Revised Common Lectionary (Semicontinuous)
జాయిన్
49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
కనుక నాకు ఈలాగు జరుగుతుంది.
16 నేరీయా కుమారుడైన బారూకునకు దస్తావేజులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని ప్రార్థించాను. నేనిలా అన్నాను:
17 “యెహోవా నా దేవా, చాపబడిన నీ బల ప్రభావాలచే నీవీ భూమ్యాకాశాలను సృష్టించావు. తిరుగులేని నీ మహిమచే వాటిని నీవు సృష్టించినావు. నీవు చేసే పనులలో నీకు ఆశ్చర్యకరమైనది, అసాధ్యమైనది ఏదియు లేదు. 18 యెహోవా, నీవు వేలాది ప్రజలకు దయామయుడవు, నమ్మకస్తుడవు అయివున్నావు. కాని పెద్దల తప్పులకు వారి పిల్లలను కూడా శిక్షింపగలవాడవు. మహోన్నతుడవు, శక్తి సంపన్నుడవు, సర్వశక్తిమంతుడైన యెహోవా అని నీకు పేరు. 19 దేవా, నీవు యోచించి ఘనమైన కార్యాలు సాధిస్తావు. ప్రజలు చేసే ప్రతీ పనినీ నీవు చూస్తావు. మంచి పనులు చేసేవారికి ప్రతిఫలాలిస్తావు. చెడుకార్యాలు చేసే వారికి తగిన శిక్ష విధిస్తావు. 20 యెహోవా, ఈజిప్టు రాజ్యంలో నీవు అమోఘమైన అద్భుతాలు జరిపించినావు. ఈ నాటి వరకు నీవు నీ శక్తివంతమైన కార్యాలు జరిపిస్తూనే ఉన్నావు. ఆ పనులు నీవు ఇశ్రాయేలులో మాత్రమే గాక, నీ ప్రజలు ఎక్కడ వుంటే అక్కడ నీవా అధ్భత కార్యాలు చేశావు. వీటి కారణంగా నీవు మిక్కిలి ఘనత వహించినావు. 21 యెహోవా, నీవు ఎన్నో మహాశక్తిగల అధ్భుతాలు జరిపించి, ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి బయటికి తీసికొని వచ్చావు. నీ శక్తవంతమైన హస్తాన్ని వినియోగించి నీవీ పనులు చేశావు! నీ శక్తి అశ్ఛర్యాన్ని కలుగ జేస్తూఉంది!
22 “యెహోవా, నీవీ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకిచ్చావు. ఈ దేశాన్ని ఇస్తానని వారి పితరులకు నీవు ఏనాడో వాగ్దానం చేశావు. ఈ దేశం చాలా మంచిది. ఇది ఎన్నో మంచి వస్తువులతో నిండివున్నది. 23 ఇశ్రాయేలీయులు ఈ దేశంలోనికి వచ్చి దీనిని వారు స్వంతం చేసుకున్నారు. కాని ఆ ప్రజలే నీకు విధేయులు కాకుండా పోయారు. వారు నీ బోధనలను అనుసరించ లేదు. నీవు ఆజ్ఞాపించినట్లు వారు నడుచుకోలేదు. అందువల్లనే ఇశ్రాయేలు ప్రజలకు ఈ భయంకరమైనవన్నీ జరిగేటట్టు నీవు చేశావు.
24 “మరియు ఇప్పుడు శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. యెరూషలేము నగర ప్రాకారం చుట్టూ దిమ్మలు, మెట్లు నిర్మిస్తున్నారు. తద్వారా వారు నగరపు గోడలు సులభంగా ఎక్కి నగరాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. శత్రువుల కత్తుల మూలంగా కరువులు, రోగాలు మొదలైన ఈతి బాధల కారణంగా, కల్దీయుల సైన్యం యోరూషలేము నగరాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు బబులోను సైన్యం నగరాన్ని ఎదుర్కొంటూ వుంది! యెహోవా, ఇది జరుగుతుందని నీవు చెప్పావు. పైగా అది నీవు చూస్తూ వుండగానే జరుగుతూ ఉంది.
25 “యెహోవా, నా ప్రభువా, ఆపద ముంచుకు వస్తున్నది. కాని, నీవు నాతో, ‘యిర్మీయా, వెండినిచ్చి పొలం కొనమనీ, ఆ కొనుగోలుకు సాక్షులను నియమించ!’ మనీ చెపుతున్నావు. కల్దీయుల సైన్యం నగరాన్ని కైవసం చేసికోడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీవు నాకీ విషయం చెపుతున్నావు. నా ధనం అలా ఎందుకు వృధా చేయాలి?”
