Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 102:1-17

శ్రమపడుతున్న వ్యక్తి ప్రార్థన. బలహీనంగా ఉండి తన ఆరోపణలను యెహోవాకు చెప్పాలని అతడు తలంచినప్పటిది.

102 యెహోవా, నా ప్రార్థన విను.
    సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము.
యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము.
    నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము.
పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది.
    నా జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది.
నా బలం పోయింది.
    నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను.
    నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను.
నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది.[a]
అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
    శిథిలమైన పాత కట్టడాలలో బ్రతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
నేను నిద్రపోలేను.
    పై కప్పు మీద ఒంటరిగా నివసించే పక్షిలా నేను ఉన్నాను.
నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు.
    నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తారు.
నా అధిక విచారమే నా భోజనం.
    నా కన్నీళ్లు నా పానీయాల్లో పడతాయి.
10 ఎందుకంటే, నీవు నా మీద కోపగించావు.
    యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు, నీవు నన్ను క్రిందకు విసిరేశావు.

11 సాయంకాలమయ్యేసరికి దీర్ఘమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయిపోయింది.
    నేను ఎండిపోయి వాడిన గడ్డిలా ఉన్నాను.
12 అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
    నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది.
13 నీవు లేచి సీయోనును ఆదరిస్తావు.
    నీవు సీయోను యెడల దయగా ఉండే సమయం వస్తూంది.
14 యెరూషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.
15 జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు.
    దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు.
16 ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు.
    యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు.
17 దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు.
    దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.

యిర్మీయా 29:8-23

ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్పేదేమనగా “మీ ప్రవక్తల, మంత్ర విద్యలు చేసే వారి యొక్క మోసంలో మీరు పడకండి. వారు కనిన కలలను మీరు వినవద్దు. వారు అబద్ధాలను బోధిస్తున్నారు. వారు చెప్పే వర్తమానం నానుండి వచ్చినదేనని అంటున్నారు! కాని నేను పంపలేదు!” ఇదే యెహోవా వాక్కు.

10 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బలమైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులోనులో నివసిస్తున్న మీ వద్ధకు వస్తాను. మిమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చుతాను. 11 ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయటానికి వ్యూహరచన చేస్తాను. 12 అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. 13 మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు. 14 మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”

15 “అయితే యెహోవా మాకు ఇక్కడ బబులోనులో ప్రవక్తలనిచ్చియున్నాడు” అని మీరు చెప్పవచ్చు. 16 కాని బబులోనుకు తీసుకొని పోబడకుండా ఇక్కడే ఉన్న మీ బంధువుల గురించి యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజును గూరించి, యెరూషలేములో మిగిలి ఉన్న తదితర ప్రజల విషయమై నే మాట్లాడుతున్నాను. 17 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేములో ఇంకా మిగిలి ఉన్న ప్రజలపైకి నేను త్వరలో కత్తిని, ఆకలిని, భయంకర రోగాలను పంపుతాను. తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె వారిని చేస్తాను. 18 యెరూషలేములో ఇంకా వున్న వారిని నేను కత్తితోను, కరువుతోను, రోగాలతోను వెంటాడతాను. ఈ ప్రజలకు సంభవించే భయంకర విపత్తులను చూచి ప్రపంచ రాజ్యాలన్నీ భయభ్రాంతులయ్యేందుకే నేనిది చేయదలచాను. ఆ ప్రజలు నాశనం చేయబడతారు. వారికి సంభవించిన విపత్తును గురించి విన్న ప్రజలంతా సంభ్ర మాశ్ఛర్యాలతో నిండిపోతారు. ప్రజలు తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన రీతిగా జరగాలని కోరుకుంటారు. నేను వారిని ఎక్కడికి బలవంతంగా పంపితే అక్కడ వార అవమానాల పాలవుతారు. 19 యెరూషలేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన ప్రవక్తలను నా సందేశం ఆ ప్రజలకు అందజేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు వినలేదు.” ఇది యెహోవా వాక్కు. 20 “మీరంతా బందీలు. నేనే మిమ్మల్ని యెరూషలేము వదిలి బబులోనుకు పోవలసిందిగా బలవంతం చేశాను. కావున, యెహోవా సందేశం వినండి.”

21 సర్వశక్తిమంతుడైన యెహోవా కోలాయా కుమారుడైన అహాబును గురించి, మయశేయా కుమారుడైన సిద్కియాను గురించి ఇలా చెపుతున్నాడు: “ఈ ఇద్దరు మనుష్యులు మీకు అబద్దాలు బోధిస్తున్నారు. వారు చెప్పే సందేశం నానుండి వచ్చినదేనని అంటున్నారు. కాని వారు అబద్ధమాడుతున్నారు. ఆ ఇద్దరు ప్రవక్తలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. అప్పుడు నెబుకద్నెజరు బబులోనులో బందీలుగా వున్న మీ అందరి ముందు ఆ ప్రవక్తలను చంపుతాడు. 22 యూదా జాతి బందీలంతా తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన శాస్తి వంటిది జరగాలని కోరుకుంటారు. అనగా శాపగ్రస్తులలో వీరొక ఉదాహరణగా మిగిలి పోతారు. బందీలంతా ఇలా అంటారు: ‘సిద్కియాకు, అహాబుకు పట్టిన గతినే మీకూ యెహోవా పట్టించు గాక! బబులోను రాజు వారిద్దరినీ అగ్నిలో కాల్చివేశాడు!’ 23 ఆ ప్రవక్తలిద్దరూ ఇశ్రాయేలు ప్రజలమధ్య బహునీచ కార్యాలు చేశారు. తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచారం చేశారు. వారు అబద్ధాలు కూడ చెప్పారు. పైగా వాటిని యెహోవానైన నానుండి వచ్చిన సందేశంగా చెప్పుకున్నారు. ఈ పనులన్నీ చేయమని వారికి నేనెప్పుడు చెప్పియుండలేదు. వారేమి చేశారో నాకు తెలుసు. వాటికి నేనే సాక్షిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.

అపొస్తలుల కార్యములు 26:24-29

పౌలు అగ్రిప్పను ఒప్పించుటకు ప్రయత్నించటం

24 పౌలు తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు.

25 పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను. 26 రాజుకు యివన్నీ తెలుసు. నేను రాజుతో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టినుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి రహస్యంగా సంభవించలేదు. 27 అగ్రిప్ప రాజా! నీవు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నావని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు.

28 అగ్రిప్ప, “అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు.

29 పౌలు, “సులభమో, కష్టమో! నీవే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International