Revised Common Lectionary (Semicontinuous)
27 “ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు అభివృద్ధి చెందేలా నేను సహాయపడే రోజులు వస్తున్నాయి.” ఇది యెహోవా వాక్కు. “వారి సంతానం, వారి పశుసంపద వర్థిల్లేలా కూడా నేను సహాయపడతాను. నేను చేసే ఆ పని ఒక మొక్కను నాటి దానిని పెంచినట్లుగా ఉంటుంది. 28 గతంలో ఇశ్రాయేలు, యూదావారు చేసే కార్యకలాపాలపై నేను నిఘా వేసి ఉన్నాను. వారిని మందలించే సమయం కోసం నేను వేచి ఉన్నాను. సమయం వచ్చింది; వారిని చీల్చి చెండాడాను. వారికి అనేక కష్ట నష్టాలు కలుగ జేశాను. కాని ఇప్పుడు వారిని పైకి తీసికొని రావటానికి, వారిని బలపర్చటానికి నేను వారిని గమనిస్తూ ఉన్నాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
29 “ఆ సమయంలో ప్రజలు ఈ సామెత చెప్పరు:
‘తండ్రులు పుల్లని ద్రాక్ష తిన్నారు,
కాని పిల్లల పళ్లు పులిశాయి.’[a]
30 కాని ప్రతివాడు తన పాపాల కారణంగా చనిపోతాడు. పుల్లని ద్రాక్షా తిన్న వాని పండ్లే పులుస్తాయి.”
క్రొత్త ఒడంబడిక
31 “ఇశ్రాయేలు వంశంతోను, యూదా వంశంతోను నేనొక క్రొత్త ఒడంబడికను కుదుర్చుకునే సమయం ఆసన్న మవుతూ ఉంది. 32 ఇది నేను వారి పూర్వీకులతో చేసికొన్న ఒడంబడిక వంటిది గాదు. వారిని నా చేతితో ఈజిప్టు నుండి నడిపించి తీసికొని వచ్చి నప్పుడు మేమా ఒడంబడిక చేసికొన్నాము. నేను వారి యెహోవాను, కాని వారే ఆ ఒడంబడికను ఉల్లంఘించారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
33 “భవిష్యత్తులో నేను ఇశ్రాయేలుతో ఈ రకమైన ఒడంబడిక చేసుకుంటాను.” ఇదే యెహోవా వాక్కు. “నా బోధనలన్నీ వారి మనస్సులో నాటింప చేస్తాను. పైగా వాటిని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారి దేవుణ్ణి. వారు నా ప్రజలై ఉందురు. 34 యెహోవాను గురించి తెలిసికొనేందుకు ప్రజలు వారి పొరుగువారికి, బంధువులకు బోధించనక్కరలేదు. ఎందువల్లనంటే అన్ని తరగతుల ప్రజలు తమతమ భేదం లేకుండా నన్ను తెలిసికుంటారు.” ఇదే యెహోవా వాక్కు. “వారు చేసిన చెడ్డ పనులన్నిటినీ నేను క్షమిస్తాను. వారి పాపాలను నేను గుర్తు పెట్టుకొనను.”
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
14 కాని, నీవు ఎవరినుండి నేర్చుకొన్నావో తెలుసు. కనుక, నీవు నేర్చుకొన్నవాటిని, విశ్వసించినవాటిని పాటిస్తూ ఉండు. 15 అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి పవిత్ర గ్రంథాలు తెలిసినవాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి. 16 లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయం తర్బీదు చేయటానికి ఉపయోగపడతాయి. 17 వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారుకాగలడు.
4 చనిపోయినవాళ్ళపై, బతికివున్నవాళ్ళపై తీర్పు చెప్పే దేవుని సమక్షంలో యేసు క్రీస్తు సమక్షంలో నీకొక ఆజ్ఞ యిస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కానున్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. 2 దైవసందేశాన్ని ప్రకటించు. అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండు. తప్పులు సరిదిద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, ప్రోత్సాహమిస్తూ, సహనంతో బోధిస్తూ ఉండు.
3 ప్రజలు మంచి ఉపదేశాలు వినటం మానివేసే సమయం వస్తుంది. వాళ్ళు తమ యిష్టం వచ్చినట్లు చేస్తారు. తాము వినదల్చిన లౌకికమైన వాటిని చెప్పగలిగే పండితుల్ని తమ చుట్టూ ప్రోగుచేసుకొంటారు. 4 సత్యం వినటం మాని, కల్పిత సంగతులు వింటారు. 5 కాని అన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండు. కష్టాలు ఓర్చుకో. సువార్త ప్రచారం చెయ్యటానికి కష్టించి పనిచెయ్యి. నీ సేవా సంబంధంలో చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తిగా నిర్వర్తించు.
పట్టు వదలని వితంతువు యొక్క ఉపమానం
18 నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం చెందరాదని, బోధించటానికి యేసు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు: 2 “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను. 3 అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది. 4 చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు. 5 కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”
6 ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! 7 మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా! 8 ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.
© 1997 Bible League International