Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 65

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
    నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
    ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
    నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
    నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
    నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
    ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
    మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
    మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
    దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
    నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
    నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
    భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
    అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
    బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
    లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.

యోవేలు 1

మిడుతలు పంటలను పాడుచేయుట

పెతూయేలు కుమారుడైన యోవేలు ఈ సందేశాన్ని యెహోవా దగ్గరనుండి అందుకొన్నాడు:

నాయకులారా, ఈ సందేశం వినండి!
    దేశంలో నివసించే మనుష్యులారా, మీరందరూ నామాట వినండి.
మీ జీవితకాలంలో ఇలాంటిది ఏదైనా ఇదివరకు జరిగిందా?
    లేదు! మీతండ్రుల కాలంలో ఇలాంటిది ఏదైనా జరిగిందా? లేదు!
ఈ సంగతులను గూర్చి మీరు మీ పిల్లలతో చెపుతారు.
    మీపిల్లలు వారి పిల్లలతో చెపుతారు.
    మీ మనుమలు, మనుమరాండ్రు తమ తరువాత తరమువారితో చెపుతారు.
కోత మిడుతలు విడిచిపెట్టినదానిని
    దండు మిడుతలు తినేస్తాయి
దండు మిడుతలు విడిచిపెట్టినదానిని
    దూకుడు మిడుతలు తినేస్తాయి.
దూకుడు మిడుతలు విడిచిపెట్టినదానిని
    వినాశ మిడుతలు తినేశాయి!

మిడుతలు—పెద్ద దండు

మద్యపాన మత్తులారా, మేల్కొని, ఏడ్వండి!
    ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి.
ఎందుకంటే, మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపోయింది.
    ఆ ద్రాక్షామద్యం మరో గుక్కెడు మీకు దొరకదు.
నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒక పెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది.
    వారు లెక్కించ శక్యం కానంతమంది సైనికులు ఉన్నారు.
ఆ మిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు!
    అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంటుంది.

నా ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపళ్ళు అన్నింటినీ
    ఆ “మిడుతలు” తినేస్తాయి!
అవి నా అంజూరపు చెట్లను నాశనం చేస్తాయి.
    మిడుతలు నా చెట్ల బెరడును తినేస్తాయి.
కొమ్మలు తెల్లబారి పోతాయి.
    చెట్లు నాశనం చేయబడతాయి.

ప్రజలు దుఃఖించుట

పెళ్లికి సిద్ధంగా ఉండి, తనకు కాబోయే భర్త
    అప్పుడే చంపి వేయబడగా, ఒక యువతి ఏడ్చేలా ఏడ్వండి.
యాజకులారా! యెహోవా సేవకులారా! ఏడ్వండి.
    ఎందుకంటే యెహోవా ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇక ఉండవు.
10 పొలాలు పాడుచేయబడ్డాయి.
    చివరికి నేలకూడా విలపిస్తుంది.
    ఎందుకనగా ధాన్యం పాడైపోయింది.
కొత్త ద్రాక్షారసం ఎండిపోయింది.
    ఒలీవ నూనె ఇకలేదు.
11 రైతులారా! విచారించండి.
    ద్రాక్షాతోట రైతులారా! గట్టిగా ఏడ్వండి.
గోధుమ, యవల[a] కోసం ఏడ్వండి!
    ఎందుకంటే పొలంలోని పంట నష్టమైంది.
12 ద్రాక్షావల్లులు ఎండిపోయాయి.
    అంజూరపుచెట్టు చస్తోంది.
దానిమ్మ చెట్టు, ఖర్జూరపుచెట్టు,
    జల్దరు[b] చెట్టు, పొలములోని చెట్లు అన్నీ ఎండిపోయాయి.
    ప్రజల్లో సంతోషం చచ్చింది.
13 యాజకులారా, మీ విచార సూచక వస్త్రాలు ధరించి గట్టిగా ఏడ్వండి.
    బలిపీఠపు సేవకులారా, గట్టిగా ఏడ్వండి.
నా దేవుని సేవకులారా, మీరు మీ విచారసూచక వస్త్రాలతోనే నిద్రపోతారు.
    ఎందుకంటే, దేవుని ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇకమీదట ఉండవు.

మిడుతల భయంకర నాశనం

14 ఉపవాసం ఉండాల్సిన ఒక ప్రత్యేక సమయం ఉంటుందని ప్రజలతో చెప్పు. ప్రత్యేకమైన ఒక సమావేశం కోసం ప్రజల్నిపిలువుము. దేశంలో నివసిస్తున్న నాయకులను, ప్రజలందరిని సమావేశ పరచు. నీదేవుడైన యెహోవా ఆలయానికి వారిని తీసుకొనివచ్చి యెహోవాకు ప్రార్థించండి.

15 దుఃఖపడండి! ఎందుకంటే, యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరనుండి శిక్ష ఒక దాడిలా వస్తుంది. 16 మన ఆహారం పోయింది. మన దేవుని ఆలయంనుండి ఆనందం, సంతోషం పోయాయి. 17 మనం విత్తనాలు విత్తాం, కాని ఆ విత్తనాలు ఎండిపోయి, చచ్చి, మట్టిలో పడివున్నాయి. మన మొక్కలు ఎండిపోయి, చచ్చిపోయాయి. మన కొట్టాలు ఖాళీ అయిపోయి పడిపోతున్నాయి.

18 జంతువులు ఆకలితో మూలుగుతున్నాయి. పశువుల మందలు గందరగోళంగా తిరుగుతున్నాయి. అవి మేసేందుకు గడ్డి లేదు. గొఱ్ఱెలు చస్తున్నాయి. 19 యెహోవా, సహాయంకోసం నీకు నేను మొరపెడుతున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా మార్చేసింది. పొలంలోని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చివేశాయి. 20 అడవి జంతువులకు కూడ నీ సహాయం కావాలి. కాలువలు ఎండిపోయాయి. నీళ్ళు లేవు. మా పచ్చటి పొలాలను అగ్ని ఎడారిగా మార్చివేసింది.

2 తిమోతికి 3:1-9

చివరి కాలపు సంగతులు

ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి. మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, అపవిత్రత, ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం, ద్రోహబుద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటె సుఖాన్ని ప్రేమించటం. పైకి భక్తిపరుల్లా ఉండి దాని శక్తిని అంగీకరించకుండటం ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండు.

వాళ్ళు ఇళ్ళల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకు పోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకొంటారు. ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకొంటారు. కాని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. యన్నే మరియు యంబ్రే అనువారు మోషేను ఎదిరించిన విధంగా వీళ్ళ బుద్ధులు పాడై సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. వీళ్ళు ముందుకు పోలేరు. మోషేను ఎదిరించినవాళ్ళలాగే వీళ్ళ అవివేకం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International