Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 65

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
    నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
    ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
    నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
    నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
    నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
    ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
    మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
    మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
    దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
    నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
    నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
    భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
    అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
    బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
    లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.

యోవేలు 2:12-22

ప్రజలు మార్పు చెందాలని యెహోవా చెప్పుట

12 ఇది యెహోవా సందేశం:
    “ఇప్పుడు మీ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగిరండి.
మీరు చెడ్డ పనులు చేసారు.
    ఏడువండి, ఏడువండి. భోజనం ఏమీ తినకండి.
13 మీ వస్త్రాలు కాదు
    మీ హృదయాలు చింపుకోండి.”
మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి.
    ఆయన దయ, జాలిగలవాడు.
ఆయన త్వరగా కోపపడడు.
    ఆయనకు ఎంతో ప్రేమఉంది.
ఒక వేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విషయంలో
    ఆయన తన మనస్సు మార్చుకొంటాడేమో.
14 ఒకవేళ యెహోవా తన మనస్సు మార్చుకొంటాడేమో ఎవరికి తెలుసు.
    మరియు ఒకవేళ ఆయన తన వెనుక నీ కోసం ఒక ఆశీర్వాదం విడిచి పెడతాడేమో.
అప్పుడు నీవు నీ యెహోవా దేవునికి
    ధాన్యార్పణం, పానీయార్పణం అర్పించవచ్చు.

యెహోవాను ప్రార్థించు

15 సీయోనులో బూర ఊదండి.
    ఒక ప్రత్యేక ఉపవాస సమయం ఏర్పాటు చేయండి.
16 ప్రజలను సమావేశం చేయండి.
    ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి.
పెద్దవాళ్లను సమావేశపరచండి.
    చిన్న పిల్లలను, తల్లుల స్తనములను ఇంకా కుడిచే చిన్న శిశువులను సహితం సమావేశపరచండి.
పెండ్లికుమార్తెను, ఆమె పెండ్లికుమారున్ని
    వారి పడకగదినుండి బయటకు రప్పించండి.
17 యాజకులను, యెహోవా సేవకులను
    మండపానికి బలిపీఠానికి మధ్య విలపించనివ్వండి
ఆ ప్రజలందరూ ఈ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు.
    నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు.
    నీ ప్రజలనుగూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు.
ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ
    ‘వారిదేవుడు ఎక్కడ?’ అని చెప్పనియ్యకు.”

యెహోవా దేశాన్ని మరల ఇచ్చివేస్తాడు

18 అప్పుడు యెహోవా ఈ దేశాన్నిగూర్చి ఉద్వేగపడ్డాడు.
    తన ప్రజల విషయం ఆయన విచార పడ్డాడు.
19 యెహోవా తన ప్రజలతో మాట్లాడాడు.
ఆయన చెప్పాడు, “నేను మీకు ధాన్యం, ద్రాక్షారసం, నూనె పంపిస్తాను.
    అవి మీకు సమృద్ధిగా ఉంటాయి.
    రాజ్యాల మధ్య నేను మిమ్మిల్ని ఇంకెంత మాత్రం అవమానించను.
20 లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను.
    ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు వెళ్ళేటట్టు నేను చేస్తాను.
వారిలో కొందరు తూర్పు సముద్రానికి వెళ్తారు.
    మరి కొందరు పడమటి సముద్రానికి వెళ్తారు.
ఆ ప్రజలు అంత భయంకరమైన పనులు చేశారు.
    కాని వారు చచ్చి కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు.
అక్కడ భయంకరమైన కంపు కొడుతుంది!”

దేశం మరల కొత్తదిగా చేయబడుతుంది

21 దేశమా, భయపడకు.
    సంతోషించి ఆనందంతోనిండి ఉండు.
    ఎందుకంటే యెహోవా గొప్పకార్యాలు చేస్తాడు.
22 పొలంలోని పశువులారా, భయపడవద్దు.
    అరణ్యపు బీళ్ళు మరలా గడ్డి మొలిపిస్తాయి.
చెట్లు ఫలాలు ఫలిస్తాయి.
    అంజూరపు చెట్లు, మరియు ద్రాక్షావల్లులు మరిన్ని ఫలాలు ఫలిస్తాయి.

లూకా 1:46-55

మరియ పాడిన భక్తి గీతం

46 మరియ ఈ విధంగా అన్నది:

47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
    దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
    ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
    నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
    ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
    గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
    దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
    ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
    అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International