 మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు నేను అమ్మివేస్తాను. అప్పుడు వారు ఇంకా దూరంలో ఉన్న షెబాయీము ప్రజలకు అమ్మివేస్తారు.” ఆ విషయాలు యెహోవా చెప్పాడు.
క్రీస్తు అనుచరుడిగా శ్రమపడటం
12 నా ప్రియమైన సోదరులారా! మీకు అగ్నిపరీక్ష జరుగుతోంది. తద్వారా ఏదో జరుగరానిది జరిగినట్లు ఆశ్చర్యపడకండి. 13 క్రీస్తు కష్టాల్లో మీరు పాలు పంచుకుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన మహిమ వ్యక్తమైనప్పుడు మీరు చాలా ఆనందిస్తారు. 14 ఒకవేళ క్రీస్తు పేరు కారణంగా మీకు అవమానం కలిగితే, మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన ఆత్మ మీలో ఉన్నాడన్నమాట. 15 హత్య చేసి కాని, దొంగతనం చేసి కాని, దుర్మార్గంగా ప్రవర్తించి గాని, లేక యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటం వలన కాని, మీరు శిక్షను అనుభవించకూడదు. 16 మీరు క్రైస్తవులైనందువలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి. 17 ఎందుకంటే, తీర్పు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళ మీద తీర్పు చెప్పబడుతుంది. మరి ఆ తీర్పు మనతో ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాకరించిన వాళ్ళగతేమౌతుంది? 18 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు:
“నీతిమంతులకే రక్షణ లభించటం కష్టమైతే,
నాస్తికుని గతి, పాపాత్ముని గతి ఏమౌతుంది?”(A)
19 అందువలన, దైవేచ్ఛ ప్రకారం కష్టాలనుభవించేవాళ్ళు, విశ్వసింప దగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకొని సన్మార్గంలో జీవించాలి.
© 1997 Bible League International