Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 66:1-12

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.

యిర్మీయా 25:1-14

యిర్మీయా బోధనల సంగ్రహం

25 యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు చేరిన సందేశం ఇది. యెహోయాకీము యూదాకు రాజై పాలిస్తున్న నాల్గవ సంవత్సరంలో[a] ఈ సందేశం వచ్చింది. యోషీయా కుమారుడు యెహోయాకీము. ఇతని పాలనలో నాల్గవ సంవత్సరం అయ్యే సరికి నెబుకద్నెజరు బబులోనుకు రాజు కావటం, పరిపాలన ఒక సంవత్సరం కొనసాగించటం జరిగింది. ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరికి, యెరూషలేము వాసులందరికి ఈ సందేశం ఇచ్చాడు:

యెహోవా నుండి వచ్చిన సందేశాలను గత ఇరవై మూడు సంవత్సరాలలో నేను మీకు పదే పదే ఇచ్చియున్నాను. అమోను కుమారుడైన యోషీయా యూదా రాజ్యాన్ని పదమూడవ సంవత్సరంలో పాలిస్తూ ఉన్నప్పటినుండి నేను ప్రవక్తగా కొనసాగుతున్నాను. ఆనాటి నుండి ఈ నాటి వరకు నేను మీకు యెహోవా సందేశాలను అందజేస్తూ వస్తున్నాను. కాని మీరు వినిపించుకోలేదు. యెహోవా తన సేవకులైన ప్రవక్తలను మరల, మరల మీ వద్దకు పంపాడు. కాని వారు చెప్పేది మీరు వినలేదు. మీరసలు వారిని లక్ష్య పెట్టలేదు.

ఆ ప్రవక్తలు, “మీ జీవిత విధానం మార్చుకోండి. ఆ చెడు కార్యాలు చేయటం మానండి. మీలోమార్పు వస్తే, ఏనాడో దేవుడు మీరు నివసించుటకు మీ పితరులకు ఇచ్చిన రాజ్యానికి మీరు తిరిగి రాగలరు. మీరు శాశ్వాతంగా నివసించటానికి ఈ రాజ్యాన్ని ఆయన మీకిచ్చాడు. అన్య దేవతలను అనుసరించకండి. వాటిని సేవించవద్దు. ఆరాధించవద్దు. మానవ హస్తాలతో చేసిన విగ్రహాలను పూజించకండి. అదే మీపట్ల నాకు కోపం కల్గిస్తూ వుంది. ఇది చేయటం వల్ల మీకు మీరే హాని కలుగజేసుకుంటున్నారు!”[b]

“కాని మీరు నా మాట వినలేదు” ఇది యెహోవా వాక్కు “ఎవడో ఒక వ్యక్తి చేసిన విగ్రహాలను మీరు పూజించారు. అది నన్ను ఆగ్రహపర్చింది. అదే మిమ్ము బాధ పెట్టింది.”

కావున సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “మీరు నా వర్తమానాలను వినలేదు. అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజలందరి కొరకు ఒకనిని పంపుతాను.” ఇదే యెహోవా వాక్కు. “బబులోను రాజైన నెబుకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం పొందుతారు. 10 ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలను అంతం చేస్తాను. వివాహ వేడుకలు ఏ మాత్రం ఉండవు. తిరుగలి రాళ్ల శబ్దాలను, దీపాల వెలుగును మాయం చేస్తాను. 11 ఆ ప్రాంతమంతా ఒక పనికిరాని ఎడారిలా మారి పోతుంది. ఆ ప్రజలంతా బబులోను రాజుక్రింద డెబ్బయి ఏండ్ల పాటు బానిసలవుతారు.

12 “కాని డెబ్బయి సంవత్సరాల అనంతరం నేను బబులోను రాజును శిక్షిస్తాను. బబులోను రాజ్యాన్ని కూడా శిక్షకు గురి చేస్తాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “కల్దీయుల దేశాన్ని కూడా వారు పాపాల నిమిత్తంగా శిక్షిస్తాను. ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎడారిలా మార్చివేస్తాను. 13 బబులోనుకు చాలా కష్టనష్టాలు కలుగుతాయిని చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరుతాయి. యిర్మీయా ఆ పరాయి రాజ్యాల గురించి ప్రవచించియున్నాడు. ఆ హెచ్చరికలన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడినాయి. 14 అవును. బబులోను ప్రజలు చాలా దేశాలలో ఎక్కువమంది గొప్ప రాజులకు సేవలు చేయాల్సి ఉంటుంది. వారు చేసే పనులన్నిటికీ అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”

2 తిమోతికి 1:13-18

13 నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసు క్రీస్తులో విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో. 14 దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు.

15 ఆసియ ప్రాంతములో ఉన్నవాళ్ళంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపొయ్యారని నీకు తెలుసు. “పుగెల్లు” “హెర్మొగెనే” కూడా నన్ను వదిలి వెళ్ళిపొయ్యారు. 16 నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక “ఒనేసిఫోరు” ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక! 17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు. 18 ఆ “రానున్న రోజున” కనికరము పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక! నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్ని విధాల సహాయం చేసాడో నీకు బాగా తెలుసు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International