26 అప్పుడు యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది: 27 “యిర్మీయా, నేనే యెహోవాను, ఈ భూమి మీద ప్రతి వానికి నేనే దైవాన్ని. యిర్మీయా, నాకు అసాధ్యమైనదేదీ లేదని నీకు తెలుసు.” 28 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “యెరూషలేము నగరాన్ని నేను అతి త్వరలో కల్దీయుల సైన్యానికి, బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. ఆ సైన్యం నగరాన్ని పట్టుకుంటుంది. 29 కల్దీయుల సైన్యం ఇప్పటికే యెరూషలేము నగరాన్ని ఎదుర్కొంటూ వుంది. వారు త్వరలో నగరం ప్రవేశించి నిప్పు పెడతారు. వారీ నగరాన్ని తగులబెడతారు. బూటకపు దేవతైన బయలుకు ప్రజలు ఇండ్ల పైకప్పులపై బలులు అర్పించారు. అలా నాకు కోపం తెప్పించిన కొన్ని ఇండ్లు ఈ నగరంలో వున్నాయి. విగ్రహాలకు మద్యం సమర్పించి పూజించిన వారు కూడ ఉన్నారు. ఆ నివాసములన్నిటినీ కల్దీయుల సైన్యం తగుల బెడుతుంది. 30 ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను నేను గమనిస్తూవున్నాను. వారు చేసే ప్రతీదీ దుష్టకరమైనది! వారి చిన్నతనం నుండి వారు చెడు కార్యాలకు పాల్పడ్డారు. ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం తెప్పించారు. చేతులతో చేసిన విగ్రహాలను పూజించి ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం కలుగజేశారు!” ఇది యెహోవా వాక్కు. 31 “యెరూషలేము కట్టబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నగర ప్రజలు నాకు కోపం కల్గిస్తూనే ఉన్నారు. ఈ నగరం నాకెంతో కోపం తెప్పించింది. కావున నేను దానిని నా దృష్టి పథం నుండి తొలగిస్తాను. 32 ఇశ్రాయేలు, యూదా ప్రజలు చేసిన చెడు కార్యాల కారణంగా నేను యెరూషలేము నగరాన్ని నాశనం చేస్తాను. ప్రజలు, రాజులు, నాయకులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదాప్రజలు, యెరూషలేము నగర వాసులు అందరూ నాకు కోపం కలుగజేశారు.
33 “ఆ ప్రజలు సహాయం కొరకు నన్ను చేరవలసింది. కాని వారు నాకు విముఖులైనారు. వారికి నేను పదే పదే బుద్ధి చెప్ప చూశాను. కాని వారు నా మాట వినిపించుకోలేదు. నేను వారిని సరిజేయ చూశాను. అయినా వారు పట్టించుకోలేదు. 34 వారు విగ్రహాలను చేస్తూనే వచ్చారు. నేనా విగ్రహాలను ఏవగించుకున్నాను. పైగా నా పేరు మీద పిలవబడే ఆలయంలో వారా విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విధంగా వారు నా మందిరాన్ని ‘అపవిత్రం’ చేశారు.
35 “బెన్హిన్నోము[a] లోయలో వారు బూటకపు దేవత బయలుకు ఉన్నత పూజా స్థలాలు ఏర్పాటు చేశారు. వారా పూజా స్థలాలలో తమ కుమారులను, కుమార్తెలను శిశు బలులుగా మొలెకుకు సమర్పించటానికి ఏర్పాటు చేశారు. అటువంటి భయంకరమైన పని చేయమని నేనెప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు! అటువంటి ఘోరమైన పని యూదా ప్రజలు చేస్తారని కూడా నేనెప్పుడు అనుకోలేదు!
లవొదికయలోని సంఘానికి
14 “లవొదికయలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఈ విషయాలకు ఆమేన్[a] అనువాడును, దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును, నిజమైన సాక్షి అయినవాడును చెప్పుచున్నాడు.
15 “నీవు చేసిన పనుల్ని గురించి నాకు తెలుసు. నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక. 16 నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మి వేయబోతున్నాను. 17 ‘నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యం ఉంది. నాకు ఏ కొరతా లేదు’ అని నీవంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు. దీనావస్థలో ఉన్నావు. నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. 18 నీవు ధనవంతుడవు కావాలనుకొంటే, నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే నీ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి నా నుండి తెల్లని దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్ళకు పెట్టుకో. అప్పుడు చూడగల్గుతావు.
19 “నేను ప్రేమించిన వాళ్ళను గద్దిస్తాను. వాళ్ళను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితితో ఉండి పశ్చాత్తాపం చెందు. 20 ఇదిగో! నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను. అతడు నాతో కలిసి తింటాడు.
21 “నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి ఆయన సింహాసనంపై కూర్చున్నాను. అదే విధంగా విజయం సాధించినవాడు నాతో సింహాసనంపై కూర్చుంటాడు. 22 సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.”
© 1997 Bible League International