Revised Common Lectionary (Semicontinuous)
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
16 తరువాత పాలకులు, ప్రజలు అందరూ మాట్లాడారు. ఆ ప్రజలు యాజకులతోను “యిర్మీయా చంపబడకూడదు. యిర్మీయా మనకు చెప్పిన విషయాలు మన యెహోవా దేవుని నుండి వచ్చినవే” అని అన్నారు.
17 అప్పుడు నగర పెద్దలలో (నాయకులు) కొందరు లేచి ప్రజలతో ఇలా అన్నారు: 18 “ప్రవక్తయైన మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజైన హిజ్కియా పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా ప్రజలందరికీ మీకా(A) ఈ విషయాలు చెప్పియున్నాడు:
“సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే:
సీయోను దున్నబడిన పొలంలా అవుతుంది!
యెరూషలేము ఒక రాళ్ల గుట్టలా తయారవుతుంది!
గుడివున్న పర్వతం, ఒక ఖాళీ కొండ[a] పొదలతో నిండినట్లవుతుంది.
19 “హిజ్కియా యూదాకు రాజుగా వున్నప్పుడు హిజ్కియా మీకాను చంపలేదు. యూదా ప్రజలెవ్వరూ మీకాను చంపలేదు. హిజ్కియా యెహోవా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడని మీకు తెలుసు. అతడు దేవుని సంతోషపరచాలని కోరుకున్నాడు. యూదా రాజ్యానికి కీడు చేస్తానని యెహోవా అన్నాడు. కాని హిజ్కియా యెహోవాను ప్రార్థించాడు. అందువల్ల యెహోవా తన మనస్సు మార్చుకున్నాడు. యెహోవా ముందుగా అన్నట్లు ఏ కీడూ చేయలేదు. ఇప్పుడు మనం యిర్మీయాను గాయపర్చితే, మనం మన మీదికే అనేక కష్టాలు తెచ్చి పెట్టుకుంటాము. ఆ కష్టాలన్నీ మన స్వంత తప్పులు.”
20 గతంలో యెహోవా సందేశాన్ని ప్రవచించిన మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్యత్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా కూడ చెప్పియున్నాడు. 21 రాజైన యెహోయాకీము, అతని సైన్యాధికారులు, మరియు యూదాలోని ప్రజా నాయకులు ఊరియా బోధించినదంతా విన్నారు. వారికి చాలా కోపం వచ్చింది. రాజైన యెహోయాకీము ఊరియాను చంపగోరాడు. కాని యోహోయాకీము తనను చంపగోరుతున్నట్లు ఊరియా విన్నాడు. ఊరియా భయపడ్డాడు. అందుచే అతడు ఈజిప్టుకు తప్పించుకు పోయాడు. 22 కాని ఎల్నాతాను అనే వ్యక్తిని, మరి కొందరు మనుష్యులను రాజైన యోహోయాకీము ఈజిప్టుకు పంపాడు. ఎల్నాతాను అనేవాడు. అక్బోరు అనేవాని కుమారుడు. 23 ఆ మనుష్యులు ఊరియాను ఈజిప్టు నుండి తీసికొని వచ్చారు. వారు ఊరియాను రాజైన యెహోయాకీము వద్దకు తీసికొని వెళ్లారు. ఊరియాను కత్తితో నరికి చంపమని యెహోయాకీము ఆజ్ఞ యిచ్చాడు. పేద ప్రజల స్మశాన వాటికలో అతని శవం పారవేయబడింది.
24 షాఫాను కుమారుడైన అహీకాము అనే ప్రముఖ వ్యక్తి ఒకడున్నాడు. అహీకాము యిర్మీయాకు అండగావున్నాడు. అందుచే అహీకాము యాజకుల బారి నుండి, ప్రవక్తల బారి నుండి చంపబడకుండా యిర్మీయాను రక్షించాడు.
దేవుడు సమ్మతించిన పనివాడు
14 వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను హెచ్చరించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది. 15 దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.
16 విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటివాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు. 17 వీళ్ళ బోధ పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనై, ఫిలేతు ఈ గుంపుకు చెందినవాళ్ళు. 18 వీళ్ళు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు.
19 అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు.(A) ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలివెయ్యాలి” అని వ్రాయబడి ఉంది.
20 గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో, మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి. 21 దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు.
22 యౌవనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచేవాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు. 23 కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. 24 అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. 25 తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి. 26 అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చి సాతాను వేసిన వలనుండి తప్పించుకోగల్గుతారు. ఎందుకంటే సాతాను వాళ్ళను తన యిచ్ఛ నెరవేర్చటానికి బంధించి పెట్టాడు.
© 1997 Bible League International