Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
కాని వారు ఎన్నడూ జయించలేదు.
3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
6 ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
8 ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
“యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.
యిర్మీయాను సిద్కియా కొన్ని ప్రశ్నలడగటం
14 పిమ్మట రాజైన సిద్కియా తన సేవకునితో ప్రవక్తయైన యిర్మీయాను పిలిపించాడు. దేవాలయంలో మూడవ ద్వారం వద్దకు అతడు యిర్మీయాను పిలువనంపాడు. అప్పుడు రాజు “యిర్మీయా, నేను నిన్నొక విషయం అడగదలిచాను. ఏమీ దాయకుండా చిత్త శుద్ధితో అంతా చెప్పు” అని అన్నాడు.
15 “నేను నీకు సమాధానం ఇస్తే నీవు నన్ను చంపివేస్తావు. నేను నీకేదైనా సలహా ఇచ్చినా నీవు దానిని వినిపించుకోవు” అని యిర్మీయా సిద్కియాతో అన్నాడు.
16 కాని రాజైన సిద్కియా యిర్మీయాకు ఒక ప్రమాణం చేశాడు. సిద్కియా ఇది రహస్యంగా చేశాడు. సిద్కియా ఇలా ప్రమాణం చేశాడు: “యిర్మీయా, మనందరికీ జీవం పోసిన ప్రాణదాత, నిత్యుడు అయిన యెహోవా సాక్షిగా నిన్ను నేను చంపను. అంతే గాదు. నిన్ను చంపజూచే అధికారులకు నిన్ను అప్పగించనని కూడా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను.”
17 అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విధంగా చెప్పాడు, ‘నీవు బబులోను అధికారులకు లొంగిపోతే నీ ప్రాణం కాపాడబడుతుంది. యెరూషలేము నగరం కూడ తగుల బెట్టబడదు. నీవు, నీ కుటుంబం సజీవంగా ఉంటారు. 18 నీవు బబులోను రాజుయొక్క అధికారులకు లొంగి పోవటానికి నిరాకరిస్తే, యెరూషలేము కల్దీయుల సైన్యానికి ఇవ్వబడుతుంది. వారు యెరూషలేమును తగులబెడతారు. నీవు కూడ వారి బారి నుండి తప్పించుకోలేవు.’”
19 “కాని ఇప్పటికే బబులోను సైన్యపు పక్షం వహించిన యూదా ప్రజల విషయంలో నేను భయపడుతున్నాను. పైగా సైనికులు నన్ను యూదా ప్రజలకు ఇస్తే వారు నన్ను అవమానపర్చి, గాయపర్చుతారని కూడా నేను భయపడతున్నాను.” అని యిర్మీయాకు రాజైన సిద్కియా బదులు చెప్పాడు.
20 అందుకు యిర్మీయా ఇలా అన్నాడు: “సైనికులు నిన్ను ఆ యూదా ప్రజలకు అప్పజెప్పరు. నేను చెప్పినట్లు విని యెహోవాకు విధేయుడవై ఉండుము. అప్పుడు పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి. నీ ప్రాణం రక్షింపబడుతుంది. 21 కాని నీవు బబులోను సైన్యానికి లొంగిపోవటానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుందో యెహోవా నాకు చూపించాడు. యెహోవా ఇలా అన్నాడు: 22 యూదా రాజగృహంలో మిగిలివున్న స్త్రీలంతా బయటకు లాగబడతారు. వారు బబులోను రాజు ముఖ్య అధికారుల వద్దకు తేబడుతారు. నీ స్త్రీలే నిన్ను ఒక పాట పాడి ఎగతాళి చేస్తారు. ఆ స్త్రీలు ఇలా అంటారు.
‘నీ మంచి స్నేహితులే నిన్ను తప్పుదోవ పట్టించారు.
నీవారు నీకంటె బలవంతులైనారు.
అటువంటి స్నేహితులనే నీవు నమ్మావు.
నీ కాళ్లు బురదలో కూరుకున్నాయి.
నీ స్నేహితులు నిన్ను వదిలి పెట్టారు.’
23 “నీ భార్యలు, పిల్లలు అందరూ బయటకు ఈడ్వబడతారు. వారు కల్దీయుల సైన్యానికి అప్పగించబడతారు. నీవు కూడ బబులోను సైన్యం నుండి తప్పించుకోలేవు. నీవు బబులోను రాజుచే పట్టు కొనబడతావు. యెరూషలేము తగులబెట్టబడుతుంది.”
24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నేను నీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ తెలియనీయవద్దు. చెప్పితే నీవు చనిపోతావు. 25 ఆ అధికారులు నేను నీతో మాట్లాడినట్లు తెలిసికోవచ్చు. అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, ‘యిర్మీయా, నీవు రాజైన సిద్కియాకు ఏమి చెప్పావో అది మాకు తెలియజేయుము. రాజైన సిద్కియా నీకు ఏమి చెప్పినాడో కూడ మాకు చెప్పు. మాకు నిజాయితీగా అంతాచెప్పు. లేకుంటే మేము నిన్ను చంపివేస్తాం’ అని అంటారు. 26 వారు నీతో అలా అన్నప్పుడు, ‘నన్ను మరల యెనాతాను ఇంటి క్రిందగల చెరసాల గదిలోకి పంపవద్దని రాజును వేడుకుంటున్నాను. మళ్లీ నేనా చెరసాల గదికి పంపబడితే చనిపోతాను’ అని అన్నట్లు చెప్పు.”
27 అనుకున్నదంతా జరిగింది. రాజ్యాధికారులు యిర్మీయాను ప్రశ్నించటానికి వచ్చారు. యిర్మీయా మాత్రం రాజు ఆజ్ఞానుసారం ఆయన చెప్పిన రీతిగా వారికి సమాధానమిచ్చాడు. అప్పుడా అధికారులు యిర్మీయాను ఒంటరిగా వదిలారు. యిర్మీయా మరియు రాజు ఏమి మాట్లాడారో ఏ ఒక్కరూ వినలేదు.
28 యెరూషలేము ముట్టడింపబడేనాటి వరకు యిర్మీయా ఆలయ ప్రాంగణంలో బందీగా ఉన్నాడు.
క్రైస్తవుల మధ్య వివాదాలు
6 ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? 2 పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? 3 మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? 4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? 5 సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? 6 సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.
7 మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది. 8 దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.
9 దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే వాళ్ళకు, 10 దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు, దేవుని రాజ్యం దొరకదు. 11 మీలో కొందరు ఆ విధంగా జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్దోషులుగా పరిగణింపబడ్డారు.
© 1997 Bible League International