Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
విలాప వాక్యములు 1:1-6

యెరూషలేము తన వినాశనానికి దుఃఖించుట

యెరూషలేము ఒకనాడు జనసందోహంతో కిటకిటలాడిన నగరం.
    కాని ఘోరంగా నిర్జనమయ్యింది!
ఒకప్పుడు ప్రపంచ మహానగరాల్లో యెరూషలేము ఒక మహానగరం.
    కాని అది విధవరాలుగా అయింది.
ఒకనాడామె నగరాలలో యువరాణిలా ఉన్నది.
    కాని ఆమె ఒక బానిసలా చేయబడింది.
ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది.
    ఆమె కన్నీరు ఆమె చెక్కిళ్లపై ఉన్నాయి.
    ఆమెను ఓదార్చటానికి ఎవ్వరూ లేరు.
ఆమెతో సఖ్యంగా ఉన్న ఏ ఒక్క దేశమూ
    ఆమెను ఓదార్ఛలేదు.
ఆమె స్నేహితులంతా ఆమెపట్ల విముఖులయ్యారు.
    ఆమె స్నేహితులు ఆమెకు శత్రువులయ్యారు.
అనేక బాధలను అనుభవించి యూదా బందీ అయ్యింది.
    మిక్కిలి శ్రమకు గురియై యూదా బందీ అయ్యింది.
యూదా పరదేశీయుల మధ్య నివసిస్తూ ఉంది.
    ఆమెకు విశ్రాంతిలేదు.
ఆమెను వెంటాడిన ప్రజలు ఆమెను పట్టుకున్నారు.
    ఆ ప్రజలు ఆమెను ఇరుకు లోయల్లో పట్టుకున్నారు.
సియోనుకు పోయే మార్గాలన్నీ దుఃఖమయ మయ్యాయి.
    అందుకు కారణం సీయోనుకు నియామక కూటాలకు ఎవ్వరూ రాకపోవటమే.
సీయోను ద్వారాలు పాడుబడినాయి.
    సీయోను యాజకులు మూల్గుచున్నారు.
సీయోను యువతులు పట్టుబడ్డారు.
    ఇదంతా సీయోనుకు భరింపరాని విషాదం.
యెరూషలేము శత్రువులు గెలిచారు.
    ఆమె శత్రువులు విజయవంతులయ్యారు.
యెహోవా ఆమెను శిక్షించిన కారణంగా ఇదంతా జరిగింది.
    యెరూషలేము చేసిన అనేక పాపాలకు ఆయన ఆమెను శిక్షించినాడు.
ఆమె పిల్లలు వెళ్ళిపోయారు.
    వారి శత్రువులకు బందీలై వారు వెళ్ళిపోయారు.
సీయోను కుమార్తె[a] అందం
    మాయమయ్యింది.
ఆమె రాకుమారులు లేళ్లవలె అయ్యారు.
    గడ్డి మేయటానికి పచ్చిక బయలు కానరాని లేళ్లవలె వారున్నారు.
శక్తి లేకపోయినా వారెలాగో పారిపోయారు.
    తమను వెంటాడుతున్న వారి నుండి వారు పారిపోయారు.

విలాప వాక్యములు 3:19-26

19 ఓ యెహోవా, నా దుఃఖాన్ని,
    నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము.
    నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
20 నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి.
    నేను మిక్కిలి విచారిస్తున్నాను.
21 కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది.
    నేను ఇలా అనుకున్నాను.
22 యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి.
    యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
23 అవి నిత్య నూతనాలు.
    ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
24 “యెహోవా నా దేవుడు.
    అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.

25 ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు.
    ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
26 యెహోవా రక్షణకై నెమ్మదిగా
    వేచియుండటం క్షేమకరం

కీర్తనలు. 137

137 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని
    సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లకు[a] మన సితారాలు తగిలించాము.
బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.
    సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు.
    సీయోను గూర్చి పాటలు పాడమని వారు మనకు చెప్పారు.
కాని విదేశంలో మనం యెహోవాకు
    కీర్తనలు పాడలేము!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
    నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
    నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకుపోవును గాక!
నేను ఎన్నటికీ నిన్ను మరువనని
    వాగ్దానం చేస్తున్నాను.

యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!
    యెహోవా, యెరూషలేము పడిన రోజున
ఎదోమీయులు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకొనుము.
    దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!
    నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
    నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.

2 తిమోతికి 1:1-14

పౌలు నుండి నా ప్రియమైన కుమారుడు తిమోతికి వ్రాయడమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు కృప, దయ, శాంతి లభించుగాక!

నేను దైవేచ్ఛానుసారం యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.

దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము యేసు క్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా నేను అపొస్తలుడనయ్యాను.

విశ్వాసంలో ఉండండి

నేను నిష్కల్మష హృదయంతో నా పూర్వికుల దేవునికి సేవచేస్తూ కృతజ్ఞుడనై యున్నాను. రాత్రింబగళ్ళు నిన్ను జ్ఞాపకము పెట్టుకొని నీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. నీలాంటివాణ్ణి నాకు యిచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూసాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది. నీలో ఉన్న నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉంది. నీ తల్లి యునీకేలో కూడా ఉంది. నీలో కూడా అలాంటిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అందుకోసం, నా చేతులు నీ తలపై ఉంచడం వల్ల నీకు దేవుడు యిచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ ఉండమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, స్వయం క్రమశిక్షణ గల ఆత్మనిచ్చాడు.

కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకు. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించు.

దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. 10 కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు.

11 ఈ సువార్తను ప్రకటించటానికి నన్ను వార్తాహరునిగానూ, అపొస్తలునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమించాడు. 12 ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే, నేను విశ్వసించినవాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించినదాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.

13 నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసు క్రీస్తులో విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో. 14 దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు.

లూకా 17:5-10

నీ విశ్వాసము ఎంత గొప్పది

అపొస్తలులు ప్రభువుతో, “మా విశ్వాసాన్ని గట్టి పరచండి” అని అన్నారు.

ప్రభువు అన్నాడు: “మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నాచాలు; మీరు కంబళి చెట్టుతో, ‘నీవు నీ వేర్లతో బాటు పెళ్లగింపబడి వెళ్ళి సముద్రంలో పడి అక్కడ నాటుకుపో!’ అని అంటే అది మీ మాట వింటుంది.

సేవకుని కర్తవ్యం

“మీ పొలం దున్నే సేవకుడో లేక మీ గొఱ్ఱెలు కాచే సేవకుడో ఒకడున్నాడనుకోండి. అతడు పొలం నుండి యింటికి రాగానే, ‘రా! వచ్చి కూర్చొని భోజనం చెయ్యి’ అని అతనితో అంటారా? అనరు. దీనికి మారుగా, ‘వంటవండి, దుస్తులు మార్చుకొని, నేను తిని త్రాగేదాకా పనిచేస్తూవుండు. ఆ తర్వాత నువ్వు కూడా తిని త్రాగు’ అని అంటారు. మీరు చెప్పినట్లు విన్నందుకు మీ సేవకునికి కృతజ్ఞత తెలుపుకుంటారా? 10 మీరు కూడా చెప్పిన విధంగా చేసాక ‘మేము మామూలు సేవకులము, చెప్పినట్లు చేసాము. అది మా కర్తవ్యం’ అని అనాలి.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International