Revised Common Lectionary (Semicontinuous)
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
దేవాలయం వద్ద యిర్మీయా పాఠం
26 యూదా రాజ్యాన్ని యెహోయాకీము పాలిస్తున్న మొదటి సంవత్సరంలో[a] ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. 2 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు దేవాలయ ప్రాంగణంలో నిలబడు. దేవుని ఆరాధించుటకై వచ్చే యూదా ప్రజలందరికి ఈ సందేశాన్ని అందజేయుము. నేను నిన్ను మాట్లాడమని చెప్పినదంతా వారికి చెప్పుము. నా సందేశంలో ఏ భాగాన్ని వదిలి పెట్టవద్దు. 3 బహుశః వారు నా సందేశాన్ని విని ఆచరించవచ్చు. బహుశః వారా దుర్మార్గపు జీవితాన్ని విడనాడవచ్చు. వారు గనుక మారితే, నేను వారిని శిక్షించాలనే నా పథకాన్ని కూడా మార్చు కుంటాను. వారు చేసిన అనేక దుష్టకార్యాల దృష్ట్యా నేను వారిని శిక్షించే పథకాన్ని తయారు చేస్తున్నాను. 4 నీ విధి వారికి చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు: నా ఉపదేశాలను మీకు అందించాను. మీరు నాకు విధేయులై నా సూక్తులను పాటించాలి! 5 నా సేవకులు (నా ప్రవక్తలు) మీకు చెప్పే విషయాలను మీరు ఆలకించాలి. నా ప్రవక్తలను మీ వద్దకు మరల, పంపియున్నాను. కాని మీరు వారు చెప్పేది ఆలకించలేదు. 6 మీరు నన్ను అనుసరించక పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలోహులో వున్న నా పవిత్ర గుడారం[b] మాదిరిగా చేసివేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరైనా తమకు గిట్టని నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు జరిగినట్లు జరగాలని కోరుకుంటాను.’”
7 దేవాలయంలో యిర్మీయా ఈ మాటలు చెప్పటం యాజకులు, ప్రవక్తలు, దేవుని ఆలయానికి వచ్చిన ప్రజలందరూ విన్నారు. 8 ప్రజలకు చెప్పమని యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చెప్పటం ముగించాడు. పిమ్మట యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అంతా యిర్మీయాను పట్టుకున్నారు. “ఈ భయంకరమైన విషయాలు చెప్పినందుకు నీవు చనిపోవలసినదే! 9 యెహోవా పేరట అటువంటి విషయాలు చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో వారంతా యిర్మీయాను చుట్టు ముట్టారు.
10 ఇప్పుడు యూదా పాలకులు జరుగుతున్న విషయాలన్నీ విన్నారు. కావున వారు రాజభవనం నుండి బయటికి వచ్చారు. వారు దేవాలయానికి వెళ్లారు. అక్కడ దేవాలయానికి తిన్నగా వెళ్లే నూతన ద్వారం వద్ద తమ తమ స్థానాలను అలంకరించారు. 11 అప్పుడు యాజకులు, ప్రవక్తలు కలిసి పాలకులతోను, తదితర ప్రజలతోను మాట్లాడారు. “యిర్మీయా చంపబడాలి. యెరూషలేమును గురించి అతడు చాలా చెడ్డ విషయాలు చెప్పాడు. అతడా విషయాలు చెప్పటం మీరు కూడ విన్నారు” అని వారంతా చెప్పారు.
12 పిమ్మట యిర్మీయా యూదా పాలకులందరితోను, ఇతర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి ఈ విషయాలు చెప్పమని యెహోవా నన్ను పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియజేసినదే. 13 ఓ ప్రజలారా, మీ జీవిత విధానం మార్చుకోండి! మీరు సత్కార్యాలు చేయుట మొదలుపెట్టండి! మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. మీరలా చేస్తే యెహోవా తన మనస్సు మార్చుకుంటాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా తలపెట్టిన హానికరమైన పనులు చేయడు. 14 ఇక నా విషయానికి వస్తే, నేను మీ ఆధీనంలో ఉన్నాను. మీరు ఏది ఉచితమని, న్యాయమని తోస్తే, నాకు అది చేయండి. 15 కాని మీరు నన్ను చంపితే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరానికి పాల్పడిన వారవుతారు. అంతే కాదు. మీరీ నగరాన్ని, అందులోని ప్రతి పౌరుణ్ణి కూడ నేరస్థులుగా చేసిన వారవుతారు. యెహోవా నిజంగా నన్ను మీ వద్దకు పంపియున్నాడు. మీరు విన్న సందేశం వాస్తవంగా యెహోవా నుండే వచ్చినది.”
22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. 23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.
24 “ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. 25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతి వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.
27 “మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. 28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’
29 “మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు. 30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”
32 చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు. 33 పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు. 34 కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసి అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగువాళ్ళున్నారు.
© 1997 Bible League International