Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 102:1-17

శ్రమపడుతున్న వ్యక్తి ప్రార్థన. బలహీనంగా ఉండి తన ఆరోపణలను యెహోవాకు చెప్పాలని అతడు తలంచినప్పటిది.

102 యెహోవా, నా ప్రార్థన విను.
    సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము.
యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము.
    నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము.
పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది.
    నా జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది.
నా బలం పోయింది.
    నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను.
    నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను.
నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది.[a]
అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
    శిథిలమైన పాత కట్టడాలలో బ్రతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
నేను నిద్రపోలేను.
    పై కప్పు మీద ఒంటరిగా నివసించే పక్షిలా నేను ఉన్నాను.
నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు.
    నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తారు.
నా అధిక విచారమే నా భోజనం.
    నా కన్నీళ్లు నా పానీయాల్లో పడతాయి.
10 ఎందుకంటే, నీవు నా మీద కోపగించావు.
    యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు, నీవు నన్ను క్రిందకు విసిరేశావు.

11 సాయంకాలమయ్యేసరికి దీర్ఘమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయిపోయింది.
    నేను ఎండిపోయి వాడిన గడ్డిలా ఉన్నాను.
12 అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
    నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది.
13 నీవు లేచి సీయోనును ఆదరిస్తావు.
    నీవు సీయోను యెడల దయగా ఉండే సమయం వస్తూంది.
14 యెరూషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.
15 జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు.
    దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు.
16 ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు.
    యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు.
17 దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు.
    దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.

యిర్మీయా 29:24-32

షెమయాకు దేవుని సందేశం

24 షెమయాకు కూడ ఒక సందేశం ఇవ్వు. షెమయా నెహెలామీయుడు. 25 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు. “షెమయా, నీవు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకులందరికీ లేఖలు పంపావు. మయశేయా కుమారుడు, యాజకుడునయిన జెఫన్యాకు నీవు లేఖలు పంపావు. లేఖలన్నీ నీవు నీ పేరుమీదనే పంపావు. అంతేగాని యెహోవా అధికారంతో పంపలేదు. 26 షెమయా, నీ లేఖలో జెఫన్యాకు ఇలా చెప్పావు. ‘జెఫన్యా, యెహోవా నిన్ను యెహోయాదా స్థానంలో యాజకునిగా చేశాడు. దేవాలయ నిర్వాహణాధికారం నీవు కలిగి ఉంటావు. పిచ్చివానిలా[a] ప్రవర్తించే ప్రతి వానినీ లేదా ప్రవక్తలా నటించే ప్రతి వానినీ, నీవు నిర్భందించవచ్చు. వానికి నీవు బొండ కొయ్య[b] దండన విధించవచ్చు. వాని మెడకు ఇనుప చక్రం[c] వేసి దానికి గొలుసులు తగిలించవచ్చు. 27 ఇప్పుడు యిర్మీయా ప్రవక్తలా ప్రవర్తిసున్నాడు. కావున నీవతనిని ఎందువల్ల నిర్భందించలేదు? 28 బబులోనులో వున్న మనకు యిర్మీయా యిలా వర్తమానం పంపాడు. ఇశ్రాయేలు నుండి తీసుకురాబడి బబులోనులో వున్న ప్రజలారా, మీరక్కడ బహుకాలం వుంటారు. కావున ఇండ్లు నిర్మించుకొని స్థిరపడండి. తోటలు పెంచి, మీరు పండించిన పండ్లను తినండి.’”

29 ప్రవక్త యిర్మీయాకు ఈ లేఖను యాజకుడైన జెఫన్యా చదివి వినిపించాడు. 30 పిమ్మట యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. 31 “యిర్మీయా, ఈ సందేశం బబులోనులో ఉన్న బందీలందరికి పంపించుము ‘నెహెలామీయుడైన షెమయాను గురించి యెహోవా ఇలా అంటున్నాడు. షెమయా మీకు ప్రవచించాడు. కాని నేనతనిని పంపలేదు. షెమయా ఒక అబద్ధాన్ని మీరు నమ్మేలాచేశాడు. 32 షెమయా అలా చేసిన కారణంగా యెహోవా యిలా చెప్పుతున్నాడు. నేను త్వరలో నెహెలామీయుడైన షెమయాను శిక్షిస్తాను. పూర్తిగా అతని వంశం నాశనం గావిస్తాను. నా ప్రజలకు నేను చేసే మేలులో అతను పాలుపంచుకోలేడు.’” ఇదే యెహోవా వాక్కు “‘ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా షెమయా బోధించాడు గనుక నేను షెమయాను శిక్షిస్తాను.’”

ఎఫెసీయులకు 6:10-20

దేవుడు యిచ్చిన ఆయుధాలు

10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. 11 సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. 12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. 13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.

14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. 16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. 17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. 18 ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.

19 నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. 20 సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International